cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

సినిమా చూపించరు మావా

సినిమా చూపించరు మావా

టాలీవుడ్ నిర్మాతల మాయాజాలం..బయ్యర్ల జూదం..వెరిసి కోట్ల రూపాయిల నష్టం

ఎక్కడన్నా సరుకు చూడకుండా కోట్లు పోసి కొంటారా? కొంటారు..టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే.... ఎంత బ్రాండ్ ఇమేజ్ వుంటే మాత్రం...ఒకేసారి కోట్లు పోసేస్తారా?..పోయడమా..సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే ఈక్వేషన్లు చూసి, అడ్వాన్సులు చేతిలో పెట్టిపోతారు. రేటు సంగతి తరువాత డిసైడ్ చేసుకుందాం అంటారు...ఎన్ని పోటీలు గెలిచిందో లెక్కలు కట్టి, గుర్రాలపై పందాలు కాసినట్లు, హీరోల హిట్ లు, డైరక్టర్ల స్టామినా చూసి, గోనె బస్తాల్లో కోట్లు తెచ్చి నిర్మాత ముంగిట్లో పోసెయ్యడమేనా? సినిమా పోయిన తరువాత కోట్ల పోయాయంటూ గగ్గోలు పెట్టే బదులు, బయ్యర్లు తమకు సినిమా చూపించమని ఏ నిర్మాతనూ ఎందుకు అడగలేకపోతున్నారు? బయ్యర్లలో నెలకొన్న పోటీ ఇప్పుడు నిర్మాతల పాలిట వరంగా మారిందా? అవును..నిజమే. ఇప్పుడు బయ్యర్లు సినిమాలతో జూదమే ఆడుతున్నారు. కళ్లు మూసుకుని డైస్ వేస్తున్నారు. అదృష్టం బాగుంటే కావాల్సిన అంకె పడుతోంది..లేదంటే కొంపలు కొల్లేరవుతున్నాయి. 

టాలీవుడ్ లో సినిమాల పంపిణీ వ్యవస్థ మళ్లీ రివర్స్ గేర్ లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. సింగిల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ నుంచి ఏరియాల వారీ బయ్యర్లు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఒక్క బయ్యర్ ఒక్కో ఏడాది కుదేలైపోతుంటే, సినిమా ఆఫీసుల సంఖ్య నానాటికీ జిల్లా కేంద్రాల్లో తగ్గిపోతున్నాయి. దాంతో మళ్లీ రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కరే సినిమాను కొనేసే పరిస్థితి లేదా పంపిణీ చేసే విధానం చిగురు వేస్తోంది.

ఏ ఉత్పాదనకైనా రెండు విషయాలు కీలకం..ఒకటి తయారీ..రెండవది పంపిణీ. అది ఏ వస్తువైనా కావచ్చు..మరేదైనా కావచ్చు..ఆఖరికి సినిమా అయినా కావచ్చు. అయితే ఎప్పుడూ, ఎక్కడైనా ఏ ఉత్పాదనకైనా ఒక విషయం తయారీదారు ఇష్టం. అతగాడి దగ్గర పెట్టుబడి వుంటే ఉత్పాదన కష్టమేమీ కాదు. కానీ రెండవ విషయమైన పంపిణీ అన్నది మాత్రం చాలా కష్టం. ప్రజల అభిరుచులు, మార్కెటింగ్ సూత్రాలు, నాణ్యత,ప్రచారం ఇలాంటి వాటన్నింటి మీద ఆధారపడి వుంటుంది, తయారైనే సరుకు వినియోగదారుడి దగ్గరకు చేరడం అన్నది. 

సరే, మిగిలిన వాటి అన్నింటి సంగతి పక్కన పెట్టి, సినిమానే చూస్తే, ఇప్పుడు టాలీవుడ్ లో ఈ రెండో అంకం అత్యంత కష్టంగా ఇంకాచెప్పాలంటే, దాదాపు ఒక్కోసారి అసాధ్యం అన్నంతగా తయారైంది. 

