cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

నాదీ సేం డైలాగ్‌

నాదీ సేం డైలాగ్‌

నాకు ధర్మం తెలుసు. కానీ దాన్ని ప్రవృత్తిగా స్వీకరించలేకపోతున్నాను. నాకు అధర్మం తెలుసు కాని దాని నుండి బయటకు రాలేకపోతున్నాను. ఏదో దైవం హృదయంలో తిష్టవేసి ఎలా  నడిపిస్తోంటే అలాగే చేస్తున్నాను’

... ఇవి సుయోధన సార్వభౌముడి మాటలు. దుర్యోధనుడి ఔచిత్యాన్ని తెలియజెప్పే పద్యం ఇది. తన లోపాలను కూడా ఆయన చక్కగా ఒప్పుకున్నాడు. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే.. దుర్యోధనుడిలోని ఈ సద్బుద్ధిలో శత సహస్రాంశ కూడా మన నాయకులకు లేదు. ప్రత్యేకించి రాష్ట్రాన్ని నడుపుతున్నానని విర్రవీగే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తన వలనచేత నడపగలుగుతున్నాడని గునుస్తూ ఉండే నారా చంద్రబాబునాయుడు లు!

ఎందుకంటే- కారణాలు ఏవైనా తమకు లేని తెగువ వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ఉన్నదనే సత్యం వారికి తెలుసు. రెండు పార్టీలకు నేతలు వారు. ఆ రెండు పార్టీలు కూడా చెరి రెండేసి విరుద్ధాభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. పూర్తి సమైక్య వాంఛతో పోరాడుతున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఒక్కటే అని వారికి తెలుసు. కానీ ఆ విషయం ఒప్పుకోవాలంటే భయం. కీర్తి వారికి దక్కుతుందేమోననే భయం. లేదా, తమకు దర్శకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహిస్తుందన్న భయం. అందుకే వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రయత్నించినప్పుడు కాకుండా.. నష్టాన్ని అడ్డుకోకుండా..., నష్టం  కూడా పూర్తవుతున్న సమయంలో మళ్లీ తమ సొంత కీర్తికోసం వైకాపా పాటలే పాడుతున్నారు. వైకాపా మాటలే వల్లిస్తున్నారు. 

కానీ తన లోపాన్ని ఒప్పుకున్న దుర్యోధనుడి బుద్ధి కిరణ్‌, చంద్రబాబులకు లేదు. ఉంటే ఈ రాష్ట్రానికి ఇంతటి దుర్గతి పట్టేదే కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తామే తెగ త్యాగాలు చేస్తున్నట్లు నాటకాలాడుతూ.. మరోవైపు విభజన విషయంలో యథేచ్ఛగా ముందుకు దూసుకువెళ్లిపోవడానికి అధిష్ఠానం ఏం కోరుకుంటున్నదో ఆ ప్రకారంగా రాష్ట్రం నుంచి నిర్ణయాలు రావడానికి సహకరిస్తూ.. ప్రజలను నిత్యం వంచించడానికి పూనుకున్న ఈ ఇద్దరు నాయకుల వక్రనీతి ప్రజలు గుర్తించలేనిది కాదు. 

ఈరోజు బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపడం అనే తీర్మానం ఆమోదింపజేయడం ద్వారా తాను ఓ అద్భుతమైన పనిచేసి రాష్ట్ర ప్రజల్లోని సమైక్య ఆశలను సజీవంగా ఉంచానని కిరణ్‌ మభ్యపెడుతూ ఉండవచ్చు గాక..! కానీ అదే సమయంలో బిల్లు మీద చర్చ పూర్తయినదని కూడా స్పీకర్‌ మనోహర్‌ ప్రకటించారు. తెలంగాణ వాదులు కూడా పండగ చేసుకుంటున్నారు. తాము పండగ చేసుకోవాలో లేదో తెలియక సీమాంధ్రులు సందిగ్ధంలో ఉన్నారు. చాలా శోచనీయమైన పరిస్థితి ఇది! కేవలం ‘ప్రస్తుత’ రాజకీయ నిర్ణయాధికారమూ- నియంత్రణాధికారమూ తమ చేతుల్లోనే ఉన్న ఇద్దరు నాయకులు... కలసి కుమ్మక్కయి రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చేయడానికి బాటలు తీర్చిన మహా కుట్ర ఫలితమిది!! తమ రాజకీయ స్వార్థం తప్ప... కీర్తి కండూతి తప్ప.. ప్రత్యర్థులు చేస్తున్న పని మంచిదైనా సరే, రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేది అయినా సరే.. సహకరిస్తే వారికి కీర్తి దక్కుతుందేమోననే దుగ్ధతో.. దురాశతో, దుర్మార్గపు వైఖరితో.. రాష్ట్రాన్నే పణంగా పెట్టేసిన అన్యాయాలకు ఈ దుస్థితి నిదర్శనం. 

