cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

సింగ’పూర్’ సంస్థలు

సింగ’పూర్’ సంస్థలు

చంద్రబాబు ప్రభుత్వం నవ్య రాజధాని కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైకాపా అధినేత జగన్ సంబంధిత దినపత్రిక సాక్షి దీనిపై ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం ఒప్పందం కుదిరింది ఇరు ప్రభుత్వాల నడుమ కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రెజెస్ సంస్థకు నడుమనట. 

పైగా ఆ సంస్థ పూర్తిగా సింగపూర్ ప్రభుత్వం సంస్థ కాదట..అదీ కాక మధ్యలో మరో ఏ మాత్రం ఈ రంగంలో అనుభవంలో లేని రెండు ప్రయివేటు సంస్థలను కూడా అందులో చేర్చారట. ఈ రెండింటికీ ఒకరే ప్రతినిధిగా సంతకాలుచేసారట. ఇదిలా వుంటే, ఒప్పందం కుదుర్చున్న సంస్థకు అటుపక్క అధినేతగా వున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదట. 

ఇటుపక్క మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు. రేపు తేడా ఏదన్నావస్తే, ముందు వరుసలో వుండాల్సింది వీరే. వైఎస్ హయాంలో జరిగిన వాటిలో మంత్రులు కూడా వున్నా ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు..పడుతున్నారు. ఇక్కడ నేరుగా అధికారుల నడుమే ఒప్పందాలు కుదిరాయి. మంత్రుల చేతికి మట్టి అంటే పని లేదు. పైగా ఈ సంస్థ పక్కా కమర్షియల్ సంస్థ అని దాని వెబ్ సైటే చెబుతోంది. మన దగ్గర వున్న జిఎమ్ఆర్, జివికె, ఇంకా సవాలక్ష ఇన్ ఫ్రా కంపెనీల లాంటిదే ఇదీనూ. కాకుంటే కాస్త ప్రభుత్వ భాగస్వామ్యం వున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా వుంటే ఆ సంస్థ తన గురించి తాను ఇలా చెప్పుకుంది

International Enterprise (IE) Singapore is the government agency driving Singapore’s external economy. We spearhead the overseas growth of Singapore-based companies and promote international trade. Our vision is a thriving business hub in Singapore with Globally Competitive CompaniesTrade has always been the backbone of Singapore’s economy.  

ఈ సంస్థను సింగపూర్ ప్రభుత్వమే ఏర్పాటు చేసుకుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే దాని మేనేజింగ్ బోర్డు ఇటు ప్రయివేటు సంస్థల ప్రతినిధులు, అటు ప్రభుత్వ ప్రతినిధులతో నిండి వుంది కాబట్టి. కానీ ఇది కూడా మనదగ్గర వున్న అనేకానే సంస్థల లాంటిదే అయినపుడు,వీటిని కాదని దాన్ని ఏ ప్రమాణాలతో ఎన్నుకున్నారు? అన్నది మౌలికమైన ప్రశ్న.

పైగా ఇలాంటి సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా చాలా వున్నాయి. వాటన్నింటిని కాదని దీన్నే ఎందుకు ఎన్నుకున్నారు?

అసలు ఏ ప్రామాణికతో, ఏ విధమైన సర్వే లేదా, అంచనా లేదా, సమాచార సేకరణతో ఈ సంస్థను ఎన్నుకున్నారు?

నేరుగా ఫలానా కంపెనీ అని వ్యక్తిగతంగా ఫిక్సయిపోవచ్చు. దాంట్లో తప్పులేదు. కానీ ప్రభుత్వం ఓ సంస్థను ఎంపిక చేసేటపుడు దానికి కొన్ని విధి విధానాలు అనుసరించాలి కదా? 

నవ్య రాజధాని..దాని ప్లానింగ్..దాని విస్తృతి..దీన్ని ఎవరు చేయగలరు? ఇలాంటివి చేయగల సామర్థ్యం వున్న అంతర్జాతీయ సంస్థలెన్ని? వాటి ట్రాక్ రికార్డు ఏమిటి? అవన్నీ చూసి కానీ డిసైడ్ చేయకూడదు కదా? మరి ఎలా చేసారు?

కాంగ్రెస్ హయాంలో దొచిపెట్టారు..దోచి పెట్టారు..అని ఇప్పటికీ రొదపెడుతున్నారు..పోనీ అది వాస్తవమే అనుకుందాం..మరి ఆ నింద తమపై రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలిగివుండాలి కదా. అలా కలిగి వుండాలి అంటే వీలయినంత పారదర్శకంగా వ్యవహరించాలి కదా.

ఇప్పటికైనా ఇంకా ఏమీ ప్రారంభం కాలేదు. కనుక, ఒప్పందం ఏ విధంగా, ఏప్రాతిపదికన కుదుర్చుకున్నాం అన్నది వెల్లడిస్తే బాగుంటుంది.

అలా కాకుండా, జగన్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలు ముందు బయటపెట్టమనండి..అని ఎదురుదాడికి దిగితే చెప్పేదేమీ లేదు.

 


×