cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బడ్జెట్ కు ముందే బీద అరుపులు

బడ్జెట్ కు ముందే బీద అరుపులు

సాధారణంగా బడ్జెట్ ఎలా వుంటుంది అన్నది ముందుగా ఎప్పుడూ, ఏ ఆర్థికమంత్రీ తెలియనివ్వరు.  కేంద్ర బడ్జెట్ అయితే అత్యంత భయకరమైన రక్షణలో తయారవుతుంది.  రాష్ట్రం బడ్జెట్ కు అంత సీన్ వుండదు. కానీ దాని ప్రభావం దానికి వుంటుంది. కానీ ఈ సారి చిత్రంగా ఆర్థిక మంత్రి ముందుగానే బడ్జెట్ ఇలా వుండబోతోంది అన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చేసారు. బడ్జెట్ పరిణామం, లోటు వ్యవహారాలు దాదాపు బయటకు వచ్చేసాయి. 

దీని వెనకాల తెలుగుదేశం తెలివైన వ్యూహం వుందని తెలుస్తోంది. తెలంగాణతో సమానంగా భారీ బడ్జెట్ పెట్టాలి. సంక్షేమ పథకాలకు, రుణమాఫీలకు కేటాయింపులు స్పష్టంగా వుండాలి. అన్ని రంగాలను చూడాలి. కానీ ఆదాయం తక్కువే. కేంద్రం రెవెన్యూ లోటును ఏ మాత్రం సర్దుబాటు చేస్తుందో తెలియదు. అందుకుని జనాలు మరీ ఆశలు పెంచుకోకుండా ముందే బడ్జెట్ ఇలా వుండబోతోంది అన్నదాన్ని చూచాయగా వెల్లడించినట్లు వినికిడి.  

భారీ బడ్జెట్ తయారు చేయడం వల్ల రెండు లాభాలు ఆశిస్తున్నారు. ఒకటి భారీబడ్జెట్, భారీ కేటాయింపులు ఆకర్షణీయంగా వుంటాయి. బడ్జెట్ పై ఆరంభంలోనే విమర్శలు రావు. రెవెన్యూ లోటు కూడా భారీగానే వుంటుంది. దాన్ని చూసి అంత కాకుంటే కొంతయినా కేంద్రం సహాయం రావడానికి అవకాశం వుంటుంది. లేదూ ఆశించిన మేరకు సహాయం రాలేదంటే, ఆర్థిక సంవత్సరం చివర కోతలు ఎలాగూ తప్పవు. కేంద్రం ఇవ్వనపుడు మేమేం చేస్తాం అనేయచ్చు..ఇస్తుందో ఇవ్వదో తెలియకుండా అంత బడ్జెట్ ఎందుకు అని ఎవరూ అడగరు.

పైగా ఆర్థికమంత్రి తొలిసారి ప్రణాళికేతర వ్యయం గురించి మాట్లాడుతున్నారు. అంటే వివిధ శాఖలకు, అధికారులకు ఖర్చులకు డబ్బులు అంతలా వుండవని ముందే అర్థమైపోతోంది. కేంద్ర రాష్ట్రాల బడ్జెట్ లో ప్రణాళికేతర వ్యయం, మూడు వంతులకుపైగా పెరిగిపోతోంది. ఇదే విషయమై ఇటీవల కేంద్ర బడ్జెట్ మీద వ్యాసం రాస్తే (http://telugu.greatandhra.com/articles/chanakya/ekkadikelthundi-ee-desam-60104.html) కొందరు తేలిగ్గా తీసుకున్నారు. 

ఇప్పుడు మన ఆర్థిక మంత్రి కూడా అదే చెబుతున్నారు. పైగా తెలంగాణ బడ్జెట్ లో ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా వుందని తెలుగుదేశం విమర్శిస్తోంది. ఇప్పుడు ఆంధ్ర బడ్జెట్ లో ప్రణాళికేతర వ్యయం గతంలో కన్నా తగ్గిస్తామని చెబుతోంది. కానీ ఇది కాస్త కష్టమైన ఫీట్. ఎందుకంటే ఇటీవలే దాదాపు 15శాతానికి పైగా జీతాల పెంపకం తప్పలేదు.(ఇంటీరియమ్ చెల్లింపులు పోను) అంటే ఆ మేరకు అయినా ప్రణాళికేతర వ్యయం పెరగాలి. మిగిలిన ఖర్చులు కూడా పెరగక తప్పదు. 

ఎందుకంటే ధరలు పెరుగుతన్నాయి కాబట్టి. కానీ ఆదర్శవంతమైన బడ్జెట్ అనిపించుకోవడానికి ప్రణాళికేతర వ్యయం తగ్గిస్తామంటున్నారు. మంచి నిర్ణయమే. కానీ మంత్రుల ఆడంబరాలు తగ్గించుకుంటారో? లేక అధికారులు, ఉద్యోగుల వ్యవహారాల్లో కోత వేస్తారో చూడాలి. మొత్తానికి ఆర్థికమంత్రి అడిగిన మీడియాకు, అడగని మీడియాకు బడ్జెట్ వ్యవహారాలు వెల్లడించారంటే, వ్యవహారం వెనకు కాస్త లాజిక్ వుండే వుంటుందని స్పష్టమవుతోంది.

చాణక్య

writerchanakya@gmail.com​

 


×