విశిష్ట బృహత్ ప్రయత్నం గంగాధర్ భగవద్దీత

భగవద్గీత ను ఎందరో గాయకులు ఆలపించారు. కానీ ఘంటసాల భగవద్గీతకు వచ్చినంత పాపులారిటీ మరి దేనికీ రాలేదు. ఎంత పాపులారిటీ అంటే భగవద్గీత అంటే అదే అనుకునేంత. సామాన్యులు అలా అనుకుంటే తప్పు లేదు.…

భగవద్గీత ను ఎందరో గాయకులు ఆలపించారు. కానీ ఘంటసాల భగవద్గీతకు వచ్చినంత పాపులారిటీ మరి దేనికీ రాలేదు. ఎంత పాపులారిటీ అంటే భగవద్గీత అంటే అదే అనుకునేంత. సామాన్యులు అలా అనుకుంటే తప్పు లేదు. కానీ భగవద్గీత అంటే ఘంటసాల స్వరపరిచి, ఆలపించిన 106 శ్లోకాలు మాత్రమే కాదు. మొత్తం 700 శ్లోకాల వున్నాయి. ఈ ఏడువందల శ్లోకాలను శాస్తబద్ధంగా స్వరపరిచి, ఆలపించి, వాటి తాత్పర్యం చెబుతూ, మరిన్ని విశేషాలు జోడించి, అందించాలన్న ప్రయత్నాన్ని తలకెత్తుకుని పూర్తి చేసారు ఎల్. గంగాధర శాస్త్రి. మన వాడు..మన తెలుగువాడు..ఒకప్పుడు సినిమా జర్నలిస్టు..ఆపై గాయకుడు..ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాజెక్టును చేపట్టి, 18 డివిడిల రూపంలో సిద్ధం చేసారు. 

భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమమూ, ప్రతిష్టాత్మకమూ, ప్రామాణికమూ అనదగిన శబ్దవాగ్మయమే గంగాధర శాస్త్రి ఆలపించిన 700 శ్లోకాల తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత. గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ''సంపూర్ణ భగవద్గీత గాన యజ్ఞం'' పూర్తయ్యి, 18 ఆడియో సీడీల రూపంలో విడుదలకు సిద్ధమైంది. అమర గాయకుడు ఘంటసాలగారు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను మాత్రమే గానం చేయగా, హెచ్‌ఎంవీ సంస్థ వారు 1974, ఏప్రిల్‌ 21న గ్రామ్‌ఫోన్‌ రికార్డు రూపంలో విడుదల చేశారు. ఆనాడు ఒక తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగు గాయకుడే పూర్తి చేయాలన్న సంకల్పంతో గంగాధర శాస్త్రి  స్వీయ సంగీత సారథ్యంలో తెలుగు తాత్పర్య సహితంగా ''700 శ్లోకాల సంపూర్ణ గీతా గాన యజ్ఞాన్ని'' 2006, జూన్‌ 25న ప్రారంభించారు.

అవిశ్రాంత కృషి, ఆమూలాగ్ర పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుమధుర గాన మాధుర్యాల మేళవింపుగా గంగాధర శాస్త్రి చేసిన ఈ అపూర్వ ప్రయత్నం భారతీయ సంగీత చరిత్రలో సువర్నాక్షర లిఖితం అవుతుందని వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించడం విశేషం. 8 సంవత్సరా ల నిరంతర కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియోలోని ఇంకా అనేక ప్రత్యేకతలు వున్నాయి. 

దాదాపు 100 మంది పండితులు, వా ద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, భగవద్భంధువులు ఈ ప్రాజెక్టుకు సహకారం అందించారు. మహామహోపాధ్యాయ, 'పద్మశ్రీ' ఆచా ర్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, 'సంస్క తమిత్ర' డాక్టర్ ఆర్‌.వి.ఎస్‌.ఎస్‌.అవధానులు మరియు ఆచార్య శ్రీ కోరాడ  సుబ్రహ్మణ్యం గార్ల పర్యవేక్షణలో ప్రామాణిక స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఘంటసాలగారి 'భగవద్గీత'కు పనిచేసిన 'సితార్‌' వాద్యకళాకారుడు శ్రీ జనార్దన్‌, సౌండ్‌ ఇంజనీర్‌ 'హెచ్‌.ఎమ్‌.వి' రఘు, సంగీత దర్శకులు శ్రీ సంగీతరావు గార్లు ఈ ప్రాజెక్టుకు కూడా గౌరవహోదాల్లో పనిచేయడం విశేషం. 

కర్నాటక, శాస్త్రీయ , హిందూస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతా ల మేళవింపుగా సాగే ఈ 'భగవద్గీత'  శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్ళేట్టుగా సాగుతుంది. 

ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక విలువలతో డిజిటల్‌ స్టీరియో రికార్డింగ్‌లోను, 'డాల్బీ డిజిటల్‌ 5.1' చానల్‌లోను మిక్సింగ్‌ చేయడం ఈ 'భగవద్గీత' ప్రత్యేకత.
'భగవద్గీత ' గానానికి ప్రారంభంలో ఉపోద్ఘాతము, 18 అధ్యాయాలకు ముందు ఆయా అధ్యాయాలలోని ప్రధానాం శాల ప్రస్తావన, అధ్యాయం ప్రారంభంలో థీమ్‌ మ్యూజిక్‌, ప్రతి అధ్యాయం చివరన 'క ష్ణ భజన' ఈ 'భగవద్గీత'లోని ప్రత్యేకతలు.

'భగవద్గీత'ను తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌, రష్యన్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌ మొదలైన అంతర్జాతీయ  భాషలలో కూడా అనువదించి, ఆడియో సీడీలుగా విడుదల చేయడానికి గంగాధర శాస్త్రి స్థాపించిన 'భగవద్గీత ఫౌండేషన్‌' కృషి చేస్తోంది.

ఇంతటి అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ సంపూర్ణ భగవద్గీత ఆడియో ఆవిష్కరణ మహోత్సవం 'జూలై 29న, హైదర బాద్‌ మాదాపూర్‌లోని శిల్పకళావేదిక'లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది. ఆధ్యాత్మిక, రాజకీయ, సినిమా, పారిశ్రామిక, సాంస్క్రు తిక, విద్యా, వైద్య, క్రీడాదిరంగాల ప్రముఖుల సమక్షంలో జరగనున్న 'సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ మహోత్సవంలో జనరంజకమైన సాంస్క్రు తిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.