Advertisement

Advertisement


Home > Articles - Chanakya

మసకబారుతున్న కేసిఆర్ ప్రతిష్ట

మసకబారుతున్న కేసిఆర్ ప్రతిష్ట

పైకి ఎవరూ మాట్లాడడం లేదు కానీ, తెలంగాణ వాదుల బుర్రలుగిర్రున తిరుగుతున్నాయి. తాము ఏరి కోరి తెచ్చిపెట్టకున్న నాయకుడు చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే వాళ్లకు మతిపోతోంది. ఉద్యమ కాలంలో చెప్పిందేమిటి? ఎన్నికల ముందు మాట్లాడిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఆలోచిస్తేనే తల వంపుగా వుందని  పైకి అనలేక, లోపల వుంచుకోలేక సతమతమవుతున్నారు. 

తెలంగాణ వెనుకబాటుతనం పోవాలని కదా, ఉద్యమం నడిపి, స్వంత రాష్ర్టం సాధించుకున్నది. కానీ కేసీఆర్ ఆ దిశగా వెళ్లకుండా తన అధికారం, తన పార్టీని పదిలం చేసుకోవాలని. ఆయన ప్రజలకు నమ్మబలికిన విషయాలు ఎన్నో వున్నాయి. ప్రతి ఇంటికి ఉద్యోగాలు వస్తాయని,  వెనకబడిన ప్రాంతాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తాయని, ఇక వెనుకబాటుతనమే వుండదని, ప్రతి కుటుంబం రెండు బెడ్ రూమ్‌ల ఇళ్లలో వుండొచ్చని, ఇలా చాలా.

కానీ తీరా అధికారం అందాక ఆయన ముందు చేసిన పని తాను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం. దానికి ఎవరూ ఏమీ అనలేదు. విపక్షాలు ఏదో గతంలో ఇచ్చిన ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి అన్నదాన్ని గుర్తుచేసి వుంటే వుండొచ్చు కానీ,  అంతకు మించి ఆ విషయంలో ఎవరూ ఏమీ అనలేదు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ తన కుమారుడిని, మేనల్లుడిని మంత్రులను చేసారు. కుమార్తెను ఎంపీగా పంపారు. అధికారం ముందు ఎందుకొచ్చిన రగడ అని ఇష్టంలేని వారు కూడా లోలోపల సణుక్కుని ఊరుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన జెఎసి, ఉస్మానియా విద్యార్థులు ఇప్పుడు తెరాసకు దూరమవుతున్నారు. ఏ ఉస్మానియలో అయితే ఇతరుల దిష్టిబొమ్మలు దగ్దం అయ్యాయో అక్కడ ఇప్పుడు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేస్తున్నారు.

సరే, ఆ సంగతి అలా వుంచితే, తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి కాదు, ఇక్కడ ప్రగతి చూసి, తెలంగాణ మొత్తం అభివృద్ది చెందిపోయింది అంటే సరికాదన్నది మొదట్నించీ తెలంగాణ వాదుల వాదన. అది కూడా నిజమే, అదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి మూల ప్రాంతాలకు ప్రగతి ఫలాలు సోకలేదు. మిగిలిన జిల్లాల్లో కూడా పెద్ద పట్టణాలు ఓకె కానీ, పల్లెలు ఇంకా ప్రగతికి దూరంగానే వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎజెండా ఏ దిశగా వుండాలి. ఈ మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా. కానీ ఆయన చేస్తున్నది వేరు. మరోసారి తన దృష్టిని అంతా హైదరాబాద్ పైనే కేంద్రీకరించారు. హైదరాబాద్‌కు ఐటి, వివిధ కన్వెన్షన్ సెంటర్లు, ఫిల్మ్ సిటీ, ఇంకా ఇంకా,. పరిశ్రమలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఇబ్బడి ముబ్బడిగావున్నాయి. 

అందువల్ల వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలి. అందుకోసం వీలయినన్ని ఎక్కువ రాయతీలు, వరాలు ప్రకటించాలి. ఒకసారి అదిలాబాద్‌లోనో, మహబూబ్‌నగర్‌లోనో పరిశ్రమలు వస్తే, ఇటు వికేంద్రీకరణ సాధ్యమవుతుంది. అక్కడ ప్రగతీ సాధ్యమవుతుంది. కానీ మిగిలిన పాలకుల్లాగే కేసీఆర్ కూడా హైదరాబాద్ పైనే దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్ ఎంత అభివృద్ది చేద్దామా అనే చూస్తున్నారు. హైదరాబాద్‌ను ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పని లేదు. అది ఆల్ రెడీ ట్రాక్ మీదకు వెళ్లిపోయింది. వద్దన్నా ముందుకే సాగుతుంది. అందులో అనుమానం లేదు. కాస్త ముందు వెనుక అంతే.

ఇలా హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం అన్నది మరో విధంగా కూడా కేసీఆర్‌ను పక్కదారి పట్టిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కేసీఆర్ పట్టుదల. అదే విధంగా తన పార్టీకి కానీ, తనకు కానీ శాసనసభలో తిరుగు వుండకూడదన్నది మరో సమస్య. అందుకోసం వివిధ పార్టీల నుంచి జనాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. సరే రాజకీయంగా ఇది అవసరమే అనుకుందాం. కానీ ఉద్యమకాలంలో అండగా నిలిచినవారు, తెలంగాణలో తమ ప్రభుత్వం వస్తే, తమకు అధికారం లభిస్తుందనుకున్నవారిని కాదని, ఏ పార్టీని, ఏ పార్టీ జనాలను అయితే తెలంగాణ వ్యతిరేకులుగా, ఆంధ్ర పార్టీ జనాలుగా ముద్రవేసారో, వాళ్లని అక్కున చేర్చుకోవడం అంటే ఏమనాలి? వారికి అధికారం అందించడం అంటే ఏమనుకోవాలి?

