Advertisement

Advertisement


Home > Articles - Chanakya

వీరుడా..విరాళాలేల?

వీరుడా..విరాళాలేల?

అన్నపూర్ణ ఆంధ్రదేశం రెండు ముక్కలయింది. పెద్ద కొడుకు, చిన్నకొడుకు వేరయ్యారు. సహజంగానే ఉమ్మడి ఇల్లు పెద్దవాడికి దక్కింది. చిన్నావాడికి ఇల్లు లేదు. దానికి మింజువలె అంటే, బదులుగా డబ్బు ఇప్పిస్తామని పెద్ద మనుషులు చెప్పారు..హామీ ఇచ్చారు. ఈ హామీ ఏ మేరకు నెరవేరుతుందో చూడకుండానే, హమీ నెరవేర్చమని కోరకుండానే,.,.ఇల్లు కట్టుకుంటా చందాలివ్వండి అని ఊరు మీద పడడమేమిటి? దీనికేమన్నా అర్థం వుందా?

కేంద్రం ఏం చెబుతూ వస్తోంది మొదట్నించీ? మీకు హైదరాబాద్ కన్నా అద్భుత నగరాన్ని నిర్మించి ఇస్తాం..మీరు వీరులు..శూరులు..కడు సమర్థులు. మీకు బోలెడు ఇసుక తీరం వుంది..అది వుంది..ఇది వుంది. మీకు సకల సహాయం చేస్తాం..రాజధాని నిర్మించుకోండి అంది. నమ్మినా , నమ్మకున్నా, చేసేది ఏమీ లేదు కాబట్టి, విభజన జరిగిపోయింది. అధికారంలో వున్న యుపిఎ అంథకారంలోకి పోయింది. కానీ అదృష్టమేమిటంటే, విభజనను గట్టిగా సమర్థించిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ కూడా రాష్ట్రంలోని తెలుగదేశం పార్టీకి మిత్ర పక్షమే కాదు, అక్కడా ఇక్కడా అధికారం పంచుకున్న పార్టీలు కూడా. అంటే గడచిన యుపిఎ ఇచ్చిన రాజధానికి సహాయం వాగ్దానాన్ని భాజపా తోసి రాజనడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. సరే, రాజధానికి నిర్మాణానికి చంద్రబాబు చెబుతున్నట్లు నాలుగో, అయిదో లక్షల కోట్లు కేంద్రం ఇవ్వకపోవచ్చు. కనీసం ఇరవయ్యవ వంతు అంటే లక్ష కోట్లయినా సాయం చేయదా? వాటితో పని ప్రారంభించి, ఖర్చు చేసి, ''ఇదిగో మీరు ఇంత ఇచ్చారు..ఇంత పని జరిగింది..ఇంకా ఇంత కావాలి.''అని ఒప్పించే సత్తా నాయుడు అంటే నాయకుడు అనే కొత్త అర్థం రాజకీయ డిక్షనరీలోకి చేర్చిన వెంకయ్యనాయుడు కు లేదా? లేదా మోడీ మన్ననలు పొందిన చంద్రబాబుకు లేదా? 

అది అలా వుంచితే రాజధాని ఎక్కడో ఇంకా తెలియదు. బాబు అయితే విజయవాడ-గుంటూరు నడుమ అని ధృఢ నిశ్చయంతో వున్నారు. మోడీ ప్రభుత్వం మెడలు వంచి, అక్కడే రాజధానిని ఫిక్స్ చేయించగలనన్న ధీమా ఆయనది. అందుకే మంత్రివర్గ సమావేశంలో కూడా ఆ ముచ్చటే మరోసారి వెల్లడించారని వార్తలు వినవచ్చాయి. మరి రాజధాని నిర్ణయాన్ని ప్రభావితం చేయగలనని అంత ధీమా వున్నపుడు, అందుకు నిధులు కూడా కేంద్రం నుంచి తేగలనన్న ధీమా వుండాలి కదా? అక్కడ మాత్రం బాబు ఎందుకు బేలగా మారిపోతున్నారు. కనీసం ఓ ఇటుకనన్నా ఇవ్వండి..కనీసం అందుకు సరిపడా నగదన్నా (అంటే మూడు నుంచి అయిదు రూపాయిలు) ఇవ్వండి అని దేవురిస్తున్నారు.? విభజించింది కాంగ్రెస్, భాజపాలు. అధికారంలో వున్నది భాజపా..మరి ప్రజలెందుకు విరాళాలివ్వాలి? ఎవడబ్బ సొమ్ము అని కేంద్రం రాజధానికి నిధులు ఇవ్వకుండా వుంటుంది? ముందు అక్కడ పోరాడండి..విభజనకు అనుకూలంగా భజన చేసారు. మాకు రాజధాని నిర్మించి ఇవ్వండి అని పోరాడండి. దానికి అనుకూలంగా అవసరమైతే ప్రజల్ని సమాయత్తం చేయండి. అంతే కానీ ఆదికి ముందే విరాళాలంటూ జోలె పట్టడం కాధు. దానికి ఇంకా చాలా సమయం వుంది. రాజధాని నిర్ణయం కావాలి. కేంద్రం ఇచ్చేది ఇవ్వాలి..దాంతో చేసేది చేయాలి..అది చాలకపోతే అప్పుడ. అంతకు ముందే ఈ విరాళాల గోల ఏల వీరుడా?

చాణక్య

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా