జనానికి ఏం కావాలో తెలుసంతే

భీమ్స్..రవితేజ తాజా చిత్రం బెంగాల్ టైగర్ కు సంగీత దర్శకుడు. పెద్ద సినిమా అంటే చాలు దేవీ శ్రీ ప్రసాద్, థమన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనూప్ రూబెన్స్ అని డిసైడ్ అయిపోతున్న…

భీమ్స్..రవితేజ తాజా చిత్రం బెంగాల్ టైగర్ కు సంగీత దర్శకుడు. పెద్ద సినిమా అంటే చాలు దేవీ శ్రీ ప్రసాద్, థమన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనూప్ రూబెన్స్ అని డిసైడ్ అయిపోతున్న టైమ్ లో, ఒక్కటి రెండు సినిమాల అనుభవం వున్న కొత్త సంగీత దర్శకుడు అతగాడు. మరి దర్శకుడు సంపత్ నందికి అతగాడిలో ఏం టాలెంట్ కనిపించిందో, భీమ్స్ కు ఏ మాత్రం ధైర్యం వుందో, మొత్తానికి అడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు శ్రోతల ఆదరణ కూడా పొందుతోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో భీమ్స్ తో గ్రేట్ ఆంధ్ర చిట్ చాట్. 

మీ పేరు ఇదేనా..చిత్రంగా వుంది

నా పేరు ఇదే. మాది నిజానికి ఆంధ్ర కాదు..రాజస్థాన్..మా తాత ఇక్కడకు వచ్చి ఖమ్మం సమీపంలో సెటిల్ అయిపోయారు. మా నాన్న, నేను అంతా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్లమే. తెలుగులోనే చదివాను..

రాజస్థాన్ అంటే వ్యాపారం చేయాలి కానీ, ఇలా సంగీతంలోకి?

మొదట్నించీ నాకు మంచి పుస్తకాలు, మంచి సాహిత్యం చదవడం ఇష్టం. ఇప్పటికే అదే నాకు ఇష్టమైన కార్యక్రమం..ఇంటర్ నెట్, సెల్ ఫోన్ ఇవన్నీ దాని తరువాతే. అలా తెలంగాణ కళాకారులందరితో పరిచయం సాన్నిహిత్యం ఏర్పడింది. దాంతో ఇంటర్ ఏజ్ లోనే ఎన్ శంకర్..2003లో ఆయుధం సినిమాలో పాట రాసే చాన్స్ ఇచ్చారు. …'ఓ రాజా కన్నుల్లో నువ్వే' అనే హిట్ సాంగ్ నేను రాసిందే.

ఆ తరువాత సంపత్ నంది గారితో పరిచయం నన్ను సంగీతం వైపు మళ్లించింది.

అదెలా?

నేను గాయకుడిని కూడా. నాకు నేను పాటలు కూర్చుకోవడం, స్వరపర్చుకోవడం, ఆయనకు సరదాగా వినిపించడం జరిగేది. దాంతో ఆయన పదే పదే ప్రోత్సహించేవారు. నాకు ఈ విషయంలో ఆయన ఎన్నో మెళుకువలు, పద్దతులు, అన్నీ నేర్పింది ఆయనే. 

అంటే మీరు సంగీతం నేర్చుకోలేదా?

లేదండీ…నేను అబద్ధం చెప్పను. నాకు సంగీతం రాదు. కానీ ప్రజల నాడి తెలుసు. ఏ విధంగా పాడితే, పాట ఎలా వుంటే జనాలకు నచ్చుతుందో నాకు తెలుసు. అది నాకు స్వంతంగా అలవడిన విద్య. దాంతోనే నేను సంగీత దర్శకుడిని అయ్యాను.

మరి ఆ తరువాత పాటలు రాయలేదా?

రాసాను. అప్పుడప్పుడు. కానీ సంగీత దర్శకుడిని అయ్యాక తగ్గించాను. అన్నీ మనమే చేసేయాలి అనుకోకూడదని నా అభిప్రాయం.

మరి సంగీత దర్శకుడిగా తొలి సినిమా

సంపత్ నందిగారి ఏమైంది ఈ వేళకు చేయాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది. తరువాత నరేష్-శర్వానంద్ ల నువ్వానేనా చేసాను. ఆ తరువాత కెవ్వు కేక, ఆపై గాలిపటం, జోరు సినిమాలకు సంగీతం అందించాను. 
 

సంగీతం నేర్చుకోకుండానే సంగీత దర్శకుడు అయిపోవచ్చా?
అలా అని అనను..సంగీత దర్శకుడు అంటే ఏం కావాలి..ఎలా కావాలి అని చెప్పేంత అథారిటీ నాకు లేదు. కానీ నాకు స్వరజ్ఞానం వుంది. రిథమ్ తెలుసు. కొన్ని వాయిద్యాలు వాయించగలను. నా మీద నాకు నమ్మకం వుంది. నా ట్యూన్లు మైనస్ కానపుడు ఇంక సమస్య ఏముంది?

బెంగాల్ టైగర్ పాటలకు స్పందన ఎలా వుంది?

అది మీరే చెప్పాలి. నాకయితే ఫీడ్ బ్యాక్ బాగానే వుంది. ఎఫ్ ఎమ్ ల్లో తరచు వినిపిస్తోందంటే, శ్రోతలకు నచ్చినట్లే కదా?
 

సినిమాకు ఆర్ ఆర్ మీరే చేసారా?

లేదండీ..వేరే వాళ్లు చేసారు. 

భవిష్యత్ ప్రాజెక్టులు?

ప్రస్తుతానికి అన్నీ డిస్కషన్ లోనే. త్వరలో ప్రారంభం అవుతాయి.

థాంక్యూ..బెస్ట్ ఆప్ లక్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి