Advertisement

Advertisement


Home > Articles - Chanakya

మూడు బడులు - ఒక్కటే పాఠం..

మూడు బడులు - ఒక్కటే పాఠం..

కాలం కుదురుగా వుండదు..పరుగెడుతూనే వుంటుంది...ఆ పరుగు చివరకి కొలమానమై కూర్చుంటుంది...కాలం మరుపు తెస్తుంది..ఆదమరిస్తే మచ్చా తెస్తుంది.. మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడుకు ఏ తీరుగా వుందో చెప్పేయచ్చు..పువ్వు పూర్తిగా  విచ్చుకోనక్కరలేదు..వాసన ఎలా వుండబోతోందో తెలియడానికి. ఆరు నెలల పాలన...అటు కేంద్రంలో, ఇటు రెండుగా మారిన తెలుగు రాష్ట్రాల్లో..అన్నింటా మార్పుకే ఓటేసారు జనం. 

కేంద్రంలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి, కోటి కాంక్షలతో మోడీని భుజాన ఎత్తుకున్నారు. చిరకాలపు అసమానత తొలగిపోతుందన్న ఆశలతో కేసిఆర్ కు అధికారం అందించారు తెలంగాణ జనాలు. విడిపోయి గాయపడిన ఆంధ్రసీమకు శస్త్రచికిత్స చేసి, పునరుజ్జీవితం ఇస్తాడని అనుభవం పండిన చంద్రబాబును కోరి తెచ్చుకున్నారు ఆంధ్రసీమ ప్రజలు.

ఇవన్నీ జరిగి ఆరునెలలు పూర్తయిపోయింది. పయనం ఏ దిశగా వెళ్తోందో తెలిసిన తరువాత గమ్యం కాస్త ఊహకు అందుతుంది. అందువల్ల ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, కేసిఆర్ ల పనితీరు ఎలా వుంటుందన్నది ఓ అంచనాకు అందనంత జటిలమైన వ్యవహారమైతే కాదు. వారు ఏం చేస్తారన్నది ముందుగానే ఓటర్లుకు చెప్పుకొచ్చారు. ఎవరికి వారు ఓటర్ల కళ్ల ముందు అందమైన హరివిల్లులను యధాశక్తి సాక్షాత్కరింపచేసారు. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అవి అలాగే వున్నాయా..వాతావరణం మారి కరిగిపోతున్నాయా అని తెలుసుకోవడానికి మరో ఆరునెలలో, అర్ధ  దశాబ్ధమో ఆగనక్కర లేదు. ఎందుకంటే రాజకీయనాయకులు..తమ హామీలకు ముందు సామాన్యంగా వాడే ప్రీఫిక్స్ పదం ఒకటి వుంటుంది...’మేం..అధికారంలోకి వస్తే..’...లేదా ‘మేం అధికారంలోకి రాగానే’...అని ప్రారంభిస్తారు. అధికారంలోకి రాగానే చేస్తాం అన్నవారు..ఆర్నెల్లకు అడిగేసరికి, ‘ఏమంత తొందర..కాసింత ఆగరా..’ అంటూ వాయిదారాగం ఎత్తుకుంటారు. వారు ఏ రాగాలు ఆలపిస్తేనేం, జనాలకు ఏం అనిపిస్తోంది అన్నది కాస్త చూద్దాం.

మోడీ మహత్తు

దేశం మొత్తం మీద ఇప్పుడ మోడీ మహత్తు కానవస్తోంది. ఇప్పుడేమిటి, మొన్నటి ఎన్నకలకు కాస్తంత ముందుగానే తన మేనేజ్మెంట్ చాతుర్యంతో మోడీ దేశం మొత్తం మీద తన పేరు పాకిపోయేలా చేసుకోగలిగారు. తన వెనుకున్న తెలివైన అనునాయులు కావచ్చు, వారి తరపున పనిచేసే మేథావులు కావచ్చు..అందరూ కలిసి మోడీ అనే అద్భుతాన్ని జనం కళ్ల ముందు వుంచారు. ఇప్పటికే అదే కొనసాగుతోంది. 25మిలియన్ల మంది మోడీని ఫేస్ బుక్ లో నిత్యం గమనిస్తున్నరు. ఎనిమిది మిలియన్ల మంది ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. మోడీ ఏరి కోరి నియమించుకున్న అధికారులు ఈ రెండు అక్కౌంట్లను నిర్వహిస్తారు. తరచు ఆయన చేసే ట్వీట్ లు, ఫేస్ బుక్ పోస్టింగ్ లు క్షణాల్లో దేశం నలుమూలలా పాకిపోతాయి.

నిజానికి మోడీ బ్రాండ్ ఇమేజ్ ఈ ఆర్నెల్లకు ముందు విదేశాల్లో ఎంత వుందో అది ఇఫ్పుడు ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఆ దిశగా మోడీ తన కార్యక్రమాలను, తన వ్యవహారాలను డిజైన్ చేసుకుంటూ వస్తున్నారు. అమెరికాతో సహా మిగిలిన అన్ని పర్యటనలు, పాల్గొన్న అన్ని సమావేశాలు, ప్రసంగించిన సకల వేదికలు విజయవంతమైనవే. ఆయన ప్రసంగాలు అహొ అనిపించినవే.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అదే మోడీ బ్రాండ్ ఇమేజ్ దేశీయంగా చూసుకుంటే తగ్గలేదని అభిమానుల అనుకోవచ్చేమో కానీ, పెరిగిందని మాత్రం చెప్పలేరు. మోడీ స్వయంగా భాజపాకు గెలిచిపెట్టిన రాష్ట్రాలను చూపించి, దేశీయంగా పెరిగిందని చెప్పడం సరైన వాదన అనిపించుకోదు. ఎందుకంటే ఒక వేవ్ కొంత ప్రాంతాన్ని తాకిన తరువాత, మిగిలిన వారు కూడా అందులో భాగం కావాలని అనుకోవడం సహజం. అందువల్ల కొత్తగా మరే ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినా మోడీ విజయం ఖాయమే. కానీ జరిగిన చోట మళ్లీ జరిగి, గెల్చుకు వచ్చినపుడు అసలు సత్తా తెలిసేది. మోడీ చరిష్మా చవిచూసిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, చవిచూడని రాష్ట్రాలు ఇప్పుడు అదే పనిలో వున్నాయి. 

మహరాష్ట్ర మోడీ ఖాతాలో చేరింది. మరిన్ని ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. ఇప్పుడు మోడీ దృష్టి అంతా ఈ కొత్త ప్రాంతాలపైనే వుంది.  అందుకే ఆయన మరి కొన్ని రాష్ట్రాలపై దీర్ఘకాలిక వ్యూహరచన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సాధించిన మరో విజయం పార్టీపై పూర్తి పట్టు. ఇప్పుడు మోడీకి పార్టీలో తిరుగులేదు. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే ఆయన మనిషి. పార్టీలో అసంతృప్తి, సన్నాయినొక్కులు లాంటివి లేనేలేవు. ఆ విధంగా ఆయన ఇంట పూర్తిగా గెలిచారరు. 

ఇక ఎన్నికల విజయాలు మోడీకి కొత్తా కాదు, మున్ముందు రావనీ కాదు. కానీ పాలన అంటే ఎన్నికల్లో విజయం ఒక్కటే కాదు కదా. మేనిఫెస్టో బౌండ్ పుస్తకం ఇంకా అలాగే వుంది. అది తెరిచి ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన పనుల జాబితా చాలా పెద్దదే వుంది. అన్నింటికన్నా కీలకమైనది ఉద్యోగాల కల్పన. ఆ దిశగా అయితే ఇంతవరకు మోడీ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు  మోడీ దృష్టి అంతటా, అంతర్జాతీయ సంబంధాలు, భారత్ ప్రతిష్టతో పెంచడం, అదే సమయంలో తన ప్రతిష్ట పెంచుకోవడం పైనే ఎక్కువగా వుంది. 