నిర్మాత వైపు నుంచి చూస్తే, కోట్లు పెట్టి సినిమా తీసేసి, ఆ కోట్లు థియేటర్లలో జల్లేసి, రూపాయి రూపాయి ఏరుకున్న చందంగా వుంది. అలా ఏరుకున్న రూపాయిల్లోంచి ఖర్చులు పోగా మిగిల్తే వచ్చినట్లు లేకుంటే సినిమా చచ్చినట్లు.

బయ్యర్ల వైపు నుంచి చూస్తే, సినిమా మొదలవకుండానే లక్షల నుంచి కోటి వరకు వడ్డీలేని అడ్వాన్స్ లు ఇచ్చేయాలి. ఆపై సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని చూడాలి. పూర్తయ్యాక రేట్లు నప్పాలి. లేదా నప్పించుకోవాలి. తీరా చేసి సినిమాఫ్లాప్ అయితే ఇల్లు,పొల్లూ అమ్ముకోవాలి.

ఒక్కప్పడు టాలీవుడ్ ప్రారంభంలో పంపిణీ దారే నిర్మాతకు పెద్ద అండగా వుండేవారు. నిర్మాత ప్రాజెక్టు పట్టుకుని ముందు పంపిణీ దారు దగ్గరకే వెళ్లేవాడు.తన ప్రాజెక్టు, కాస్టింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ డిస్కస్ చేసి, వాళ్లు తాము రెడీ అంటే అప్పుడు సినిమా మొదలు పెట్టేవాడు. సినిమా జరుగుతున్నంత సేపు పంపిణీ దారు కమ్ ఫైనాన్షియర్ అదుపు, అజమాయిషే లేదా పరిశీలన వుండేది. దాంతో తయారవుతున్న ప్రొడక్టు మీద నిర్మాతకు జాగ్రత్త, పంపిణీ దారుకు ఓ ఐఢియా వుండేవి. 

రానురాను ఏరియాల వారీ అమ్మకాలు మొదలయ్యాయి. పంపిణీ దారు వేరు, ఫైనాన్షియర్ వేరు అన్న పరిస్థితి వచ్చింది. సినిమా ఎలా తయారైతేనేం, తన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో ఫైనాన్షియర్ కు తెలుసు. అందువల్ల పెద్దగా సినిమాపై జోక్యం వుండడంలేదు. బయ్యర్ కు ఇప్పుడు ఈక్వేషన్లు మినహా మరేవీ పట్టడం లేదు..గుర్రప్పందాల్లో గుర్రాల ట్రాక్ రికార్డు చూసినట్లు, హీరో, డైరక్టర్ కాంబినేషన్ చూసి గుడ్డిగా ముందుకు వెళ్లిపోతున్నారు. 

వేరు వేరు ఈక్వేషన్లు

సినిమా రంగంలో ఇప్పుడు రెండు రకాల ఈక్వేషన్లు నడుస్తున్నాయి. అయ్యో బయ్యర్లు..పాపం అంటే, చిన్న, మీడియం నిర్మాతలు ఒంటి కాలి మీద లేస్తారు..బయ్యర్లతో తమ పాట్లు ఏకరవు పెడతారు.. అదే పాపం నిర్మాతలు అంటే బయ్యర్లు ఖస్సు మంటారు. పెద్ద నిర్మాతల కారణంగా బయ్యర్లు ఎలా నష్టపోతున్నదీ వివరిస్తారు. 

సరే ముందు చిన్న, మీడియం నిర్మాతల వైనం చూద్దాం. 

చిన్న సినిమా తీసాడా అంటే ఆ నిర్మాత తన డబ్బులను రోడ్డు మీద జల్లేసి నట్లే. ఏరుకోగలిగితే అదృష్టవంతుడు. లేకుంటే లేదు. మొన్నామధ్య రెండు చిన్న సినిమా ఫంక్షన్లలో గమినిస్తే, పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా కనిపించారు. నిర్మాతలు తప్ప. స్టేజ్ పై జరుగుతున్న సమావేశం, స్వడబ్బా..పర డబ్బా..పరస్పర డబ్బా అన్న రీతిలో సాగుతున్న ప్రసంగాలు ఆ నిర్మాతలకు ఏమీ పట్టడం లేదు. తమ సినిమా జనంలోకి వెళ్తుందా..థియేటర్ రెంట్ లు పోను, ఓ రూపాయి అయినా వెనక్కు వస్తుందా? ఇదే ఆలోచన.

