పొగాకు క్యాన్సర్ కారకం. నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్.. ఇలా రకరకాల క్యాన్సర్లను ప్రేరేపించే కారకాలు పొగాకులో వున్నాయని వైద్య పరిశోధనలు ఆధారాలతో సహా నిరూపించాయి. దాంతో, ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించడం తగ్గించాలంటూ గడచిన కొన్ని దశాబ్దాలుగా వైద్య వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం నిర్వహిస్తూనే వున్నాయి. మన దేశంలో అయితే, పొగాకు ఉత్పత్తులపై పెద్దపెద్ద అక్షరాలతో ‘పొగాకు క్యాన్సర్ కారకం’ అని ముద్రించి వుంటుంది. కోట్లు ఖర్చు చేసి ప్రకటనలూ గుప్పిస్తున్నారు. ధూమపానం ఆరోగ్యానికి చేటు చేస్తుందని ప్రకటనలో హెచ్చరిస్తున్నారు. ‘మీరు ధూమపానం చేస్తే మీరొక్కరే కాదు, మీ ఇంట్లోవారూ క్యాన్సర్ సహా అనేక ప్రమాదకర రోగాల బారినపడాల్సి వస్తుంది..’ అని ఓ పక్క ప్రకటనలు ప్రజల్లో చైతన్యం పెంచుతోంటే, ‘పొగత్రాగడం ప్రాణానికి హానికరం కానే కాదు.. కావాలంటే నేను నిరూపిస్తా..’ అంటూ కొందరు ఎంపీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నారు.
పొగత్రాగనివాడు దున్నపోతై పుట్టున్.. అనే డైలాగ్ గతంలో విరివిగా విన్పించేది. ఇపడూ చాలామంది ఆ డైలాగ్‌ని వల్లిస్తుంటారు. పొగత్రాగేవారు తాము చేసే పనిని సమర్థించుకోవడానికి చెప్పే మాట ఇది. పొగాకు వ్యసనం. దానికి బానిసైపోయినవాళ్ళు, తాము చేస్తున్న పనిని సమర్థించుకోడానికి ఇలాంటివి చెప్తారు గనుక, దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. తమ బలహీనత తమకు తెలుసనీ, దాన్నుంచి బయటపడలేకపోతున్నామనీ పొగరాయుళ్ళు చెబుతారంటే, అందులో వారి అసహనాన్ని అర్థం చేసుకోవాల్సిందే ఎవరైనా. కానీ, మన ఎంపీల వ్యవహారమేమిటి.? వీళ్ళకు అసలు సమాజంపై బాధ్యత వుందా? లేదా.? అనే అనుమానం కలుగుతోంది అందరికీ. మొన్నటికి మొన్న బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ, పొగాకు క్యాన్సర్ కారకం కానే కాదని తేల్చేశారు. ఇంకొకాయన, రోజుకి 60 సిగరెట్లు తాగే వ్యక్తి, ఫుల్ బాటిల్ తాగే వ్యక్తి 6 ఏళ్ళ వరకూ ఎలాంటి అనారోగ్యం లేకుండా వున్నాడనీ, మరొకాయనకు కూడా ఇలాంటి అలవాట్లే వున్నాయనీ, ఆయనా హాయిగా జీవించి వున్నాడనీ తనతో వస్తే వారిని అందరికీ చూపిస్తానని సెలవిచ్చాడు. ఇలా సెలవిచ్చిన అయ్యగారు కూడా ఎంపీనే కావడం గమనార్హం. ఈయనగారి పేరు రామ్ ప్రసాద్ శర్మ. అసోం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఏది నిజం.? ఏది అబద్ధం.? అన్న విషయాన్ని చెప్పాల్సింది వైద్యులు. పొగాకు ఎంత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందో తెలియాలంటే దేశంలో ఏ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళినా సరిపోతుంది. అక్కడ వైద్యులు తాము చికిత్స చేస్తోన్న రోగులను చూపిస్తారు.. ఏ రకంగా పొగాకు, మనిషిలో క్యాన్సర్ మహమ్మారి చొరబడటానికి అవకాశం కల్పిస్తుందో వివరిస్తారు. సునీతా తోమర్ అనే మహిళ క్యాన్సర్ బారిన పడి ఎలా తన జీవితం నాశనమైందీ ప్రపంచానికి సవివరంగా చెప్పింది. టీవీల్లో, సినిమా థియేటర్లలో ఈమె నటించిన వీడియో అందరికీ సుపరిచితమే. ‘ఆమె నటిస్తోంది..’ అనుకున్న చాలామందికి కాదు, కాదు.. చావబోతూ పదిమంది అయినా తన వీడియో చూసి ధూమపానాన్ని మానేస్తారేమో అన్న ఆవేదనతో చెప్పిందన్న విషయం ఇటీవలే తెలిసింది. నిండా ఆమెకు 30 ఏళ్ళు కూడా లేవు. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడింది. ఆమెకు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ధూమపానమేనని తేల్చారు. మహిళలేమిటి.? ధూమపానం చేయడమేంటి.? అనుకునేవారెంతోమంది వున్నారు దేశంలో. కానీ, వివిధ రూపాల్లో గ్రామీణ మహిళలు సైతం పొగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు. ఫలితం పొగాకు కారణంగా క్యాన్సర్ బారిన పడ్తున్న మహిళల సంఖ్య పురుషులతో సమానంగా వుంటోంది. ఆ మాటకొస్తే, కాస్త ఎక్కువగానే వుంటోంది. తాను చనిపోవడానికి సరిగ్గా కొద్దిరోజుల ముందే, ‘పొగాకు క్యాన్సర్ కారకం కాదు’ అని ఎంపీ దిలీప్‌గాంధీ వ్యాఖ్యానించారు. అది తెలుసుకున్న సునీతా తోమర్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తన ఆవేదన అర్థం చేసుకోవాలనీ, తాను జీవిత చరమాంకంలో వున్నాననీ, తన దుస్థితి ఎవరికీ రాకూడదనీ, పొగాకును నియంత్రించాలనీ అదే సమయంలో పొగాకు క్యాన్సర్ కారకం అన్న విషయానికి మరింత ప్రచారం కల్పించాలని ప్రధానికి రాసిన లేఖలో సునీతా తోమర్ కోరింది.
వైద్యులు చెప్పారు.. క్యాన్సర్ ఆసుపత్రుల్లో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.. ఇవన్నీ ఎంపీలకు తెలియదా.? అంత బాధ్యతారహిత్యంగా ఎలా వ్యవహరిస్తారు.? ఎవరి అలవాట్లు వారివి, ఎవరి వ్యసనాలు వారివి.. అనుకోడానికి వీల్లేదు. లిక్కర్ వ్యక్తిగత వ్యసనం. ధూమపానం అలా కాదు. ఇది సామాజిక సమస్య. ఒక వ్యక్తి ఒక సిగరెట్ లేదా, ఏదైనా పొగాకు ఉత్పత్తిని కాల్చితే, అందులోని క్యాన్సర్ కారకాలు గాల్లో కలిసిపోతాయి, అది పీల్చిన వ్యక్తికి ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది. ఇంత తీవ్రమైన సమస్య పట్ల ప్రజాప్రతినిథులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమంటే, అది భావప్రకటనా స్వేచ్ఛ అనుకోడానికి వీల్లేదు, తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వుంటుంది.
పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడో, ఇంకెలాగో పుడతాడో తెలియదుగానీ, పొగతాగితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రమైన అనారోగ్యం తప్పదు. అది క్యాన్సరా? గుండెపోటా? ఇంకొకటా.? అన్నది ఆయా వ్యక్తుల అదృష్టంపై ఆధారపడి వుంటుంది. వేగంగా వెళ్తున్న రైల్లోంచి కిందికి దూకితే ఒకటీ అరా సందర్భాల్లో అదృష్టం కలిసొచ్చి బతకొచ్చు. అలాగని రైల్లోంచి దూకేయగలమా.? దూకేయండి.. ఫలానా వ్యక్తి ఫలానా సందర్భంలో బతికాడు.. అని సరిపెట్టుకోగలమా.? ఇదీ అంతే. ప్రపంచాన్ని వణికిస్తోంది క్యాన్సర్. ఒక్క క్యాన్సర్ అనే కాదు, పొగాకు కారణంగా అనేకానేక ఆరోగ్య సమస్యలు.. తీవ్రమైన జబ్బులు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి నుంచి మానవాళిని రక్షించాలంటే, ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికల్ని ముద్రించడం కన్నా, ముందు ప్రజా ప్రతినిథుల నోళ్ళు మూయించడంపై నరేంద్రమోడీ సర్కార్ దృష్టిపెట్టాలి.
వెంకట్ ఆరికట్ల