గతవారంలోనే నటుడు దేవేన్ వర్మ కిడ్నీ వ్యాధితో మరణించారు. హాస్యనటుల్లో ఆయనది ప్రత్యేకస్థానం. ఎలాటి శారీరక వికారమూ లేదు. అందంగా, పొడవుగా, చూడడానికి హుందాగా వుండేవాడు. హాస్యం పుట్టించడం కోసం విచిత్రవేషాలు వేయడం, వూరికే ఆడిపోవడం, గొంతు మార్చి కూతలు కూయడం, ఊతపదాలు వాడడం, మొహంలో హావభావాలు గుప్పించేయడం – యిలా ఏదీ చేయలేదతను. మామూలు మనిషిలాగానే నిలబడి, మామూలు డైలాగులతో సున్నితమైన హాస్యం చేశాడు. అతను మీలాటి, నాలాటి మనిషే. కాస్త తెలివితక్కువతనం వలన, యిబ్బందికరమైన పరిస్థితుల్లో పడడం చేతనో గ్రౌషో మార్క్‌స్ తరహాలో వెర్రిమొహం వేయడమో (డెడ్‌పాన్ ఎక్స్‌ప్రెషన్) అయోమయంగా మాట్లాడడమో చేస్తాడంతే! మరాఠీ నాటకరంగంలో యిలాటి పాత్రలు ధరించి అతను బి ఆర్ చోప్డా, హృషీకేశ్ ముఖర్జీ, బాసు చటర్జీ, గుల్జార్ వంటి చిత్రప్రముఖులను ఆకర్షించాడు. గుజరాత్‌లో పుట్టిన దేవేన్ పుణెలో పెరిగాడు. అక్కడి కాలేజీలోనే గ్రాజువేట్ అయ్యాడు. బొంబాయిలో లా కాలేజీలో చదువుతూ నాటకాలు వేస్తూండేవాడు. పంజాబీ అసోసియేషన్ కార్యక్రమంలో ఒక ఏకాంకికలో అతని వేషం చూసిన బిఆర్ చోప్డా అతనికి 24 ఏళ్ల వయసులో ''ధర్మపుత్ర'' (1961)లో తొలి అవకాశం యిచ్చాడు. ఇతను చదువు కట్టిపెట్టి నెలకు రూ. 600 జీతంపై సినిమారంగానికి వెళ్లాడు. ఆ సినిమా ఫ్లాపయింది. తర్వాతి రోజుల్లో నటుడిగా నిలదొక్కుకున్న దేవేన్ గుజరాతీ వ్యాపారస్తుడిగా, మరాఠీ పోలీసువాడిగా, పార్శీవాడిగా వేసిన పాత్రల్లో చాలా పేరు తెచ్చుకున్నాడు. 149 హిందీ సినిమాలతో బాటు ఒకటి రెండు మరాఠీ, భోజ్‌పురి సినిమాల్లో నటించాడు.
మొదట్లో చిన్నవేషాలు వేసినా ''సుహాగన్'' (1964) (తెలుగు ''సుమంగళి'' రీమేక్) లో పాత్రతో గుర్తింపు వచ్చింది. అతను తనను తాను కేవలం కమెడియన్‌గా భావించలేదు. కారెక్టర్ నటుడిగానే అనుకుని అనేక రకాల పాత్రలు వేశాడు. ''దేవర్'' (1966) సినిమాలో ఒక రకమైన విలన్‌గా, అదే ఏడాది విడుదలైన ''మొహబ్బత్ జిందగీ హై''లో కమెడియన్‌గా వేశాడు. రెండూ హిట్టయ్యాయి. ''ఖామోశీ'' (1970)లో తాగుబోతు పిచ్చివాడిగా, ''మేరే అప్నే'' (1971)లో మీనాకుమారి కోపిష్టి పేచీకోరు భర్తగా నటించాడు. ''బుఢ్డా మిల్ గయా'' (1971) వంటి అనేక సినిమాలలో దేవేన్ పెద్ద వేషాలు వేశాడు. హృషీకేశ్ ముఖర్జీ ''అనుపమా'' (1966), ''అర్జున్ పండిట్'' (1976), ''గోల్‌మాల్'' (1979) ''రంగ్ బిరంగీ'' (1983)వంటి సినిమాలలో దేవేన్ వర్మ ప్రతిభను బాగా వాడుకున్నాడు. బాసు చటర్జీ ''కట్టా మీఠా'' (1977), ''దిల్లగీ'' (1978) వంటి సినిమాల్లో దేవేన్‌కు మంచి వేషాలిచ్చాడు. గుల్జార్ ''మేరే అప్నే''లో యిచ్చిన పాత్రకు భిన్నంగా ''అంగూర్'' (1982)లో పూర్తి హాస్యపాత్ర యిచ్చి దేవేన్‌కు చాలా ఖ్యాతి వచ్చేట్లు చేశాడు. షేక్‌స్పియర్ రాసిన ''కామెడీ ఆఫ్ ఎర్రర్స్'' నాటకంలో హీరోది, అతని సేవకుడిది ద్విపాత్రాభినయం. పేర్లు కూడా ఒకటే. ఒకరి వునికి మరొకరికి తెలియదు. ఒక జంట మరొక జంట వున్న వూరికి వెళ్లడంతో గందరగోళం ఏర్పడుతుంది. దాని ఆధారంగా బెంగాలీలో ''భ్రాంతిబిలాస్'' అనే సినిమా వచ్చింది. దాన్ని బిమల్ రాయ్ హిందీలో ''దో దూనీ చార్'' (1968) అనే సినిమాగా తీసి యజమాని పాత్ర కిశోర్ కుమార్‌కు, సేవకుడి పాత్రను అసిత్ సేన్‌కు యిచ్చారు. ఆ సినిమాలో పాటలు రాసిన గుల్జార్‌కు ''అంగూర్'' సినిమా తీయాలని తోచింది. సంజీవ్ కుమార్‌కు యజమాని పాత్ర, దేవేన్ వర్మకు సేవకుడి పాత్ర యిచ్చారు. సేవకుడి పాత్ర కూడా దేవేన్ ఎంతో సోఫిస్టికేషన్‌తో నిర్వహించాడు.
అశోక్ కుమార్ కూతురు రూపా గంగూలీని దేవేన్ పెళ్లాడాడు. వెండి వ్యాపారస్తుడి కొడుకైన దేవేన్ సరైన వేషాలు రాని థలో 1969లో నిర్మాతగా మారి బృజ్ దర్శత్వంలో ''యకీన్'' అని ధర్మేంద్ర, షర్మిలా టాగూర్‌లతో సస్పెన్స్, క్రైమ్ సినిమా తీశాడు. తను ఏ పాత్రా ధరించలేదు. సినిమా బాగా ఆడింది. తర్వాతి రోజుల్లో బృజ్ దర్శకనిర్మాతగా మారి ''చోరీ మేరా కామ్'' (1975) సినిమాలో గుజరాతీ పబ్లిషరు పాత్ర దేవేన్‌కు యిచ్చాడు. అది దేవేన్‌కు పేరుతో పాటు అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అదే పాత్రను ''చోర్ కే ఘర్ చోర్'' (1978)లో రిపీట్ చేశారు. ''యకీన్'' యిచ్చిన ఉత్సాహంతో దేవేన్ ''నాదాన్'' (1971- నవీన్ నిశ్చల్, ఆశా పరేఖ్)తో దర్శకనిర్మాతగా మారాడు. దానిలోనూ వేషం వేయలేదు. సినిమా బాగా ఆడలేదు కానీ పేరు వచ్చింది. దర్శకనిర్మాతగా అతను తీసిన ''బడా కబూతర్'' (1973 – దేవేన్ వర్మ, అశోక్ కుమార్, రెహనా సుల్తానాలతో కామెడీ), ''బేషరమ్'' (1978- అమితాబ్, షర్మిలా), ''దానాపానీ'' (1989- మిథున్ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి), ఏవీ ఆడలేదు. వేరేవారి దర్శకత్వంలో తీసిన ''చట్‌పటీ'' (1983-స్మితా పాటిల్) కూడా ఆడలేదు. 1993 నాటికి అతను సినిమాలపై విరక్తి చెంది, పుణెలో స్థిరపడిపోయాడు. స్వతహాగా చాలా సరదా మనిషి అయినా, పోనుపోను గంభీరంగా అయిపోయాడట. ''దిల్‌తో పాగల్ హై'' (1997)లో మాధురీ దీక్షిత్ గార్డియన్‌గా వేసిన పాత్ర యీ తరం ప్రేక్షకులకు గుర్తుండవచ్చు. ''కలకత్తా మెయిల్'' (2003) సినిమాలో ఆఖరిసారి తెరపై కనబడ్డాడు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)