కాక్‌ పిట్‌లో ఫైటింగ్‌: వీళ్ళు మారరు

జర్మన్‌ వింగ్స్‌ విమానం కూలిన ఘటనలో కో-పైలెట్‌నే బాధ్యుడిగా తేల్చారు. ఈ విమాన ప్రమాదంలో 150 మంది మృత్యువాత పడ్డారు. అసలు ఇది ప్రమాదం కాదు. 150 మందిని కో పైలెట్‌ సామూహికంగా హత్య…

జర్మన్‌ వింగ్స్‌ విమానం కూలిన ఘటనలో కో-పైలెట్‌నే బాధ్యుడిగా తేల్చారు. ఈ విమాన ప్రమాదంలో 150 మంది మృత్యువాత పడ్డారు. అసలు ఇది ప్రమాదం కాదు. 150 మందిని కో పైలెట్‌ సామూహికంగా హత్య చేశాడు అనడం సబబేమో.

వరుసగా ఒకదాని తర్వాత ఒకటి విమాన ప్రమాదాలు వెలుగు చూడ్డంతో విమానంలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. విమానయానంలో విశేషమైన ప్రగతి సాధించడంతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా చిటికిలో వెళ్ళడానికి మార్గం సుగమమయ్యింది. అదే సమయంలో.. ఈ తరహా ప్రయాణాలూ పెరిగిపోతున్నాయి.

ఇక, అసలు విషయానికి వస్తే ఎయిర్‌ ఇండియా పైలట్లు విమానంలో కొట్టుకున్నారన్న వ్యవహారం వెలుగు చూసేసరికి అంతా షాక్‌కి గురయ్యారు. జైపూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో పైలట్లు ఒకర్ని ఒకరు దూషించుకున్నారు.. ఓ దశలో పరస్పరం దాడి చేసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జరిగిందీ ఘటన.

విమానం సరైన మార్గంలో ప్రయాణించాలన్నా, సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వాలన్నా పైలెట్‌కీ, కో-పైలట్‌కీ మధ్య సమన్వయం అవసరం. ఇద్దరిలో ఏ ఒక్కరు పొరపాటు చేసినా, ఇద్దరి మధ్యా సమన్వయం కొరవడినా అందులో వున్న ప్రయాణీకులకు మూడినట్లే. ఈ విషయంలో ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఖచ్చితంగా వ్యవహరించాల్సి వుంటుంది. పైలెట్‌, కో-పైలెట్‌ ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

కానీ, చిన్నపిల్లల్లా పైలెట్‌, కో-పైలెట్‌ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాన్ని ఎలా అర్థం చేసువాలి.? పైలెట్లూ సాధారణ మనుషులే.. వారికీ భావోద్వేగాలుంటాయి.. అని లైట్‌ తీసుకోవడానికి లేదిక్కడ. చిన్న తప్పిదం వందల మందిని గాల్లో కలిపేస్తుంది. సో.. ఇలాంటి గొడవల్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సి వుంటుంది. ఎదురుగా ఘోర దుర్ఘటన కన్పిస్తున్నా పైలెట్లు బాధ్యత మరిచి కొట్టుకున్నారంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదు.