కేంద్ర రైల్వే మంత్రిగా వున్న లలిత్ నారాయణ్ మిశ్రా అనే బిహారు నాయకుడు 1975 జనవరిలో బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో బాంబుదాడికి గురయ్యాడు. అతనితో పాటు అతని తమ్ముడు జగన్నాథ్ మిశ్రా కూడా. ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. పొట్ట ఛిద్రమైన లలిత్ మర్నాడు మరణించాడు, కాళ్లు మాత్రమే గాయపడిన జగన్నాథ్ బతికాడు, వెంటనే బిహార్ ముఖ్యమంత్రి అయ్యాడు. దరిమిలా అన్నగారి పేర యూనివర్శిటీలు, కాలేజీలు పెట్టాడు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మిశ్రా హత్యపై చాలా ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక మహాత్మా గాంధీ తర్వాత జరిగిన యీ రాజకీయ హత్య వెనుక అనేక కారణాలున్నాయన్నారు. జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో జరుగుతున్న సంపూర్ణ క్రాంతి ఉద్యమం వలన బిహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి యిది నిదర్శనమని, సిఐఏ (అమెరికన్ గూఢచారి సంస్థ) సహాయంతో భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడానికే ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయని చెప్పడానికి వేరే సాక్ష్యం అక్కరలేదని వాదించారు.
మరో ఆరు నెలల తర్వాత అత్యవసర పరిస్థితి విధించడానికి దీన్ని ఒక కారణంగా వాడుకున్నారు. మిశ్రా హత్యకు కుట్ర పన్నినది సిఐఏ కనుసన్నల్లో నడిచే ఆనంద్ మార్గ్ సంస్థ అనే మతవాద, తీవ్ర రైటిస్టు సంస్థ అని పోలీసులు అనుమానించారు. ఆ విధంగానే కేసు పెట్టారు. ఆనంద్ మార్గ్‌కు యీ హత్యతో సంబంధం లేదని, 1974లో దేశవ్యాప్తంగా జార్జి ఫెర్నాండెజ్ నాయకత్వంలో నడిచిన రైల్వే సమ్మెను కఠినంగా అణచివేసిన రైల్వేమంత్రిగా మిశ్రాపై రైల్వే ఉద్యోగులు కక్ష పెంచుకుని చంపించివేశారని కొందరు అన్నారు. ఫిరోజ్ గాంధీకి ఒకప్పటి స్నేహితుడిగా ఇందిర వద్దకు చేరిన మిశ్రా కాంగ్రెసులోని పాత నాయకుల (సిండికేట్ అనేవారు)తో పోరాడడానికి ఇందిర పక్షాన నిలిచాడు. 1969లో కాంగ్రెసు చీలిపోయాక గతంలో అతుల్య ఘోష్, ఎస్ కె పాటిల్‌ల తరహాలో పార్టీకి నిధులు సమకూర్చే బాధ్యత తలకెత్తుకున్నాడు. ఇందిర అతనికి డిఫెన్సు, ప్రొడక్షన్, ట్రేడ్ వంటి కల్పవృక్షాల శాఖలను కట్టబెట్టింది. ట్రేడ్ మంత్రిగా వుండగానే 'లైసెన్సు రాజ్' ప్రవేశపెట్టి పరిశ్రమ పెట్టడానికి లైసెన్సు కావాలంటే కాంగ్రెసు పార్టీకి నిధులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కణ్నుంచి రైల్వే మంత్రిగా చేశారు. కాలక్రమంలో చాలా భాగం నిధులు తనవద్దే అట్టే పెట్టేసుకున్నాడనీ, దానితో కోపగించిన ఇందిరే అతన్ని యశ్‌పాల్ కపూర్ ద్వారా చంపించి వేసిందనీ కూడా పుకార్లు వచ్చాయి.
ఇలాటి అనుమానాలు రావడానికి తగినంత కారణం కూడా వుంది. రైల్వే సమ్మె అణిచివేసిన తర్వాత తనకు ప్రాణాపాయం పెరిగిందని మిశ్రా అనేకమంది దగ్గర అన్నాడు. అయినా అతని సెక్యూరిటీ పెంచలేదు. బాంబు దాడి జరిగాక చికిత్స కోసం సమస్తిపూర్ నుండి 50 కి.మీ. దూరంలో వున్న దుర్భంగాకు కాకుండా 100 కి.మీ.ల దూరంలో పట్నా వద్ద వున్న దానాపూర్ వద్దకు రైల్వే కోచ్‌లో తీసుకెళ్లారు. ఆ ప్రయాణానికి రైల్వే వాళ్లు 8 గంటలు తీసుకున్నారు – లోపల సాక్షాత్తూ రైల్వే మంత్రే వున్నా! ఆసుపత్రిలో కూడా చికిత్స ఆలస్యంగా ప్రారంభమైంది. ఎవరో కావాలనే యిలా చేయించారని అందరూ నమ్మారు. విచారణ సవ్యంగా జరిగితే నిజానిజాలు బయటకు వచ్చేవేమో! కానీ కేసు అస్తవ్యస్తంగా నడిచింది.
