Advertisement

Advertisement


Home > Articles - Chanakya

కుడి ఎడమల వృధా..వృధా

కుడి ఎడమల వృధా..వృధా

నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు..ఈ సమాజ జీవచ్ఛవాన్ని..అని తీవ్రంగా ప్రశ్నిస్తాడు కవి సిరివెన్నెల. రాను రాను సమాజం నిర్వీర్యం అయిపోతోంది.రాజకీయనాయకుల అధికార దాహార్తి తీర్చుకునే మార్గంలో పన్నుతున్న పన్నాగాల పుణ్యమా అని, ఏకంగా వున్న సమాజంలో కులాలు, మతాలు, రేషన్ కార్డులు, రిజర్వేషన్లు ఇలా అనేకానేక గోడలు వెలిసాయి. వర్గాలుగా,ముఠాలుగా,తరగతులుగా జనం చీలిపోయారు. ఇప్పుడు జనంలో ఐకమత్యం రమ్మన్నా రాదు. పొరపాటున వచ్చినా చీల్చేయడం పెద్ద కష్టం కాదు. సమాజ ఐకమత్యం ఇప్పుడు పేకమేడ చందమైంది. ఏ ఒక్కముక్క ను లాగేసినా, మేక కూలిపోతుంది.

అమ్మకమే..అభివృద్ధా అంటూ గతవారం గ్రేట్ ఆంధ్ర కవరుకథనం అందించినపుడు పాఠకులు స్పందించిన తీరు అమోఘం.ముఖ్యంగా నిత్యం కష్టపడుతూ, నెల జీతం సంపాదిస్తూ, లెక్కలు దాచడానికి ఏ మాత్రం అవకాశం లేని ఉద్యోగవర్గం తాము కడుతున్న పన్నులు ఎలా వృధా అవుతున్నాయన్నదానిపై చాలా ఆవేదన వ్యక్తం చేసారు. తాము సంపాదించిన ఆదాయం పైసా పైసా పాన్ కార్డు రూపంలో లెక్కించి, ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటిని అభివృద్ధి కోసం కాకుండా, అయితే తమ పాలనా ఖర్చులకు, లేదంటే ఓట్ల సాధన కోసం వినియోగిస్తున్న తీరుపట్ల అనేకానేక మంది ఆవేదన వ్యక్తం చేసారు. ఇది జరిగి వారం గడవకుండానే ఆంధ్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తెల్లకార్డుల వారికి సంక్రాంతి పండుగ చేసుకునేందుకు గాను, కొన్ని నిత్యావసర సరుకులను ఫ్రీగా ఇవ్వాలని. ఇది పండుగ కానుక అని ప్రభుత్వం పేర్కొంది. 

సంక్రాంతి పండుగ. తెలుగు రాష్ట్రంలో రైతు లేదా రైతు కూలీ లేదా వ్యవసాయంపై ఆధార పడి బతికే ఏ ఇతర వృత్తులకు చెందిన వారికైనా సంబరాల పండుగ. రావమ్మా..మహా లక్ష్మీ రావమ్మా...అని సంక్రాంతి లక్ష్మిని పిలిచే కాలం. ఇప్పుడు సరే, భూమి సారం బట్టి రెండు పంటలు, మూడు పంటలు పండుతున్నాయి..కానీ ఒక్క పంట వుండే కాలంలో డిసెంబర్ లో కోతలు, ఆపై నూర్పులు జరిగి, పండగ ముందు ధాన్యం ఇంటికి చేరేవి. కళ్లాల్లోనే సకల వృత్తులవారికీ ధాన్యం కొలిచేవారు. రైతులు, రైతు కూలీల దగ్గర డబ్బులు కళకళ లాడతాయి. దాంతో ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు, ఇంటికి రంగులు..ఓహ్..ఒకటేమిటి పండగ శోభ అద్భుతంగా వుంటుంది. మరే పండుగకైనా గ్రామాల ప్రజల దగ్గర డబ్బు వుంటుందో, వుండదో చెప్పలేము కానీ, సంక్రాంతి మాత్రం అలాంటిది కాదు. కచ్చితంగా డబ్బులు వుండే పండుగ.

మరి అలాంటి పండుగకు కూడా, జనం చాలా హీన స్థితిలో వున్నారని, వారు పండుగ చేసుకునే పరిస్థితిలో వున్నారని, అందుకే వారికి ఫ్రీగా సరుకులు ఇస్తున్నామని చెప్పి, ఉచిత పంపిణీ చేస్తుంటే ఏమనుకోవాలి? అనేకానేక సందేహాలు ఉత్పన్నం కావా?

అంటే రైతు లేదా రైతు కూలీ దగ్గర సంక్రాంతి కూడా పైసలు లేని పరిస్థితి దాపురించిందా?

287 కోట్ల రూపాయిల విలువైన సరుకులు 1.3 కోట్ల మందికి ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సరుకుల్లో నూనె, బెల్లం తదితర వస్తువులు వుంటాయి. సరే ఈ రాష్ట్రంలో 1.3 కోట్ల మంది జనం పండుగ చేసుకోలేని స్థితిలో వున్నారని ప్రభుత్వం భావిస్తోంది అనుకుందాం. మరి పండుగ తరువాత? పండుగ నాడే పరమాన్నం వండుకోలేని స్థితిలో వున్నావారు ఆ తరువాత అన్నం ఎలా వండుకోగలరు? అలాంటి వారిని ఆదుకునేందుకు ఏం చేయాలి? అది కదా ఆలోచించాల్సింది. జనాలను స్వయం స్వావలంబన దిశగా మళ్లించాలి కానీ, ఇలా ఎన్నాళ్లు సహాయాలు చేస్తూ పోతారు? రాష్ట్రాలు స్వయం స్వావలంబన కావాలని కేంద్రం అంటుంది. మున్సిపాల్టీలు, పంచాయతీలు తమంతట తాము బలోపేత కావాలని రాష్ట్రాలు అంటాయి. మరి ప్రజల్ని ఆ విధంగా తయారుచేసే ఆలోచన ఎందుకు చేయవు? సంక్రాంతి సరకుల ఖర్చలు దగ్గర దగ్గర మూడు వందల కోట్లు. 

ఇప్పుడు ఇదే స్కీమును ఇప్పటితో ఆపేస్తారని లేదు. మరో నాలుగు పండుగులకు, అంటే ఉగాది,దసరా, రంజాన్, క్రిస్మస్ లకు కూడా అమలు చేస్తారని వార్తలు వినవస్తున్నాయి. అంటే మొత్తం ఏడాదికి 1500 కోట్లు. ఒక చిన్న తరహా పరిశ్రమకు యాభై కోట్లు ఖర్చు చేయచ్చు అనుకుందాం. 1500 కోట్లతో 30 పరిశ్రమలు స్థాపించవచ్చు. ఒక్కో పరిశ్రమ కనీసం వంద మందికి ఉపాథి కల్పిస్తుంది అనుకుందాం..అంటే మూడు వేల మందికి శాశ్వత ఆదాయం లభిస్తుంది. అంటే వారిపై ఆధారపడిన మరో ముగ్గురికి ఇంత అన్నం దొరకుతుంది. అంటే పదివేల మంది పేదరికం నుంచి బయటపడతారు. ఇలా పదేళ్ల పాటు అమలుచేస్తే, లక్ష మంది ఆనందంగా బతికే పరిస్థితి వుంటుంది. పైగా కొంచెం కొంచెంగా ప్రభుత్వం ఆ డబ్బను రికవరీ చేసుకోవచ్చు. పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. పరిశ్రమల ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంకా ..ఇంకా..ఇంకా..అనేకానేక లాభాలు. 

మరి ఇలా ఆలోచించకుండా, కేవలం ఫ్రీగా పంచేస్తామనే ఆలోచనలే రాజకీయ వేత్తలు ఎందుకు చేస్తారు? జనం దృష్టిలో మంచిగా వుండాలి. జనం కూడా తమకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారన్నది అనవసరం. ఇచ్చారా లేదా? అంతే. ఇదెవరి డబ్బు. కష్టపడి ఉద్యోగాలు చేసి, పరిశ్రమలు నడిపి, ఆదాయం సంపాదించి, పైసా పైసా లెక్క చెప్పి, ఏటేటా పన్నులు కడుతున్నవారి డబ్బు? ఈ డబ్బును ఇలా వృధా చేయడానికి రాజకీయ నాయకులకు ఎవరిచ్చారు హక్కు? ఎవ్వరూ అడగరేం?

రాజకీయ నాయకులు అడగరు..పార్టీలు నోరు మెదపవు. ఎందుకంటే అడిగిన నాయకుడిని, అడిగిన పార్టీని జనం మందు దోషిగా నిలబెడతారు. మీకు ఫ్రీగా సరుకులు ఇద్దామనుకుంటే వీళ్లు వద్దంటున్నారు అని టముకేస్తారు? ఫ్రీకరెంట్ ఇస్తామంటే, వీలు కాదుఅన్న బాబు దోషి అయ్యారు..రుణాలు  ఫ్రీ గా తీర్చేస్తామంటే, వద్దన్న జగన్ దోషి అయ్యారు ప్రజల దృష్టిలో. మరింక ఈ రెండు అనుభవాలు చూసాక ఇంకే పార్టీ అయినా మాట్లాడుతుందా? మరే నాయకుడైనా పెదవి విప్పుతాడా? 

మోడీ ఓ పక్క వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్లినపుడల్లా, అభివృద్ధి కావాలా? వద్దా మీరే తేల్చుకోండి అంటున్నారు? మరి ఆలా ఫ్రీగా సరుకులు ఇవ్వడమే అభివృద్ధి అనుకోవాలా? ఇలా ప్రజా ధనం దుర్వినియోగం చేయడాన్ని ఎప్పటికైనా కట్టడి చేయాల్సి వుంది. ఇప్పటికే ఉచిత ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కుట్టు మిషన్లు ఇలా అనేకానేక వెర్రితలలు వేసింది. ఇవన్నీ సద్వినియోగం అవుతున్నాయని అనుకుంటే అంతకన్నా భ్రమ మరోటి వుండదు. కేవలం రాజకీయ పార్టీలు తమ చేతిలోంచి డబ్బులను విత్తనాలుగా జల్లి, ఓట్ల పంట పండించుకునేందుకు బదులు, ప్రజాధనాన్ని విచ్చలివిడిగా వాడుకునేందుకు ఇదో మార్గంగా మారింది. 

పన్నుకట్టే జనం నినదించేవరకు ఈ ఫ్రీ స్కీములు వర్థిల్లుతూనే వుంటాయి. 

-కౌటిల్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?