ఇలాటి పరిస్థితుల్లో పటిష్టమైన ప్రభుత్వం పరిస్థితులను తన చేతిలోకి తీసుకుని, పబ్లిక్ సెక్టార్‌ను కాపాడాలి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు లొంగకుండా తనకు కావలసిన రీతిలో దేశాన్ని మలచుకోవాలి. కానీ కార్పోరేట్లకు కావలసినది వేరు. అందుకే 'దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే రైటిస్టు మార్గమే మేలు, అలా నడిపించగల సమర్థుడు మోదీయే' అనే నినాదంతో మోదీని నిలబెట్టాయి. అయితే ఆ మాట వారు చెపితే మనకు అనుమానం వస్తుంది. అందుకని కొందరు మేధావులను ముందుకు తోశారు. వారు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆ పనిని చేస్తున్నారు. 'ప్రభుత్వం చాలా తక్కువగా అధికారం వినియోగించాలి. దేనినీ నియంత్రించనక్కరలేదు, యిదే మంచి మార్గం.' అనే ఆలోచనను విద్యావంతుల మెదళ్లలో ప్రవేశపెట్టారు. 'మన్‌మోహన్ చేసినది యిదే కదా, ప్రపంచబ్యాంకు చెప్పినట్లు ఆడడమే కదా, అది మన ఆర్థికవ్యవస్థను నాశనం చేసింది కాబట్టి దానికి వ్యతిరేక దిశలో వెళ్లాలి కదా' అనేవాళ్లను అభివృద్ధి నిరోధకులుగా ముద్ర కొట్టడమే వీళ్ల పని. ఈ ఆర్థిక ప్రతిపాదనలకు జాతీయవాద రంగు, హిందూత్వ రంగు పులిమి అందించడంతో మనకు అసలు స్వరూపం తోచకుండా పోతుంది. వీరి పద్ధతులను కాదన్నవారందరూ జాతిద్రోహులే, హిందూవ్యతిరేకులే. 'మన దేశం కోసం..', 'మన హిందూమతం కోసం..' 'మన జాతి గౌరవాన్ని ప్రపంచంలో యినుమడింపచేయడానికి..' అంటూ వాళ్లు చేసే ప్రచారం విన్నప్పుడు మొదటిసారి 'తప్పేముంది?' అని పిస్తుంది. ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప పొరలు విడవు.
'మన దేశం యిలా ఆర్థికంగా వెనకబడి వుండడానికి ముస్లిములు కుటుంబనియంత్రణ పాటించకపోవడమే..' అనే స్లోగన్ వుందనుకోండి, కుటుంబ నియంత్రణ పాటించని హిందువులు ఎంతమంది, వారిలో ఎందరు దారిద్య్రరేఖకు దిగువన వున్నారు? పాటించే ముస్లిములెందరున్నారు? ప్రభుత్వసాయం పొందేవారిలో ముస్లిముల శాతం ఎంత? యిలాటి ప్రశ్నలకు సమాధానాలివ్వరు. గ్రాస్ జనరైలేజషన్‌తో సరిపెడతారు. 'మతాంతీకరణ వలన క్రైస్తవుల జనాభా పెరిగి, భారతదేశంలో హిందువులు మైనారిటీగా మారిపోతారు. అందుచేత మతమార్పిడులు నిషేధించాలి..' అనే నినాదం తీసుకోండి. 'ఏడాదికి ఎంతమంది మారుతున్నారు? అదే రేటు ఎన్నేళ్లు కొనసాగితే ఎంతకాలంలో హిందువులు మైనారిటీ అవుతారు? భారతదేశంలో మతమార్పిడులు యిప్పుడే వచ్చాయా? శకులు, హూణులు, కుషానులు, యవనులు.. యిలా అనేక జాతులు మనదేశంపై దండెత్తి వచ్చి, మన సంస్కృతి చూసి ముచ్చటపడి, మన జీవనస్రవంతిలో కలిసిపోయారని చదువుకున్నాం. వాళ్లకు అసలంటూ ఏదో ఒక మతం వుంటుంది కదా, అది వదిలేసి హిందూమతంలోకి మారినపుడు మతమార్పిడి జరగలేదా? అలాగే బౌద్ధులు, జైనులు ఒక కాలంలో మనదేశంలో విరివిగా వుండేవారు. వారంతా కొన్నాళ్లకి హిందూమతంలోకి మారిపోవడం వలన వాళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. బౌద్ధులను వెతుక్కోవలసి వస్తోంది. హిందూమతంలోకి