నేపాల్ని తీవ్ర భూకంపం నిన్న కుదిపేసినప్పటినుంచీ, ఈ ఉత్సాతాన్ని చూసినవారు కంటి మీద కునుకు లేకుండానే గడుపుతున్నారు. క్షణ క్షణానికీ భూమి కంపిస్తూనే వుంది. ఎన్నిసార్లు భూమి కంపించిందో లెక్కలు వేసుకోలేని దుస్థితి నేపాల్ భూకంప బాధితులది. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో 6.9 తీవ్రతతో మరోమారు నేపాల్లో భూమి కంపించింది. ఈ భూకంపం తాలూకు ఎఫెక్ట్, భారతదేశంపైనా పడింది.
ఇప్పటికే నిన్నటి భూకంపం కారణంగా మూడు వేల మందికి పైగా మృత్యు వాత పడినట్లు అంచనాలు వేస్తుండగా, తాజా భూకంపం దెబ్బకి నేపాల్ మరింతగా విలవిల్లాడింది. అయితే, తాజాగా ఈ రోజు సంభవించిన భూకంపం.. నిన్నటి భూకంపం తర్వాతి వచ్చే ప్రకంపనలకు కొనసాగింపేననీ, ఇది భూకంపంగా భావించలేమని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల మాటల్లో అయితే తాజా భూకంపాన్ని ‘ఆఫ్టర్ షాక్స్’గా చెప్పుకోవాల్సి వుంటుంది.
పేరు ఏదైనాసరే, అసలే తీవ్రమైన గాయంతో విలవిల్లాడుతోన్న నేపాల్ నెత్తిన మరోమారు పిడుగు పడటంతో, సహాయక చర్యలకు మరింత ఆటంకం ఏర్పడుతోంది. 72 గంటలపాటు నేపాల్లో ప్రకంపనలు కొనసాగే అవకాశం వుందనీ, ఓ వారం పది రోజులపాటు చిన్న చిన్న ప్రకంపనలు రావొచ్చనీ నిపుణులు అంటున్నారు.