చిన్న సినిమాను ఇప్పుడు బయర్లు కొనడం లేదు. అబ్బే లాభం లేదండీ..అనేయడమే. కావాలంటే ఆడించమంటే ఆడిస్తాం..ఖర్చులు పోను మిగిల్తే మీకే ఇస్తాం అంటారు. అదీ సినిమా ఓ మాదిరిగా ఆడుతుందన్ననమ్మకం వుంటే. లేకుంటే మేం థియేటర్లు సెట్ చేస్తాం..మీరు రెంట్ లు కట్టుకోండి. మేం వ్యవహారాలు చూసి పెడతాం..ఎంతో కొంత ఇద్దరుగాని. ఇక మీడియం రేంజ్ సినిమాలది వేరే తంతు. కొంచెం అడ్వాన్స్ లు ఇస్తారు. సినిమా తీసుకుంటారు. ఓవర్ ఫ్లోస్ అంటే అడ్వాన్స్ లు పోగా ఇంకా వస్తే ఇస్తాం అంటారు. ఇక అంతే సంగతులు. 

ఓవర్ ఫ్లోస్ కోసం నిర్మాత ఫోన్ బిల్లు మోగి పోవాలి కానీ, అక్కడి నుంచి పైసలు రాలవు..ఈ మాట అబద్ధం అని ఎవరైనా అనుకుంటే సూపర్ డూపర్ హిట్ అనుకున్న కార్తికేయ నిర్మాతను అడగండి. ఆయనే కాదు చాలా మంది నిర్మాతలకు అనుభవం. అందుకే వీలయినంత అడ్వాన్స్ లు తీసుకోవాలని చూస్తారు మీడియం సినిమా నిర్మాతలు. ఎందుకంటే వారికి తెలుసు..అక్కడితో అది సరి అని. కొంత మంది బయ్యర్లు ఓవర్ ఫ్లోస్ చూపించరు. 

పైగా సినిమాకు డివైడ్ టాక్ వచ్చి, మీడియాలో కలెక్షన్ల పడిపోయాయి అని వార్త వస్తే ఈ బయ్యర్లకు ఆనందం. ఆ వంక చెప్పి, తమ దగ్గర కలెక్షన్లే లేవని చెప్పి, ఓవర్ ఫ్లోస్ కు ఎగనామం పెడతారు. డిసిఆర్ అంటే థియేటర్లు డైలీ కలెక్షన్ రిపోర్టులు ఎవరి చిత్తానికి అవి తయారవుతాయి. పైగా కొందరు బయ్యర్లు దేశముదుర్లు, విదేశీ ముదుర్లు కూడా వుంటారు. ఓవర్ ఫ్లోస్ వచ్చాయి కదా..ఇవ్వండీ అంటే..అల్లా సినిమాలో పోయాయండీ నాకు బోలెడు అంటారు. అదేంటీ ఆ సినిమాతో నాకేం సంబంధం నా సినిమా నాది అంటే అసలు ఈక్వేషన్ చిట్టా విప్పుతారు. అది ఇలా వుంటుంది.

ఎక్స్ అనే సినిమా వస్తోంది అనుకుందాం. బయ్యర్ కు థియేటర్ యజమాని అడ్వాన్స్ ఇస్తాడు. మంచి సినిమా తన థియేటర్లో పడాలని. ఎందుకంటే సైకిల్ స్టాండ్, క్యాంటీన్ వగైరా నడవాలి కదా,. బయ్యర్ నిర్మాతకు అడ్వాన్స్ ఇస్తాడు. తీరా చేసి ఆ ఎక్స్ అనే సినిమా ఢమాల్ అంది అనుకుందాం. నిర్మాత దగ్గర నుంచి బయ్యర్ కు వాపసు రాదు..బయ్యర్ నుంచి థియేటర్ యజమానికి వాపసు రాదు. అయితే ఇది ఇక్కడితో ఆగదు. నిర్మాత మారోచ్చు కానీ, థియేటర్, బయ్యర్ బంధం మారదు.