కిరణ్‌ పార్టీ : అధినేత్రి పాదపద్మముల సముఖమునకు...

రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును తిరస్కరించి, తిప్పి ఆయనకే పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రవేశపెట్టిన బిల్లు మూజువాణీ ఓటుతో నెగ్గిన తర్వాత.. సీఎం విజయగర్వంతో జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ శాసనసభనుంచి బయటకు వస్తుడడం చూసి... ఇక ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ గ్యారంటీ అనుకున్నారు చాలా మంది. నిజానికి ముఖ్యమంత్రి స్థాపించబోయే పార్టీకి సంబంధించి చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ప్రజల్లో ఈ పార్టీకి ఉన్న విశ్వసనీయత మాత్రం తక్కువే. ఒక అనధికారిక సర్వేలను బట్టి.. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పెట్టబోయే పార్టీకి సింగిల్‌ డిజిట్‌ స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కుతాయనేది ఒక అంచనా. ఈ వాక్యం కొందరికి చేదుగా ఉండచ్చు. కానీ ఒక సర్వే అంచనా ఇది. ఇది అతిశయోక్తి అనుకున్నప్పటికీ.. పరిస్థితి అంతకంటె పెద్ద తేడాగా ఏమీ ఉండదని కిరణ్‌కుమార్‌ రెడ్డికి కూడా తెలుసు. ఆయనకు తెలుగు సక్రమంగా రాకపోవచ్చు.. కానీ రాజకీయంగా జరగబోయే పరిణామాలను ఊహించలేనంత అజ్ఞాని మాత్రం కాదు. ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీ స్థాపించి.. సాధించగల ఓట్లు ఎన్ని ఉండగలవో ఆయనకు ఒక అంచనా ఉంటుంది. కిరణ్‌ పార్టీ నెగ్గడం అనేది అసాధ్యం అని ఎవరైనా చెప్పగలరు.  ఆ పార్టీ తరఫున సీమాంధ్రలో ఎక్కడైనా తమ సొంత బలంతో నెగ్గగల నాయకులు ఒకరిద్దరు గట్టునపడినా ఆశ్చర్యం లేదు. 

