డా|| కేతన్ దేశాయి అనే ఒక డాక్టరుగారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు (ఎంసిఐ) ప్రెసిడెంటుగా వుండి అవినీతికి పాల్పడితే 2010 ప్రాంతాల్లో అది బయటపడి అరెస్టు చేశారు, జైలుకి పంపారు. ఆర్నెల్లు శిక్ష అనుభవించి బెయిలు మీద బయటకు వచ్చాడు. కేసు విచారణ యింకా జరగాలి. ఈలోగా ఏకంగా వరల్డ్ మెడికల్ ఎసోసియేషన్ (డబ్ల్యుఎమ్‌ఏ)కు ప్రెసిడెంటు అయిపోయాడు, దొంగ సర్టిఫికెట్లతో! అదీ ఆయనగారి సత్తా!
ఈ దేశాయి గుజరాత్‌కు చెందిన డాక్టరు. ఎవర్ని ఎలా పట్టాలో తెలిసిన వ్యక్తి. మెడికల్ కౌన్సిల్ ప్రెసిడెంటు అయిపోయాడు. మెడికల్ కాలేజీలకు అనుమతులు జారీ చేయడంలో, సర్టిఫికెట్లు యివ్వడంలో లంచాలు పట్టేవాడు. పంజాబ్‌లో పటియాలాలో గ్యాన్ సాగర్ మెడికల్ కాలేజీ గుర్తింపు విషయంలో రూ. 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతనితో బాటు యింకో యిద్దరు డాక్టర్లు సుఖ్‌వీందర్ సింగ్, కవల్‌జిత్ సింగ్, మధ్యవర్తి జె పి సింగ్‌లపై సిబిఐ 2010 ఏప్రిల్‌లో కేసు పెట్టింది. దేశాయి యింటిని సోదా చేసిన సిబిఐకు 1.5 కిలోల బంగారం, 80 కిలోల వెండి దొరికాయి. బ్యాంకు లాకర్లో రూ. 35 లక్షల విలువైన నగలున్నాయి. ఇంకా తెరవవలసిన లాకర్లు 35 వున్నాయని సిబిఐ అప్పుడు చెప్పింది. దేశవ్యాప్తంగా 400 ఆస్తులున్నాయట. రాష్ట్రపతి 2010 మేలో ఆ మెడికల్ కౌన్సిల్‌నే రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ కౌన్సిల్ ఏర్పడినపుడు అది దేశాయి మెడికల్ ప్రాక్టీషనర్ లైసెన్సును రద్దు చేసింది.
ఇంత జరిగినా ఆ ఘటికుడు బెదరలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి మోదీని ఆశ్రయించాడు. గుజరాత్ మెడికల్ కౌన్సిల్ నీ మెడికల్ ప్రాక్టీషనర్ లైసెన్సును రద్దు చేయనులే అంది. అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీలో యూరాలజీ డిపార్టుమెంటుకి హెడ్‌ని చేసింది, గుజరాత్ యూనివర్శిటీ సెనేట్ మెంబర్‌గా 2010లో మళ్లీ ఎంపిక చేసింది. రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రతినిథిగా ఒకరిని మెడికల్ కౌన్సిల్‌కు పంపుతాయి. తమ రాష్ట్రప్రతినిథిగా దేశాయిని మించిన యోగ్యుడు దొరకలేదు మోదీకి. గుజరాత్ ప్రతినిథిగా మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా 2012లో మళ్లీ వచ్చి చేరాడు. ''మీకు మెడికల్ ప్రాక్టీషనర్‌గా లైసెన్సే లేదు, మీరు కౌన్సిల్ సభ్యుడు ఎలా అవుతారు?'' అని పాత్రికేయులు అడిగితే, ''నేను రిజిస్టర్ చేసుకున్నది గుజరాత్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌తో. వాళ్లు రద్దు చేయలేదు. నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేసుకోనప్పుడు రద్దు చేసే అధికారం వాళ్లకెలా వుంటుంది?'' అని వాదించాడు. గుజరాత్ మెడికల్ కౌన్సిల్ కూడా అతని తరఫునే వాదించింది. సిబిఐ కేసు పెండింగులో వుండగానే యిలా కౌన్సిల్ సభ్యుడై పోవడంతో అతను ఆగలేదు. కౌన్సిల్ బోర్డులోనూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లోనూ తనకు అనుకూలంగా వుండే సభ్యులు ఎన్నికయ్యేట్లు చూసుకున్నాడు.
