ఫైర్ బ్రాండా? ‘బూతు’ బ్రాండా?

రాజకీయాల్లో ‘ఫైర్ బ్రాండ్’ అనే మాట బాగా పాపులర్. ఆవేశంగా మాట్లాడే నాయకురాళ్లను ఉద్దేశించి మీడియాలో ఈ పదం వాడుతుంటారు. ఎందుకో దీన్ని ఆడవాళ్లేక పరిమితం చేశారు. కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి, పశ్చిమ…

రాజకీయాల్లో ‘ఫైర్ బ్రాండ్’ అనే మాట బాగా పాపులర్. ఆవేశంగా మాట్లాడే నాయకురాళ్లను ఉద్దేశించి మీడియాలో ఈ పదం వాడుతుంటారు. ఎందుకో దీన్ని ఆడవాళ్లేక పరిమితం చేశారు. కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను ‘ఫైర్ బ్రాండ్’ అంటూ ఉంటారు. ఒకప్పుడు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారికి కూడా ఈ పేరు ఉండేది. రేణుకా చౌదరి టీడీపీలో ఉన్నప్పుడు ఎన్‌టిఆర్ ఆమెను ఎంతగా మెచ్చుకున్నారంటే ‘తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒకే ఒక్క మగాడు’ అనేవారు. ఇక్కడ మగాడు అనే మాట ధైర్యానికి చిహ్నంగా వాడారన్నమాట. సాధారణంగా  ప్రతీ పార్టీలోనూ ఒక ఫైర్ బ్రాండ్ ఉంటుంది. ఈ ఫైర్ బ్రాండ్లకు నోరు ఎక్కువుంటుంది. ధాటిగా మాట్లాడతారు.  ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఒక్కోసారి వీరివల్ల పార్టీకి లాభం జరిగితే, మరోసారి తీవ్ర నష్టం కూడా జరుగుతుంది. ఎందుకు? ఆవేశంలో వెనకా ముందు చూడకుండా, ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించకుండా వ్యవహరిస్తుంటారు కాబట్టి వారి వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా, పార్టీ పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. వైకాపా నగరి శాసనసభ్యురాలు, మాజీ సినిమా హీరోయిన్ రోజా అలియాస్ రోజా రెడ్డి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇలాగే ఉంది. 

గౌరవం కోల్పోయిన రోజా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రోజా వ్యవహరించిన తీరు,  ప్రవర్తన, వాడిన భాష అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వైకాపాలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రోజాను ఇప్పుడు ‘బూతు బ్రాండ్’ అంటున్నారు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్నవారికి ఓ ఇమేజ్ ఉంటుంది. అంతో ఇంతో గౌరవం ఉంటుంది. కాని రోజాకు ఆ ఇమేజ్, గౌరవం లేవు.  అలవోకగా, సిగ్గు పడకుండా బూతులు మాట్లాడే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు తప్ప ఓ చక్కటి శాసనసభ్యురాలిగా కాదు. ఆమెను చూడగానే ఆమె మాట్లాడిన బూతులే గుర్తుకు వస్తాయి తప్ప గౌరవం కలగదు. మగవాళ్లు సైతం సిగ్గుతో తలవంచుకునేలా ఆమె ప్రవర్తించిన తీరు శాసన సభ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుంది. ‘రేప్’ వంటి అభ్యంతరకర పదాలు వాడారేంటి? అని అడిగిన ఓ విలేకరిని ‘ఏం నువ్వు రేప్ చేస్తావా?’ అని రోజా ప్రశ్నించారు. ఇంత పచ్చిగా మాట్లాడే వారికి ప్రజా జీవితంలో కొనసాగే అర్హత ఉంటుందా?  (ఇది రోజాకే కాదు. ఎవరికైనా వర్తిస్తుంది. మిగతావారు పత్తిత్తులు కాదు కదా) తాను అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నానే స్పృహ ఆమెకు లేదు.  పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. కొందరు ఆవేశంలో అభ్యంతరకర పదాలు వాడినా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. రోజా ఆ పని చేయకుండా స్పీకర్‌ను, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా అసహ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షనిస్టు స్పీకర్ అయ్యాడని, బొల్లి వ్యాధి ఉన్నోడు ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. కుంటోడు, గుడ్డోడు పరిపాలన చేయొచ్చుగాని బొల్లి వ్యాధి ఉన్నోడు పరిపాలన చేయకూడదని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రోత్సహించిన బాబునే దుర్భాషలు

టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును తెగ పొగిడిన రోజా ఇప్పుడు బజారు భాషలో మాట్లాడుతున్నారు. ఇలా సోయి మర్చిపోయి మాట్లాడటం రాజకీయమా? ఇంత ఓవరాక్షన్ చేస్తేగాని రాజకీయంగా ఎదగలేమని ఉద్దేశమా? ఆమె టీడీపీలో ఉన్నప్పుడూ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. ధాటిగా మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడేది. ఈ వ్యవహారశైలిని అప్పట్లో చంద్రబాబు, ఇతర నాయకులు ప్రోత్సహించారు కూడా. రోజా చాలా చురుకైన నాయకురాలని మెచ్చుకునేవారు. ఆ చురుకుదనం ఇప్పుడు మరింత శృతిమించి చంద్రబాబును బొల్లోడు అని తిట్టే వరకూ వెళ్లింది. ఒకప్పుడు రోజాకు, అప్పట్లో ప్రజారాజ్యం నాయకురాలిగా ఉన్న శోభారాణికి మధ్య పబ్లిగ్గానే అసహ్యకరంగా వాదోపవాదాలు జరిగాయి.  రాయలేని, చెప్పలేని భాషలో బండ బూతులు తిట్టుకున్నారు. (ఆ వీడియోలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి) బూతులు మాట్లాడే వారిని  పార్టీల అధినేతలు అదుపు చేయకుండా ప్రోత్సహిస్తుండటంతో  ఇలాంటివారు పార్టీ మారినప్పుడు తమ మాజీ అధినేతలను తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు ఇది అనుభవంలోకి వచ్చింది. వైకాపా అధినేత జగన్ కూడా రోజాను ప్రోత్సహిస్తున్నారుగాని నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పడంలేదు. జగన్ మెప్పు కోసం ప్రత్యర్థులను తిడుతున్న రోజా ఒకవేళ వైకాపా నుంచి వెళ్లిపోతే జగన్‌నూ బూతులు తిడుతుంది. ఏ నాయకుడు లేదా నాయకురాలు చేసే పనైనా ఇదే. 

తిడితేనే ఎదుగుతారా?

రాజకీయ నాయకులు ధాటిగా మాట్లాడాలి. ప్రత్యర్థులపై విరుచుకుపడాలి. కాని అది హుందాగా జరగాలి. పరిమితుల్లో జరగాలి. ఉదాహరణకు…క్రికెట్‌లో ఓ జట్టు అరివీర భయంకరంగా ఆడి ప్రత్యర్థి జట్టును చిత్తు చేస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? నియమ నిబంధనల పరిధిలోనే జరుగుతుంది. రాజకీయం కూడా ఇలాగే ఉండాలి. చిరస్మరణీయులైన కొందరు నాయకులు అంత ఎత్తుకు ఎదగడానికి కారణం బూతులు తిట్టడమా? అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడటమా? కానేకాదు. హుందాగా వ్యవహరించడం, సిద్ధాంతపరంగా మాట్లాడటం, ప్రత్యర్థులు ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా తమ వాదనాపటిమతో అవతలవారిని చిత్తు చేయడం..మొదలైనవి వారు గొప్ప నాయకులుగా ఎదగడానికి కారణం. 1950 దశకంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓ నాయకుడు ‘రుద్దుతున్నారు’ అనే పదం వాడితే అది అభ్యంతరకరమైన పదమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో హుందాగా వాదోపవాదాలు జరిగిన అసెంబ్లీలో ఇప్పుడు పచ్చి బూతులు మాట్లాడుతున్నా జనం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.   

వాగ్ధాటి ఉన్నా…వాదనాపటిమ లేదు

ఇప్పుడున్న చాలామంది నాయకులకు వాగ్ధాటి ఉంది. కాని వాదనాపటిమ లేదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. ఓ సబ్జెకుపైన (ప్రజా సమస్యలకు సంబంధించి) అసెంబ్లీలో చక్కటి వాగ్ధాటితో మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలగాలి. ఆలోచింపచేయాలి. వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. ప్రజాప్రతినిధి చేయాల్సిన ప్రాథమికమైన పని ఇది. ముఖ్యంగా ప్రతిపక్షం. ఒకప్పుడు వాగ్ధాటి, వాదనాపటిమ ఉన్న ఉద్దండులు అసెంబ్లీలో ఉండేవారు. వివిధ అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి సభకు వచ్చేవారు. కొందరు నాయకులు నడిచే లైబ్రరీలుగా ఉండేవారనడం అతిశయోక్తి కాదు. ఇలాంటి వారిని అధికారపక్షమూ ఎంతో గౌరవించేది. సుందరయ్యవంటి వారిని గురించి ఇప్పటికీ చెప్పుకోవడానికి ఇదే కారణం. కాని ఇప్పుడు రివర్స్‌గా ఉంది. చట్టసభల్లో ఉన్నవారిలో ఎక్కువమందికి అధ్యయనం లేదు. సబ్జెకులపై పట్టు లేదు. లైబ్రరీకి వెళ్లరు. పుస్తకాలు చదవరు. అసెంబ్లీ నియమనిబంధనలు తెలియవు. తెలిసినా ఖాతరు చేయరు. అంతా అరాజకవాదం. రౌడీయిజం. ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటానికి వెంపర్లాడుతుంటారు. పథకం ప్రకారం చట్టసభలో గొడవ చేస్తారు. ప్రజాసమస్యలు చర్చకు రానివ్వరు. వచ్చినా సవ్యంగా మాట్లాడరు. రోజా వంటి వారు కూడా చరిత్రలో మిగులుతారేమోగాని గౌరవంగా కాదు. బూతు బ్రాండుగా. 

ఎం.నాగేందర్