కాకపోతే.. ఇప్పటిదాకా సమైక్యాంధ్ర వాదానికి కట్టుబడిన పార్టీ వైకాపా ఒకే ఒక్కటి అని ప్రపంచం యావత్తూ నమ్ముతుండగా ‘దానికి తాను ప్రత్యామ్నాయం’ అని ప్రజల వద్దకు వెళ్లడం ఒక్కటే ఆయన లక్ష్యం! కేవలం సమైక్యాంధ్ర భావజాలానికి మాత్రమే పడే ఓటు ఏదైనాఉంటే.. దాన్ని చీల్చడమే ఆయన లక్ష్యం. నిజానికి ఇది కిరణ్‌ స్వబుద్ధి కూడా కాదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం విరచించిన స్కెచ్‌. సీమాంధ్రలో పార్టీ పతనం ఖరారు అని తెలిసినా కూడా అధిష్ఠానం ఇంత సుదీర్ఘమైన వ్యూహరచన చేయడం ఎందుకు? అనే అనుమానం కూడా ఎవరికైనా రావొచ్చు. అయితే.. వైఎస్సార్‌ మీది జనాభిమానానికి తోడు సమైక్యాంధ్ర భావజాలం తోడై వైఎస్‌ జగన్మోహనరెడ్డి రాష్ట్ర నాయకుడిగా ఎదగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఒకసారి ముఖ్యమంత్రి కాగానే.. రాష్ట్రంలో తిరుగులేని మహానేతగా జనాభిమానాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ రాజశేఖరెడ్డి వారసుడు జగన్‌ కూడా ఒకసారి ముఖ్యమంత్రి అయితే గనుక.. ఇక ఆయన పాతుకుపోతాడేమో అనేది కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న భయం. అంటే ఇప్పుడు కిరణ్‌ పార్టీ పెట్టి జగన్‌కు పడగల ఓట్లను కాస్త చీల్చి.. వీలైతే గద్దె ఎక్కకుండా అడ్డుపడి.. కుదరకపోతే.. అయిదేళ్లపాటూ ఆయన మీద పోరాడుతూ ఉండి.. ఆ పిమ్మట.. ‘‘జగన్‌ వంటి దుర్మార్గుడి మీద విజయం సాధించడానికి తానొక్కడూ చాలనని.. కాంగ్రెస్‌ వంటి పెద్ద పార్టీ అవసరం ఉంటుందని’’ తన సమైక్యాంధ్ర పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తారన్నమాట. కిరణ్‌ పెట్టబోయే పార్టీ అయిదేళ్లు మించని ఆయుష్షు ఉన్న పార్టీ అనేది ఖరారు. ఆ పిమ్మట కిరణ్‌ తన పార్టీని కాంగ్రెస్‌ అధినేత్రి పాదపద్మముల చెంతకు చేర్చి, పునీతుడు అవుతాడనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది కూడా ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా సాధిస్తే మాత్రమే. అది కూడా చేతకాకపోతే.. చిరంజీవి కంటె తక్కువ వ్యవధితో పార్టీ పెట్టదలచుకుంటున్న ఆయన.. చిరంజీవి కంటె తక్కువ వ్యవధిలోనే తన పార్టీని అమ్మ పాదాలవద్ద దఖలుపెట్టేసే అవకాశం కూడా ఉంది. 

చంద్రబాబు : నిరీక్షణ బ్రహ్మ!

చంద్రబాబునాయుడు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన తన మాటల విషయంలో ప్రమాదభరితమైన పొదుపు పాటిస్తుంటారు. తాను మాట్లాడవలసిన సమయంలో ఆయన మౌనవ్రతం చేస్తుంటారు. ‘గత జల సేతుబంధనం’ అన్నట్లుగా ఇక ప్రయోజనం ఏమీ ఉండదని, కాగల కీడు జరిగిపోయినదని తేలిన తర్వాత పెదవి విప్పుతారు. ప్రత్యేకించి తెలంగాణ బిల్లు విషయంలో చంద్రబాబు రాష్ట్రప్రజానీకానికి చేసిన ద్రోహం.. ఆయన మౌనం. మౌనంగా ఉన్నంత మాత్రాన తనకు విభజన, సమైక్యవాద ముద్రలు అంటవని.. తానొక్కడూ తటస్థుడిగా పేరు తెచ్చుకుని ఇరు ప్రాంతాల్లోనూ గరిష్టంగా లాభపడవచ్చునని ఆయన ఐడియా. అందులో ఎంత మేరకు సఫలమయ్యారో గానీ.. రాష్ట్రానికి నష్టం మాత్రం చాలా జరిగింది. 

