Advertisement


Home > Articles - Kapilamuni
శుభసంక్రాంతి: పతంగం నేర్పే జీవిత సత్యాలివే!

సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని మనందరికీ తెలుసు. పతంగులను మనం కేవలం సరదాగా ఎగురవేసే ఆటలాగా మాత్రమే చూడకూడదు. నిజానికి పతంగుల్లో జీవితానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం..

పాఠం 1:
‘‘వ్యక్తిగా మనకు ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆకాంక్ష ఉండాలి. ఎదగడానికి ప్రయత్నం చేయాలి’’ పతంగును చూడగానే మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి పాయింటు ఇదే.. లుకప్ యువర్ ఎయిమ్ హై అని పూజ్య వివేకానందుడు చెప్పిన సందేశం కూడా ఇదే. పెద్ద కలలు కనండి వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడండి అంటూ అబ్దుల్ కలాం బోధించిన జీవిత సత్యం కూడా ఇదే.

పతంగం ఎంత చిన్నది అయినా సరే.. అది ఆకాశపు అంచుల వరకూ వెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. చాలా సందర్భాల్లో అది ఆకాశాన్ని అందుకుంటుంది కూడా. అలాగే మనం ఎంత చిన్న వాళ్లం.. ఎంత పేదరికంలో ఉన్నాం.. ఎంత చిన్న పట్టణాల్లో గ్రామాల్లో బతుకుతున్నాం అనేది ఇక్కడ ప్రధానం కాదు.. ఎంతగా కలగంటున్నాం.. మన లక్ష్యాలను ఎంత పెద్దవిగా పెట్టుకుంటున్నాం.. ఎంతగా పరిశ్రమిస్తున్నాం.. అనేది ముఖ్యం. మనం తలచుకుంటే.. ఆకాశపు ఎత్తులకు చేరుకోవడం సాధ్యమే అని గాలిపటాన్ని చూసి మనం నేర్చుకోవాలి.

పాఠం 2 :
‘‘మన లక్ష్యాలకు పరిస్థితులు సహకరించాలి’’. గాలిపటం ఆకాశం అంచు వరకూ ఎగరడం అనేది నిజమే. కానీ గాలి వాటు, వాతావరణం సవ్యంగా సహకరించినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. వర్షం కురిసిందంటే.. ఇక పతంగానికి పయనమే ఉండదు. గాలి అనువుగా లేకపోతే.. పైకి వెళ్లడం కుదర్దు. అంటే వాతావరణం సహకరిస్తేనే ఆకాశాన్ని అందుకోవడం.

ఈ వాస్తవాన్ని మనం జీవితానికి కూడా అన్వయించి చూసుకోవాలి. మన లక్ష్యాలను అందుకోవడంలో పరిస్థితులు కూడా సహకరించాలి. సహకరించే పరిస్థితుల్ని కూడా మనమే సృష్టించుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన లక్ష్యఛేదనను ప్లాన్ చేసుకోవాలి.

పాఠం 3 :
‘‘ఎదురుదెబ్బలు తప్పవు.. పడ్డాక లేచి ఎగరాల్సిందే’’ పతంగం ఎగరేయడం మొదలెట్టినప్పటినుంచి.. అదే పనిగా ఎగురుతూ వెళ్లదు. మధ్యలో పడుతుంది. దాన్ని మళ్లీ లేపి ఎగరేయాలి.. కొన్ని సార్లు పడినా సరే.. ఒకసారి పుంజుకున్నదంటే.. అలా ఆకాశం వరకూ వెళ్లిపోతుంది.

అలాగే మన లక్ష్యాన్ని అందుకోడానికి ప్రయత్నించేటప్పుడు.. ప్రారంభ దశలో మనకు ఇబ్బందులు రావచ్చు. ఎదురుదెబ్బలు తగలవచ్చు. కానీ అక్కడితో నీరసపడిపోకుండా.. ఎదురుదెబ్బలను తట్టుకుంటూ ముందకు సాగాలి. నొప్పిని ఓర్చుకుంటూ ముందుకు సాగాలి. మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యం అవుతుంది.

పాఠం 4:
చిట్టచివరి పాఠమే అయినప్పటికీ.. పై మూడింటికంటె ఎంతో ముఖ్యమైన పాఠం ఇది.

‘‘మూలాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి’’.. అవును ఇది చాలా ముఖ్యమైన సంగతి. పతంగం ఆకాశం దాకా కూడా వెళ్లవచ్చు గాక... కానీ దాని మూలం భూమిమీదనే ఉందనే సంగతిని అది గుర్తుంచుకోవాలి. భూమి మీద ఉన్న మూలాలతో దారం అనే అనుబంధాన్ని అది బలంగా ఉంచుకోవాలి. ఆ అనుబంధం తెగిపోయిందంటే.. దారం పుటుక్కు మన్నదంటే.. ఇక పతంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారి.. నానా అగచాట్ల పాలవుతుంది. దిక్కూమొక్కూ లేకుండా పోతుంది.

మనుషులు కూడా అంతే.. లక్ష్యాలను అధిగమించినా.. ఎంత ఉన్నత స్థానాలకు చేరుకున్నా సరే.. మన మూలాలు ఎక్కడ ఉన్నాయో మనం గుర్తంచుకోవాలి.. మనం ఎక్కడినుంచి ఎదిగివచ్చామో గుర్తించుకుని.. వినయంతో ప్రవర్తించాలి. అహంకారాన్ని దరిజేరనివ్వకూడదు. మన మూలాలతో మన అనుబంధాన్ని తుంచేసుకోకూడదు.

... ఈ జీవితసత్యాలను తెలుసుకున్నప్పుడు.. ఆకాశాన్ని తాకే గాలిపటం లాగా.. మనం కూడా మన జీవితాల్ని సక్రమంగా తీర్చిదిద్దుకుని.. లక్ష్యాలను అధిగమిస్తుండవచ్చు.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

-కపిలముని