బంగారం ధర తగ్గిపోతోంది..ఇప్పుడు గ్రాము ధర ఆభరణాల బంగారం 2400 లోపుకే వచ్చేసింది. బంగారంపై పెట్టుబడికి ఇది అనువైనదేమో అని చాలా మంది మధ్యతరగతి జనాలు భావించడం సహజం. పైగా దుకాణ దారులు కూడా ఆ విధంగానే ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే బంగారం మళ్లీ ఏ రేంజ్ కు చేరుకుంటే ఇప్పుడు మన పెట్టుబడి సేఫ్ అన్నది కచ్చితంగా ఆలోచించుకోవాలి.
ఎందుకంటే మధ్యతరగతి వారికి పెట్టుబడికి సేఫ్ అయినవి రెండు మార్గాలు ఒకటి..బ్యాంకు డిపాజిట్లు. రెండు బంగారం. ఈ రెండూ కూడా వెంటనే నగదుగా మారడానికి వీలున్నవి. చిన్న మొత్తాల్లో కూడా పొదుపు చేసుకోవడానికి అవకాశం వున్నవి. అందువల్ల ఇవే మధ్యతరగతికి పొదుపు మార్గాలు.
బ్యాంకులో కనీసంలో పది వేలకు నెలకు 60 నుంచి డెభై రూపాయిల మధ్య వడ్డీ వచ్చే అవకాశం వుంది. అంటే ఇప్పుడు 10 గ్రాముల బంగారంపై పెట్టుబడి పెడితే, అంటే సుమారు 23 వేలు అనుకుంటే, సుమారుగా నెలకు నూటాయాభై రూపాయిల పెరుగుదల నమోదు చేయాలి. అంటే వచ్చే ఏడాది నాటికి, బంగారం 10 గ్రాముల ఆభరణాల ధర 24800 రూపాయిలు కావాల్సి వుంటుంది.
కానీ ఇక్కడ అంతకు మించిన సమస్య ఇంకోటుంది. బంగారాన్ని కొనేటప్పుడు కాయిన్ గా కొన్నా, కూడా మూడు నుంచి అయిదు శాతం తరుగు వసూలు చేస్తున్నారు. అదే విధంగా దాన్ని నగదు గా మార్చుకోవాలంటే అయిదు నుంచి పది శాతం వసూలు చేస్తున్నారు. అంటే ముందు వెనుక కలిపి, హీనంగా పది శాతం పోగొట్టుకోవాల్సి వుంటుంది. అంటే సుమారు 2300 రూపాయిలు. అంటే ఇందాక లెక్కించిన 24800 కు ఇది అదనం. అంటే, 27వేల రూపాయిలు దాటాలి పది గ్రాముల ఆభరణాల బంగారం ధర. అప్పుడు బ్యాంకు వడ్డీ వచ్చినట్లు. లేదంటే లేదు.
మరి ఇంత బాధపడి, టెన్షన్ పడి కొనడం ఏ మేరకు లాభం? అంతకన్నా బ్యాంకు వడ్డీ బెటర్ కదా? పైగా పెట్టుబడి కోసం బంగారం కొనేటపుడు కాయిన్ కాకుండా ఆభరణాలు కొంటే మరీనష్టం. ఎందుకంటే వాటిపై కనీసపు వేస్టేజ్ 10శాతానికి తక్కువ వుండదు. అప్పుడు బంగారం పెట్టుబడిపై బ్యాంకు వడ్డీ రావాలంటే, వచ్చే ఏడాది ఇదే కాలం నాటికి ఆభరణాల బంగారం ధర 29వేలకు చేరుకోవాలి. ఇది జరగడానికి అవకాశం వుందీ అంటే వుంది..లేదు అంటే లేదు.
అలాంటపుడు రిస్క్ తీసుకోవడం కన్నా మధ్యతరగతి జనాలకు బ్యాంకు డిపాజిట్లే సేఫ్. పైగా బంగారమైనా, బ్యాంక్ డిపాజిట్లయినా పాన్ కార్డ్ వాడాల్సిందే. అంటే లెక్కలు చూపాల్సిందే. అయితే యంగ్ జనరేషన్, అంటే ఇప్పుడు పాతిక, ముఫై ఏళ్లలో వున్నవారు బంగారంపై లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేసుకోవచ్చు. నెలనెలా, ఏడాది పెరుగుదల చూడకుండా, పదేళ్ల తరువాత సంగతి చూసుకుంటే బ్యాంకు వడ్డీ కన్నా లాభాలు వుండే అవకాశం వుంది.
ఎందుకంటే గోల్డ్ ట్రాక్ రికార్డు చూసుకుంటే గ్రాఫ్ పైకే వుంది కానీ కిందకి లేదు. కానీ గడచిన అరేడేళ్లలో మాత్రం అంత లాభదాయకమైన పెట్టుబడిగా మాత్రం లేదు. ముఖ్యంగా ఆరేడేళ్ల క్రితం ముఫై , ముఫ్ఫై రెండు వేల రేంజ్ లో పది శాతం నుంచి ఇరవై శాతం వేస్టేజ్ పెట్టి కొన్నవారంతా ఇప్పటికి బ్యాంకు వడ్డీనే కాదు, అసలు కూడా నష్టపోయే వున్నారు. అందువల్ల బంగారం కొనే ముందు కాస్త ఆలోచించుకోండి.