జనవరి 2 న దాడి జరిగితే బిహార్ పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. నాలుగు రోజులు తిరక్కుండా ఎవరూ కోరకుండా కేంద్రం ఆధిపత్యం లోని సిబిఐ కేసును తన చేతిలోకి తీసేసుకుంది. ఇందిర అధికారంలో వున్నంతకాలం కేసు ఫైల్ కాలేదు. జనతా పార్టీ కుప్పకూలిన తర్వాత 1979 నవంబరు 1న చార్జిషీటు ఫైల్ చేసింది. 1980 కల్లా ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయకుండా విచారణను ఢిల్లీలో నిర్వహించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. నిందితులు విచారణను అడుగడుగునా సవాలు చేస్తూ పోవడంతో కేసు నత్తనడక నడిచింది. 22 మంది జజ్‌లు మారారు. 200 మంది సాకక్షులను విచారించారు. చివరకు 2012లో 'కేసు మొదలుపెట్టి మూడున్నర థాబ్దాలు అయింది కాబట్టి కేసు మూసేయాల'ని నిందితులు కోరడంతో సుప్రీం కోర్టు 'దినవారీ విచారణ నిర్వహించి కేసును ఒక కొలిక్కి తెండి' అని ఆదేశించడంతో యింకో రెండేళ్ల తర్వాత 2014 డిసెంబరు 8 న న్యూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు 6000 పేజీల తీర్పు వెలువరిస్తూ మిశ్రా హత్య కేసులో రంజన్ ద్వివేదిని, సంతోషానంద అవధూత, సుదేవానంద అవధూత, గోపాల్‌జీ అనే ఆనందమార్గీయులను దోషులుగా నిర్ణయించింది. ఏ శిక్ష ఏం వేస్తారో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అసలు ఆనంద్ మార్గ్ అంటే ఏమిటి? అనే ప్రశ్న రావడం సహజం.
ఆనంద్ మార్గ్ అనే ధార్మిక, సామాజిక సంస్థను ప్రభాత్ రంజన్ సర్కార్ అనే అతను ఆనందమూర్తి అనే పేరుతో బిహార్‌లో 1955 ప్రారంభించాడు. దీని అనుయాయులు కాషాయం ధరించేవారు. స్కూళ్లు అవీ తెరిచి సామాన్యులను ఆకర్షించేవారు. కమ్యూనిజం ప్రబలుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టి అక్కడి పేదలను ఆకట్టుకోవడంతో సిఐఏ నిధులతో యిది నడుస్తోందన్న అనుమానం బలపడింది. ఎందుకంటే వారికి నిధులు ఎక్కణ్నుంచో ధారాళంగా వస్తూండేవి. 1960ల కల్లా అది బాగా విస్తరించేసి యితర దేశాలకు కూడా వ్యాపించింది. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆనంద మార్గీయులు, కమ్యూనిస్టులు ముఖాముఖీ తలపడేవారు. ఆనంద మార్గీయులు పూజలో వామపంథా (మాంసం, మద్యం, మగువ వంటి పంచ మకారాలతో) అవలంబిస్తారని, చిన్నపిల్లలను బలి యిచ్చి కపాలాలను ధరిస్తారని నమ్మకం వుండేది. చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నారన్న అనుమానంతో కలకత్తాలోని టాలీగంజ్‌లో 1982లో 16 మంది ఆనంద మార్గీయులను కొంతమంది పౌరులు పట్టపగలు సజీవదహనం చేశారంటే పరిస్థితి వూహించుకోండి. దానిపై ఓ పట్టాన విచారణ సాగలేదు.
2012లో జ్యుడిషియల్ కమిషన్ వేసినట్టున్నారు. కమ్యూనిస్టులపై నింద మోపడానికే కాంగ్రెసు వారు యిది చేశారని అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఆరోపించారు. ఏది ఏమైనా ఆనంద్ మార్గ్ 1970లలో కమ్యూనిస్టు వ్యతిరేకతతోనే పనిచేసిందన్నది నిర్వివాదాంశం. కమ్యూనిస్టులను అణచడానికి ఇందిర వారిని ఉపయోగించుకుందని పరిశీలకులు అంటారు. సంఘవ్యతిరేక కలాపాలు చేస్తున్నారన్న ఆరోపణపై ఆనందమూర్తి అరెస్టు అయ్యాడు. బెయిల్ కోసం అప్లయి చేస్తే చీఫ్ జస్టిస్ ఎ.ఎన్.రాయ్ యివ్వలేదు. ఆయనపై హత్యాప్రయత్నం జరిగింది. దానిలో ఆనందమార్గీయులు అరెస్టయ్యారు. వారిలో యిద్దరినీ మిశ్రా హత్య కేసులో యిరికించారు పోలీసులు. ఇప్పుడు వారంతా 70-80 ఏళ్ల వయసులో వున్నారు. ఇది జిల్లా జజ్ తీర్పు. దీని తర్వాత హైకోర్టు అంటారు, సుప్రీం కోర్టు అంటారు. అప్పటికి యీ నిందితులు మేం ముసలివాళ్లం దయ చూడండి అంటారు. మొత్తం మీద మిశ్రా హత్యకు అసలు కారణం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్