హరియాణాలోని బర్వాలాలో బాబా రాంపాల్ ఆశ్రమంలో 15 వేలకు పైగా భక్తులను లోపల బంధించి వుంచారని తెలిసి నివ్వెరపోయాం. హరియాణాకు వున్న 55 వేల మంది పోలీసుల్లో దాదాపు సగం మందిని ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవడానికి వినియోగించారు. వాళ్లు 'ఆపరేషన్ సంవేది' పేరుతో రెండు వారాల పాటు చుట్టుముట్టి ఎన్ని హెచ్చరికలు చేసినా, ఆహారం, నీళ్లూ, విద్యుత్ అందకుండా చేసినా బాబా ఖాతరు చేయలేదు. తనకు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న వందలాది కమెండోల సహాయంతో పిల్లా, పాపలతో వున్న భక్తులందరినీ బంధించి వాళ్లను అడ్డుపెట్టుకుని పోలీసులు ఆటాడించాలని చూశాడు. ఆరుగురు బందీలు చనిపోయినా చలించలేదు. పోలీసులు ఆశ్రమం గోడలు పగలకొట్టి బందీలకు స్వేచ్ఛ కల్పించారు. చివరకు నవంబరు 19 న రాత్రి 9.30కు పోలీసులు లోపలకు చొచ్చుకుని వెళ్లి బాబాను పట్టుకుని జైల్లో పడేశారు. అతనితో బాటు 425 మంది అనుచరులను కూడా. కొత్తగా ఏర్పడిన హరియాణా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించిందని అనుకోవడానికి ఏమీ లేదు. హైకోర్టు వాళ్ల నెత్తిన అంకుశంతో పొడవడంతో వేరే మార్గం లేకపోయింది. అనేక కేసుల్లో ముద్దాయిగా వుండి, కోర్టు సమన్లను ఖాతరు చేయకుండా, న్యాయవ్యవస్థను ధిక్కరిస్తున్న బాబాను నవంబరు 21 లోగా అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచమని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం కదిలింది. బాబా కోర్టునే కాదు, చాలా వ్యవస్థలను ధిక్కరించాడు. ధిక్కరించమని అందరికీ ఉద్బోధిస్తాడు. దేవుణ్ని, మతాలను, మతగ్రంథాలను, మతాచారాలను, పూజాపునస్కారాలను, గురువులను తిరస్కరించమంటాడు. అదే అతని మార్గం. ఈ మార్గానికి కబీర్ మార్గం అని పేరు పెట్టుకున్నాడు.
ఈ మోక్షమార్గం అతనికి హిమాలయాల్లో తపస్సు చేస్తూండగా స్ఫురించిందని అనుకోవద్దు. అతను పాలిటెక్నిక్ చదివి ఇరిగేషన్ డిపార్టుమెంటులో జూనియర్ ఇంజనియరుగా పనిచేసేవాడు. పరమబద్ధకస్తుడు. అతని అతితెలివిని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించినంతకాలం సహించి చివరకు 2000 వ సం||రంలో బయటకు సాగనంపారు. 49 ఏళ్ల వయసులో సంపాదించే మార్గం మూసుకుపోవడంతో బాబా అవతారమెత్తాడు. కబీర్ మార్గాన్ని ప్రవచించిన స్వామి రామదేవానంద్ గారి శిష్యుణ్నని చాటుకుని, ఓ మంచి రోజు చూసి 'జగద్గురు శ్రీ తత్వదర్శి సంత్ రామ్‌పాల్ జీ మహరాజ్' అనే పేరు పెట్టుకుని రోహటక్ వద్దనున్న కరోంఠాలో ఓ ఆశ్రమం తెరిచాడు. ముక్కు మూసుకుని కూర్చుంటే పబ్లిసిటీ ఎలా వస్తుంది? ఆర్యసమాజ్‌ను, దాని స్థాపకుడు దయానంద సరస్వతి రాసిన 'సత్యార్థ ప్రకాశ్' పుస్తకాన్ని బహిరంగంగా నిందించి వార్తల్లోకి ఎక్కాడు. ఆర్యసమాజ్ వాళ్లు అభ్యంతరం తెలిపితే తన అనుచరులచేత కొట్టించాడు. వాళ్లూ వీళ్లని కొట్టారు. ఇద్దరి మధ్య కొట్లాటలు, కేసులు, తద్వారా పబ్లిసిటీ! ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాబాలో ఏ అవతారమూర్తి వున్నాడో అని వెతికే పామరజనానికి లోటు లేదు కాబట్టి హరియాణా, పంజాబ్, ఢిల్లీ, యుపి, ఎంపీ, రాజస్థాన్ లక్షలాది భక్తులు పోగడ్డారు. (ప్రస్తుతం 25 లక్షలమందిట) డబ్బు కావాలనో, ఆరోగ్యం బాగుపడాలనో, కొడుకు పుట్టాలనో – ఏదో కారణం చేత జనాలు మూగుతున్నారు. వీళ్ల ఓట్ల మీద కన్నేసిన రాజకీయనాయకులు కూడా వచ్చి ఓ నమస్కారం పెట్టిపోతున్నారు. భక్తుల మాట ఎలా వున్నా బాబాకు డబ్బు వచ్చిపడింది. ఇప్పుడతని విలువ రూ. 100 కోట్లట!
2006 నాటికి ఆర్యసమాజ్‌తో గొడవలు ముదరి ఒకతను మరణించి, అనేకమంది తీవ్రంగా గాయపడడంతో పోలీసులు ఆ ఆశ్రమం ఖాళీ చేయించి బాబాకు జైల్లో ఆశ్రయం కల్పించారు. 2008లో బెయిలుపై బయటకు వచ్చాక యిప్పుడున్న బర్వాలా ఆశ్రమం తెరిచాడు. ఆ తర్వాత అతని అనుచరులు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చేయడంతో యింకో కేసు పడింది. 2013లో యితను గార్డుల కారణంగా బుల్లెట్ తగిలి ఒక ఆశ్రమవాసిని చనిపోవడంతో మరో కేసు పెట్టారు. ఈ కేసుల విచారణకు కోర్టులు యితన్ని హాజరు కమ్మనమని గత నాలుగేళ్లలో 40 సమన్లు పంపడం, యితను లెక్క చేయకపోవడం జరుగుతూ వచ్చింది. చివరకు పంజాబ్, హరియాణా హై కోర్టు యితన్ని అరెస్టు చేయించి, నవంబరు 20 న కోర్టుకి పిలిచి 2008 నాటి బెయిలు రద్దు చేసి, కోర్టు ధిక్కారనేరాన్ని జోడించి పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఎమ్బీయస్ ప్రసాద్