ఈసారి జరిగిన 'మా' సంఘ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. అయితే జరిగిన హడావుడి మేరకు ఓటింగ్ శాతం లేదు. పైగా సినిమాల్లో పది మందికి ఆదర్శప్రాయమైన కబుర్లు చెప్పే హీరోలు, ఓటింగ్ చేయాలన్న తమ బాధ్యతను హక్కును మరిచిపోవడం ఆశ్చర్యం. దాదాపు మూడు వందల మంది ఓట్లు వేయలేదు. అయితే చిత్రమేమిటంటే, గతసారి కన్నా ఈసారి పోలింగ్ శాతం పెరగడం. దాదాపు 80 మంది వరకు ఈసారి అదనంగా ఓటు వేసారట.
ఈసంగతి అలా వుంటే, నిన్నటి వరకు జయసుధ ప్యానెల్ గెలుపు గ్యారంటీ..అంతా వన్ సైడ్ అని అంటే, ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యాక ఆ ధీమా సడలిపోవడం. ఆర్పీ (రాజేంద్రప్రసాద్)కు మొగ్గు వుందని అనుకున్నారు. ఇక్కడే అచ్చమైన సినిమాటిక్ ట్విస్ట్ వచ్చిందని తెలుస్తోంది.
జయసుధ వెనుక వున్న సినమా పెద్దలు మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్, ట్రెండ్, సమాచారం క్రోడీకరించి, అప్పటి కప్పుడు వ్యూహరచన సాగించారని వినికిడి. తమకు ఓట్లు వేసే వారు ఎక్కడ, ఏ పనిలో, ఎలా వున్నా, వాకబు చేసి, హుటాహటిన కబురు చేసి, రప్పించి, ఓటింగ్ చేయించి పంపారని టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తోంది. దీంతో సాయంత్రానికి జయసుధ వర్గం ఊపిరి పీల్చుకుందని, గెలుపుపై ధీమా పడిందని తెలుస్తోంది. కోర్టు ఆదేశించిన తరువాత ఫలితాలు వెల్లడైతే కానీ, అసలు సంగతి ఏమీ వెల్లడి కాదు.