గుణశేఖర్ చాలా ఇష్టంతో, కష్టంతో నిర్మించిన సినిమ రుద్రమదేవి. ఇప్పుడీ సినిమా దాదాపు రెడీ అయింది. మార్కెటింగ్ కావాలి..ఆపై విడుదల కావాలి. అదే ఎలా ఎప్పుడు అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవికి కౌంటర్ పార్ట్ గా చెప్పుకునే బాహుబలి మే 15 డేట్ ఫిక్స్ చేసి కూర్చుంది. అంటే మే 15 నుంచి కనీసం రెండు మూడు వారాలు మరో సినిమాకు అవకాశాలు తక్కువ. దాన్ని బట్టి మే 15లోపే రుద్రమదేవి విడుదల కావాల్సి వుంటుంది.
ఏప్రిల్ 2 నుంచి 15మధ్యలో పెద్దగా ఖాళీ లేదు. ఏప్రిల్ 15 నుంచి మే ఫస్ట్ లోపే రుద్రమ దేవి వస్తే రావాలి. ఎందుకంటే బాహుబలి ముందు కనీసం రెండు వారాలు వదిలేయాలి. లేదంటే రుద్రమదేవికి రెండు వారాల థియేటర్ల రన్ కష్టం. మరి ఏప్రిల్ రెండో వారంలో రావాలంటే ఇప్పటి నుంచీ హడావుడి వుండాలి. కానీ అదే కనిపించడం లేదు.
రుద్రమదేవికి వున్న సమస్య..దాని కథా విషయం. అందులో సినిమా లిబర్టీ తక్కువ. బాహుబలి అలా కాదు. జానపద కథ, ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు. రుద్రమదేవి విషయంలో అలాంటి తేడాలు చేస్తే గొడవలైపోతాయి. మరి అలాంటి నేపథ్యంలో ప్రేక్షకులకు నచ్చే మెలోడ్రామా ఏ మేరకు వుంటుంది. రుద్రమదేవి ఖర్చుకు, దాని హక్కుల రేట్లకు చూసుకుంటే, బయ్యర్లు అంత ఆసక్తి కరంగా లేరని వినికిడి.
ఇప్పటికీ ఇంకా గుణశేఖర్ సినిమా అమ్మకపు ఇబ్బందులతో కిందా మీదా వున్నారని టాలీవుడ్ టాక్. అప్పటికి వుండీ..వుండీ..ఒకటీ అరా స్టిల్స్ విడుదలచేస్తూ, జనాల్లో ఆసక్తి రేకెత్తించాల్ని చూస్తున్నారు కానీ, ఆశించిన హైప్ రావడం లేదు. తొలి టీజర్ కమ్ ట్రయిలర్ పబ్లిక్ గా ఐమాక్స్ లో విడుదల చేసి, హడావుడి చేసినా, ఆశించిన ఫలితం రాలేదని వినికిడి. ఇంతవరకు ఫలానా డేట్ అన్నది ప్రకటించలేదు. సమ్మర్ సినిమాలు ఒక్కోటీ డేట్లు ప్రకటించేస్తున్నాయి.
కానీ రుద్రమదేవి ఇంకా అడియో ఫంక్షన్ డేట్ మాత్రం ప్రకటించింది. చిత్రంగా అడియో ఫంక్షన్ డేట్లు ప్రకటించకుండా లయన్, బాహుబలి లాంటి సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించేసాయి. బాహుబలి హక్కులు చకచకా అమ్ముడుపోతున్నాయి.
రుద్రమదేవి శాటిలైట్ హక్కుల మీద కూడా ఏ విషయం బయటకు ఇంతవరకు రాలేదు. ఈ సినిమాను నమ్ముకుని గుణశేఖర్ భారీగా ఫైనాన్స్ తీసుకున్నారు. వాటి వడ్డీలు, అన్నీ కలిపి కాస్త గట్టి మొత్తమే అయింది. ఇప్పుడు అవన్నీ సరిపడా అమ్మకాలు జరగాలంటే, కాస్త ఇబ్బందిగానే కనిపిస్తున్నట్లు వినికిడి.