అదో క్రూర మృగం. దానికి విజ్ఞత అనేది వుండదు కదా. మనిషి చిక్కితే వదిలే ప్రసక్తే వుండదు. దానికి దూరంగా, కాస్త జాగ్రత్తగా వుండాల్సింది మనమే. కానీ, ఓ కుర్రాడు పులి బోనులోకి దూకాడు. కాదు, పడిపోయాడనే వాదన కూడా వున్నా, పడిన తీరు.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చూస్తే మాత్రం, ఆ కుర్రాడు కావాలనే పులి బోనులోకి వెళ్ళినట్లు అర్థమవుతుంది. దూకాడో, పడిపోయాడో.. పులి చూస్లూ ఊరుకోలేదు. చంపేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఎక్కడో అడవుల్లో జరగలేదు.. బోల్డంతమంది జనం చూస్తుండగానే ఢిల్లీలోని జూ పార్క్‌లో జరిగింది.
జూ పార్క్‌కి ఎందుకు వెళ్తాం.? అక్కడ వుండే జంతువుల్ని చూసేందుకు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ జూపార్క్లున్నాయి. వాటిల్లో క్రూరమృగాల్ని సంరక్షిస్తున్నాం. అడవుల్లో జంతువులకు రక్షణ లేకపోవడంతో, వాటిని జూ పార్క్‌ల్లో పెట్టి బోల్డంత ఖర్చు చేసి మరీ సంరక్షించాల్సి వస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న జూ పార్క్‌ల్లో కూడా క్రూరమృగాల్ని వేటాడేవాళ్ళున్నారనుకోండి.. అది వేరే విషయం. జూ పార్క్‌కి వెళ్ళే సందర్శకుల్లో కొందరు తుంటరి జనాలుంటారు. జంతువుల్ని రెచ్చగొడ్తుంటారు. ఒకడుగు ముందుకేసి, హెచ్చరిక బోర్డుల్ని లెక్క చేయకుండా చేతులు చాచడం.. ఫెన్సింగ్‌పై నిల్చోవడం వంటివి చేయడం మామూలే. ఒక్కోసారి వారి వికృత చేష్టలకు వారే బలైపోయిన సందర్భాలూ వున్నాయి.
ఢిల్లీ జూపార్క్‌లో ఏమయ్యిందోగానీ, పులికి చిక్కిన కుర్రాడు.. భయం భయంగా దాని ముందు కూర్చుండిపోతే.. పులి నిస్సహాయ స్థితిలో వున్న అతడ్ని నోట కరచుకుపోయింది. జూ అధికారులు స్పందించేటప్పటికే కుర్రాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక్కడ జూ పార్క్ నిర్వాహకులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్చరిక బోర్డులు లేవనీ.. ఫెన్సింగ్ తగిన ఎత్తులో లేవనీ సందర్శకులు విమర్శిస్తున్నారు. అయితే, ప్రమాదమని తెలిసీ.. ప్రమాదం అంచుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.? అన్న ప్రశ్న కీలకం.
తప్పెవరిదైనా ఓ నిండు ప్రాణం పులికి బలైపోయింది. ఈ ఘటనకు సంబంధించి సందర్శకులు చిత్రీకరించిన వీడియో, మీడియాలోనూ ఇంటర్నెట్లోనూ హల్చల్ చేస్తోంటే చూసినవారికి గుండె తరుక్కుపోతోంది.