cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

2019: ఈ ఏటి ప్రముఖుడు - జగన్‌

2019: ఈ ఏటి ప్రముఖుడు - జగన్‌

2019 ఆంధ్ర రాజకీయాల్లో ఒక మైలురాయి లాటిది. ఒక రాజకీయపార్టీ కనీవినీ ఎరుగనంత మెజారిటీతో నెగ్గి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరచింది. ఆ విజేత జగన్మోహన రెడ్డి. తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడి, భంగపడి, వేళాకోళాలకు గురైన వ్యక్తి పదేళ్లలో రాజకీయ నాయకుడిగా పరిణతి చెందాడు. రికార్డు సృష్టించిన పాదయాత్రలో పాల్గొని, ప్రజాదరణ సంపాదించుకుని, అన్ని ప్రాంతాల నుంచి అభిమానాన్ని, ఓట్లను చూరగొన్నాడు. మీడియా ఏం రాసినా, టిడిపి నాయకులు ఎంత విమర్శించినా ధృతి చెడకుండా 'నేనే కాబోయే ముఖ్యమంత్రిని' అని ప్రకటించుకుని, సాధించి చూపించాడు. పార్లమెంటు సీట్లలో వైసిపికి మొగ్గు ఉందని జాతీయ మీడియా రాస్తూనే ఉంది. అసెంబ్లీలో 110 సీట్లు వస్తాయని చాలామంది అనుకున్నారు. 130 వస్తాయని జగన్‌ ఆంతరంగికులతో అన్నాడని వార్త. తీరా చూస్తే 151 వచ్చాయి.

ఇక ఆయన ప్రత్యర్థి చంద్రబాబు - పార్లమెంటు ఎన్నికలను, అసెంబ్లీ ఎన్నికలను కలపకపోతే మంచిదని లెక్క వేసి కెసియార్‌ 2018లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కానీ చంద్రబాబు వేరేలా లెక్క వేయడం వలన 2019లోనే ఆంధ్రకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. మోదీపై ప్రజావ్యతిరేకత పెరిగిందని, గతంలో కంటె బిజెపికి తక్కువ సీట్లు వచ్చి హంగ్‌ పార్లమెంటు వస్తుందని, కాంగ్రెసు సహాయంతో తృతీయ కూటమికి అధికారం దక్కుతుందని బాబు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే జాతీయస్థాయిలో నాయకులతో భుజాలు రాసుకుంటూ తిరిగారు. మోదీని రాజకీయంగానే కాక, వ్యక్తిగతంగా కూడా తిట్టిపోశారు. రాష్ట్రంలో తను బలంగా ఉన్నాననే భ్రమలోనే యిదంతా చేశారు. తీరా చూస్తే అడుగు కదిలిపోయింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేనంత స్థాయిలో పరాజయాన్ని చవి చూశారు. దీనికి కారణం బిజెపి, తెరాస పరోక్షంగా వైసిపికి అందించిన సాయమని చెప్పుకుని తృప్తి పడ్డారు. అది కొంతవరకు నిజమే అనుకున్నా, వాళ్లకు జగన్‌పై ప్రత్యేక ప్రేమ లేకపోయినా, బాబుకి బుద్ధి చెప్పడం కోసమే సహాయపడ్డారని అర్థం చేసుకోవచ్చు.

