cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

కబుర్లు సరే, కార్యాచరణ ఏదీ?

కబుర్లు సరే, కార్యాచరణ ఏదీ?

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వరంగల్ పర్యటన  ముగిసింది. వరంగల్ సభలో చంద్రబాబు మాటలతో రెండు రాష్ట్రాల ప్రజలు అయోమయంలో పడ్డారు. కారణం ఆయన కొత్త మాటలేమి చెప్పకున్నా... తీరని సందేహాలను మిగిల్చారు. అందరూ శాఖాహారులే... రొయ్యల మూట మాయమైంది అన్న నానుడిని మరోసారి తెలుగు ప్రజల ముందుంచారు చంద్రబాబు. అదేంటంటే రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలు. వాటన్నింటికి ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ  సీఎం చంద్రబాబు చెబుతున్న పరిష్కార మార్గమూ ఒకటే. అదేంటంటే కలిసి చర్చించుకుందాం, సమస్యలు పరిష్కరించుకుందాం అని. కాని వారిద్దరు సమస్యల పరిష్కారం కోసం చర్చించుకునేందుకు ఇప్పటి వరకు కలిసింది లేదు. వేదికలపై కలిసి చర్చించుకుందాం అని చెప్పడం తప్ప అధికారికంగా వారి చర్చలకు ఒకరినొకరు పిల్చుకున్నది లేదు.

ఇక ఏపి సీఎం చంద్రబాబు చెబుతున్న మరో మాట. తాను చర్చించుకునేందుకు రెడీ, కాని కేసీఆర్ బెట్టు చేస్తున్నారు, సహకరించడం లేదు. ముఖాముఖి చర్చకు ఆయన సిద్ధంగా లేకుంటే పెద్ద మనుషుల సమక్షంలో చర్చించుకుందాం, వారు చెప్పినట్టు నడుచుకుని సమస్యలను పరిష్కరించుకుందాం అని. ఇవే మాటలు మళ్లీ రిపీట్ చేసారు వరంగల్ సభలో. అంతే కాదు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల, విద్యుత్ వివాదాలను ప్రస్థావించారు. ఏపీలో మిగులు విద్యుత్ ఉన్నా... లేదా ఆదా చేసైనా సరే తెలంగాణకు ఇస్తానన్నారు. కాని పీపీఏలను తెరమీదకు తెచ్చి తెలంగాణ వాటాకు కోత పెట్టారన్న టీఆర్‌ఎస్ ఆరోపణలను మాత్రం ప్రస్తావించలేదు, దానికి సమాధానం చెప్పలేదు. పర్యటనకు ముందు టీఆర్‌ఎస్ నేతలందరు ఇవే ఆరోపణలు చేసినా వరంగల్ వేదికపై వీటికి సమాధానం చెప్పలేదు.

సరే ఈ సమస్యల మాటెలా ఉన్నా... పెద్దమనుషుల సమక్షంలో చర్చించి వారి మాట విని సమస్యలు పరిష్కరించుకుందాం అన్నారు. ఇద్దరు సీఎంలను మించిన పెద్ద మనుషులు రాష్ట్రాల్లోనయితే లేరు. ఎందుకంటే ఎవరి రాష్ట్రానికి వారే పెద్దమనుషులు. ఇక వారిని మించిన పెద్దమనుషులంటే ఎవరు... అయితే కేంద్రం, లేదంటే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్. మరి వీరిద్దరి సమక్షంలో వారు సమస్యలపై చర్చించారా.. అంటే అదీ లేదు. విడివిడిగా కేంద్రం వద్దకు, గవర్నర్ వద్దకు వెళ్లడం ఒకరి తీరుపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకోవడం తప్ప. ఇక పెద్దమనుషుల సమక్షంలో కలిసి చర్చించి పరిష్కరించుకుందాం అన్నది నిజమయ్యేదెలా... కేవలం రాజకీయం కోసం ఇలాంటి మాటలు మాట్లాడం తప్ప. దీని వల్ల నష్టపోతున్నదెవరు,  చక్కటి పదవులతో సీఎం లిద్దరు బాగానే ఉన్నారు, రాజకీయాలతో సంబందంలేని సాధారణ జనం మాత్రం ఇరు రాష్ట్రాల్లో నష్టపోతున్నారు.

