విదేశీగడ్డపై స్వదేశ లొసుగులను ప్రస్తావించటం పారదర్శకతనా? స్కామ్‌ల గురించి మాట్లాడటం సముచితం కాదని మోడీపై లేటెస్ట్ వివాదం.
ఒబామా దంపతులు భారత్‌ని సందర్శించినపుడు మోడీ వేసుకున్న ఖరీదైన కోట్… వస్త్రధారణపై మోడీకున్న వ్యామోహం నిన్నటి వివాదాంశం.
అధికార విషంతో కడుపు నింపుకున్న కాంగ్రెస్ అంటూ విమర్శించటం మొన్నటి వివాదం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా గోద్రా అల్లర్లు మోడీ చలవే అన్నది తొలి వివాదాంశం.
అయినా ప్రధాని పీఠంపై మోడీ ఇంకా పసికూననే కాబట్టి నిరాశ వలదంటూ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పారిశ్రామిక వర్గాలను సముదాయించటం మోడీ పాలనపై కన్నేసిన వారి కన్నెర్రకు ఒక ప్రతిబింబం మాత్రమే.
భారతీయ రాజకీయ ‘యోగి’ నరేంద్ర మోడీ.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ‘ప్రధాని’గా మోడీ ‘రాజసం’ వివాదాస్పదమౌతుందా?
భారతీయ జనతాపార్టీ ప్రతినిధిగా కాంట్రవర్షియల్ అవుతున్నారా?
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీని అర్థం చేసుకున్నవారికంటే అర్థం చేసుకోనివారే ఎక్కువ శాతమా?
ఆర్ఎస్ఎస్ ప్రచారకత నుండి ఇంతై ఇంతింతై అన్నట్టు ఎదిగిన అసలు మోడీ ‘వ్యక్తి’గా ఎవరికీ అర్థం కారా?
‘అవును’ అన్నదే సమాధానం… మోడీ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని, బహుముఖీనత్వాన్ని తిరగతోడితే.
మోడీ ఎన్నడూ పదవికోసం ప్రయత్నించినట్టు కనిపించదు పైకి… కానీ సిద్ధాంతాలతో పోరాడిన తీరు చూస్తే ఆ పోరాటమే ఆయన ప్రయత్నం అని స్పష్టమవుతుంటుంది.
మోడీ స్వార్థపరుడు కాడు అని అందరూ అనుకుంటుంటారు… అవును, ఆయన స్వార్థం తన రక్త సంబంధీకుల చుట్టూ అల్లుకుపోలేదు… ఆ స్వార్థం భారతీయతను, హిందుత్వాన్ని బలంగా పొదువుకుంది. కాబట్టే ‘నిస్వార్థ’ ముద్ర ఆయన రాజకీయ చరిత్రపై పడింది. బిజెపిలో తిరుగులేని నాయకుడనిపించుకోవటానికి కారణం ఆయన ‘ప్రతిభ’నే.
పేదరికంలో పుట్టి ప్రధాని కావటం నరేంద్రమోడీ గొప్పతనం కాకపోవచ్చు… ప్రధానిగా పదవీ ప్రమాణోత్సవంలో కన్నతల్లిని కళ్లెదుట కూర్చోపెట్టకపోవటం, తోడబుట్టిన వారిని ఆ ప్రాంగణంలోకి ఆహ్వానించకపోవటం గొప్ప కాకపోవచ్చు. కానీ మనగత ప్రధానుల, ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలను చూసిన మనకు ఒక విధంగా మోడీ గొప్పనే.
గుజరాత్లో మోడీ ఒక చరిత్ర సృష్టించారనటం ఒక నిజం… అక్కడి ఆర్థిక ప్రగతి మోడీ పరిపాలనా దక్షత వల్లనే అనటం మరొక నిజం… గుజరాత్ రాష్ట్రం పారిశ్రామిక రాష్ట్రంగా అవతరించటానికి మోడీ దార్శనికేక కారణం అనటం కాదనలేని నిజం… వీటితో పాటు గోద్రా విధ్వంసంలో మోడీ పాత్రను చరిత్ర విస్మరించలేదు అనటమూ ఎంతో కొంత నిజం.
ఒకప్పుడు బిజెపి అంటే అద్వానీ. బిజెపి ప్రధాని అంటే వాజ్పాయ్. ఇప్పుడు బిజెపి అంటే అద్వానీ వాజ్పాయ్ల సమ్మేళనమైన నరేంద్రమోడీ. భారతీయ మోడీ.
ఒక స్వాప్నికతకు పరాకాష్ఠ
ఒక ఆధునికతకు భూమిక
ఒక శాస్త్రీయ, సాంకేతికతలకు విప్లవ గీతిక
ఇవన్నీ కలిసిన ‘గ్లామర్’ మోడీకి ఉంది. ఈ రోజు మోడీ కంటూ రంగూ, రుచీ, వాసనా ఉంది.
గతాన్ని పట్టుకు వేలాడుతుంటే అడుగుపడదు… రేపటిలోకి అడుగు వేయటం చేతకాకపోతే చరిత్ర విస్మరించే తీరుతుంది. తనను చరిత్ర విస్మరించటం మోడీ వ్యక్తిత్వం అంగీకరించదు. కాబట్టి మోడీకి చరిత్ర కావాలి… భారతదేశ చరిత్రకూ మోడీ కావాలి.
