ఇద్దరూ ఇద్దరే: దొందూ దొందే!

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్. ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయి (రోజుల తేడాలో) ఆరునెలలు గడిచిపోయింది. ఇద్దరికీ పోలికలు వున్నాయి. ఇద్దరి పేర్లూ ‘చంద్రులే’. ఇద్దరూ ‘ఎన్టీఆర్ ట్రస్టు’ ఉత్పత్తులే. అయితే ఇలా…

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్. ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయి (రోజుల తేడాలో) ఆరునెలలు గడిచిపోయింది. ఇద్దరికీ పోలికలు వున్నాయి. ఇద్దరి పేర్లూ ‘చంద్రులే’. ఇద్దరూ ‘ఎన్టీఆర్ ట్రస్టు’ ఉత్పత్తులే. అయితే ఇలా పోల్చేటప్పుడు ఒక్కటే సమస్య: వీరిద్దర్నీ పట్టుకుని ‘ఇద్దరూ ఇద్దరే’ అనాలా..? లేక ‘దొందూ దొందే’ అనాలా? రెండూ అనొచ్చు. గొప్పగా పాలించేస్తే.. అనగా… సినిమా వాళ్ళ భాషలో ‘ఇరగదీసేస్తే’ మొదటి పద్ధతిలో పోల్చవచ్చు. తుస్సు మనిపించారనుకోండి.. అంటే ఇదే సినిమా భాషలో ‘పెద్ద సీను లేదనుకోండి’.. రెండో పధ్ధతిలో పోల్చవచ్చు.

‘చంద్రుల’న్నాక వారు కనపడే రాత్రులూ(శుక్లపక్షాలూ) వుంటాయి; వారు అడ్రసు లేని రాత్రులూ (కృష్ణపక్షాలూ) వుంటాయి. ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేసి ‘నేను రైతుని మాట్లాడుతున్నాను’ అని ఉత్తినే అన్నా, ఇద్దరూ ఉలిక్కి పడతారు. కేసీఆర్‌కు అయితే ‘విద్యుత్ షాక్’ కొట్టినట్లనిపిస్తుంది; చంద్రబాబు కయితే అప్పులవాళ్ళు తలుపులు దబ,దబా బాదినట్లనిపిస్తుంది. 

పాపం! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. రైతుపేరు చెబితే ఇద్దరికీ ఒళ్లు తెలీదు. ఎన్నికల ముందు ఎగిరెగిరి హామీలిచ్చేశారు. ‘రైతన్నా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని చెప్బబోయి నీ ‘రుణానికి నారుణం అడ్డు’ అని అనేశారు. చంద్రబాబుకు అయితే వాక్ప్రవాహం (ఫ్లో అంటరే అది) ఆగలేదు. ‘ అంగన్ వాడి అక్కా! నీ రుణానికి కూడా నా రుణం అడ్డు’ అని అనేశారు. తీరా గెలిచాక, ఇద్దరికీ చుక్కలు కనిపించాయి. రిజర్వ్ బ్యాంకు వైపు పరుగెత్తారు. ‘అప్పులు ఎగవేసే హాబీ’లను తాను ప్రోత్సహించనని కూడా బ్యాంకు తెగేసి చెప్పేసింది. దాంతో రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యను తగ్గించటం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. ‘కొర్రీ’ల పెట్టబోయారు. ఆరునెలలు గడిచేలోగా ఎంతోకొంత రుణాల పేర విడుదల చేయక తప్పింది కాదు. సంపూర్ణమైన మాఫీ ఇద్దరూ చెయ్యలేక పోయారు. 