నిజానికి కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ వ్యవహారాలపై దృష్టి పెట్టినా, దేశీయంగా వాటిని తెలియచెప్పే వ్యవహారాలను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. మన్మోహన్ విదేశీ పర్యటనలు చాలా చప్పగానే సాగేవి తప్ప, దేశీయంగా వాటికి పెద్ద ప్రాచుర్యం, పబ్లిసిటీ లేదు. మోడీ వ్యవహారం వేరు. ఆయనకు పనీ కావాలి..పబ్లిసిటీ కావాలి. మనం చేసిన పని నలుగురికీ తెలిస్తే మనకూ మంచిదే అనే ఆలోచన ఆయనది. అందువల్ల ఒక పక్క దౌత్య వ్యవహారాలను అద్భుతంగా చక్కబెడున్నారన్న పేరుతో పాటు, మోడీ మాత్రమే ఇలా చేయగలరని దేశీయంగా మేధావి, చదువుకున్న ఓటర్లలో ఓ అభిప్రాయాన్ని ఆయన సృష్టించుకోగలిగారు.

 కానీ భారతదేశం అంటే కేవలం మేధావులు, విద్యాధికులే కాదు. డెభై శాతం ఓటింగ్ జరిగితే అందులో పామరుల శాతమే ఎక్కువ. అందుకే మన మేనిఫెస్టోలు, మన రాజకీయాలు, మన పథకాలు వీరి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే ఇప్పటికీ మోడీ వీరిని కన్నా పట్టణ ప్రాంత ఓటర్ ను దృష్టిలో పెట్టుకోవాలనే చూస్తున్నారు. అందుకోసమే..చాలా తెలివిగా గాంధీని తీసుకువచ్చి, తన పెరట్లో కట్టేసుకునే కార్యక్రమంగా స్వఛ్ భారత్ ను తలకెత్తుకున్నారు. అంతవరకు గాంధీ అంటే పడని ఆరెస్సెస్ కూడా ఇప్పుడు మోడీ వ్యూహం చూస్తూ మౌనంగా వుండిపోయింది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కానీ స్వఛ్ భారత్ అన్నది ఫొటోల ఆల్బమ్ కు మాత్రమే పరిమితమైపోయింది. మరోపక్క దేశ వ్యాప్తంగా పత్రికలు, టీవీలకు ప్రకటనల రూపేణా ఆదాయవనరుగా మాత్రం పనికివచ్చింది. ఇదో వేలం వెర్రిగా ఫొటోలు దిగడం మినహా జరిగిందేమీ లేదు. నిజానికి రోడ్లను శుభ్రం చేయమని కాదు పిలుపు నివ్వాల్సింది..శుభ్రంగా వుంచమని. స్వఛ్ భారత్ అన్న నినాదం అద్భుతమైనది అది ఎవరూ కాదనలేరు. కానీ దాన్ని ప్రాచుర్యం చేయడానికి ఎంచుకున్న మార్గం సరైనది కాదు.  కేవలం ప్రచారం ద్వారా ఈ దేశపు ప్రజలను మార్చడం అన్నది ఎన్నికల కోసం వాళ్లను మళ్లించినంత సులువు కాదు.

సరే ఆ సంగతి అలా వుంచితే, మోడీ దృష్టి అంతా చాలా హైఫై వ్యవహారాలపైనే వుంది. స్మార్ట్ సిటీలు, బుల్లెట్ రైళ్లు వంటివి. ఇవన్నీ ఇప్పుడప్పుడే సాకారమయ్యేవి ఎంత మాత్రం కాదు. ఆ మాటకు వస్తే, ఈ అయిదేళ్ల టర్మ్ లో ఇలాంటి పథకాలకు శంకుస్థాపన జరగకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాటి రేంజ్ అటువంటిది. నిజానికి భారతదేశానికి కావాల్సింది, ఇంకా బేసిక్ సదుపాయాలే. అంటే మరింత పటిష్టమైన మామూలు రైల్వే వ్వవస్ధ, మంచి రోడ్లు, సకల సదుపాయాలు వున్న పల్లెలు.

ఇప్పుడున్న రైల్వే వ్వవస్థ ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చేందుకు సరిపోవడం లేదన్నది వాస్తవం. మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కావడం లేదు. ఇప్పటికీ రైళ్లలో సాధారణ భోగీలు చాలా తక్కువవుండి జనాలు ఇబ్బంది పడుతున్నారు. పట్టణాలు సదుపాయాలు పెంచుకుంటుంటే, పల్లెలు అందుకు దూరంగా వుంటున్నాయి.