మతమార్పిడి జరిగినపుడు ఓకేనా? ఇప్పుడు మాత్రమే నిషేధించాలా? మతం మార్చుకోవడం అనేది వ్యక్తిగతం. దానిపై రాజ్యానికి హక్కు వుంటుందా? హిందూమతం విడిచి వెళ్లేవారు ఎందుకు విడిచి వెళుతున్నారో హిందూమత పెద్దలు, అభిమానులు ఆత్మపరిశీలన చేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారా? ఇలాటివి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు యివ్వరు. అడిగినవాళ్లను సూడో సెక్యులరిస్టులు (సూడో అనే పదం కలపందే సెక్యులరిస్టు పదాన్ని వాళ్లు వాడరు) అని నిందిస్తారు. ఆ నోటితోనే నువ్వు సోనియా భక్తుడివి, కమ్యూనిస్టువి అని కూడా తిడతారు. హిందువైతే, అచ్చమైన భారతీయుడివి అయితే మోదీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను, బిజెపిని సమర్థించి తీరాలి అనే సందేశంతో వాదన ముగిస్తారు.
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలపై ఏర్పడిన థింక్-ట్యాంకులు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే సొసైటీలు, ఎన్‌జిఓ (స్వచ్చంద సంస్థలు) ఎన్నో గత థాబ్దకాలంలో పుట్టుకుని వచ్చాయి. వీటి బాహ్యరూపం ఎకడమిక్ అధ్యయన కేంద్రాలు! వేర్వేరు సంస్థలుగా కనబడినా, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కార్యకలాపాలు నిర్వహించినా వీటిని బంధించే మూలసూత్రం రైటిస్టు విధానమే. ఇటువంటి కొన్ని సంస్థలు గురించి చెప్పాలంటే – ఆర్‌ఎస్‌ఎస్-జనసంఘ్ నాయకుడు నానాజీ దేశముఖ్ 1968లో స్థాపించిన దీన్‌దయాళ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ గ్రామాలను స్వయంసమృద్ధిగా చేయడానికి కృషి చేస్తూ వుంటుంది. దీని జనరల్ సెక్రటరీ భారత్ పాఠక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభయ్ మహాజన్. అనేక గ్రామాల్లో మంచి కార్యక్రమాలు చేస్తూ వుంటుంది. 1978లో ఆర్‌ఎస్‌ఎస్ నెలకొల్పిన మరో సంస్థ రాష్ట్రీయ సేవా భారతి, దీనికి అనుబంధంగా 442 సామాజిక సంస్థలున్నాయి. సోషల్ రిసెర్చి చేస్తున్నామంటారు. దీనికి అధ్యకక్షుడు సూర్యప్రకాశ్ టోంక్. డా|| జెకె బజాజ్ చెన్నయ్, ఢిల్లీలలో నడుపుతున్న సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కేంద్రం. 1990లో స్థాపించిన ఈ సెంటర్ సోషల్ సైన్స్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తూ అధికోత్పత్తి ద్వారా ఆహారభద్రత వంటి అంశాలపై వ్యాఖ్యానిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఢిల్లీలో 2008లో నెలకొల్పిన సంస్థ – ఇండియా పాలసీ ఫౌండేషన్. నిర్వాహకుడు ప్రొ. రాకేశ్ సిన్హా, అందరికీ ఆరోగ్యం చట్టం ఎలా తయారుచేయాలో నమూనా తయారుచేస్తున్నారు. డా|| వినయ్ సహస్రబుద్ధె 1982లో ముంబయిలో స్థాపించిన రామ్‌భావూ మాళ్గి ప్రబోధిని అనే సంస్థ పరిపాలనా వ్యవహారాలపై ఉద్యోగస్తులకు శిక్షణ యిస్తూ వుంటుంది. ఈయనే 2011లో ముంబయి, ఢిల్లీలలో పబ్లిక్ పాలసీ రిసెర్చి సెంటర్ అనే పేర 2011లో పెట్టారు. ప్రభుత్వపాలన ఎలా వుండాలో దీని ద్వారా డాక్యుమెంట్లు తయారుచేస్తున్నారు.
