సెంటిమెంట్ ముందర.. మొట్టికాయలు బలాదూర్.!

ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అండగా తెలంగాణ సెంటిమెంట్ వుండగా.. న్యాయస్థానమే మొట్టికాయలు వేసినా బలాదూర్.. అనుకునే పరిస్థితి కాదిపడు తెలంగాణ సర్కార్‌ది. ఏం చేసినా తెలంగాణ కోసమే.. అని తెలంగాణ సర్కార్ చెబితే, తెలంగాణ…

ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. అండగా తెలంగాణ సెంటిమెంట్ వుండగా.. న్యాయస్థానమే మొట్టికాయలు వేసినా బలాదూర్.. అనుకునే పరిస్థితి కాదిపడు తెలంగాణ సర్కార్‌ది. ఏం చేసినా తెలంగాణ కోసమే.. అని తెలంగాణ సర్కార్ చెబితే, తెలంగాణ సమాజం హర్షించొచ్చుగాక.. అంతమాత్రాన అదే ‘న్యాయం’ అయిపోదు. అదే పరిపాలన అన్పించుకోదు. ఉద్యమం వేరు, పరిపాలన వేరు. దానికీ దీనికీ తేడాని తెలంగాణ సర్కార్ గుర్తెరడం అత్యంత ముఖ్యమిపడు. అధికారంలోకి వచ్చాక తీసుకున్న అరడజను ప్రధాన నిర్ణయాల్లో మెజార్టీ నిర్ణయాల్ని న్యాయస్థానం తపపట్టిందంటే టి.సర్కార్ పరిపాలనలో ఎలాంటి తప్పటడుగులు వేస్తోందో అర్థం చేసుకోవచ్చు. మెప్పించడం వేరు.. న్యాయబద్ధంగా వ్యవహరించడం వేరు. దానికీ దీనీకీ తేడా తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఎపడూ వుంటుంది. మెప్పిస్తే రాజకీయంగా లబ్ది పొందొచ్చుగానీ, పరిపాలన పరంగా మార్కులు పడవు. ఈర్ష్యాధ్వేషాలకు అతీతంగా అనీ.. ఇంకోటనీ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ చాలా విషయాలు చెబుతారు.. వాటిని దృష్టిలోపెట్టుకుని పరిపాలన సాగించాల్సిందే ఎవరైనా. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే మాత్రం న్యాయస్థానాల జోక్యం తప్పనిసరవుతుంది. పదే పదే న్యాయస్థానాలు మొటిే్టకస్తే పాలన వివాదాస్పదమవుతుంది.. తద్వారా ‘బ్రాండ్’ పడిపోతుంది. అది పార్టీ బ్రాండ్ అయినా.. రాష్ర్టం బ్రాండ్ అయినా.. దేశం బ్రాండ్ అయినా.

జూన్ 2న తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. తెలంగాణలో తెలంగాణ రాష్ర్ట సమితి అధికారంలోకొచ్చింది. ఎన్నికల్లో గెలిచాక కూడా తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత, ‘ఆంధ్రోళ్ళతో పంచాయితీ అయిపోలేదు..’ అన్నారు. ఆ మాటేక ఆయన కట్టుబడి వున్నట్టున్నారు. లేకపోతే, ప్రతి విషయంలోనూ ఇంకా వలసవాదులపై ఆయన తనదైన స్టయిల్లో ‘రాజకీయం’ ప్రదర్శిస్తూనే ఎందుకు వుంటారు.? తెలంగాణ సర్వే అయినా, ‘ఫాస్ట్’ పథకం అయినా.. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ సర్కార్ ఏది తెరపైకి తెచ్చినా అందులో ‘ఆంధ్రోళ్ళని ఇబ్బంది పెట్టాలి’ అన్న ఆయన ఆలోచన స్పష్టంగా కన్పిస్తోందన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అందుకు తగ్గట్టే ఆయన ఆయా పథకాల్ని రూపొందిస్తున్నారు కూడా. తెలంగాణ వచ్చాక.. తెలంగాణలో వున్నవారంతా తెలంగాణ వారే.. అన్న విశాల దృక్పథం గురించిన ఆలోచనే చేయడంలేదు తెలంగాణ ముఖ్యమంత్రి. ‘సెంటిమెంట్‌తో గెలిచాం.. ఆ సెంటిమెంట్‌ని ఎపడూ మర్చిపోకూడదు.. మర్చిపోతే పులిమీద స్వారీ.. అత్యంత ప్రమాదకరంగా మారుతుంది..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి తెలియకుండా వుంటుందా.? అందుకే ఆయన అన్ని విషయాల్లోనూ ‘తెలంగాణ సెంటిమెంట్’కే పెద్దపీట వేస్తున్నారు.. న్యాయస్థానాలు మొట్టకస్తున్నాసరే.

సర్వే ప్రతిష్టాత్మకం.. అనుకున్నారుగానీ..

సమగ్ర సర్వే విషయానికొస్తే, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘ఆంధ్రోళ్ళతోనే పంచాయితీ..’ అని కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏమాత్రం బెరుకు లేకుండా వ్యాఖ్యానించేశారంటూ టీడీపీ నేతలు ఓ వీడియోని విడుదల చేశారు. ఆ సర్వేని తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోండి.. సర్వేలో పాల్గొనకపోతే లెక్కల్లో వుండరు..’ అని తెలంగాణ సీఎం హెచ్చరిస్తే, హైకోర్టు మాత్రం, ‘ఐశ్చికమే..’ అని తేల్చేసింది. దాంతో, సమగ్ర సర్వేకి తొలుత క్రియేట్ చేసిన సీరియస్‌నెస్ ఆ తర్వాత లేకుండా పోయింది. ‘ఇచ్చిన వివరాలు రాసుకోండి.. బలవంతం చేయొద్దు..’ అని హైకోర్టు స్పష్టం చేసే సరికి, అన్ని వివరాలూ సిద్ధం చేసుకోవాల్సిందేనన్న ప్రభుత్వ సూచనలు (హెచ్చరికలు అని కూడా అనుకున్నారు జనం) నీరుగారిపోయాయి. సర్వే గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు.. దేశవ్యాప్తంగా ఇలాంటిదొకటి చేపడితే మంచిదని ప్రధానికి సూచించా.. అని ఆ తర్వాత కేసీఆర్ చెపకున్నారుగానీ, సర్వే ఎంత గొప్పగా జరిగింది.? అన్నది అందరికీ తెల్సిన వ్యవహారమే.

రవాణా శాఖకి డబుల్ మొట్టికాయలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రవాణా పన్ను విషయమై గవర్నర్ పాలనలో తీసుకున్న నిర్ణయాన్ని తుంగలో తొక్కి, తెలంగాణ సర్కార్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ప్రవేశించే వాహనాలపై పన్నులు షురూ చేసింది. కానీ, హైకోర్టు మొట్టికాయలేసింది. విభజన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల్ని ఇరు రాష్ట్రాలూ గౌరవించాలని హైకోర్టు తేల్చి చెప్పేసరికి, రవాణా పన్ను రూపేణా ఖజానాలో సొమ్ములు జమచేసుకోవాలనుకున్న తెలంగాణ సర్కార్‌కి షాక్ తగిలింది. ఇటీవలే, వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలోనూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓసారి పన్ను కట్టి, నెంబర్ తీసుకున్నవారిని రాష్ర్టం విడిపోయిందన్న నెపంతో ఎలా వేధిస్తారు.? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? అని హైకోర్టు ప్రశ్నించేసరికి తెలంగాణ సర్కార్ బిక్కమొహం వెయ్యాల్సి వచ్చింది. తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందేనని వాహనదారులకు హుకూం చేసిన తెలంగాణ సర్కార్, హైకోర్టు నిర్ణయం కారణంగా డిఫెన్స్‌లో పడిపోయింది. మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదు.. అని హైకోర్టు వ్యాఖ్యానించడం తెలంగాణ సర్కార్‌కి ఎదురుదెబ్బ కాక మరేమిటి.?

సర్కార్ ‘ఫాస్ట్’కి హైకోర్టు బ్రేకులు

సర్వే, రవాణా వ్యవహారాలు ఒక యెత్తు.. ఫాస్ట్ పథకం విషయమై హైకోర్టు వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ‘దేశ సమగ్రతను దెబ్బతీసేలా వుంది..’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే, టి.సర్కార్ ‘ఫాస్ట్’ పథకం విషయమై ఎంత తొందరపాటు ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు. ‘మా సొమ్ములు మా తెలంగాణ విద్యార్థులేక..’ అని ఫాస్ట్ విషయంలో తెలంగాణ సర్కార్ తరఫున అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని న్యాయస్థానం సీరియస్‌గా తీసుకున్నట్టుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు ‘మాది మాకే’ అన్న ఆలోచన చేస్తే, దేశంలో జాతీయ సమగ్రత ఎలా వుంటుంది.? అని న్యాయస్థానం ప్రశ్నించడం తెలంగాణ సర్కార్‌కి పెద్ద మొట్టికాయ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ ఆఫర్ ఇచ్చారు ఈ ఫాస్ట్ పథకం విషయమై గతంలో. మీరు తెలంగాణేతరులంటోన్న సీమాంధ్రులకి మేం 5 శాతం రీఎంబర్స్‌మెంట్ చెల్లిస్తాం.. మిగతాది మీరు చెల్లించండి.. అన్నారాయన. కానీ అందుకు టి.సర్కార్ ఒపకోలేదు. స్థానికత పేరుతో అడ్డగోలు నిబంధనను తెరపైకి తెచ్చింది.. హైకోర్టుతో మొట్టికాయలేయించుకుంది.

పదే పదే మొట్టికాయలు.. ఎందుకిలా.?

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గతంలో మంత్రిగా పనిచేశారు. బోల్డంత రాజకీయ అనుభవం ఆయన సొంతం. మరి, పరిపాలన విషయంలో ముఖ్యమంత్రిగా ఆయనెందుకు తొందరపాటు చర్యలకు దిగుతున్నట్టు.? ఏ పథకం ప్రకటిస్తే ఎట్నుంచి ఎటు వివాదాలు కమ్మేస్తాయోనన్న ఆలోచన ఆయనకి లేకపోవడం వింతగానే అన్పిస్తోంది. ఉద్యమం నేపథ్యంలో ఆయనేం మాట్లాడినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లిపోయింది. ఉద్యమానికీ పరిపాలనకీ చాలా తేడా వుంటుంది. ఉద్యమంలో ఆంధ్రోళ్ళని తరిమికొడ్తాం.. అనొచ్చుగాక. ముఖ్యమంత్రిగా, తన రాష్ర్టంలో నివసిస్తోన్నవారి పట్ల వివక్ష చూపడం కేసీఆర్‌కి తగదు. ‘మా తెలంగాణేక..’ అంటే, తెలంగాణలో నివసిస్తోన్న తెలంగాణేతరుల (కేసీఆర్ లెక్కప్రకారం సీమాంధ్రులు) పరిస్థితి ఏమిటి.? తెలంగాణ, భారతదేశంలోనే వుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.. అని రాష్ర్ట సర్వోన్నత న్యాయస్థానం చురకలంటించడం చిన్న విషయమేమీ కాదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయాలు, ఆయన సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ రాష్ట్రానికే చెడ్డపేరు తెస్తున్నాయన్న విమర్శలకు కొదవేం లేదు. కేసీఆర్‌ని విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లేనన్న రీతిన తెలంగాణ ఉద్యమకాలంలో వ్యవహరించింది టీఆర్‌ఎస్. మరిపడు న్యాయస్థానం సంధిస్తోన్న ప్రశ్నలకు సమాధానమిచ్చేదెవరు? ఇప్పటి తెలంగాణ నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగం. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా హైద్రాబాద్‌లో ‘సమగ్రత’ కన్పించేది. అన్ని రాష్ట్రాలవారు, అన్ని ప్రాంతాలవారు కలిసిమెలిసి వున్నారు. తాము పరాయివారమనో, తాము ప్రత్యేకమనో ఎవరూ అనుకోలేదు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతాలుగానే విడిపోతున్నాం.. ప్రజలుగా కలిసే వుంటాం.. అని చెప్పిన టీఆర్‌ఎస్, అధికారంలోకొచ్చాక ‘మీరు వేరు.. మేం వేరు..’ అనేట్టుగా నిర్ణయాలు తీసుకుంటుండడం ఏ ‘సమగ్రత’కు సంకేతం.?

మొండి వైఖరితో ఏం సాధించినట్టు.!

ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిపై దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ‘మీ కౌన్సిలింగ్ మీదే.. మా కౌన్సిలింగ్ మాదే’ అంటూ టి.సర్కార్ తేల్చి చెప్పేసరికి ఎంసెట్ కౌన్సిలింగ్ తొలుత గందరగోళంలో పడింది. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాలూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుని, కౌన్సిలింగ్ ప్రక్రియను వేగంగా జరిపి వుంటే, ఇంజనీరింగ్ విషయంలో ఇంత గందరగోళమే వుండేది కాదు. మెరిట్ విద్యార్థులు, అవకాశం వున్నవారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఇక్కడ తెలంగాణ సర్కార్ సాధించినదేమిటన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి ‘నో ఆన్సర్’. నష్టపోతున్నవారిలో తెలంగాణ విద్యార్థులూ వున్నారిపడు. పరిస్థితి ఇలా వుంటుందని తెలంగాణ సర్కార్ ముందే ఊహించలేదా.? తెలంగాణలో సర్కార్‌ని నడుపుతోన్న తెలంగాణ రాష్ర్ట సమితి అంత మొండిగా ఎలా వ్యవహరించిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడంలేదు.

