మెన్ ఇన్ బ్లూ.. ప్రపంచ కప్‌కి దారిదీ.!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లేడు.. ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెట్టడానికి తగినంత అనుభవం వున్న బౌలర్లూ లేరు.. అయినా ఈ వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా అంచనాల్ని మించి రాణిస్తోంది. భారత క్రికెట్ అభిమానులే,…

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లేడు.. ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెట్టడానికి తగినంత అనుభవం వున్న బౌలర్లూ లేరు.. అయినా ఈ వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా అంచనాల్ని మించి రాణిస్తోంది. భారత క్రికెట్ అభిమానులే, పెద్దగా తమ జట్టుపై అంచనాలు పెట్టుకోలేదంటే, ప్రపంచ క్రికెట్‌లో మిగతా జట్లు టీమిండియాని వరల్డ్ కప్ పోటీల్లో ఎలా ఊహించుకుని వుంటాయో అర్థం చేసుకోవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్‌గానే బరిలోకి దిగినా, టీమిండియాని అండర్ డాగ్‌గానే పరిగణించారు చాలామంది. 

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమిండియా వైఫల్యం ఓ రకంగా వరల్డ్ కప్‌లో ఆ జట్టుకి కలిసొచ్చింది. పెద్దగా అంచనాలేమీ తమపై లేకపోతే, ఎలాంటి సంచనాలు సృష్టిస్తామనే విషయం ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్‌తో ప్రూవ్ చేసింది. అంచనాల్లేకుండానే బరిలోకి దిగి, తొలి టీ20 వరల్డ్ కప్‌ని ధోనీ సేన కైవసం చేసుకున్న విషయం విదితమే.

అయితే, గత వరల్డ్ కప్ నాటి పరిస్థితులు వేరు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా వుందప్పుడు. బోల్డంత అనుభవం వున్న ఆటగాళ్ళు జట్టు నిండా వున్నారు. పైగా, అది స్వదేశంలో.. ఉప ఖండంలో జరిగిన వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ నాటికి పరిస్థితులు పూర్తి భిన్నం. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ, ఆ వెంటనే జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఘోర వైఫల్యాన్ని చూసి భారత క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ జట్టు వరల్డ్ కప్‌లో లీగ్ దశను దాటడం చాలా కష్టం.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అతి చెత్త పెర్ఫామెన్స్‌తో లీగ్ దశలోనే టీమిండియా వెనక్కి రావడం ఖాయమని వరల్డ్‌కప్‌కి ముందు అనుకోని క్రికెట్ అభిమాని మన దేశంలోనే వుండడేమో అనుకోవడం అతిశయోక్తి కాదు.

కానీ, ఆ అనుమానాలు పటా పంచలయ్యాయి. టీమిండియా భారత క్రికెట్ అభిమానులకే షాక్ మీద షాక్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. అయితే అన్నీ ‘స్వీట్’ షాక్‌లే కావడం గమనార్హం. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో.. గత రికార్డ్‌ని నిలబెట్టుకుంటే చాలని అంతా అనుకున్నారు. పాక్‌పై గెలిచాక హమ్మయ్యా అనుకున్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్.. గెలవడం కష్టమేనని భారత క్రికెట్ అభిమానులు అనుకుంటే, భారీ విజయాన్ని సఫారీలపై సాధించింది టీమిండియా. ఈ వరల్డ్ కప్‌లో లీగ్ దశలోని తొలి మ్యాచ్ నుంచి, క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన తాజా మ్యాచ్ దాకా టీమిండియా పెర్ఫామెన్స్ అన్ని రంగాల్లోనూ అద్భుతం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకూ అవకాశమివ్వలేదు భారత ఆటగాళ్ళు. పక్కా వ్యూహంతో ప్రతి మ్యాచ్ సాగిందన్నదాంట్లో ఎవరికీ ఇంకో అభిప్రాయం లేదు. ఏదో జరిగింది. ఎవరో మార్చారు. లేకపోతే టీమిండియా ఆటగాళ్ళలో ఈ క్రమశిక్షణ అసాధ్యం.. అన్నది చాలామంది అభిప్రాయమిపడు. ఎవరో మార్చారో, లేదంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదా తెచ్చిన కసి వల్లనో.. కారణం ఏదైతేనేం, వరల్డ్ కప్‌లో టీమిండియా అంచనాలకు మించి రాణిస్తోంది.