ఎక్కడైనా సరే.. ఒక బిల్లు సభ ముందుకు వచ్చినదంటే.. అందులోని లోటుపాట్లను గురించి ప్రధానంగా ప్రస్తావించి ఆ మేరకు ప్రజలకు నష్టం కలగకుండా చూడవలసిన పాత్ర ప్రధాన ప్రతిపక్షనేతది. కానీ ఇక్కడ చంద్రబాబు ఆ పాత్రను పూర్తిగా మరచిపోయారు. ప్రేక్షకుడిలాగా సభలో కూర్చున్నారు. ఇది బిల్లేనా..? విభజించే తీరు ఇదేనా? మీకు చేతకాకుంటే పక్కకు తప్పుకోండి? అంటూ రంకెలు వేశారు. కానీ, ఆగిపోయిన తర్వాత.. ఆ కీర్తికూడా తనకే దక్కాలన్నట్లుగా ఆయన తన పెంపుడు చిలకలతో కీర్తిపాఠాలు వల్లించుకుంటున్నారు. తెలంగాణ వచ్చేస్తున్నదని ప్రచారం జరిగినంత కాలమూ.. ఆయన పెంపుడు చిలకలు మరియు స్వయంగా ఆయన కూడా ‘తెదేపా అసలు లేఖ ఇవ్వకపోతే వచ్చేదేనా?’ అని విర్రవీగారు. తీరా సీమాంధ్రలో వ్యతిరేకత ఎరిగాక, ఇప్పుడు తిరస్కరించిన తర్వాత.. తన వల్లనే బిల్లును తిరస్కరించడం జరిగినట్లుగా కూడా ఆయన చిలకలు మళ్లీ బాబునే కీర్తిస్తున్నాయి. 

వైచిత్రి ఏంటంటే.. ఈ బిల్లు విషయంలో మాత్రం అటు ప్రవేశపెట్టింది ప్రభుత్వమే.. అడ్డుకున్నది కూడా ప్రభుత్వమే. ఇంతకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అనేది ఆగినట్టా? సాగుతున్నట్టా? అనే ప్రశ్నను సజీవంగా ప్రజల మెదళ్లలో సస్పెన్సు థ్రిల్లరు సినిమాలాగా ఉంచేసినది కూడా కాంగ్రెస్సే. అలా జరిగినది కాబట్టే.. అందరికీ అనుమానాలు పొడసూపుతున్నాయి. 

ఎవ్వరికైనా ఇక్కడ తలెత్తే సందేహం ఒకటుంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం స్కెచ్‌కు అనుగుణంగా కిరణ్‌ నాటకాలాడ్డంలో అర్థముంది. ఆయనకు పార్టీ చాలా చేసింది. ఆయన జీవితంలో ఊహించలేనంత ఉన్నత పదవిలోనూ కూర్చోబెట్టింది. మరి చంద్రబాబు తాను కూడా ఆ నాటకాల్లో భాగస్వామి కావడం ఎందుకు? చంద్రబాబునాయుడు ‘గోతికాడ..’ లాగా కాసుక్కూచున్నారు. ఆయనకు సొంతంగా పార్టీ మీద ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించి విజయం సాధించాలనే ఉద్దేశం లేదు. తన మీద ప్రజల్లో నమ్మకం పెంచి, గద్దె ఎక్కాలనే కోరిక లేదు. ఆయనకు అడ్డదార్లు కావాలి. తొలిసారి ముఖ్యమంత్రి అయినా, రెండోసారి అయినా.. అడ్డదార్లే కలిసి వచ్చాయని ఆయనకు నమ్మకం. అందుకే కాంగ్రెస్‌ వ్యూహాలకు వంతపాడుతూ.. వారి స్కెచ్‌ ప్రకారం నడుచుకుంటే.. వారు జగన్‌కు బ్రేకులు వేయగలిగితే.. సీమాంధ్రలో కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు పతనమైనట్టే గనుక.. ఆ మేరకు తాను లబ్ధిని పంచుకోవచ్చునని వెంపర్లాట. అందుకు ఆయన నిరీక్షిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. 

‘జగన్‌ బాట’లోనే.. కాకుంటే కాస్త లేటుగా...

‘ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే‘ అని నీతి. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎవ్వరూ ఏ పనీ చేయరు. రాజకీయ పార్టీలు అందుకు అతీతం ఏమీ కాదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం తన వ్యూహాలతో ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. అయితే అందుకు వారు స్పష్టంగా సమైక్యవాదాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు. అయితే తమాషా ఏంటంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరూ కూడా జగన్‌ పార్టీ అనుసరించిన బాటనే నడుస్తున్నారు. కానీ ఆయనతో కలిసి నడవడం లేదు. అలా కలిస్తే.. సమస్య పరిష్కారం అయిపోతుంది.. కానీ క్రెడిట్‌ జగన్‌కే దక్కుతుందేమోనని వీరి భయం. 

