‘ఉరి’ పర్యవసానం ‘ఉగ్ర’ దాడులా?

1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను ఉరి తీయడం ద్వారా  ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపివుండొచ్చు. ఉగ్రవాదుల భరతం పడతామనే సంకేతం ఇచ్చివుండొచ్చు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తాను…

1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను ఉరి తీయడం ద్వారా  ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపివుండొచ్చు. ఉగ్రవాదుల భరతం పడతామనే సంకేతం ఇచ్చివుండొచ్చు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తాను గట్టి మద్దతుదారునని ప్రపంచానికి చాటివుండొచ్చు. మెమన్ ఉరితీత పట్ల ఎన్ని అభ్యంతరాలు వచ్చినా భారత న్యాయ వ్యవస్థ వాటిని తోసిపుచ్చి ఉరిని అమలు చేయడం ద్వారా బాధిత కుటుంబాలకు ఉపవమనం కలిగించి వుండొచ్చు. ఇదంతా ఓ కోణం. ఉరిని అమలు చేయడం ద్వారా భారత్ ఉగ్రవాదులకు సవాల్ విసిరిందా? లేదా ఉగ్రవాదులు భారత్‌కు సవాల్ విసరబోతున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది మరో కోణం. ఉరితీయడానికి కొన్ని గంటల ముందు వరకు న్యాయవ్యవస్థ, భారత ప్రభుత్వం పడిన మల్లగుల్లాలు, తీవ్ర తర్జనభర్జనలు ఈ విషయం ఎంత జటిలమైందో తెలియచేశాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అర్థరాత్రి ఈ కేసును మరోసారి విచారించడం చరిత్రలో మొదటిసారిగా జరిగింది. మరో ముఖ్యమైన అంశం… అనేకమంది న్యాయ నిపుణులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాల వారు, సామాజిక కార్యకర్తలు…ఇలా ఎందరో ఉరిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష రాజకీయ పార్టీలు ఉరిని వ్యతిరేకించాయి. ఏ కోణంలోంచి చూసినా మెమన్ ఉరి శిక్ష పెద్ద సంచలనమైందని చెప్పకతప్పదు.

ఇదే సమయంలో  కొన్ని సంచలన ఘటనలు, సమాచారం బయటపడ్డాయి. అదే…భారత్‌పై ఉగ్రవాదులు దాడులు జరపడం. భారత్‌పై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్….దీన్నే ఇస్లామిక్ స్టేట్ అని వ్యవహరిస్తున్నాం) దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తోందనే సమాచారం రావడం. అంటే ఏ క్షణంలోనైనా భారతపై ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాపై దాడులకు ఐఎస్‌ఐఎస్ సన్నాహాలు చేస్తుండటం చాలాకాలం నుంచి జరుగుతున్నా ఇప్పుడు ఈ ఉరితీత అందుకు మరింత ఆజ్యం పోస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో పక్క పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు కూడా దాడులు చేసే అవకాశం ఉందని తాజాగా పంజాబ్‌లో జరిగిన ఉగ్రదాడులు సంకేతమిచ్చాయి. మెమన్‌ను ఉరి తీయగానే ‘ఓ పనైపోయింది’ అంటూ భారత్ ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం లేదు. ఉరి శిక్ష అమలు చేసిన రోజున టీవీ ఛానెళ్లలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో కొందరు, ప్రధానంగా పత్రికా రంగానికి చెందినవారు భారత్‌పై ఉగ్రవాద దాడులు జరిగేందుకు అవకాశం ఉందన్నారు. మెమన్‌ను ఉరి తీసి భారత్ పెద్ద తప్పు చేసిందని, ప్రభుత్వానికి లొంగిపోవాలనుకున్న ఉగ్రవాదులు ఎవరైనా ఉంటే ఇప్పుడు వారు కూడా పోరాటానికి సిద్ధమవుతారని అన్నారు. యాకూబ్ మెమన్ దోషే కావొచ్చుగాని ఉరి అనేది అతనికి పెద్ద శిక్ష అని, అసలు సూత్రధారులైన టైగర్ మెమన్‌ను, దావూద్ ఇబ్రహీంను ఉరి తీయాలని కొందరు అన్నారు. వీరు పాకిస్తాన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