 వై అనే సినిమా వచ్చింది అనుకుందాం. ఈ సారి మళ్లీ బయ్యర్ తన రెగ్యులర్ థియేటర్ లో వేస్తాడు. ఈ సారి కలెక్షన్లు బాగుంటాయి. కానీ థియేటర్ల నుంచి బయ్యర్ల దగ్గరకు పైసలు రావు. ఎందుకంటే ఎక్స్ సినిమాలో బాకీ వుంది కదా అంటారు. దాంతో బయ్యర్ దగ్గర నుంచి నిర్మాతకు ఓవర్ ఫ్లోస్ రావు. అదేంటీ అంటే..అదంతే..ఎవరో సినిమా పాపం, ఈ సినిమా నిర్మాత మోయాలి. లేదూ నిర్మాత గట్టివాడై, రాబట్టుకోగలిగితే అదివేరే సంగతి. అంత స్టామినా వుంటే చిన్న సినిమా ఎందుకు తీస్తాడు..పెద్ద సినిమానే తీస్తాడు. 

ఇక పెద్ద సినిమాల సంగతి ఇందుకు రివర్స్

పెద్ద స్టార్ కాస్ట్..కాంబినేషన్ ప్రకటించగానే బయ్యర్లు వాలిపోతారు. అడ్వాన్స్ లు చేతిలో పోస్తారు. సినిమా పూర్తయ్యేసరికి, అడియోఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి వీర హైప్ రప్పిస్తారు. అప్పుడు రేటు కట్టడం మొదలవుతుంది. హీరో అంతకు ముందు నటించిన హిట్ సినిమా ఆ ఏరియాకు ఎంత వసూలు చేసిందో చెప్పి, దానికి కొంచెం కలిపి ఇమ్మంటారు. ఇది భలే చిత్రం. ఆ సినిమా కలెక్ట్ చేసినంత ఈ సినిమా వసూలు చేయాలనీ లేదు. పోనీ అదే సూపర్ డూపర్ హిట్ రేంజ్ కలెక్షన్. దానికన్నా అదనం అంటే ఈ సినిమా ఇంకెంత సూపర్ డూపర్ హిట్ కావాలి. ఇంకేం రేంజ్ కలెక్షన్ రావాలి. 

అలాకాదూ..అంటే అయితే నీ అడ్వాన్స్ తీసేసుకో..ఇంకొకళ్లు అడుగుతున్నారు..వాళ్లకి ఇచ్చేస్తాం అంటారు. ఇన్నాళ్లు వడ్డీలేని అప్పు. ఇక తప్పక బయ్యర్ తీసుకుంటాడు. బొమ్మ కాస్తా బొరుసు అవుతుంది. బయ్యర్ లబో దిబో అంటాడు. ఈ లోగానే నిర్మాతలకు ఓ టెక్నిక్ వుంది. ఈ సినిమాకు గుమ్మిడి కాయ కొట్టకుండానే మరో మాంచి కాంబినేషన్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి వదుల్తారు. లేదా సినిమా ఫైనల్ చేసి వుంచుకుంటారు. బయ్యర్ లబోదిబో అంటే, ఆ సినిమాలో చూసుకుందాంలే అంటారు. అప్పటికి అది ఉపశాంతి. కానీ ఆ సినిమా ప్రారంభమై, దానికి హైప్ వచ్చాక మళ్లీ కథ మామూలే. 

తగ్గిపోతున్న బయ్యర్లు

రాను రాను చిన్న చిన్న బయ్యర్లు తగ్గిపోతున్నారు. విశాఖ, ఈస్ట్, వెస్ట్, నైజాం, ఇలా అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సినిమా ఆఫీసులు తగ్గుతున్నాయి. మరోపక్క థియేటర్ల గుత్తాధిపత్యం అన్నది మళ్లీ సింగిల్ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థకు ప్రాణం పోస్తోంది. ఇదెలాగంటే.  పది మంది బయ్యర్లు, వాళ్ల డిసిఆర్ లు ఇలాంటి తలకాయనొప్పలు పడలేక, కాస్త థియేటర్లు చేతిలోవున్న పంపిణీదారు చేతిలో సినిమా పెట్టాలనుకుంటున్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు లేదా ఆంధ్ర, సీడెడ్ నైజం అనే మూడు ప్రాంతాలకు ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురికి సినిమాను అప్పగించడం. 

