cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

ఎక్కడికెళ్తోందీ దేశం..

ఎక్కడికెళ్తోందీ దేశం..

మళ్లీ మరో బడ్జెట్ వచ్చింది మన ముందుకు. మన రాష్ట్రానికి ఏం దక్కింది, మిగిలిన వాటికి ఏం దక్కింది. ఏ రంగానికి ఎంత ఇచ్చారు..ఇదే కదా మనం చూసేంది.

కానీ అసలు దేశం ఆదాయం ఎంత? అందులో ఖర్చులకు ఎంత పోతోంది. అభివృద్థి, లేదా సబ్సిడీలు, లేదా రాయితీలు, లేదా పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు అన్నది చూస్తుంటే కాస్త బాధని పిస్తుంది. రాను రాను కొండంతలా పెరుగుతోంది ప్రణాళికేతర వ్యయం. దగ్గర దగ్గర ఎనభై శాతం వరకు ప్రణాళికేతర వ్యయానికే సరిపోతోంది. 

అంటే మనం కట్టే పన్నుల ఆదాయంలో రూపాయికి ముప్పావలా ప్రభుత్వం అనే తెల్లఏనుగును మేపడానికే సరిపోతోంది. ఆ మిగిలిన పావలాలో..పింఛన్లు, రాయతీలు, సబ్సిడీలు పోను, అభివృద్ధి కార్యక్రమాలకు మిగిలేది ఎన్ని పైసలు? ప్రభుత్వం ఒక్క ఫ్యాక్టరీ పెట్టడం మానేసింది. ఎవరైనా వచ్చి పెట్టాల్సిందే.

ఈ అంకెలు చిత్తగించండి..

  • మొత్తం బడ్జెట్.. 17,77,477 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం..అంటే ఖర్చులు మాత్రం... 13,12,200 కోట్లు
  • రాయతీలు, పనులు..వగైరా ప్రణాళిక వ్యయం...4,65,277 కోట్లు
  • చిత్రమేమిటంటే, ఈ నాలుగు లక్షల పై చిలుకు లో, రక్షణ రంగానికి కేటాయింపు 2,46,727 కోట్లు.

అంటే మిగిలిన రెండు లక్షల కోట్లు పైచిలుకులో, రాయతీలు సబ్సిడీలు పోవాలి. ఇక్కడ ఇంకా చిత్రమేమిటంటే, పార్లమెంటులో ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో, పార్లమెంటు సభ్యులు గ్యాస్ రాయతీని వదులుకోవాలని కోరడం. అర్థముందా..ఇలా కోరడానికి, నిర్ధాక్షిణ్యంగా తీసేయాలి కానీ. కోటానుకోట్లు సంపాదించినవారే ఇవ్వాళ నూటికి తొంభైమంది . మరి వాళ్లను బతిమాలతారు.

ఇక్కడ మాత్రం ముక్కుపిండి పన్నలు వసూలు చేస్తారు. పాన్ కార్ఢ్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ పట్టుకుని, పైసా పైసా ఆదాయం లెక్కలు తీసి, ఇన్ కమ్  టాక్స్ స్లాబ్ మార్చకుండా వసూలు చేసిన లక్షల కోట్లు ఎందుకయ్యా అంటే ప్రభుత్వాన్ని నడపడానికే సరిపోతున్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో అది చాలదన్నట్లు కోటి ఆదాయం దాటితే రెండు శాతం అదనపు పన్ను తగిలించారు. 

అంటే దాదాపు సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు అంతా ఈ కేటగిరీ కిందకు వస్తారు. వారు 20శాతం ప్లస్ మరో రెండు శాతం అదనంగా కట్టాల్సిందే. విల్లాలు, ఫ్లాట్లు రేట్లు పెరిగినా, ఇంట్రస్ట్ సేవింగ్స్ పరిమితి మాత్రం మారదు. అంటే అవి కూడా ఇప్పుడు సుఖం లేకుండా పోతాయి. 

గృహనిర్మాణ రంగం ఇప్పటికే కుదేలవుతోంది. ముఫై లక్షలు లోన్ పెడితే ఇరవై ఏళ్లపాటు, ముఫై వేలు నెలకు వంతున 72లక్షలు కట్టాల్సి వస్తుంది.  అదే ముఫై లక్షలు బ్యాంకులో వేసుకుంటే, నెలకు 21వేలు వడ్డీ వస్తుంది. ఈ లోన్ తో కొన్న ఇంటికి పదివేలు అద్దె రాదు. పోనీ విలువ పెరుగుతుంది అనుకుంటే లోన్ తీరేసరికి కొత్త ఫ్లాట్ ధర అరవై లక్షలు వుంటే, పాత ఫ్లాట్ ధర 50లక్షలు వుంటుంది. అద్దె లెక్కించుకుంటే బరాబర్ అవుతుంది. ఇన్ని టెన్షన్లు పడితే సాధించేది ఏమిటి అంటే కాస్త వడ్డీ రాయతీ మాత్రమే.  కానీ కార్పొరేట్ టాక్స్ మాత్రం అయిదు శాతం తగ్గించేసారు. ఎందుకంటే వారే కదా మనకు ఆప్తులు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం నడుమ ఈ గ్యాప్ మరింత తగ్గిపోకుండా వుండాలంటే,  టాక్స్ లు పెంచనన్నా పెంచాలి..లేదా ఆదాయ లిమిట్ యథాతథంగా నైనా వుంచాలి. అందుకే రెండో మార్గం ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రణాళికేతరవ్యయం ఏటికేటా పెరుగుతూనే వుంటుంది. జీతభత్యాలు, కాన్వాయ్, మంత్రుల సోకులు, ప్రజా ప్రతినిధుల ఖర్చులు ఇవన్నీ ఏటా పెరిగేవే కానీ తరిగేవి కావు.  అందుకే రాను రాను బడ్జెట్ కేవలం పద్దుల పుస్తకంగా మారిపోతోంది. ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేకుండా వుంది. ఎందుకంటే ఎవరైనా రాజకీయనాయకులే కదా.

చాణక్య

writerchanakya@gmail.com​

 


×