ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏమైంది? ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఆకాశానికెత్తిన, అభివృద్ధిలో సాటి లేని మేటి అని కీర్తించిన ఆ నరేంద్ర మోదీకి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీకి పొంతన కనిపించడంలేదు. ఆయన సొంత ఆలోచనలు చేయడంలేదు. అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్న మోదీ, ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తూ విదేశీ ఫ్యాషన్ గురువుల ప్రశంసలు పొందుతున్న మోదీ చేతల్లో మాత్రం ‘కాపీరాయుడు’లా కనబడుతున్నారు. ఇది మనం చెబుతున్న మాట కాదు. రాజకీయాల్లో, మీడియాలో తలల పండిన నిపుణులు చెబుతున్న మాట. వారి విశ్లేషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే ‘నిజమే సుమా’ అనిపిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయింది కాబట్టి ఆయన సత్తా ఏమిటో ఇప్పుడే తెలియదు కదా అని అనుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే మాట తనను గురించి చెప్పుకున్నారు. ‘నా మార్కు పాలన ఇంకా మొదలుకాలేదు’ అని అన్నారు. ఇదే మోదీకి వర్తింపచేసుకుంటే ఆయన మార్కు పాలన కూడా ఇంకా మొదలుకాలేదని బీజేపీ నాయకులు చెప్పుకోవచ్చు. కాని యూపీఏ ప్రభుత్వ విధానాలను, చర్యలను విమర్శించి అధికారంలోకి వచ్చిన బీజేపీ అవే విధానాలను అనుసరించడమేమిటి? అది కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పగ్గాలు చేపట్టిన తెల్లవారి నుంచే యూపీఏ విధానాలను అమలు చేయడం ప్రారంభించింది. ఆ విధానాలకు విసిగిపోయే కదా ప్రజలు మార్పు కోరుకున్నారు. అటువంటప్పుడు అవే విధానాలు అనుసరిస్తే ఆ సర్కారుకు, ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి, అధికారంలోకి రాగానే మరోలా వ్యవహరిస్తే ఇక బీజేపీ ప్రభుత్వం ఎందుకు? యూపీఏ ప్రభుత్వాన్నే కొనసాగించవచ్చు కదా…!
ప్రజలకు చేటు చేసే ఆర్థిక సంస్కరణలను యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువ వేగంగా మోదీ సర్కారు అమలు చేస్తోంది. విదేశీ బడా పెట్టుబడిదారులకు గత ప్రభుత్వం కంటే ఘనంగా స్వాగతం పలుకుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ స్పీడుతో నిర్వీర్యం చేస్తోంది. తాను పెట్టుబడిదారులకు నమ్మకమైన దోస్తుననే అభిప్రాయం మోదీ బలంగా కలిగించారు. ఇక ప్రస్తుతానికి వస్తే…యూపీఏ పాలనలో ఘోరంగా విఫలమైన, సామాన్య ప్రజలను నానా ఇబ్బందులపాలు చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ (డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్) పథకాన్ని మోదీ సర్కారు మళ్లీ భుజాలకెత్తుకుంటోంది. గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది దీన్ని వచ్చే ఏడాది జనవరి నుంచో, ఏప్రిల్ నుంచో అమలు చేస్తారట…! వంటగ్యాసును ఆధార్‌తో ముడిపెట్టి అమలు చేసిన నగదు బదిలీ అట్టర్‌ఫ్లాప్ కావడంతో భయపడిన యూపీఏ ఎన్నికల ముందు దాన్ని ఆపేసింది. ఈ పథకంతో విసిగిపోయిన జనం ఎన్నికల్లో ఫలితం చూపించారు. సబ్సిడీ గ్యాస్ సిలండర్లను కుదించడాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు. దీంతో ఏడాదికి 9 బదులు 12 సిలిండర్లు ఇస్తామన్నారు. పన్నెండు సిలిండర్ల పథకం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగుస్తుంది. దీంతో నగదు బదిలీ ద్వారా గ్యాసు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. నగదు బదిలీ అనేది సబ్సిడీలను ఎత్తేయడానికి ఉద్దేశించిన పథకం. ఆర్థిక సంస్కరణల్లో ఇదొక భాగం. చాలా పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.
పాత పథకంలోని లోపాలను సరిదిద్ది అమలు చేస్తామని చెబుతున్నా పకడ్బందీగా అమలు జరుగుతుందనే నమ్మకం లేదు. మోదీ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ఎందుకు ముందుకు పోవడంలేదనేది ప్రధాన ప్రశ్న. ఆయన యూపీఏ బాటలోనే నడస్తుండటంతో ఈమధ్య దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతింది. కేవలం వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే అందుకు కారణాలు ఆలోచించుకోవాలి. సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన బీజేపీ ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. వాస్తవానికి అక్కడ అఖిలేష్ యాదవ్ పాలన రౌడీ రాజ్యంలా ఉందనే విమర్శలు, ఆరోపణలున్నాయి. అయినప్పటికీ అక్కడ బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. బీహార్, రాజస్థాన్‌లోనే కాకుండా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తల బొప్పి కట్టింది. గతంలో ఏ పార్టీకీ ఇలా జరగలేదు. అంటే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇంత వ్యతిరేకత కనబడలేదని పరిశీలకులు చెబుతున్నమాట. గుజరాత్లో మోదీ చేశారని చెప్పుకుంటున్న అభివృద్ధి హంబక్ అనేవారు చాలామంది ఉన్నారు. తాజాగా వెలువడిన ఓ నివేదిక ప్రకారం…బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉందట. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయట..! కాబట్టి మోదీ సర్కారు ఇప్పటికైనా వినూత్నమైన ఆలోచనలు చేస్తేనే వచ్చే ఎన్నికల నాటికి ప్రజాదరణ పొందుతుంది. గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు.
ఎం. నాగేందర్