cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

టాలీవుడ్ అనాథ?

టాలీవుడ్ అనాథ?

భారతదేశ చలన చిత్ర రంగంలో ఒక్క రాష్ట్రానికి చెందినదైనా, టాలీవుడ్ దేశం మొత్తాన్ని ఫ్రభావితం చేసే స్థాయిలోనే వుంది. ఏటా వందల సినిమాలు, వందల కోట్ల టర్నోవర్ ఇక్కడ జరుగుతోంది. అన్నింటికి మించి ఇంత వరకు టాలీవుడ్ మిగిలిన ప్రాంతాల సినిమా పరిశ్రమలకు భిన్నంగా వుంటూ వస్తోంది. చలన చిత్ర పరిశ్రమ అయినా కూడా ఓ అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారం మాదిరిగా ఇక్కడి వ్యవహారాలు నడుస్తూ వస్తున్నాయి. 

తెలుగు సినిమా పుట్టి, చిగుర్లు వేసిన దగ్గర నుంచి ఒక కట్టుబాటు అన్నది అలా అలా పెరుగుతూ వచ్చింది. ఆఖరికి అది మర్రిమానులా ఎదిగింది. అయితేనేం ఆ మర్రి నీడలో సినిమా రంగం ఓ ప్లస్ ను ఓ మైనస్ ను సంపాదించుకుంది. సరైన కట్టుబాట్లు, పద్దతులు, క్రమశిక్షణ అలవడ్డాయి. ఆఫ్ ది రికార్డుగా ఎలా మాటలు విసిరేసినా, ఆన్ ది రికార్డుగా కాస్త కంట్రోల్ లో వుండడం అలవాటైంది. 

ఇదొక్కటే కాదు  సినిమా నిర్మాణం వ్యవహారాలను కూడా ఓ సిస్టమాటిక్ గా తయారుచేసాయి. అయితే అదే సమయంలో మైనస్ ఏమిటంటే, తమ కరుణా కటాక్షాలు వుంటే తప్ప వేరెవరు హీరోలు కాకుండా, దర్శకులు కాకుండా చేసేసారు. యావత్తు సినిమా పరిశ్రమను కొద్ది మంది తమ గుప్పిట్లో వుంచుకున్నారు. 

ఇప్పుడు జరిగిన మా సంఘ ఎన్నికల సాక్షిగా ఈ కట్టుబాట్లన్నీ తెగిపోయినట్లు కనిపిస్తోంది. తొలితరంలో ఎన్టీఆర్ పెద్దాయిన బాధ్యత తీసుకున్నారు. ఆయన కనుసన్నలలో పరిశ్రమ ఒదిగి ఒదిగి నడిచింది. ఆయన తరువాత అక్కినేని అటువంటి బాధ్యత ఏదీ స్వీకరించకున్నా, కనీసం ఆయన పట్ల గౌరవం అలా వుండేది. దర్శకుడు దాసరి ఆ తరువాత కాస్త పెద్దరికం సంతరించకున్నారు. 

ఇప్పుడు అక్కినేని లేదు..రామానాయుడు లేరు. కాస్త పెద్దరికం వహించగలిగింది ఇద్దరే మిగిలారు. దాసరి, అల్లు అరవింద్. కానీ ఇటీవల కొంత కాలంగా దాసరి హవా కూడా తగ్గింది. ఏ స్టేజ్ కు ఆ మాట అన్నట్లు ఆయన మాట్లాడడం, ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడడం వంటివి ఆయన స్థాయిని పలుచన చేసాయన్నది వాస్తవం. పైగా ఆయన కూడా ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా చేసినప్పటి కేసులతో కిందా మీదా అవుతున్నారు. 

అల్లు అరవింద్ ది డిప్లమాటిక్ వ్యవహారం. తను పనులు..తన వ్యవహారాలే. ఇక రాఘవేంద్రరావు ఎవ్వరినీ నొప్పించక, తానొవ్వక అన్నట్లు వుంటారు. మోహన్ బాబు మాట కరుకు. మనసులో ఎలా వున్నా, ఆయన దగ్గరకు వెళ్లడానికి జనం భయపడతారు. ఆయన మొత్తం టాలీవుడ్ కంట్రోల్ చేయలేరు. ఇక మిగిలింది ఎవరూ లేరు. మురళీ మోహన్ వెనుక తెలుగుదేశం, హోదా, సామాజికవర్గం వంటి వాటి వల్ల కాస్త కనిపిస్తున్నారు కానీ లేకుంటే అంత లేదు. విబి రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్లు లేరు. 

ఇప్పుడు అందుకే టాలీవుడ్ లో గొంతులు లేస్తున్నాయి. ఆఫ్ ది రికార్డు అనడం లేదు..ఆన్ ది మైక్ అంటున్నాయి. అందులో ఇప్పుడు టాలీవుడ్ తెలంగాణలో వుంది. ఆంధ్రలో లేదు. ఇప్పటికే కెసిఆర్ ప్రాపకం సంపాదించుకుని, ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పడు కట్టుబాట్లు, కహానీలు అంటే నడిచేది కాదు. 

కానీ నిజానికి ఇలాంటప్పుడే ఓ పటిష్టమైన పెద్దరికం, నాయకత్వం టాలీవుడ్ కు అవసరం. అటు అక్కినేని, ఇటు నందమూరి ఫ్యామిలీల వారసులు ఇలాంటి వ్యవహారాలకు దూరంగా వుంటారు. వారి పనేదో వారిదే. మెగాస్టార్ గా చిరంజీవికి అపార గౌరవం వున్నా, ఆయన కూడా ఇలాంటి మధ్యవర్తిత్వాలకు, రాజీలకు దూరంగానే వుంటారు. వుంటున్నారు. 

మా సంఘ ఎన్నికలు టాలీవుడ్ లో నాయకత్వం, క్రమశిక్షణ లేమిని స్పష్టంగా ఎత్తి చూపాయి. మురళీ మోహన్ పోటీ చేయను అని ప్రకటించాక, దాదాపు చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది అధ్యక్ష పదవి ఆఫర్. బాలయ్య, నాగార్జున, వెంకీలలో ఎవరైనా ఒక్కరు మేం రెడీ అని వుంటే ఇంత అవస్థ, అల్ల కల్లోలం జరిగి వుండేది కాదు. కానీ వారు మాకెందుకు అని అనుకోవడం వల్లనే వచ్చింది ఇదంతా. 

కానీ అప్పట్లో అక్కినేని, ఎన్టీఆర్ ఇలా అనుకోలేదు. పదవులు వున్నా లేకున్నా, టాలీవుడ్ పై గ్రిప్ ను ఏనాడూ వదులుకోలేదు. దాని వల్ల చాలా వరకు టాలీవుడ్ కు మంచే జరిగింది. ఇప్పుడు మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా పరిస్థితి చక్కబడుతుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ గెలిచినా, ఆయనకు అంత కంట్రోలు వుండదు. జయసుధ గెలిచినా, ఆమెకు అంత సహకారం వుండకపోవచ్చు.

ఇప్పటికైనా సినిమా రంగ పెద్దలు అరవింద్, సురేష్, చిరంజీవి, నాగ్, బాలయ్య, వెంకీ వంటివారు కలిసి, చర్చించుకుని, టాలీవుడ్ ను ఓ ట్రాక్ పైకి తీసుకురావడం అవసరం. అయితే అంతకు ముందు వారంతా ఓ తాటి మీదకు రావాలి. జరిగే పనేనా?

చాణక్య

writerchanakya@gmail.com

 


×