మొదట ఫీజు రీయంబర్స్ మెంట్.... దీనిపై ఎంతో వివాదం చెలరేగింది. విద్యార్థుల చదువులు చాలా కాలం మసకబారాయి. ఇరు రాష్టాల విద్యామంత్రులు గవర్నర్ సమక్షంలో చర్చలు జరిపారు. ఎవరి వాదన వారిది తప్ప పెద్ద మనిషిగా గవర్నర్ చెప్పిందెవరు వినలేదు. తర్వాత ఇంటర్, ఎంసెట్ నిర్వహణపై అదే జరిగింది. ఇక క్రిష్ణా జలాల వినియోగం, దీనిపై కృష్ణా ట్రిబ్యునల్ చెప్పింది కూడా ఇద్దరు వినలేదు, చివరకు కేంద్రం కల్పించుకుని సలహా ఇచ్చినా పాటించలేదు. చివరకు చేసేది లేక ట్రిబ్యునల్, కేంద్రం తమ వల్ల కాదు, మీది మీరే చూసుకోండి అనేదాకా తెచ్చుకున్నారు. ఇప్పుడేమయింది. వారిద్దరు బాగానే ఉన్నారు. పంటలు వేసిన రైతన్నలు లబోదిబో మంటున్నారు. ఒక్క ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనే సాగర్ కుడికాలువ కింద ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఎడమ కాలువ కింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్నాయి. వీరి గొడవ మరో వారం రోజులు ఇలా సాగినా... జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. రైతులు నిండా మునుగుతారు. అప్పుడు చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుంది. అందుకే వ్యర్థ రాజకీయాలు మాని వారిని నమ్ముకున్న ప్రజలకోసం ఇరువురు చర్చించుకుని సమస్యలు, వివాధాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.

రాజకీయం ఎవరిది?

చంద్రబాబు వరంగల్ పర్యటనను అడ్డుకునేందుకు దిగజారుడు రాజకీయాలు నడిచాయన్నది నిజం. అయితే ఈ నీచరాజకీయాలకు పాల్పడిందెవరు, ఎందుకు చేసారు, దీని అవసరం ఎవరికి ఉంది అన్న సందేహాలు సామాన్యుడిని తొలిచేస్తున్నాయి. ఏపీ సీఎంగా చంద్రబాబు భాద్యతలు స్వీకరించాకా ఆయన తెలంగాణకు రావాలని తొలిసారి డిసైడ్ అయ్యారు. దీని అవసరం ఆయనెకంత వరకు ఉంది, ఈ సమయంలో వరంగల్ పర్యటన ఆయనకు అవసరమా.. అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఓ దశలో తెలంగాణలో హేమాహేమీలైన నేతలు పార్టీని వీడి పోతున్నా.. ఆయన తెలంగాణకు రాలేదు, పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. నేతల వలసలతో క్యాడర్ నిస్తేజంగా తయారవుతున్నా.. వచ్చి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వరంగల్ పర్యటన ఎందుకు పెట్టుకున్నారు. అంతగా నిరసనలు ఎందుకు వ్యక్తమయ్యాయి. పోని వరంగల్ ఎంపీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడింది, అభ్యర్థి ఎంపిక, ప్రచారం పర్వం ఏమైనా ఉందా.. అంటే అది ఇప్పట్లో లేదు. అందుకే బాబు పర్యటన వెనుక బడా రాజకీయం ఉందన్న వాఖ్యలు రాజకీయ విమర్శుకుల్లో వక్తమవుతున్నాయి.