యాకూబ్‌ను నేపాల్‌లో అరెస్టు చేశారని కొందరు, కాదు…లొంగిపోయాడని మరి కొందరు అంటున్నారు. రెండు దశాబ్దాలు జైల్లో ఉన్న వాడిని ఉరి తీయడం అన్యాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. యాకూబ్ పోలీసు వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరించాడని, ఉగ్రవాదులకు సంబంధించిన చాలా సమాచారం అందించాడని, అటువంటప్పుడు ఉరి తీయడమేమిటని కొందరు ప్రశ్నించారు. ఈ వాదనలు ఎలా ఉన్నా ఉరితీతకు ముందు జరిగిన ఘటనలను, అమెరికాకు చెందిన ‘యుఎస్‌ఏ టుడే’ బయటపెట్టిన సమాచారాన్ని విశ్లేషించుకోవాల్సి ఉంది. యాకూబ్ ఉరికి తేదీ నిర్ణయం జరిగి, దీనిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసి పోలీసు అధికారిని, పోలీసులను, కొందరు పౌరులను చంపేశారు. 

ఉగ్రదాడి జరిగిన పదకొండు గంటల తరువాత మనవాళ్లు ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చారు. వీరు పాకిస్తాన్ నుంచే వచ్చారని తేలింది. ఉరిశిక్ష అమలు జరుగుతుందా? రద్దవుతుందా? అనే ఉత్కంఠలో కొట్టుమిట్టాడుతున్న దశలో యుఎస్‌ఏ టుడే ప్రచురించిన కథనం సంచలనం కలిగించింది. భారత్‌పై పెద్ద ఎత్తున దాడులకు ఐఎస్‌ఐఎస్ సన్నాహాలు చేస్తోందని ఆ కథనం సారాంశం. పాకిస్తానీ తాలిబన్లతో సంబంధాలున్న ఓ వ్యక్తి వద్ద లభ్యమైన డాక్యుమెంట్ ద్వారా ఈ విషయం తెలిసింది. ‘ఆర్మ్‌గెడ్డన్’ మాదిరిగా (న్యూ టెస్ట్‌మెంట్‌లో అంటే కొత్త నిబంధనలో ఇలా ఉంది: ‘తీర్పు రోజుకు ముందు మంచికి, చెడుకు మధ్య చివరి యుద్ధం జరుగుతుంది) ప్రపంచం అంతమయ్యేలా యుద్ధం జరుగుతుందని ఆ డాక్యుమెంట్‌లో ప్రేరేపించింది. మరో ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖైదాను కూడా తమతో చేతులు కలపాల్సిందిగా ఐఎస్‌ఐఎస్ కోరింది. ఈ డాక్యుమెంట్‌లో ఇంకా అనేక విషయాలున్నా భారత్‌పై దాడుల అంశం ప్రధానమైంది. ఒకవేళ ఐఎస్‌ఐఎస్ అనుకున్నది చేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పలేం. ఆ దాడులను ఎదుర్కొనే శక్తి భారత్‌కు 
ఉందా? విశ్లేషించుకోవాలి. భారత్‌పై దాడులు చేస్తామని అల్‌ఖైదా గతంలో ప్రకటించింది. పాక్ తాలిబన్లు హెచ్చరికలు చేశారు.

ముఖ్యంగా నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు ఎక్కువయ్యాయి. మోదీ అధికారంలోకి వచ్చాక భాజపా మంత్రులు, నాయకులు పాకిస్తాన్‌పై అనేక విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. నిరంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ జపం చేస్తున్నారు. గొడ్డు మాంసం తినాలనుకునేవారు పాకిస్తాన్‌కు వెళ్లాలని అంటున్నారు. ఇలాంటివన్నీ సహజంగానే ముస్లింలకు కోపం తెప్పిస్తాయి. పాక్ కూడా  సరిహద్దుల్లో దాడులు చేయడం, కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించడం మొదలైనవి చేస్తోంది. చివరకు భారత్ హిందువులకు, పాకిస్తాన్ ముస్లింలకు ప్రతినిధులనే భావన కలిగించేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌పై దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దేశంపై ఇప్పటివరకు దాడులు చేసి ఉరిశిక్షకు గురైన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌కు చెందినవారే. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అయినా ఉగ్రవాదులు అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. భారతపై ఉగ్ర దాడులకు అక్కడి గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సాయం చేస్తోందన్న వాదనా ఉంది. ఏది ఏమైనా ఐఎస్‌ఐఎస్ ఇండియాపై దాడులకు తెగబడే ప్రమాదం ఉన్నందున మోదీ సర్కారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆజ్యం పోయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. 

మేనా