ఉద్యమకాలంలో తనకు దన్నుగా వున్నవారిని కూడా కేసీఆర్ దూరం పెట్టుకుంటున్నారని వార్తలు, గుసగుసలు వున్నాయి. ఉద్యమకాలంలో అండగా నిలబడింది నమస్తే తెలంగాణ. దాంట్లో ప్రధాన వాటాదారు రాజం. ఎన్నికల ముందు కేసీఆర్ తన వాటా వదిలేసుకున్నారని టాక్. కానీ తీరా ఎన్నికయ్యాక అదే కేసీఆర్ దాన్ని మొత్తం తన హస్తాల్లోకి తీసుకున్నారు. రాజం మిన్నకుండిపోవాల్సి వచ్చిందని టాక్. మరి ఇలా దూరమైన వారు మరోసారి ఎలా దగ్గరవుతారు?

హైదరాబాద్ ఆంధ్ర జనాల భవనాలకు వలలు ఏర్పాటు చేసారు ఉద్యమకాలంలో. ఎందుకని, వాటిపై రాళ్లేస్తారని. కేసీఆర్ స్వయంగా అనేకసార్లు హెచ్చరించారు.. ప్రకటించారు.. రామోజీ ఫిలిం సిటీ లాంటి వ్యవహారాలను ఓ చూపు చూస్తామని. కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఏం జరిగింది. ఆయన ఇప్పటికిప్పుడు ఆర్‌ఎఫ్‌సికి ఎందుకు వెళ్లాలి. వెళ్లకపోయినా వచ్చిన నష్టంలేదు. రామోజీతో  మాట్లాడేది వుంటే, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. కానీ అలా కాకుండా వెళ్లి, గంటలు గంటలు గడిపి, ఒంటరిగా సమావేశమై మాట్లాడితే ఉద్యమాలు సాగించిన వారి మనసులు ఏమనుకుంటాయి? ఇప్పుడు ఉద్యమకారులు దేనిపైనా ముందుకు సాగలేరు. ఎందుకంటే వారి ప్రభుత్వమే వారిని కట్టడి చేస్తుంది. మొన్నటికి మొన్న ఉస్మానియాలో జరిగింది అదే.

 కేసీఆర్ అంత అనుభవం వున్న రాజకీయవేత్త ఎందుకిలా తప్పటడుగులు వేస్తున్నారో అర్థం కాదు. రాజకీయ నాయకులకు విశ్వాసాలు వుండవు.. అవసరాలే వుంటాయి. అందువల్ల ఇప్పుడు తన అవసరాల కోసం కేసీఆర్ దగ్గరకు తీస్తుంటే, వారి అవసరాల కోసం వారు వస్తున్నారు. ఇలా వచ్చినవారు వచ్చే ఎన్నికల నాడు కూడాతనతోనే వుంటారనుకుంటే అది భ్రమే. ఆ రోజు ప్రజల నాడి ఎలా వుంటే, గాలి ఎలా వుంటే అటువెళ్తారు తప్ప, ఇటు వుండాలని లేదు. 

కానీ ఉద్యమకాలంలో కేసీఆర్ వెంట వున్నవారు రాజకీయ నాయకులు కాదు. తెలంగాణ పట్ల చిత్త శుద్ధి వున్నవారు. అలాంటివారిని వెంటేసుకుని, అయిదేళ్లు రాజకీయం నడిపితే, దాని తీరు వేరుగా వుంటుంది. . పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహించవచ్చు కానీ, మరీ మంత్రిపదవులు కూడా కట్టబెట్టడం అంటే ఏ తరహా రాజకీయాలు అనుకోవాలి? కేవలం అవకశా వాద రాజకీయాలు అనో అనాల్సి వుంటుంది. ఇప్పుడు ేకేసీఆర్ రాజకీయ రూపం జనాలకు తెలిసివస్తోంది. నిన్నటి దాకా ఆయన ఉద్యమరూపం చూసి, అభిమానించిన తెలంగాణ జనాలు, ఈ రాజకీయ రూపాన్ని చూసి, జీర్ణించుకోలేకపోతున్నారు.

కేవలం ఒక్క హైదరాబాద్ మున్సిపల్ కార్పేషన్ ఎన్నికల కోసం కేసీఆర్ ఇంత కిందకు దిగాల్సిన పనిలేదు. ఆంధ్ర జనాల్లో కీలకమైన కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇచ్చి, అదే సామాజిక వర్గానికి చెందిన రామోజీరావు దగ్గరకు తానే వెళ్లి, బుద్దిమంతుడైన బాలుడిలా చేతులు కట్టుకుని నిల్చోవాల్సినంత అగత్యం లేదు. హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణను నిజంగా బంగరు తెలంగాణ చేసిన నాడు కేసీఆర్ ఎవ్వరినీ బతిమాలక్కర్లేదు.. ఎవర్నీ గులాబీ కండువా కప్పి ఆహ్వానించక్కర్లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు నిజమైన ప్రజా సేనానిగా అవతరిస్తారు. అలా చేయాలంటే, కుటుంబ వ్యవహారాలు, బంధుప్రీతి, కులప్రీతి, ఇలాంటివి అన్నీ పక్కన పెట్టి. అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు పోవాలి. అది జరిగేనా అంటే అనుమానమే. ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు బేరీజు వేసుకుంటే అలాంటి ఆశలు కలగడం లేదు.

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?