సరే బాబు వస్తే టీఆర్‌ఎస్ నేతలకు ఉలుకెందుకు, వారి చేతిలో ఉన్న అధికారం ఇప్పటికిప్పుడు ఊడిపోతుందా.. పోని ప్రభావం చూపుతుందా అంటే ఇప్పటి వరంగల్ పర్యటన 2019 ఎన్నికల వరకు ఉంటుందా.. అలాంటప్పుడు బాబు పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం వారికేముంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాబు పర్యటన విజయవంతమైతే.. టీఆర్‌ఎస్ పరువు పోతుందన్న భావం వారిలో ఉంటే ఉండే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేం. ఇక బాబు పర్యటన సంధర్భంగా నోరు పారేసుకున్కన్నది మాత్రం టీఆర్‌ఎస్ నాయకులే. వారికి ఆ అవసరం ఏంటో తెలియకున్నా.. బాబు పర్యటనలో ఏ అపశృతి దొర్లినా, అది ఎవరి వల్ల జరిగినా దాని ఫలితం పూర్తిగా టిఆర్‌ఎస్ పైనే పడుతుందన్న విషయం వారికి తెలియదా.. అన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి.

వేదిక వద్ద మంటలు పెట్టడం, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఒరిగిందేమిటి. అది టీఆర్‌ఎస్ పని కాదని పైకి చెప్పుకుంటున్నా.. ఆ అవసరం ఎమ్మార్పిఎస్ కు ఎందుకు ఉంది, ఎంత మేరకు ఉంది అని కూడా ఆలోచిస్తారు కదా. పైగా ఎమ్మార్పిఎస్ నిన్న మొన్నటి వరకు టిడిపికి అండగా ఉంది, తెలంగాణలోనూ టీఆర్‌ఎస్ తీరును విమర్శిస్తోంది. అలాంటిది ఎమ్మార్పీఎస్ చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం ఏంటన్న అనుమానాలయితే కలుగుతాయి. అసలు ఎమ్మార్పీఎస్ నేతలు కోరుతున్నదేమిటి? ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని. దానిపై చంద్రబాబు హామీ ఇవ్వాలని. ఇది వింటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఏపికి సీఎం, ఆయన ఆ బిల్లును ప్రవేశపెట్టాలని ఏపిలో ఎమ్మార్పీఎస్ ఆందోళన చేయాలి, కాని ఇంత వరకు ఈ విషయంపై ఏపిలో ఎమ్మార్పీఎస్ ఆ పనిచేయలేదు. 

పైగా తెలంగాణలో ఏపి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని గొడవ చేయడమేంటి, తెలంగాణలో వారు బాబును అడ్డుకోవడమేంటి అన్న సందేహాలు సామాన్యుడికి కూడా కలుగుతాయి. టీఆర్‌ఎస్ కావాలని ఎమ్మార్పీఎస్ ముసుగులో ఇలా చేయించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా... ఇంత బ్లండర్ మిస్టేక్ ఎలా చేస్తుంది. పైగా చంద్రబాబుకు అనుకూలమైన ఎమ్మార్పీఎస్ ఇందుకు ఎందుకు ఒప్పుకుంటుందన్నది కూడా ఆలోచించాల్సిందే కదా.. అయితే ఎవరు చేసినా అది టీఆర్‌ఎస్ మీదనే పడుతుంది. అలా కాక సాదాసీదాగా చంద్రబాబు అలా వచ్చి ఇలా వెళితే ఇంపాక్ట్  ఏముంది అందుకే టిడిపి జనాలే ఏదో చేసి వుంటారన్న ఊహాతీత అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా.. చంద్రబాబు వరంగల్ పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమి లేదు. ఏమైనా ప్రయోజనం జరిగితే రాజకీయంగా చంద్రబాబుకు, అడ్డుకున్నందుకు టీిఆర్‌ఎస్‌కో ఉండాలి. కాని అది కూడా పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఇరు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు రాజ్యమేలుతున్న వేళ ఇలా అనవసరంగా సమయం వృధా చేయడం మాత్రం విమర్శలకు దారితీసింది.

చాణక్య

writerchanakya@gmail.com

 


×