cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

తుపానులు వెలిసాయి

తుపానులు వెలిసాయి

బాబు సింగపూర్, జపాన్ వెళ్లి వచ్చేసారు...తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి..టాలీవుడ్ మేము సైతం హడావుడి పూర్తయింది. ఇప్పుడు ఇక రొటీన్.

తెలంగాణలో..

భీభత్సం సృష్టిస్తుందనుకున్న తుఫాను వెలసింది. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు, తొలి ప్రభుత్వానికి సవాల్ గా మారుతాయి అనుకున్నారు. విపక్షాలు తుఫాను సృష్టిస్తాయి అనుకున్నారు. ఎన్నో ఆశలను చూపెట్టి తెలంగాణ సాధించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ వాటిని ఏమేరకు నెరవేరుస్తుంది.. ఈ బడ్జెట్ తో అవన్నీ ఎలా పూర్తి చేస్థుంది అంటూ సభలో విపక్షాలు సంధించే ప్రశ్నలకు అధికార పక్షం ఉక్కిరిబిక్కిరవుతుంది అని భావించారు.  

అయితే అదికార పక్షం చాకచక్యాన్ని ప్రదర్శించింది. పక్కా వ్యూహంతో సభానాయకుడు కేసిఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావులు తుఫాను ప్రభావాన్ని చాలా మట్టుకు తగ్గించి తీరాన్ని దాటించారు. మూడు బిల్లులు, ఆరు తీర్మానాలతో ముగించారు.

రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు, రుణమాఫీ వంటి అంశాలు ఉడికిస్తాయనుకుంటే ప్రజా సంక్షేమానికి ఏమాత్రం సంబంధం లేని కేసిఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వ్యవహారం బాగా దుమారం లేపింది. ఈ విషయంలో టిడిపికి అధికార పక్షం గట్టి షాకిచ్చింది. కానీ అధికారపక్షం వ్యూహాలు పన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు టిడిపికి దొరకకుండా చేసి తుఫాను తీవ్రతను తగ్గించుకుంది. 

ఇక రెండు దఫాలు సస్పెన్షన్లు, వాయిదాలతో సభను అలా లాగించి ఇలా ముగించేసారు. ప్రతి దానికి 50 ఏళ్లుగా చేయని దానిని అదికారంలోకి వచ్చిన అయిదునెలల్లో తామెలా చేస్తాం, అయిదేళ్లు ఆగండి అధ్భుతాలు చేస్తాం అంటూ చెప్పి అన్నింటి నుంచి అధికార పక్షం గట్టెక్కింది.

ప్రధాన ప్రతిపక్ష నేత జానా రెడ్డి బడ్జెట్ చాలా పకడ్బందీగా మాట్లాడి అదికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. అయితే ఆయన తీరు అలాగే ముందుకుపోకుండా అంతలోనే శాంతం, అధికార పార్టీ అభిప్రాయాలతో ఏకీభవించడం, అంతలోనే విమర్శించడం వంటి విధానం అవలంబించడంతో అదికార పార్టీ ఆయనను సమర్థవంతంగా ఎదుర్కుంది. 

చివర్లో రేవంత్ రెడ్డి సస్పెన్షన్, ఆయనను సభలో మాట్లాడనీయకుండా అడ్డుకోవడం వంటి అంశాలను కాంగ్రెస్ కూడా కాస్తా సీరియస్ తీసుకున్నట్లు కనిపించినా అంతగా పలించలేదు.

మొత్తం మీద అంతా అనుకున్నట్లే చేసింది అధికార పక్షం. సభ్యులందరికీ మాట్లాడే ఛాన్స్‌ ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ సాగిందని చెప్పుకొచ్చింది. ఎక్కడా విపక్షాలకు అస్ర్తాలు అందించకుండా వ్యూహాత్మకంగా అడుగేలేసింది. 19 రోజుల పాటు తెలంగాణ తొలి బడ్జెట్‌ సమావేశాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించింది. 

సర్కార్‌ అనుకున్నట్లుగానే ముందునుంచి సభలో అన్నీ తానై వ్యవహరించింది. విపక్షాలు సంధించిన పలు ప్రశ్నలను తిప్పికొట్టి సమాధానాలు ఇచ్చింది. సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఆధిపత్యం చెలాయించిన సర్కార్‌.. టీడీపీ, కాంగ్రెస్‌లను పూర్తిస్థాయిలో కట్టడి చేసింది.

ముఖ్యమైన అంశాలైన వక్ఫ్ భూములు, హౌసింగ్ సొసైటీలు, అసైన్డ్ భూములపై సభా సంఘాలను వేసి.. విపక్షాలను ఇరుకున పెట్టే సంకేతాలిచ్చింది కేసీఆర్‌ సర్కార్‌. ఇక డిఎల్ఎఫ్ భూముల విషయంలో ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు సభలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అసెంబ్లీలో సభ్యులందరూ మాట్లాడే అవకాశమిస్తానని సమావేశాల ముందురోజు చెప్పిన కేసీఆర్‌.. అనుకున్నట్లే చేశారు. 

కానీ రేవంత్‌ విషయంలో అలా జరగలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలతో రేవంత్‌కు సభలో మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వలేదు అధికార పార్టీ. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టింది. వారం పాటు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన నిర్ణయాన్ని సర్కార్‌ పూర్తిస్థాయిలో సమర్థించుకుంటోంది. కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని చెబుతోంది. 