క్రమశిక్షణ గల వ్యక్తిత్వాన్ని ఏ చరిత్రా విస్మరించదు. మోడీ క్రమశిక్షణకు మారుపేరు కాబట్టి మోడీకి చరిత్రలో స్థానం దేక్క తీరుతుంది. ‘అధికారం విషతుల్యం’ అని తెలిసీ విషాన్ని సేవిస్తున్న గరళ కంఠుడు మోడీ. కాంగ్రెస్ పార్టీకి అధికారంతో కడుపు నిండింది అంతే… బిజెపికి ఇపడే కంఠాన్ని చేరుకుంటోంది. గొంతు దిగితేనే కదా కడుపును చేరేది… కడుపు నిండేది.
ఇటువంటి నేపధ్యంలోనూ మోడీకి వోటర్లను ఆకర్షించటం బాగా తెలుసు. అందుకే ప్రచార పర్వంతో – రాజకీయ విషం ఇంక చాలు… ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే రాజకీయం అందలమెక్కాలి. పేదలకు అభ్యున్నతిని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను, అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు గౌరవాన్ని అందించే పాలన కావాలి… కాలం హరించుకుపోతోంది… దేశాన్ని మారుస్తామని పిడికిలి బిగించండి… భారత్‌కే వోటు అంటూ నినదించండి.. అంటూ తాను కాషాయ సముద్రంపై నుండి ఎగిరి వచ్చినట్టుగా ఉందని పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని ఉత్తేజపరచటం మోదీ ప్రత్యేకబాణీ. మోడీ తాను భారతీయుడనని, హైందవుడనని, హిందూ మతస్తుడనని చెపకోవటానికి ఏ చిన్న సందర్భాన్నీ జారవిడుచుకోరు. అదే ఆయన ప్రధాని కావటానికి వోట్ బాంక్ అయింది.
హిందుత్వాన్నే ఊపిరిగా చేసుకున్న మోడీ ఎంతటి ‘ఆధునికుడు’ అంటే దేవాలయాలు పరిసరాలలో మరుగుదొడ్లు అవసరం అని ఏనాడో చెబితే తన పుట్టిల్లైన ఆర్ఎస్ఎస్ మోదీని జీర్ణించుకోలేకపోయింది. ఆనాటి ఆ పిలుపుకు కొనసాగింపే నేటి స్వచ్ఛ భారత్. వాడవాడలా పారిశుద్ధ్యమే కాదు పాలనలోను పారిశుద్ధ్యం అవసరం అన్న నినాదంతోనే విదేశాలలో స్వదేశీ స్కాంల ప్రస్తావన తీసుకొచ్చి వివాదాస్పదుడవు తున్నారు. ఏది ఏమైనా మోడీలో ఒక ‘రాడికల్’ ఉన్న కారణంగానే ఇదంతా సాధ్యమౌతోంది.
మోడీ ఎంతో సంయమనంతో మాట్లాడగలరు… అవసరాన్ని బట్టి స్వరం పెంచగలరు… ఉపన్యసిస్తున్నప్పుడు మోహం కందగడ్డలా మారిన సందర్భాలు లేకపోలేదు… తాను రెచ్చిపోవటమే కాక అనుయాయుల్ని రెచ్చగొట్టడమూ మోడీకి తెలుసు. ఇంకా మన దేశ పౌరులు కూటి కోసం పోరాడుతూనే ఉన్నారని నిర్మొహమాటంగా ఎలుగెత్తి చెప్పగల ధైర్య స్థైర్యాలు మోడీ స్వంతం. ఏ సందర్భంలోనూ నీళ్లు నమలటం తెలీని నాయకుడు మోడీ.
మనకు కనీసరావసరాలకు అవసరమయ్యే కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఉండని పరిస్థితిని మోడీ మాటల్లో వింటే ఎటువంటి వారికైనా ఉక్రోషం పుట్టుకొస్తుంది… అమ్మకి వొంట్లో బాగాలేకపోతే ఫాన్ పెట్టుకోలేని దుస్థితి… కొడుకు పరీక్షలకి చదువుకుంటుంటే లైట్ వేసుకోలేని అసమర్థస్థితి. ఆంగ్లేయులు ఇక్కడివారిని శత్రువులుగా చూసారనటం నాటి చరిత్ర అయితే మన ప్రభుత్వాలే మనల్ని శత్రువులుగా చూస్తుండటం నడుస్తున్న చరిత్ర – ఇదీ మోడీ పొలీటికల్ మోటివేషన్.
నేను ఎన్నడూ ఇలా కావాలని అనుకోను… అదీ నాతత్వం. గుజరాత్ ముఖ్యమంత్రిని కావాలని ఎన్నడూ అనుకోలేదు. ఎదో చెయ్యాలని మాత్రం సదా అనుకుంటుంటాను. అందుకే భారత్‌ను అగ్రస్థానంలో నిలపటమే నా లక్ష్యం.. ఇదీ మోడీ దేశాభిమానం.
మోడీకి ఎవరూ మార్కులు వేయనవసరం లేదు… తనకు తాను మార్కులు వేసుకోవటం తెలిసిన తెలివైన నాయకుడు మోడీ. అందుకే ఒక సందర్భంలో అంటారు.. క్రికెట్ ఆటలో ఎంతమంది ఆటగాళ్లు ఎంత తక్కువ స్కోర్ సాధించినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అదే సచిన్ 90కి అవుటైనా విమర్శిస్తారు… కారణం సచిన్ నుండి ఆశించేది వేరు. అలాగే నన్ను ఎక్స్‌పెక్టేషన్స్‌తో కొలుస్తుంటారు.’’
ఇలా చూస్తే మోడీది విమర్శకుల కొలమానాలకు అంటే నాయకత్వం కాదు… ఇతర నాయకులు వేసే మార్కులకు సరితూగే వ్యక్తిత్వమూ కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయారణ్యంలో ‘రాజ’ ‘యోగి’ నరేంద్రమోడీ.
డా. వాసిలి వసంతకుమార్
సెల్ : 9393933946