ఇంతలో అతని కన్ను వరల్డ్ మెడికల్ అసోసియేషన్‌పై పడింది. డాక్టర్లలో నైతిక విలువలు కాపాడే ఉద్దేశంతో 102 దేశాల డాక్టర్లతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ అది. దానికి యితని అధ్యకక్షుడిగా యితని పేరు సిఫార్సు చేయించుకున్నాడు. దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నాడు. తనపై కేసులున్నాయన్న విషయం ప్రపంచసంస్థ వారు విని వుంటారని తెలుసు కాబట్టి మెడికల్ కౌన్సిల్ వారి ఎథిక్స్ కమిటీలోని ముగ్గురు సభ్యులు – డా|| అజయ్ కుమార్, డా|| వినయ్ అగర్వాల్, డా|| సుదీప్త రాయ్‌ల చేత – అతనిపై కేసులేవీ పెండింగులో లేవు అని దొంగ సర్టిఫికెట్టుపై సంతకం పెట్టించి పంపించాడు. దానితో ఆ ప్రపంచ సంస్థ వారు 2016 నుంచి యితనే ప్రెసిడెంటు అని ప్రకటించారు. దొంగ సర్టిఫికెట్టు విషయం గ్రహించిన మెడికల్ కౌన్సిల్ చీఫ్ విజిలెన్సు ఆఫీసరు ఎచ్.కె. జేఠీ సంతకాలు పెట్టిన ముగ్గురిపై చర్య తీసుకోమని హెల్త్ మినిస్ట్రీకి రాశాడు. అయితే హెల్త్ మినిస్ట్రీ ఏ చర్యా తీసుకోలేదు. దేశాయిని మోదీ చాలాకాలంగా వెనకేసుకుని వస్తున్నారని వాళ్లకూ తెలుసు. దేశాయిని వ్యతిరేకించినందుకే మోదీ హర్షవర్ధన్‌ను ఆరోగ్యశాఖనుండి తప్పించివేశాడని వారికి తెలుసు. జేఠీ లేఖకు ఫలితం లేకపోలేదు. మెడికల్ కౌన్సిల్‌కు ప్రస్తుతం అధ్యకక్షురాలిగా వున్న డా|| జయశ్రీబెన్ మెహతా (ఆవిడా గుజరాత్ నుండే వచ్చారు, దేశాయికి అనుచరురాలు) జేఠీనే కౌన్సిల్ నుండి బదిలీ చేసేసింది.
పంజాబ్ కాలేజీ కేసులో దేశాయిని పట్టిచ్చిన డా|| కుణాల్ సాహా దృష్టికి యిది వచ్చింది. అతను అమెరికాలో వుండేవాడు. అతని భార్య కలకత్తాలోని ఒక ఆసుపత్రిలో సౌకర్యాల లేమి వలన చనిపోయింది. దానిపై కేసు వేసి 15 ఏళ్లు పోట్లాడి రూ. 5.60 కోట్ల నష్టపరిహారం పొందాడు. సౌకర్యాలు లేని యీ ఆసుపత్రికి అనుమతి యిస్తున్న ఆ మాయదారి కౌన్సిల్ ఏది అని వెతకడంతో దేశాయి వంటి వ్యక్తుల గురించి తెలిసింది. ఫిర్యాదు చేసి కౌన్సిల్ అవినీతిని బట్టబయలు చేశాడు. వరల్డ్ మెడికల్ అసోసియేషన్ అధ్యకక్షుడు డా|| జేవియర్ దృష్టికి యిదంతా తెచ్చాడు. సుప్రీం కోర్టులో పిల్ పడేశాడు. మెడికల్ కౌన్సిల్, మెడికల్ అసోసియేషన్ ఎన్నికలలో రిగ్గింగ్ చేసి దేశాయి తన అనుచరులను గెలిపించుకున్నాడని, అందుకే వారు యిలా వ్యవహరిస్తున్నారనీ కూడా ఆరోపించాడు. సుప్రీం కోర్టు హెల్త్ మినిస్ట్రీకి, మెడికల్ కౌన్సిల్‌కు నోటీసులు యిచ్చి సిబిఐ చేత విచారణ జరిపించమంది. ఆరోగ్యశాఖా మంత్రి కూడా యీ విషయంపై సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. లేటెస్టు న్యూస్ ఏమిటంటే అమిత్ షా కుమారుడి పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో కేతన్ దేశాయి కూడా వున్నారు!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)