టీమిండియా ఓ సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ఆశ్చర్యకరం.. అనేంత పతన స్థాయిలో టీమిండియా బౌలింగ్ వుండేది. మరి ఇపడో.. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. వరసగా ఏడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఏడు మ్యాచ్‌లలో డెబ్భయ్ వికెట్లు.. వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా ఏ జట్టుకీ సాధ్యం కాని ఫీట్ ఇది. జహీర్‌ఖాన్ లాంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ లేడు.. కుంబ్లే లాంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేడు.. యువరాజ్‌సింగ్ లాంటి ఆల్‌రౌండర్ అసలే లేడు. అయినా టీమిండియా బౌలింగ్‌లో అద్భుతాలే చేసింది. ఓ మ్యాచ్‌లో ఒకరు.. ఇంకో మ్యాచ్‌లో ఇంకొకరు.. ఇలా బౌలర్లు సత్తా చాటుకున్నారు. స్వదేశంలో పులులు.. విదేశాల్లో పిల్లులు.. అన్న మాటను చరిత్రలో కలిపేసిన భారత బౌలర్లు, విదేశీ పిచ్‌లపై వీరవిహారం చేస్తున్నారు. బౌలర్లు అంతా దాదాపుగా కొత్తవాళ్ళే. ఉమేష్ యాదవ్, షమీ, మొహిత్ శర్మ, అశ్విన్.. ఇలా ఎవ్వరూ తగ్గడంలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేస్తున్నారు. పేసర్లు నిపలు చెరిగే బంతులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్తోంటే, స్పిన్నర్లు మ్యాచ్‌ని తిప్పేస్తున్నారు. ఆల్ రౌండర్ జడేజా కూడా బౌలింగ్ విభాగంలో బాగా ఉపయోగపడ్తున్నాడు.

బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇక్కడా లోటుపాట్లేం లేవు. ధావన్ ఓ మ్యాచ్‌లో రాణిస్తే, రోహిత్ ఇంకో మ్యాచ్‌లో.. ఛాన్స్ దొరికితే కోహ్లీ.. తనదాకా వస్తే రైనా.. ఫినిషింగ్ ఇవ్వాల్సి వస్తే ధోనీ.. మధ్యలో పరిస్థితులకు తగ్గట్టు ఆడే రహానే.. వెరసి టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కి వంకలు పెట్టలేం. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ పూర్తి సమన్వయంతో వుంది. పరిస్థితి టెయిల్ ఎండర్లదాకా వెళ్ళకుండానే పని పూర్తి చేసేస్తున్నారు. పైగా బ్యాట్‌తో మైదానంలోకి అడుగు పెట్టే భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజ్‌లో ఇబ్బందిగా కన్పించడంలేదు. కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఫీల్డింగ్ విషయంలోనూ టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అలా ఇలా కాదు, నెల రోజుల క్రితం జట్టుకీ.. ఇప్పటి జట్టుకీ స్పష్టమైన తేడా. ఎవరూ ఊహించనంత తేడా.

ఒక్కో మెట్టునీ అవలీలగా, జాగ్రత్తగా ఎక్కేసిన టీమిండియా ‘వరల్డ్ కప్’ని అందుకోడానికి కేవలం రెండు మెట్ల దూరంలో నిలిచింది. సెమీస్‌లో గెలవడం, ఆ తర్వాత ఫైనల్‌లో సత్తా చాటడం.. ఈ రెండు మెట్లే మిగిలి వున్నాయి. ఇప్పటి టీమిండియా ఫామ్‌ని చూస్తే, ఆ రెండు మెట్లూ ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదన్పిస్తోంది. ఆషామాషీగా సాధించిన విజయాలేమీ కావు, ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా సాధించినవి. దేనికదే ప్రత్యేకమైన మ్యాచ్. పసికూనలతో జరిగిన మ్యాచ్‌లను పక్కన పెడితే, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతోపాటు, గతంలో చేదు అనుభవాన్ని మిగిల్చిన బంగ్లాదేశ్‌పైనా మెమరబుల్ విక్టరీని సాధించిన ‘మెన్ ఇన్ బ్లూ..’ వరల్డ్‌కప్ సాధించే సత్తా తనలో వుందని ప్రూవ్ చేసుకుంది. 2015 వరల్డ్ కప్‌ని భారత క్రికెట్ అభిమానులకు బహుమతిగా టీమిండియా అందించాలని ఆశిద్దాం.. ఆకాంక్షిద్దాం. బెస్టాఫ్ లక్ టు టీమిండియా.

-వెంకట్ ఆరికట్ల