అందువల్ల ఈ రైల్వేకు మరో సమాంతర రైల్వే వ్యవస్థ కావాలి. అంటే ఇప్పుడున్న వ్యవస్థ మరోటి తయారుకావాలి. దానికి పాతికేళ్లు పట్టచ్చు, యాభై ఏళ్లు పట్టచ్చు. కానీ దాని వల్ల ఒనగూరినంత ప్రయోజనం బుల్లెట్ రైళ్ల వల్ల ఒనగూడదన్నది వాస్తవం. అయితే మోడీ ప్రభుత్వం ఆలోచన వేరు. ఇఫ్పుడు ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం నిర్మించలేదు. అలా అని ప్రయివేటుకు ఇస్తే రైల్వే సంఘాలు కన్నెర్ర చేస్తాయి. అదీ కాక, ప్రయివేటు పెట్టుబడిదారులు, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల వైపు చూస్తాయి. వీలయినంత ఎక్కువ లాభం ఆర్జించడం కోసం చూస్తాయి. బుల్లెట్ రైళ్లు ఇలాంటి పథకమే.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఇక స్మార్ట్ సిటీలు కూడా ఇలాంటివే. నిజానికి ఒక స్మార్ట్ సిటీ అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేసే నిధులతో వంద పల్లెలకు కనీస సదుపాయాలు కలిగించి, స్మార్ట్ విలేజ్ లు గా తయారు చేయవచ్చు. కానీ దాని వల్ల రిటర్న్ ఆదాయం వుండదు. అదే పట్టణాల్లో అయితే వివిధ రూపేణా వసూళ్లు సాగించుకోవచ్చు.ఇలా మోడీ ప్రవేశపెడదామనుకుంటున్న రెండు కీలక పథకాలు కూడా సాధారణ ప్రజలకు దూరమైనవే.

ఇక మోడీ మేనిఫెస్టోలో కీలకమైన హామీ ఉద్యోగకల్పన. ఆ దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. పరిశ్రమలు స్థాపన, లేదా పెట్టుబడులు వికేంద్రీకరణ అన్నది రాష్ట్రాల తలకాయనొప్పిలా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిశ్రమలు సాధించి, ఉపాథి కల్పన టార్గెట్ చేరుకుంటే, దేశం మొత్తం మీద కేంద్రం కూడా చేరుకున్నట్లే కదా? అందుకే ఆ పనిని మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలేసినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కేంద్రం దగ్గర నిధులు ఏమీ మురిగిపోవడం లేదు. ఆచితూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితే వుంది. అందుకే ప్రయివేటు భాగస్వామ్య పథకాలను తలకెత్తుకోవడానికే చూస్తోంది. 

మరోపక్క కేంద్రం నేరుగా అమలు చేసే పథకాల కన్నా, పరోక్షంగా రాష్ట్రాల ద్వారా అమలు చేసేవే ఎక్కువ. ఇప్పుడు దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్నాయి. అవి కేంద్రం ఈ నిధులిచ్చింది, కేంద్రం సహాయంతో ఈ పథకాలు చేపట్టాం అని చెప్పమన్నా చెప్పవు. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంలో 24గంటల విద్యుత్ అన్నది కేంద్రం ప్రతిపాదన, సహకారం. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కానీ అక్కడ అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ అది తన ఘనతే అన్నట్లు చెప్పుకుంటోంది. అలాగే వివిధ రవాణా సంస్థలకు బస్సులు అందిస్తున్నారు. ఏ సంస్థ అయినా చెబుతోందా? వివిధ పట్టణాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు అందిస్తున్నారు. వీటన్నింటికి నోరుతిరగని పేర్లు పెట్టారు. ఇవన్నీ గత కాంగ్రెస్ పాలనలో ప్రారంభించినవే, వివిధ రాష్ట్రాలు లబ్ధి పొందినవే. కానీ జనాలకు తెలియదు. సింపుల్ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారి లేదా ఫ్లయ్ ఓవర్, లేదా కేంద్ర ప్రభుత్వం అందించిన బస్సు అని రాయడం ప్రారంభించండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నిగ్గు తేలుతుంది.