జగన్‌ సమన్యాయం అన్న రోజున తెదేపా దానికి మద్దతిచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి మరో తీరుగా ఉండేదేమో. కానీ అప్పుడు బాబు రెండుకళ్ల నాటకాలు ఆడారు. సమన్యాయం అనేది కూడా కేవలం సమైక్యాంధ్రతోనే సాధ్యం అవుతుందనే వాదనకు కట్టుబడి.. ఇక సమైక్యాంధ్ర ఒక్కటే లక్ష్యం అని జగన్‌ ఫిక్సయిన తర్వాత పరిస్థితి మారింది. 

జగన్‌ పార్టీ తొలినుంచి శాసనసభలో సమైక్య తీర్మానం చేసిపంపుదాం అంటూ ముఖ్యమంత్రికి, ప్రతిపక్షనేతకు విన్నవించుకుంది. ఆరోజు వారా పనిచేసి ఉంటే బిల్లు వచ్చే అవకాశమే జరక్కపోయేది. కానీ, కిరణ్‌ నాటకాలాడారు. ఇప్పుడు కిరణ్‌ చేసిందేమిటి! బిల్లు తప్పులంటూ తిప్పిపంపాలని తీర్మానం ఆమోదింపజేశారు. పైకి సమైక్యాంధ్ర నినాదాలతో బయటకు వచ్చారు. ఇలాంటి తీర్మానాన్ని జగన్‌ చెప్పిన రోజున.. చేసి ఉంటే ఎంత బాగుండేది. ఆయన బాటలోనే ఆలస్యంగా నడుస్తూ.... కేవలం ‘జగన్‌ చెప్పడం’ అనేది పాపమైనట్లుగా రాష్ట్ర ప్రయోజనాలకు పాతర వేసిన నాటక కర్త కిరణ్‌! చంద్రబాబు తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం విభజన విషయంలో ఆయన నడుస్తున్న బాట కూడా ఆయనకంటె చాలా కాలం ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన ఆచరణశీల మార్గాలే. ఆయన జగన్‌ చెప్పినప్పుడు ‘అలా చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని’ అంగీకరించడానికి చంద్రబాబులోని విలన్‌ అడ్డు నిలిచాడు.

ఈ ఇద్దరు ముఖ్యనాయకులు కేవలం కీర్తి కండూతితో మాత్రమే కొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. రాష్ట్రానికి మంచి జరిగే మార్గం సూచించినా సరే.. జగన్‌ చెప్పాడు గనుక.. దాన్ని తొక్కి పట్టి తమ పార్టీల లబ్ధి కోసం వెంపర్లాడే దుర్మార్గపు పోకడ అది. 

ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి పట్టిన ఖర్మం అది. జగన్‌ పని (సూచన, ప్రయత్నం), సబబు (ధర్మం) అని తెలిసినా ఆచరించలేని అశక్తత వారిది. సుయోధనుడు చెప్పినట్లు వారి నెత్తిమీద ఎవరో తిష్ఠవేసి అలా నడిపిస్తున్నారు. తమాషా ఏంటంటే.. ఇద్దరి నెత్తిమీద కూడా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రే తిష్ఠ వేసుకుని కూర్చుని ఏకరీతిగా నడిపిస్తున్నది. 

జగన్‌ను నిరసించడంలో, ఆలస్యంగా అనుసరించడంలో ఏకరీతిగా ముందుకు సాగుతున్న ఈ ‘అక్రమ సోదరులు’ తద్వారా ఆశించే ప్రయోజనాలు మాత్రం.. ఎవరికి వారు వేర్వేరుగా కోరుకుంటున్నారన్నది వాస్తవం. 

- కపిలముని

kapilamuni.a@gmail.com

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?