ఎన్నికలయ్యేవరకూ తెలంగాణ రైతులను కేసీఆర్ ఓ భ్రమలో వుంచారు: ఓ బోరూ, దానికో వైరూ వుంటే చాలు అన్న తీరులో ఉపన్యాసాలు దంచారు. వైరులోకి ‘కరెంటు’ ఎక్కడనుంచి వస్తుందో చెప్పలేదు. ఎన్నికయ్యాక మాత్రం భ్రమను తీసివేయాలనుకున్నారు. వీలవుతుందా? మరో మూడేళ్ళ వరకూ ‘బోరు బోరే, వైరు వైరే’! విద్యుత్తు రాదు అని చెప్పబోయాడు. రైతులు వినలేదు. రోడ్లెక్కారు. కేసీఆర్ గొప్ప వక్త కదా! ఇదే విషయాన్ని తిప్పి చెప్పారు. మూడేళ్ళ తర్వాత ‘రెప్పపాటు’ సమయంలో కూడా ‘కోత’లుండవన్నారు. కానీ రైతులు ఆయన చెబుతున్నవి ‘కోత’లని ఇట్టే గ్రహించారు.లాభం లేదని చెప్పి, నేరుగా చత్తీస్ గఢ్ వెళ్లి విద్యుత్ సరఫరాకు ‘అవగాహనా పత్రం’ మీద సంతకం చేయించి వచ్చారు. అక్కడనుంచి ఇక్కడకు లైన్లు వేసి, వాటిల్లోంచి కరెంటు రావాలంటే, 2019 ఎన్నికల కూడా వచ్చేస్తాయి. అప్పుడు ‘రాజెవరో? మంత్రెవరో?’ ఎవరికి ఎరుక. రైతులు అయినా నమ్మటం లేదు. పురుగు చావని ‘పెస్టిసైడ్’ తాగటానికీ, కరెంటు ఇవ్వని స్తంభం ఉరివేసుకోవటానికనీ ఎప్పుడో నిర్ధారణ కొచ్చిన  ‘రైతు’ ఆత్మహత్యలు చేసుకుంటూనే వున్నారు. ఆత్మహత్యలు ఉమ్మడి రాష్ర్టంలోనూ వున్నట్టే, ప్రత్యేక రాష్ర్టంలోనూ వుంటే, ఇక ‘రాష్ర్ట సాధన’ ఫలితమేమిటని, ‘హక్కుల’ నేతలూ, ‘ఉద్యమ’ నేతలూ రోడ్లెక్కుతున్నారు.

ఇక సీమాంధ్ర ‘చంద్రుని’కీ ఈ మచ్చలేక పోలేదు. అక్కడా రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. ఇప్పటికి 0కి పైగానే రైతులు ప్రాణాలు తీసుకున్నారని, అక్కడి ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కట్టబోయే రాజధాని నగరాన్ని చూపి, చావొద్దని అంటే రైతు వింటాడా? రాజధానిని సింగపూర్ చేస్తే ఏమిటి? టోక్యో చేస్తే ఏమిటి? బతుకు ‘సోమాలియా’ అయిపోతుంటేనన్నది రైతు ప్రశ్న.   అక్కడ రైతు చనిపోవటానికి విద్యుత్తు కాదు, సవాలక్ష కారణాలున్నాయి. అక్కడి చంద్రబాబుకు ఇదే ప్రశ్న వర్తిస్తుంది. రైతుల ఆత్మహత్యలు ఆయన అధికారంలో లేనప్పుడూ వున్నాయి. ఇప్పుడయినా ఆగవేమిటి? ఇలా ఆరు నెలల్లో ఇద్దరి వైఫల్యాలను లెక్కించుకుంటూ పోతే, ‘దొందూ, దొందే’ అనాల్సి వుంటుంది.  

కానీ ఇద్దరికీ విజయాలు లేక పోలేదు. ఇద్దరికీ రెండు ‘రికార్డులున్నాయి’. కేసీఆర్ ఒక్కరోజులో రాష్ర్టమంతటా ‘సమగ్ర సర్వే’ నిర్వహించారు. ఇంత పెద్ద ఫీట్ ఎవరయినా చేశారా? అలాగే చంద్రబాబు తుపానుకు ఎదురు వెళ్ళినంత పనిచేశారు. ‘హుద్ హుద్’ తుపాను కుదిపేశాక, విశాఖపట్నం నగరాన్ని వేగంగా తేరుకునేలా చేశారు. అత్యవసర సర్వీసులను వేగంగా పునరుధ్ధరించారు. కేంద్రం నుంచి నిధుల్నీ, ప్రశంసల్నీ కొట్టేశారు. 

రాజకీయంగా, ఇద్దరికీ చెరో పార్టీ పక్కలో బల్లెంలా మారింది. కేసీఆర్‌కు మజ్లిస్ పార్టీ; చంద్రబాబుకి బీజేపీ. కేసీఆర్ సర్కారును ‘ఓవైసీలు’(మజ్లిస్) రిమోట్‌తో నడిపిస్తున్నారని ఇక్కడి ప్రతిపక్షాలు అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కి సమాంతరంగా బీజేపీ సీమాంధ్రలో ఎదిగిపోతోంది. ఇతర పార్టీల నుంచి వలసలు అధికారంలో వున్న తెలుగుదేశంలోకి కాకుండా, బీజేపీ వైపు సాగటం ఇందుకు నిదర్శనం.  ఆరు నెలలేక ఇలా వుంటే, ఏడాది ముగిసే సరికి ఎలా వుంటుందో..!? రాజకీయాల్లో ఓడలు బళ్ళూ, బళ్ళు ఓడలూ కావటానికి ఎక్కువ సమయం పట్టదు.