దానా దీనా చెప్పొచ్చేది ఏమిటంటే కేంద్రం సామాన్యులకు చేరువ అయ్యే పథకాలను చేపట్టని పక్షంలో కేవలం మిత్రపక్షాల దయాదాక్షిణ్యాల మీద, వాటి చరిష్మా మీద ఆధారపడాల్సి వుంది. ఇప్పటి వరకు కేంద్రం సామాన్యులకు ఉద్దేశించి చేపట్టిన కొత్త పధకం జనథనయోజన అనే బ్యాంకు ఖాతాల ఓపెనింగ్ మాత్రమే. దేశంలో ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతా వుండాలన్నది లక్ష్యం. నిజానికి ఇది అంత గోప్ప లక్ష్యం ఏమీ కాదు. ఎందుకుంటే బ్యాంకు  ఖాతా అవసరమైనవారు అడక్కుండానే తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా దూర దృష్టితో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. 

భవిష్యత్ లో పథకాలు అన్నీ ఆధార్, బ్యాంకు ఖాతాతో లింక్ చేసే ఉద్దేశం, దాదాపు దేశంలోజరిగే లావాదేవీలు అన్నీ ప్రభుత్వానికి తెలియాలనే ఐడియా ఈ పథకం వెనుక వుండి వుండొచ్చు. అయితే ఆరునెలలు నిర్వహిస్తే ఓడి ఇస్తామని ప్రచారం చేసారు. కానీ దీన్ని గురించి ఓ బ్యాంకు అధికారిని అడిగితే..నవ్వేసారు. ‘ఎలా ఇవ్వగలమండీ..అన్నీ హామీలు వున్న లోన్ లే వెనక్కు రావడం కష్టమవుతోంది. శాలరీడ్ అక్కౌంట్లకే ఓడి ఇవ్వడం లేదు. ఇక సాదా సీదా ఖాతాలకు ఓడిలు ఎక్కడ ఇస్తాం..ప్రభుత్వం ఏదో చెబుతుంది..అంతే’..అన్నారు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

మరి ఇంక ఏ పథకం సామాన్యుల కోసం మోడీ ప్రభుత్వం గడచిన ఆరు నెల్లలో చేపట్టినట్లు? పోనీ హామీ ఇచ్చిన నల్లధనం వ్యవహారం నిలబెట్టకోగలగిందాఔ? అదీ లేదు. ఆ విషయంలో అభాసుపాలయింది. భాజపా ప్రభుత్వాల హామీలు ఇలాగే వుంటాయి. రామజన్మభూమి, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అనేవి గడచిన భాజపా ప్రభుత్వాలు, ఇప్పటి ఫ్రభుత్వం పక్కన పెట్టిన హామీలే.

మొత్తానికి మోడీ వెళ్తున్న దిశ కార్పోరేట్ వైపే వుంది. పెట్టుబడీ ఆర్థిక విధానాలకు అనుగుణంగానే వుండేలా కనిపిస్తోంది. సామాన్యుడిని, పల్లెలను పట్టించుకునే దాఖలాలు ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు.

అభివృద్ధి గ్యాసిప్ లే ‘తారక’మంత్రం

పదేళ్ల పదవీ విరహం తరువాత, సర్వ శక్తులు కూడదీసుకుని, మరిన్ని శక్తులు అరువు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఈసారి ఆయనకు తెలిసి వచ్చింది..తను ఏ విధంగా అధికారంలోకి వచ్చాను..అది ఏ విధంగా నిలెబెట్టకోవాలి అన్నది. అందుకే ఆ దిశగానే ఆయన మాటలు, చేతలు సాగుతున్నాయి. ఒకపక్క కులాల మద్దతు, మరో పక్క యువకులు, రైతుల మద్దతు తనకు మళ్లీ గెలవడానికి అవసరం అని ఆయనకు అర్థమయింది. అయితే ఆయన ఎన్నికకు తెరవెనుక కృషి చేసినవాటిలో కార్పొరేట్ శక్తులు కీలకం. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

అందువల్ల వాటికి అనువైన కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరం. ఇటు పని చేసినట్లు వుండాలి..అటు కార్పొరేట్ పరమార్థం నెరవేరాలి. అదీ ఇప్పుడు బాబు ముందున్న లక్ష్యం. అందుకనే కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ, అభివృద్ధి అంటే ఇదే అనే విధమైన పథకాలు లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. నిజానికి మామూలుగా రాజధాని అంటే కాసిన్ని కార్యాలయాలు, నివాస భవనాల సముదాయం. ఇది నిర్మిస్తే కార్పొరేట్లకు ఏం ప్రయోజనం వుంటుంది? అందుకే బృహత్తర రాజధాని నిర్మాణానికి కిందా  మీదా అవుతున్నారు. ఈ రాజధానిలో ప్రభుత్వ అవసరాలైన కార్యాలయాలు, నివాస గృహాల కన్నా, ఇతరత్రా వ్యవహారాలపైనే బాబు దృష్టి ఎక్కువగా వుంది. 

క్లబ్ లు, ఎమ్యూజ్ మెంట్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్లు వంటి వాటిని ఆయన ప్రజల కాలక్షేప వ్యవహారాలుగా చూపిస్తున్నారు. ఉద్యోగాలు పూర్తయ్యాక జనం తోచక బాధపడతారని అందుకే ఇవన్నీ అని ఆయన అంటున్నారు. అంతే కానీ ఉద్యోగులకు సాయంత్ర వేళలో తోచేందుకు వీలుగా గ్రంధాలయాలు నిర్మిస్తా, చర్చి, మసీదు, దేవాలయాలు నిర్మిస్తా అనడం లేదు. కేవలం అవి నిర్మించి ఊరుకుంటే కార్పొరేట్లు ఏం బావుకుంటాయి. జనం జేబులు గుల్లచేసి, డబ్బులు దోచుకునే మార్గాలు అన్వేషించాలి. వాటిని కార్పొరేట్లకు అప్పగించాలి. అది చూసి, జనం అబ్బ ఎంత చక్కటి రాజధానో అనుకోవాలి. గద్దె ఎక్కిన దగ్గర నుంచి ఇదే తీరుగా కొనసాగుతోంది బాబు ఆలోచనా ధోరణి. 

ఆర్టీసీ బస్ స్టాండ్ ల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామనడం లేదు. ఎయిర్ పోర్టులు నిర్మిస్తామంటున్నారు. జిల్లాకో ఎయిర్ పోర్టు అన్నది సాధ్యం కాని వ్యవహారం అని బాబుకు తెలియదా? నిత్యం లక్షలాది మంది జనం వచ్చిపోయే, షిర్డీ లాంటి అద్భుత పుణ్య క్షేత్రంలోనే ఇప్పటి ఇంకా ఎయిర్ పోర్టు నిర్మాణం సాధ్యం కాలేదు. మరి రోజుకు పట్టుమని పది మంది ఎక్కుతారో లేదో తెలియని విజయనగరం, శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు అనడంలో ఔచిత్యమేమిటి? అది జరిగే పనో కాదో ఆయనకు తెలియదా? ఏదో జరిగిపోతోందని ప్రజలు అనుకోవాలి. వారు ఆ భ్రమల్లోవుండగానే బాబు తన కార్పొరేట్ అనుకూల విధానాలు చకచకా అమలు చేసేసుకోవాలి. నాలుగేళ్ల అనంతరం ప్రజల ముందుకు గోబెల్ ప్రచారంతో, కులాల ఈక్వేషన్లతో, నాయకుల అండదండలతో పోయి అధికారం సాధించుకోవాలి. అదే తప్ప వేరు లక్ష్యం కనిపించడం లేదు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఫింఛన్లు పెంచాం..రుణమాఫీ చేస్తాం..డ్వాక్రా రుణాలు తీరుస్తాం అనడమే తప్ప, పల్లెలను బాగుచేసే దిశగా ఇంతవరకు కృషి ప్రారంభించ లేదు. పైగా డ్వాక్రా సంఘాల ముసుగులో ఇసుక క్వారీలను తమకు కావాల్సినవారికి కట్టబెట్టారు. ఇప్పుడు ఇసుక ధర ఆకాశాన్నంటుతోంది. 

కాంగ్రెస్ హయాంలో ఏ శ్రీకాకుళం థర్మల్ ప్రాజెక్టును అయితే, వ్యతిరేకించారో, ఏ బాక్సయిట్ తవ్వకాలనైతే వ్యతిరేకించారో వాటిని ఇప్పడు ఆయన తన కార్పొరేట్ల కోసం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆయనకు కలిసి వచ్చిన అంశం ఏమిటంటే, తాము తింటే పరమాన్నం, ఎదుటి వాడు తింటే చిరుతిళ్లు అని బుకాయించడానికి ‘పచ్చ’పాత మీడియా సిద్ధంగా వుంటుంది. ఇసుక అడ్డగోలుగా అప్పగించి అమ్మేసుకుంటే, అది డ్వాక్రా సంఘాల ఉద్దరణ. బాక్సయిట్ తవ్వేస్తే అది గిరిజనోద్ధరణ. థర్మల్ ప్లాంట్ కు అనుమతిస్తే, అది విద్యుత్ సదుపాయాల కల్పన. ఇలా వంతపాడే మీడియా వున్నంతకాలం ఆయన దేనికయినా ఎందుకు జంకుతారు.  అయినా కూడా బాబు ఇప్పుడు ఏ విమర్శలకు జంకే, ఎవరి మాటలకు భయపడే పరిస్థితులో లేరు. వీలయినంత త్వరగా తను అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం, అనుకున్నది ఒకటే ఆలోచనలా వుంది. ఇది గడచిన ఆరునెలల్లో స్పష్టమైంది.

మొగలిరేకు చందం కేసిఆర్

మొగలి రేకు అందంగానే వుంటుంది..సువాసనలు వెదజల్లుతుంది కానీ, మహా మొరటు వ్యవహారం. అసలే పెళుసు..ఆపై ముళ్లు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కేసిఆర్ వైఖరి ఇలాగే వుంటుంది. ఆయనకు జనాలకు ఏదైనా చేయాలనే వుంది. అందుకు తగ్గ ఆర్థిక స్తోమత రాష్ట్రానికి వుంది. కానీ అంత అడ్డగోలుగా సాగుతుంటుంది. ఆయన మనసులో ఏది పుడితే అది. ప్రతిపక్షాలంటే లెక్కలేదు. పాలకపక్షంలో మిగిలిన వారికి పెద్దగా విలువలేదు. తాను, తన కుటుంబం, తన బంధుగణం. అధికారం వున్నపుడు ఎవరూ మాట్లాడడినికి సాహిసించరు. అలా సాహసించినవారిని టార్గెట్ చేస్తారు,. ఆ టార్గెట్ చేయడంలో కూడా మరి కిందా మీదా, పద్దతి వంటి వ్యవహారాలు పట్టించుకోరు. మీడియా అండగా వున్న చంద్రబాబు అయినా పనులు డిప్లమాటిక్ గా కానివ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ కెసిఆర్ అలా కాదు. ఎవరేమి అనుకుంటే నాకేంటి అనే తీరు. అది చానెళ్ల నిషేధం అయినా, రేవంత్ ను అసెంబ్లీలో మాట్లాడనివ్వకపోవడం అయినా.

అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయాలు కొన్ని వున్నాయి. తెలంగాణలో సామాన్య జనానికి కావాల్సిన అభివృద్ధి చూపాల్సి వుంది. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టమవుతుంది అన్న స్పృహ కేసిఆర్ కు వున్నట్లు స్పష్టమవుతోంది. రోడ్లకు, చెరువులకు, ఇతరత్రా కార్యక్రమాలకు చకచకా నిధులు ఇస్తున్న తీరే ఈ విషయాన్ని చాటి చెబుతాయి. అలాగే ద్వితీయ శ్రేణి పట్టణాలకు హైదరాబాద్ మాదిరి సౌకర్యాలు కలుగచేయాలనుకోవడం బాగుంది.  ఓట్ల బ్యాంకును దృష్టి పెట్టుకుని కావచ్చు, లేదా చేయాలనే తపనతొ కావచ్చు, సామాన్యులకు పనికివచ్చే కొన్ని పనులనైతే కేసిఆర్ తలకెత్తుకున్నారు. కానీ అనుభవలేమి అన్నది విద్యుత్ సమస్య విషయంలో చాలా స్పష్టంగా కనిపించింది. అది కెసిఆర్ కు పెద్ద మైనస్. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఇప్పుడు మరో మూడు నెలల పాటు ఈ సమస్య వుండకపోవచ్చు కానీ, మార్చి నాటికి అంతకు అంతా పెరికే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. బాబు మాదిరిగా కార్పొరేట్లకు దాసొహం అనడం లేదు కానీ, కొంత వరకు కొన్ని సంస్థల ప్రయోజనాలను ఆయనా కాపాడుతున్నట్లు స్పష్టమైంది. విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు పనికివచ్చే కార్యక్రమాల అమలు, ఇలాంటివి ఎలా వున్నా, పాలనాఅనుభవం లేని వైనం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి దానికీ పొరుగు రాష్ట్రంతో తగాయిదా పడడం, ప్రతి చిన్న సమస్యను జటిలం చేసుకోవడం, కేంద్రాన్ని నిలదీయడం, మళ్లీ బతిమాలుకోవడం ఇలా అడగు ముందుకు, అడుగు వెనక్కు అన్నట్లు సాగుతోంది కెసిఆర్ పాలన.

కెసిఆర్  ఒకటి గమనించాలి. అభివృధ్ధి ఎంత కీలకమో, మాట తీరు, పని తీరు కూడా అంతే కీలకమన్నది. అలా కాకున్న పక్షంలో చేసిన అభివృధ్ధి ఆయా ప్రాంతాలకు పరిమితమై, మాట తీరు, పనితీరు మాత్రం అంతటా పాపులర్ అయిపోతాయి. దీంతో జనం అదే నిజమనుకునే ప్రమాదం వుంది. అందువల్ల ఆర్నెల్ల అనుభవంతోనైనా కేసిఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాల్సి వుంది.

ప్రతిపక్షాలు పారాహుషార్

అధికార పక్షాలు ఇలా వుంటే ప్రతిపక్షాలు ఇరు రాష్ట్రాల్లోనూ హుషారుగానే వున్నాయి. ఆంధ్రసీమలో వైకాపా హుషారుగా వుంటే, తెలంగాణలో తేదేపా ఆ పాత్ర పోషిస్తోంది. చిత్రంగా తేదేపా తెలంగాణలో తాను వ్యవహరిస్తున్న తీరుగానే, ఆంధ్రసీమలో వైకాపా వ్యవహరిస్తుంటే మాత్రం భరించలేకపోతోంది. తాను తెలంగాణలో రుణమాఫీపై, రైతుల సమస్యలపై నినదిస్తోంది..నిలదీస్తోంది..ప్రజల నడుమ పర్యటిస్తోంది. అదే పని వైకాపా ఆంధ్రసీమలో చేస్తానంటే, తొందరపాటు, ఆరునెలలేగా అయింది అంటోంది. తెలుగుదేశం ద్వంద వైఖరికి ఇది నికార్సయిన ఉదాహరణ. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఇక కాంగ్రెస్ పార్టీ కాస్త సంఖ్యాబలం వున్నతెలంగాణలోనూ ఏమీ చేయలేకపోతోంది..ఇటు ఆంధ్రసీమలోనూ అంతే మాదిరిగా వుంది. పైగా ఇక్కడ వైకాపాకు, అక్కడ తేదేపాకు ఎప్పటికైనా అధికారంలోకి రావాలన్న కోరిక వుంది. కాంగ్రెస్ కు అయిదేళ్ల తరువాత కదా ఆ ముచ్చట. ఇప్పటి నుంచే ఎందకు అక్కర్లేని ఆయాసం అన్నట్లు వుంది. ఇదీ ఆర్నెల్ల ప్రోగ్రెస్ రిపోర్టు

చాణక్య

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?