మ్యాన్ ఆఫ్ మల్టీటాలెంట్

లింగా సినిమా అడియో ఫంక్షన్ అయిపోయింది..అందరూ మెల్లగా వెళ్లిపోతున్నారు. సూపర్ స్టార్ రజనీ లిఫ్ట్ లోకి వెళ్లారు.ఆయనతో మరి కొంతమంది వున్నారు. కాస్త బొద్దుగా, పొట్టిగా, తెల్లగా సాదా సీదాగా వున్న వ్యక్తి లిఫ్ట్…

లింగా సినిమా అడియో ఫంక్షన్ అయిపోయింది..అందరూ మెల్లగా వెళ్లిపోతున్నారు. సూపర్ స్టార్ రజనీ లిఫ్ట్ లోకి వెళ్లారు.ఆయనతో మరి కొంతమంది వున్నారు. కాస్త బొద్దుగా, పొట్టిగా, తెల్లగా సాదా సీదాగా వున్న వ్యక్తి లిఫ్ట్ బయట వున్నారు. రజనీ సార్…ఆయన్ను చూసి..కమ్ కమ్ అన్నారు. లోపలకు వెళ్లాక..ఏమిటి..మీకు అంత ఫాలోయింగ్ అన్నారు నవ్వుతూ.. విషయం ఏమింటంటే, అంతకు ముందే స్టేజ్ పై ఆ వ్యక్తికి రజనీ బొకే ఇచ్చారు. ఆ క్షణంలో అక్కడ చప్పట్లు మోగాయి. దాన్ని గుర్తు పెట్టుకుని రజనీ అన్న మాట అది. మాట కాదు..ప్రశంస. ఆ ప్రశంసను అందుకున్నది సినిమా పీఆర్వో బిఎ రాజు.

ఇదో గొప్పసంగతి అని కాదు చెప్పడం..సినిమా జనాల తలలో నాలుకలో ఆయన కలిసిపోయిన తీరుకు తార్కాణం. తెలుగు, తమిళ పెద్ద హీరోలు, దర్శకులు తొంభై శాతం మందికి సినిమా పీఆర్వో అంటే ఆయనే గుర్తుకు వస్తారు. స్టేజ్ పైకి పీఆర్వోని  పిలిచారు అంటే తొంభై శాతం ఆయనే అయివుంటారు. స్టేజ్ పై పీఆర్వోకి కృతజ్ఞతలు చెప్పారంటే అది ఆయనే అయి వుంటారు.

అందరూ అన్ని పనులు చేయలేరు. అన్ని పనులు వచ్చినా కొన్నింటికే పరిమితం అవుతారు మరి కొందరు. అసలు ఒక్కపని చేస్తే పది పనులు చేసిన ఫోజు కొడతారు.. అలాంటిది పది పనులు చేస్తున్నా, ఏ పని ఎవరి కోసం చేస్తారో, వారికి తప్ప వేరేవారికి తెలియనివ్వని వారుంటారు. అలాంటి వాళ్లు సినిమాల్లో, అందునా సినిమా జర్నలిస్టుల్లో ఎవరన్నా వున్నారా అంటే..అది ఒక్క బిఎ రాజు మాత్రమే.

సినిమా వాళ్లకు క్రేజ్ వుంటుంది. తెరమీద పడిన పేర్లను అందరూ కాకపోయినా, నికార్సయిన సినిమా ప్రేమికులు మాత్రం గుర్తుంచుకుంటారు..గుర్తుపడతారు. అయితే పీఆర్వో అనే పేరును గుర్తుంచుకునేవారు, గుర్తుపట్టేవారు తక్కువ. అయితే ఇక్కడ కూడా బిఎ రాజు మళ్లీ స్పెషలే. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమా తెరపైన నలిగిపోయిన, వెలిగిపోయిన పేరు అది.

ఎప్పుడో పాతిక, ముఫై ఏళ్ల కాలం నాడు ఆంధ్రభూమి సినిమా పత్రిక ప్రారంభించినపుడు చెన్నయ్ రిపోర్టర్ గా పని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగారు. సూపర్ హిట్ సినిమా పత్రిక ప్రారంభించారు.జ్యోతి చిత్ర, సితార, శివరంజని అని సినిమా పత్రికలకు పేర్లు పెడుతుంటే, సూపర్ హిట్ అని పేరు పెట్టడంలోనే వుంది బిఎ రాజు సినిమా పిచ్చి. నిజమే సినిమా అంటే బిఎ రాజుకు అంత పిచ్చి. రొజుకు ఓ సినిమా అయినా ఆయన చూడాలి.

 సినిమా చూస్తూ మధ్యలో పాటలకు లేచి బయటకు వెళ్లిపోవడం అంటే అంటే నచ్చదు ఆయనకు. సినిమాను ఎంజాయ్ చేయాలంటారు. ఆయన సినిమా కావచ్చు, వేరే వాళ్ల సినిమా కావచ్చు..ఈగవాలనివ్వరు.  మీ సినిమా అయితే మీరు తిట్టుకోండి..వాళ్ల సినిమాను మీరెందుకు తిడతారు? కావాలంటే కొనేసుకుని, తిట్టేసుకోండి అంటారు నవ్వుతూ. ఆయన నోట చెత్త సినిమా కూడా బాగాలేదు అన్నమాట రాదు. అంత సినిమా ప్రేమ ఆయనకు. 

రాసేవాడికి కలం కాగితాలు తోడైనట్లు, సినిమా పిచ్చి వున్న ఆయనకు, రచన,దర్శకత్వంలో టాలెంట్ వున్న జయ తోడయ్యారు. పతీ పత్నీ అవుర్ సినిమా అన్నట్లు తయారయ్యారు ఇద్దరూ. జర్నలిస్టు నుంచి, పత్రిక యజమాని, అక్కడి నుంచి పీఆర్వో, ఆపై సినిమా నిర్మాత. ఇది ఇప్పటికీ సాగుతున్న వ్యవహారం. ఉదయం ఆరుగంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఇంటికి చేరే వరకు సినిమా..సినిమా..సినిమా.

వార్తలు రాయాలి. పత్రిక చూసుకోవాలి..తాను పీఆర్వోగా వున్న సినిమాల వ్యవహారాలు చూడాలి. ఆపై తను తీయబోయే సినిమాకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలి. వీటికి తోడు. ఓ హీరో ఫలానా పని అంటారు..మరో హీరో..ఇంకేదో అంటారు. ఇంకో డైరక్టర్ మరేదో అంటారు. అందరికీ అన్నీ మేనేజ్ చేయాలి. పని గుర్తుకువస్తే చాలా మంది సినిమా సెలబ్రిటీలకు రాజు గుర్తుకు వస్తారు. రాజు గుర్తుకు వస్తే పని అయిపోయిందని వారు ఫిక్సయిపోతారు. 

అయితే ఇక్కడ ఓ గమ్మత్తు వుంది. ఎవరు ఏ పని చెప్పారు..రాజు ఏ పని చేసారు అన్నది ఆయనకు వారికి మాత్రమే తెలుస్తుంది. పొరపాటును  రెండో చెవికి సోకనివ్వరు. ఇండస్ట్రీలో నిత్యం తిరిగే జర్నలిస్టులకు సవాలక్ష వార్తలు తెలుస్తాయి. వాటిని గ్యాసిప్ లుగా రాసుకుంటారు కూడా. ఇలా..అలా అని ఒకరికి ఒకరు పంచుకుంటారు. కానీ రాజు నోట పొరపాటున ఒక్క లీక్ ఎవరికీ చేరదు. వార్త అయితేనే చేరుతుంది. తెలిసింది..అని రాసుకోండి అనేది రాజు నుంచి క్యారీ కావడం అన్నది అసాధ్యం. అందుకే రాజు అంటే అంత నమ్మిక ఇండస్ట్రీలో.

పీఆర్వోలకు వున్న మరో సమస్య మంది. ఇవ్వాళ ఇండస్ట్రీలో లెక్కకు మించిన జర్నలిస్టులు వున్నారు. వెబ్ సైట్లు, మాగ్ జైన్లు, చానెళ్లు, ఇంకా..ఇంకా. ఎవరు పిలిచినా, ఎవరైనా వెళ్తారో వెళ్లరో కానీ, బిఎ రాజు పిలిస్తే, హాల్ హౌస్ ఫుల్ పిలవకున్నా వచ్చేస్తారు బిరబిరా..కానీ ఎవర్నీ కాదనరు ఆయన. రండి అనే అంటారు. చిత్రంగా ఎవరైనా చూస్తారా అనే వెబ్ సైట్ అయినా, ఎక్కడన్నా కనిపిస్తుందా అనే పత్రిక అయినా సరే ఆయన పక్షపాతం చూపరు. లీడింగ్ వెబ్ సైట్లు, మాగ్ జైన్ల నుంచి సాదా సీదా వాటికి అన్నింటికి ఒకటే మర్యాద. అందరికీ అదే పలకరింపు.

టైమ్..ప్లానింగ్..వర్క్..ప్లానింగ్ మేనేజ్ మెంట్ అంటే బిఎ రాజు దగ్గర నేర్చుకోవాల్సినవి భలేగా వుంటాయి. ఆయన ఫోన్ మోగిందంటే..నెంబర్ చూడగానే ఆయనకు అర్థమైపోతుంది. ఎవరు ఎందుకు చేసారో..హలో అని కూడా అనరు. .పని..గురించి రెండు ముక్కలు మాట్లాడి పెట్టేస్తారు. ఎందుకంటే అక్కర్లేని మాటలు..వాళ్లు ఎందుకోసం చేసారు..పని కోసం..అందుకే అది మాట్లాడేస్తే చాలు కదా..వాళ్లకు మనకు సమయం ఆదా అంటారు.

మీరు చాలా మంది హీరోలకు నిర్మాతలకు దర్శకులకు మధ్య వారథిగా వుంటారటగా..అని అడిగితే చిరునవ్వే సమాధానం అవుతుంది. అదే మరొకరయితే..మనీ లొ తనికెళ్ల భరణిలా వాళ్లకు నేనే..వీళ్లకు నేనే అని గప్పాలు కొడతారు. కిట్టని వాళ్లు రాజు ఇలా చేసాడు ,..అలా చేసాడు అని అన్నా కూడా మళ్లీ చిరునవ్వే సమాధానం అవుతుంది.

అసలు అభిమానం వెర్రితలలు వేస్తూ, యూ ట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్  లాంటి డిజిటల్ ఫార్మాట్ ఫ్రీ పబ్లిసిటీ వచ్చిన కాలంలో కూడా ఇంకా పీఆర్వోల అవసరం వుందా అని అడిగితే..ఇప్పుడే ఇంకా పెరిగింది అంటారు. ఎందుకంటే సినిమా భవిష్యత్ ఇవన్నీ కలిసి గంటల్లో తేల్చేస్తున్నాయి. అలా తేల్చేసినపుడు, సినిమాలకు అండగా నిలిచి, కనీసం నాలుగైదు వారాలు మార్కెట్ లో నిలబెట్టాలంటే పీఆర్ స్ట్రాటజీ చాలా అవసరం. పీఆర్ స్ట్రాటజీ స్కిల్స్ వల్ల ఆడిన సినిమాలు చాలా వున్నాయి. అలా సరైన స్ట్రాటజీ లేక మిడిల్ డ్రాప్ అయిపోయిన సినిమాలూ వున్నాయి అంటారు బిఎ రాజు.

ఇన్ని పనులు, వత్తిడులు నడుమ మీకు సినిమా నిర్మాణం అవసరమా అంటే..నేను జయ కొన్ని మంచి సినిమాలు తీయాలనుకున్నాం. ఫ్యామిలీతో సహా చూసే సినిమాలే తీస్తాం. జయకు బాపు, జంధ్యాల వంటి ఫ్యామిలీ దర్శకులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె అలాంటి సబ్జెక్ట్ లే ఎంచుకుంటారు. భర్తగా నేను ఎవర్నో బతిమాలి సినిమాలు తీయించడం ఎందుకు? జయ టాలెంట్ నాకు తెలుసు..అందుకే నేనే నిర్మాతగా మారాను. ఇంత వరకు నిర్మాతగా పోగొట్టుకున్నది లేదు అని బదులిస్తారు.

మరి ఈ ఏడాది సినిమాలేంటి అంటే…రెండు మూడు సబ్జెక్ట్ లపై వర్క్ జరుగుతోంది. అందంతా జయగారి వ్యవహారం. ఆమె సబ్జెక్ట్ ఫైనల్ అయింది అంటే అప్పుడు నా పని మొదలవుతుంది. అయినా నా సినిమాల సొద ఎందుకు? ఇండస్ట్రీ సినిమాల సంగతి మంచిగా రాయండి సార్..అంటారు నవ్వుతూ.

అదే మరి బిఎ రాజుకు ఇండస్ట్రీ అన్నా..సినిమా అన్నా ఎంత పిచ్చో తెలియచేసే మాట.

అన్నట్లు ఇలాంటి నికార్సయిన సినిమా మనిషి బిఎ రాజు పుట్టిన రోజు నేడే . ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్ర శుభాకాంక్షలు తెలుపుతోంది.

విఎస్ఎన్ మూర్తి