సెంటిమెంట్ ముసుగేస్తే సరి

సర్వే నుంచి ఫాస్ట్ దాకా.. దేన్ని తీసుకున్నా అన్నిటిలోనూ తెలంగాణ సెంటిమెంట్ స్పష్టంగా కన్పిస్తోంది. సెంటిమెంట్‌ని శాంతింపజేయడంలో తెలంగాణ సర్కార్ నూటికి నూరుపాళ్ళు విజయం సాధించినప్పటికీ, సెంటిమెంట్ దాటి బయటకు వచ్చి, ఓ రాష్ట్రానికి పాలకులుగా అధికార పార్టీ నేతలు ఆలోచిస్తే వారికి వాస్తవాలు అర్థమవుతాయి. సర్వే విషయంలో ఏం జరుగుతుందో ముందే వారు ఊహించలేదని అనుకోలేం. ఎందుకంటే దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ‘నాయకుడు’ తెలంగాణ ముఖ్యమంత్రి. రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. ఫాస్ట్ పథకంలో అయినా తాను చేస్తున్నది బూమరాంగ్‌లా తమేక తిరిగి కొడ్తుందని తెలియనంత అపరిపక్వత ఆయనలో వుందని అనుకోవడమూ తప్పే. సమస్యలు ఎదురవుతాయని తెలిసినా, వాటిని తేలిగ్గా అధిగమించేయొచ్చన్న అతి విశ్వాసం అడుగడుగునా తెలంగాణలో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలేలా చేస్తోంది. సర్వే అయినా ఫాస్ట్ పథకం అయినా నెంబర్ ప్లేట్ల వ్యవహారమైనా.. అన్నిటికీ తెలంగాణ సమాజం నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం లభించింది. ఆ క్రమంలో అధికార పార్టీ రాజకీయంగా నూటికి నూరు మార్కులూ సంపాదించేసి వుండొచ్చుగాక.. పాలనలో మాత్రం ఆ మార్కులు పనిచేయవని న్యాయస్థానం వేసిన, వేస్తోన్న మొట్టికాయలతో అయినా కేసీఆర్ సర్కార్ తెలుసుకుంటే మంచిది.

బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయడం ఖాయం

న్యాయస్థానంలో చుక్కెదురయ్యిందంటే పాలకులకు పెద్ద షాకే. అది పాలనలో అపరిపక్వతకు నిదర్శనం అని భావిస్తారు చాలామంది. పరిపాలన చాలా ఫాస్ట్‌గా వుందన్పించుకోవాలంటే, దానికి చాలా మార్గాలున్నాయి. రుణమాఫీని ఇప్పటికే అమలు చేసి వుండొచ్చు. లేదంటే ఇంకో కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి వుండొచ్చు. ప్రాజెక్టులకు అనుమతులివ్వొచ్చు. కొత్త పరిశ్రమల్ని ప్రారంభించవచ్చు. ఇవేవీ కాకుండా, వివాదాస్పద నిర్ణయాల జోలికి స్పీడ్‌గా వెళితే, మార్గమధ్యంలో ఎదురయ్యే ఇబ్బందుల కారణంగా బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కి ముప తెచ్చిపెడ్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే కోర్టులో ఎలాంటి షాక్ తగులుతుందోనని వివిధ రంగాలు ఆందోళన చెందాల్సి వస్తుంది. అందుకే పాలకులు వేసే ప్రతి అడుగూ ఒకటికి పదిసార్లు ఆలోచించి వెయ్యాలి. ఉద్యమ నాయకుడిగా తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకున్న కేసీఆర్, ముఖ్యమంత్రిగానూ అవే విజయాలు సొంతం చేసుకోవాలంటే ప్రస్తుతం అనుసరిస్తోన్న మార్గం మాత్రం సరికాదు. ఆయన ఇంకా కొత్తగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. ‘అందరివాడు’ అన్పించుకోవాలి. ఆ దిశగా కేసీఆర్ ఆలోచనలు భవిష్యత్తులో సాగుతాయా.? సాగాలనే ఆశిద్దాం.

 సింధు