సురేష్ మూవీస్, దిల్ రాజు సంస్థ ఈ తరహా సోలో డిస్ట్రిబ్యూషన్ కు కీలకంగావున్నాయి. అయితే చిన్న, మీడియం సినిమాకు వీరు ఏ విధమైన అడ్వాన్స్ లు ఇవ్వరు. సినిమాను తమ థియేటర్లలో ఆడిస్తారు. అద్దెలు ఖర్చులు పోను, తాము అనుకున్న రేషియోలో మిగులు ఏమన్నా వుంటే ఇస్తారు. లేదంటే లేదు. కనీసం కష్టపడి తీసిన సినిమా వెలుగు చూస్తుంది కదా అనే ఆశతో ఇలా ఇచ్చేసే నిర్మాతలు వున్నారు.  అలా కాకుండా సినిమా ఫేర్ చేస్తుంది అనుకుంటే మాత్రం మొత్తం సినిమాను తమకు ఇచ్చేయమని కొనుగోలు చేస్తారు. అది నిర్మాత, ఈ సంస్థల నడుమ జరిగే బేరసారాలను బట్టి వుంటుంది. 

ఎంత కష్టం

మొత్తం మీద సినిమా తీయడం అన్నది ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదు. ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాస్త డబ్బులుంటే సినిమా చుట్టేయచ్చు. కానీ విడుదలే కష్టం. ఈ వ్యవహారం అంతా గమనించే రామ్ గోపాల్ వర్మ విప్లవాత్మక ప్రయత్నం అంటూ పట్టణాలు, గ్రామాల వారీ తన సినిమాను తానే అమ్మే ప్రయత్నం చేసారు. నిజానికి ఒక విధంగా అది మంచి అయిడియానే. కానీ తొలిసినిమానే ఫ్లాప్ కావడంతో ఆ అయిడియా అటకెక్కింది. పైగా థియేటర్లు తమ చేతిలో వుండగా ఈ గుత్తాథికార్లు అలాంటి అయిడియాలు కావచ్చు, మరి ఏవైనా కావచ్చు ఎలా సాగనిస్తారు?

ప్రశూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాంటిదే సినిమా వైరాగ్యం కూడా. సినిమా ఫ్లాప్ అయి, కోటో, రెండు కోట్లో పోగానే బయ్యర్, నిర్మాత ఛ..ఇక ఈ వ్యాపారం వదిలేయాలి అనుకుంటారు. కానీ తీరా చేసి మళ్లీ మామూలే. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి..ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏం వ్యాపారం చేయగలం అని సర్ది చెప్పుకుంటారు. 

ఈ సర్కిల్ ఇలా తిరుగుతూనే వుంటుంది. ముందు చూపు వుండి, వ్యాపారాన్ని తమకు అనుగుణంగా డిజైన్ చేయగలిగిన సత్తా, సమర్థత వున్నవాళ్లు లాభాలు సంపాదిస్తూనే వుంటారు. ఎందుకంటే జూదశాల పర్మనెంట్..అక్కడి వచ్చేవాళ్లలో పొగొట్టుకునే వాళ్లు వుంటారు..గెలుచుకునే వాళ్లు వుంటారు. ఈ లెక్క ఫైనల్ గా చూసుకుంటే జూదశాలదే లాభం..ఇక్కడ సినిమా రంగంలోనూ అంతే. నిర్మాత, బయ్యర్లు నిలదొక్కుకున్నవాళ్లని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. థియేటర్లు చేతిలో వున్న వారు మాత్రం నష్టపోవడం అంటూ వుండదు. 

ఇదో 'చిత్ర'మైన పరిశ్రమ.

చాణక్య

writerchanakya@gmail.com

 


×