ఆప్ సాధించిన విజయానికి అందరూ హర్షం తెలుపుతూనే 'ఇల్లు అలకంగానే పండగ కాదు' అని గుర్తు చేస్తున్నారు. అరవింద్ అతని అనుచరులు గతంలో ఉన్మాదుల్లా ప్రవర్తించాడు. తాము న్యాయంగా వున్నాం కాబట్టి, తమ ఉద్దేశాలు మంచివి కాబట్టి ఏ రాజ్యాంగానికీ, ఏ నియమానికీ కట్టుబడనక్కర లేదన్న రీతిలో ప్రవర్తించి అభాసుపాలయ్యారు. కాంగ్రెసు, బిజెపి యిద్దరూ దొంగలే అనే చూపించే ఆతృతతో అరవింద్ తన సింహాసనానికి తానే నిప్పు పెట్టుకున్నాడు. దానివలన చాలా సింపతీ వచ్చిందని భ్రమపడి పార్లమెంటు ఎన్నికల నాటికి మరిన్ని గంతులు వేసింది ఆప్. ఢిల్లీ లాటి చిన్న రాష్ట్రంలోనే కుదురుకోలేక పోయినవాళ్లు దేశమంతా పోటీ చేయడమేమిటి? పైగా అరవింద్ ఢిల్లీవాసి, అక్కడి సమస్యలు తెలిసినవాడు. షీలా దీక్షిత్‌పై కామన్వెల్త్ క్రీడల అవినీతి ముసురుకుంది కాబట్టి ఆమెపై గెలవగలిగాడు. దేశమంతా మోదీనామ జపం చేస్తూంటే వారణాశి వెళ్లి అతనితో తలపడడమేమిటి? ఘోరపరాజయం తర్వాత ఆప్‌కు తిక్క కుదిరింది. అందుకే యీసారి ఢిల్లీ వాసులు మళ్లీ ఓ ఛాన్సు యిచ్చారు. దీన్ని జాగ్రత్తగా యితర ప్రాంతాలకు నిలుపుకుని విస్తరిస్తారో, తాగలేక మళ్లీ ఒలకబోసుకుంటారో చూడాలి. గతంలో తమంతట తామే యింపాజిబుల్ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ పెట్టుకుని భంగపడ్డారు.
ఇప్పుడు యోగేంద్ర యాదవ్ 'ప్రజలకు కావలసినది ఇమ్మీడియేట్ డెలివరీ కాదు, ష్యూర్ డెలివరీ అని గ్రహించాం' అంటున్నాడు. నిజానికి సాధారణ ప్రజలు చాలా ఓర్పు కలవారు. ప్రాక్టికల్‌గా, కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తారు. చెప్పినదానిలో కొంత చేసినా సంతోషిస్తారు. కొత్త వాగ్దానాలు వద్దులే, చెప్పినవి కాస్త చేసి చూపించు అంటారు.
ఆప్ ఎన్నికలలో చేసిన వాగ్దానాలు అన్నీ యిన్నీ కావు. వాటికి నిధులు కావాలి. బాబు వంటి మిత్రులకే చేయి విదల్చని మోదీ తనకు పుట్టెడు అవమానాన్ని తెచ్చిపెట్టి రోజూ కళ్లెదుటే కనబడి గుర్తు చేస్తూండే అరవింద్‌కు యిస్తాడా? ఇక అరవింద్‌కు గతేముంది? కేంద్రాన్ని తిడుతూ కూర్చోవడం తప్ప! రోడ్ల మీద నిరసనలు చేస్తే జనాలు చీపుళ్లతో తుడిచేస్తారు. రాజకీయ చాకచక్యం ప్రదర్శించి పనులు జరుపుకోవాలి. ఏ మాత్రం లౌక్యం ప్రదర్శించినా 'ఇతనివీ సాంప్రదాయక రాజకీయాలే' అంటూ మీడియా, ప్రతిపక్ష పార్టీలు యాగీ చేస్తాయి. మోదీని ఎదిరించడానికి యితర ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చాయి కానీ, తమ రాష్ట్రానికి వచ్చి తమ అవినీతి గురించి ప్రశ్నించడం ఆరంభిస్తే వారు సహిస్తారా? ఆప్ గమనం ఎలా వుంటుందో గమనించాల్సిన విషయమే.
ఆప్ వేయబోయే మలి అడుగు పంజాబ్‌లో. దేశమంతా మోదీ వేవ్ వీస్తున్న సమయంలోనే ఆప్ పంజాబ్‌లో మూడు పార్లమెంటు సీట్లు గెలుచుకుంది అక్కడ. పంజాబ్‌ను పాలిస్తున్న అకాలీదళ్ పార్టీ అవినీతి పూర్తిగా బట్టబయలైంది. దానితో అంటకాగిన బిజెపికి కూడా ఆ మసి అంటింది. కాంగ్రెసు అవినీతి గురించి ముందే తెలుసు. అందువలన ఆప్‌కు అక్కడ ఛాన్సుంది. ఆప్ బలమంతా నగరప్రాంతంలో కనబడుతూ వచ్చింది. సోషల్ మీడియాను అది పూర్తిగా వుపయోగించుకుని, యువతను ప్రేరేపించింది. పంజాబ్‌లో రైతులను, గ్రామీణ ప్రాంతాలనూ ఆకట్టుకోగలిగిన విధానాలు ఏర్పరచుకుంటేనే దానికి అక్కడ విజయం సిద్ధిస్తుంది. ప్రస్తుతం భారత్‌ను శాసిస్తున్నది కార్పోరేట్ శక్తులు, వాళ్ల చేతిలో వున్న మీడియా. కార్పోరేట్ శక్తులకు అరవింద్ మిత్రుడేమీ కాదు. అతను అంబానీలను కూడా విమర్శిస్తున్నాడు. కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాడు. ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ బలాన్ని తక్కువ చేసే చూపే ప్రయత్నమే చేసింది మీడియా. మొదట్లో అతనికి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చినా ఎన్నికలకు 3, 4 రోజుల ముందు బిజెపిదే గెలుపు అంటూ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ వద్దకు వచ్చేసరికి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చేసినా ప్రయోజనం లేదని తెలుసు.
అవినీతి అన్ని రాష్ట్రాలలో వుంది. ఆప్ అన్ని ప్రాంతాల్లో ఓపిగ్గా యూనిట్లు పెట్టుకుంటూ వెళుతూ మునిసిపల్ ఎన్నికలతో మొదలుపెట్టి పోటీ చేస్తూ పోతే భవిష్యత్తు వుండవచ్చు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకుంటే అన్ని చోట్లా, అన్ని వేళలా అది కుదరదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)