పుణెలో అర్థక్రాంతి ప్రతిష్టాన్ పెట్టిన అనిల్ బోకిల్ పన్నుల విధానానికి సంస్కరించడానికి సూచనలు చేస్తున్నారు. కంచన్ గుప్తా ఢిల్లీలో నిర్వహించే నీతి సెంట్రల్ అనే సంస్థ రైటిస్టు భావజాల వ్యాప్తికై పనిచేస్తుంది. 2013 నుండి మోదీకి మీడియాలో బాగా కవరేజి వచ్చేందుకు, బిజెపి అతన్ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు కృషి చేసింది. ఎలక్షన్ రోజుల్ల్లో దానికి రోజుకి 10 లక్షల హిట్లు వచ్చేవి. ఢిల్లీలోని బిజెపి హెడ్‌క్వార్టర్స్ నుండి డా|| శ్యామా ప్రసాద్ ముఖర్జీ రిసెర్చి ఫౌండేషన్ నిర్వహిస్తున్న డా|| అనిర్వాణ్ గంగూలీ జాతీయ భద్రత, విదేశీవిధానం, ఆర్టికల్ 370లపై విధాన నిర్ణయాలు రూపొందిస్తున్నారు. కన్యాకుమారిలో వున్న వివేకానంద రాక్ మెమోరియల్‌కు అనుబంధంగా ఢిల్లీలో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నడుపుతున్న అజిత్ దోవల్ టెర్రరిజంపై ప్రభుత్వ విధానం ఎలా వుండాలో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. (వివేకానందుడికి, టెర్రరిజానికి సంబంధం ఏమిటని అడగవద్దు). ఎన్నికల సమయంలో సిటిజన్స్ ఫర్ ఎక్కవుంటబుల్ గవర్నెన్స్ పేర ప్రశాంత్ కిశోర్ ఆన్‌లైన్ ద్వారా టెక్నోక్రాట్స్‌ను చేరదీసి మంచి ప్రభుత్వం కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం పోవాలని ప్రచారం చేశారు. రాజేశ్ జైన్, పీయూష్ గోయల్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి అనే పేర ఆన్‌లైన్ సంస్థను 2009లో పెట్టి అప్పణ్నుంచి విద్యావంతులైన యువతరాన్ని బిజెపివైపు ఆకర్షిస్తూ వచ్చారు.
ఈ సంస్థల్లో మేధావులు ఎక్కువగా కనబడటం వలన తటస్థులు కూడా ఆకర్షింపబడతారు. మరి కొన్ని సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో, విపత్తు సమయాల్లో సేవాభావంతో పనిచేసి అందరి మెప్పూ, ఆమోదం పొందుతాయి. ఆ సంస్థల అసలు లక్ష్యం ఏమిటన్నది దాని కార్యకర్తలకు గాని, అభిమానులకు గాని అర్థమే కాకపోవచ్చు. ఇలా అనేక సామాజిక సంస్థలు మోదీ యిమేజి పెరగడానికి కృషి చేశాయి, దేశప్రజలు అతనిపై,అతను ప్రవచించే విధానాలపై మితిమీరిన ఆశలు పెట్టుకునేట్లు చేశాయి. వాటిని మోదీ ఏ మేరకు నెరవేరుస్తారో, రైటిస్టు విధానం దేశాన్ని ఏ మేరకు ముందుకు తీసుకెళుతుందో కాలమే చెపుతుంది. – (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)