cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

భాజపా వైఖరి తేలిపోతుంది

భాజపా వైఖరి తేలిపోతుంది

రాష్ట్రం పట్ల భాజపా వైఖరి ఈ నెలలో తేలిపోనుంది. విభజన పాపం తమకు అంటకుండా, వెంకయ్యనాయుడు చాకచక్యంతో, ఆయన అనుకూల మీడియా అండదండలతో భాజపా చాలా తెలివిగా తప్పించుకుంది. అసలు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ, నిద్రపోతున్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టింది భాజపా అని ఆంధ్ర జనాలు మరిచిపోయారు. ‘పచ్చ’పాత మీడియా పొరపాటున కూడా గుర్తు చేయలేదు. 

పార్లమెంటులో కాంగ్రెస్ అన్నదానికి తందాన తాన అనేసి, ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా అన్నది తమ ఘనతే అని, ఇంకా మాట్లాడితే వెంకయ్య నాయుడు పోరాడి సాధించిన వరమని ప్రచారం చేసుకున్నారు. సరే, జనం నమ్మారు భాజపా, తేదేపాల పాత్ర విభజనలో అస్సలు లేదని, అంతా కాంగ్రెస్ తప్పిదమే అని భావించారు. ఓడించారు. మోడీ, బాబు అధికారంలోకి వచ్చారు. ఒక విధంగా రాష్ట్రంలో భాజపా భాగస్వామ్య ప్రభుత్వం, కేంద్రంలో తేదేపా భాగస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నాయి. 

కానీ రాష్ట్రానికి విభిజనకు సంబంధించిన హామీలు మాత్రం ఏమీ నెరవేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందులో కీలకమైన ప్రత్యేక హోదా అన్నది ఎప్పుడు ప్రకటిస్తారన్నది తెలియనే తెలియదు. మిగిలిన రాష్ట్రాలను సంప్రదించాలి..అవి ఓకె అనాలి..అప్పుడు దాని వ్యవహారం తేలుతుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు చేస్తున్న హంగామా చూస్తున్న మిగిలిన రాష్ట్రాలు ఎందుకు ఓకె అంటాయి. 

పైగా తమకు కూడా అదే హోదా కావాలంటాయి. అన్నింటా అభివృద్ధి చెందిన తమిళనాడే అభ్యంతరం వ్యక్తం చేసినపుడు, మిగిలిన వెనుకబడిన రాష్ట్రాలు ఎందుకు ఊరుకుంటాయి. చేసేది పావలా..అది కూడా ఓట్ల కోసం, చెప్పేది వంద అన్నది బాబు ఫిలాసఫీ. ఒరిస్సా ముఖ్యమంత్రి మాదిరిగా తండ్రి ఆస్తిని దానం చేసి వుంటే బాబు అండ్ కో ఎంత హంగామా చేసి వుండేవారో తలుచుకుంటే, భలే నవ్వు వస్తుంది. సరే, ఆ సంగతి అలా వుంచితే, ప్రత్యేక స్థాయి వచ్చే అవకాశం చాలా తక్కువ అన్నది వాస్తవం. 

మరి తొలి బడ్జెట్ లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన కేంద్రం ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం ఏ మేరకు నిలబెట్టుకుంటుంది అన్నది చూడాలి. మరోనెలలో కొత్త బడ్జెట్ వ్యవహారాలు మొదలైపోతాయి. ఈలోపునే గత బడ్జెట్ లోటును కేంద్రం అందివ్వాలి. అలాగే ప్రణాళికకు సంబంధించిన నాలుగైదు వేల కోట్లు అందివ్వాల్సి వుంది. ఇవన్నీ వస్తే ఇక రాష్ట్రానికి పండగే. కానీ వస్తాయా అన్నదే అనుమానంగా వుంది.

బాబు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా సాధించిన ఫలితం ఏమీ లేదనే చెప్పాలి. ప్రతి సారి కట్టలకు కట్టల విజ్ఞాపనలు అందివ్వడం, శాలువాలు కప్పడంతోనే సరిపోతోంది. ఇదే మరే కాంగ్రెస్ముఖ్యమంత్రి చేసినా, తెలుగుదేశం జనాలు రాష్ట్ర ఆత్మగౌరవం, ఢిల్లీలో తాకట్టు వంటి పడికట్టు పదాలు ఉపయోగించి నానా యాగీ చేసేవారు. 

మరి ఇన్ని సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రతి మంత్రి గడపకు ఎక్కిదిగాల్సిన ఖర్మేమిటి? పైగా కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు వున్నారు..వారేం చేస్తున్నట్లు? వారు ఈ  పనుల చేయలేరా?

ఏదైనా కేంద్రంలో మోడీ చేస్తున్న, ఆలోచిస్తున్న వైఖరి తెలుగుదేశం పార్టీకి లోలోపల కాస్త ఇబ్బందిగానే వుంది. కానీ ఓపిగ్గా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అది జరుగుతుందా లేదా అన్నది ఈ నెలలో, వచ్చే బడ్జెట్ లో తెలిసిపోతుంది.

 


×