హైద్రాబాద్ మహా నగరం.. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్ళు, వ్యక్తిగత వాహనాలు.. ఇవేవీ ప్రజల అవసరాల్ని తీర్చలేకపోతున్నాయి. క్యాబ్ సర్వీసులపై ఆధారపడ్తోన్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త కొత్త ఆఫర్లతో క్యాబ్ సంస్థలు వినియోగదారుల ముందుకొస్తున్నాయి.
ఆటోలో ప్రయాణిస్తే అయ్యే ఖర్చుతో ఎంచక్కా ఏసీ కారులో ప్రయాణం.. అంటూ వివిధ క్యాబ్ సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, దాని ద్వారా క్యాబ్‌ని బుక్ చేసుకోవడం తేలికన్న ప్రచారాలకు కొదవే లేదు. వెరసి, చిటికెలో క్యాబ్ ఇంటిముందు వాలిపోతోంది వినియోగదారుల అవసరాల నిమిత్తం. అసలు ఆ క్యాబ్‌కి అనుమతులున్నాయా? లేవా.? అన్నవి గుర్తించే స్థితిలో వుండటంలేదు వినియోగదారులు. ఇదే క్యాబ్ సంస్థల ఆగడాలకు కారణం.
ఎక్కడో ఢల్లీ లో ఓ క్యాబ్‌లో మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్తతో కేంద్రం షాక్‌కి గురైంది. వెంటనే, ఆ సంస్థకు చెందిన క్యాబ్‌లను నిషేధించే దిశగా ముందడుగు వేసింది. ‘క్యాబ్‌లో అత్యాచారం జరిగిందని క్యాబ్‌లను బంద్ చేస్తే.. బస్సుల్లోనూ అలాంటివి జరిగాయి కదా.. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఇలాంటివి జరిగితే ఏం చేస్తాం.?’ అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్కితరమైన వ్యాఖ్యలు చేశారు క్యాబ్ సంస్థపై బ్యాన్ విధించడం గురించి స్పందిస్తూ.
నిజమే మరి. క్యాబ్ సంస్థలపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుండాలి. ఆ బాధ్యత రవాణా శాఖపైనే వుంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ పాలకులకు అంత తీరిక వుండటంలేదు. రవాణా శాఖ తూతూమంత్రం తనిఖీలతో సరిపెడ్తోంది. లంచాలకు మరిగిన అధికారుల కారణంగానే అసాంఫీుక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
హైద్రాబాద్‌లో ఉబెర్ క్యాబ్‌పై బ్యాన్ విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదొక్కటేనా, ఇతర సంస్థల మాటేమిటి.? అసలంటూ క్యాబ్ సంస్థలపై ఎప్పటికప్పుడు రవాణాశాఖ తనిఖీలు చేస్తే ఈ పరిస్థితే వచ్చి వుండేది కాదు కదా.! రాత్రికి రాత్రి క్యాబ్‌లను నిషేధిస్తే, వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు.. వాటినే ఆధారం చేసుకుని ఉద్యోగాలకు వెళ్తున్నవారి పరిస్థితేమిటి.?
ప్రభుత్వానికి ఇవన్నీ అనవసరం.. ఎద్దు ఈనింది.. దూడని కట్టెయ్యండి.. అంతే.! అది తప్ప సమస్యకు మూలాల్ని వెతికి, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో మాత్రం, పాలకులకు చిత్తశుద్ధి వుండదు.