గత ప్రభుత్వాలు సభా నిర్వహణపై ఆసక్తి చూపలేదని ఆరోపిస్తున్న మంత్రులు.. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో మాత్రం తమ ప్రభుత్వం సభ సజావుగా నడిచేలా చేసిందంటున్నారు. అన్ని అంశాలు చర్చకు వచ్చాయంటున్నారు. కొన్ని కీలక అంశాల్లోనూ ప్రభుత్వం విపక్షాల మద్దతు కూడగట్టింది. సమావేశాల ముగింపు రోజు ఎస్సీ వర్గీకరణపై సభా తీర్మానం చేసింది. మొత్తంగా సభా సజావుగా సాగలేదని విపక్షాలు ఆరోపిస్తుండగా.. పూర్తిస్థాయిలో అసెంబ్లీని మంచిగా నడిపించామంటున్నారు అధికార పార్టీ సభ్యులు.

యాత్రాకాలం పూర్తి

ఇక చంద్రబాబు సింగపూర్, జపాన్ ల ప్రత్యేక యాత్రలు ముగిసాయి. సింగపూర్ తో ఒరిగింది ఏదయినా వుందా లేదా అన్నది ఇంతవరకు తేలలేదు. పైగా రాజధాని మాస్టర్ ప్లాన్ తయారుచేయడానికే సింగపూర్ 12 వందల కోట్లు ఫీజు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అంటే మన నుంచి లాగేయడమే కానీ, మనకు సాయం చేసే ఐడియా సింగపూర్ జనాలకులేదని తేలిపోయింది. 

సింగపూర్ యాత్రతో పోల్చుకుంటే కాస్త జపాన్ యాత్రనే బెటర్. సింగపూర్ లో అంతా టూరిజం తప్ప ఏముంటుంది. జపాన్ లో పరిశ్రమలు వున్నాయి. వాటికి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్న కోరిక వుంది. పైగా ఇఫ్పటికే ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ లో కాస్త పట్టు వుంది. అందువల్ల మరి కాస్త పెట్టుబడులు పెట్టే అవకాశం వుంది. అందువల్లే కాసిన్ని ఒప్పందాలు కుదిరాయి. 

అయితే ఈ ఒప్పందాల్లో వివాదాస్పద శ్రీకాకుళం జిల్లా థర్మల్ ప్రాజెక్టు ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో దీనికి వ్యతిరకేకంగా స్థానికులు పోరాడారు. అందువల్ల ఇప్పుడు మళ్లీ ఆ అగ్గి రాజుకునే అవకాశం వుంది. బాక్సయిట్ మీద పోరాడిన తెలుగుదేశం మనసుమార్చుకుని, ఇప్పుడు రివర్స్ గేర్ వేసినట్లే, థర్మల్ మీద కూడా రివర్స్ గేర్ వేసినట్లు కనిపిస్తోంది. ఇలా ఇంకా ఎన్ని గతకాలపు పోరాటాలు, ఇప్పుడు ఆరాటాలుగా మారుతాయో చూడాలి.

ఇక బాబు రాజధాని నిర్మాణం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, ఇంకా మేనిఫెస్టో దాదాపు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ఇచ్చిన అనేకానేక హామీల మీద దృష్టి పెట్టాల్సి వుంది. అలాగే ఆ మధ్య అన్న క్యాంటీన్లు అన్నారు.వాటి సంగతి చూడాలి.ఇవన్నీ ఆర్నెల్లలో చూడాలి. ఎందుకంటే ఆర్నెల్ల తరువాత మళ్లీ జపాన్ వెళ్లాల్సి వుండొచ్చు. ఆయనే అన్నారు కదా..ఆర్నెల్ల కోసారి జపాన్ టూర్ కు వస్తానని. 

టాలీవుడ్ తకరారు

టాలీవుడ్ మేముసైతం హడావుడి ముగిసింది. మరో పక్క కార్మికుల సమ్మె కూడా ముగిసింది. అందువల్ల ఇక సినిమాల నిర్మాణం జోరందుకుంటుంది. అసలే పండుగ సీజన్ వస్తోంది. అనేక సినిమాలు విడుదలకు రెడీ కావాలి. అందువల్ల ఇక బిజీ బిజీగా వుంటుంది టాలీవుడ్. 2014 ముగియవస్తోంది. చెప్పుకోదగ్గ హిట్ లు పెద్దగా లేవు. కనీసం 2015లో అయినా టాలీవుడ్ లాభదాయకంగా మారుతుందని ఆశించాలి.

పైగా ఆంధ్ర ప్రభుత్వం ఎంటర్ టైన్ మెంట్ సిటీ కడతానంటోంది.చంద్రబాబు కూడా రెండు చోట్లా పరిశ్రమ స్థిర పడాలి అంటున్నారు.అంటే టాలీవుడ్ కు ఆంద్రలో కూడా అవకాశాలు వున్నాయన్నమాట. స్టూడియోలు, ఇతరత్రా వ్యవహారాలు ఇక అక్కడ కూడా రెడీ అవుతాయన్నామాట. ఇకనేం..ఫిల్మ్ నగర్ లు, భూముల పందేరాలు, రికార్డింగ్ స్టూడియో అని చెప్పి, వాణిజ్య అవసరాలకు వాడుకోవడాలు ఆలాంటి వన్నీ మనం అక్కడ కూడా చూడొచ్చు అన్నమాట. 

తుపానులు వెలిసాయి..ఇక పనులు ప్రారంభం కావాలి. ఏమేరకు పనులు సాగుతాయో చూడాలి మరి.

 


×