టిడిపి ఈ అంశాన్ని పట్టుకుని ఆంధ్రకు అన్యాయం చేసిన మోదీకి జగన్‌ దాసోహమంటున్నాడని, రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెట్టేస్తాడనీ ప్రచారం చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటాక చూస్తే ఆంధ్ర, తెలంగాణల మధ్య మైత్రి మూడు నెలల ముచ్చటే అయింది. జలవివాదాలు, ఉద్యోగుల వివాదాలు యథాతథంగానే ఉన్నాయి. గోదావరి నదీ జలాల వినియోగంపై యిరు రాష్ట్రాల మధ్య అపనమ్మకం కొనసాగుతూనే ఉంది. జగన్‌ ప్రకటిస్తున్న విధానాలతో కెసియార్‌ చికాకు పడుతున్నారని వింటున్నాం. తమిళనాడులోనే, కర్ణాటకలోనో ఏమైనా జరిగితే పట్టించుకోరు కానీ ఆంధ్రలో ఏదైనా పథకం ప్రకటించగానే 'మరి మా మాటేమిటి?' అంటున్నారు తెలంగాణ ప్రజలు. రాజకీయంగా జూనియర్‌ అయిన జగన్‌తో పోలిక రావడం కెసియార్‌కు దుస్సహంగా వుంది. ఆంధ్రకు కెసియార్‌ ముఖ్యమంత్రి అని, జగన్‌ ఉపముఖ్యమంత్రి అని టిడిపి చేసిన ప్రచారం క్రమేపీ విలువ కోల్పోయింది, ఎందుకంటే కెసియార్‌ ప్రాధాన్యతలు వేరు, జగన్‌ ప్రాధాన్యతలు వేరు అని తేటతెల్లమై పోయింది.

ఇక వైసిపికి, బిజెపికి సఖ్యత కూడా ఏమీ కనబడటం లేదు. టిడిపి ఉన్నంత కాలం నిధులు విదల్చని బిజెపి వైసిపి రాగానే నిధులు ప్రవహిస్తుందని అనుకున్నవారి అంచనా తప్పింది. బిజెపి యిప్పటికీ ఆంధ్రపై శీతకన్ను వేస్తూనే వుంది. నాకు అధిక సంఖ్యలో ఎంపీలిస్తే ప్రత్యేక హోదా సాధించి తీరతా అని మాటిచ్చిన జగన్‌ బిజెపికి వచ్చిన మెజారిటీ చూసి నాలుక కరుచుకోవాల్సి వచ్చింది. ఒక సుగుణమేమిటంటే బాబులా మభ్యపెట్టకుండా 'హంగ్‌ పార్లమెంటు వచ్చి వుంటే మన మాట విని వుండేవారు, యిప్పుడెవరు వింటారు?' అని పబ్లిగ్గా ఒప్పేసుకున్నాడు. హోదా లేదు సరే, ప్రత్యేక ప్యాకేజీ మాటేమిటి? దాని గురించి ఏ విషయమూ తెలియటం లేదు. బిజెపి యిచ్చే మూడ్‌లో ఉన్నట్లు తోచటం లేదు.

రాజకీయంగా కూడా వైసిపి, బిజెపి సన్నిహితం అవుతున్నట్లు తోచటం లేదు. రీటెండరింగ్‌, రివర్స్‌ టెండరింగ్‌, విద్యుత్‌ ఒప్పందాలు యిలాటి విషయాల్లో బిజెపి ప్రభుత్వం వైసిపికి సహకరించటం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉన్నపుడే యివన్నీ జరిగాయి. ఇప్పుడవి తప్పంటే బిజెపి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. పైగా ఆ కాంట్రాక్టర్లు, కంపెనీలు బిజెపికి సన్నిహితులు కావడానికే ఛాన్సుంది. అందువలన చట్టపరమైన అభ్యంతరాలు వస్తాయంటూ మోకాలు అడ్డుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపి ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న ఉద్యమం వంటిది చేపట్టి ప్రభుత్వాన్ని యిరుకున పెట్టడానికి కూడా చూసినా ఆశ్చర్యం లేదు. పవన్‌ కళ్యాణ్‌ను సన్నిహితం చేసుకుని, అతని ద్వారా జగన్‌పై దాడి చేయడానికి చూస్తోందేమో కూడా తెలియదు.

బిజెపి ప్రవర్తన వెనకాల ఒక లాజిక్‌ ఉంది. రాబోయే ఐదేళ్లలో తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని అది ప్లాన్లు వేసుకుంటోంది. టిడిపికి నూకలు చెల్లాయని దాని అంచనా. ఇది ఆశ్చర్యం. నిజానికి యీ సారి ఎన్నికలలో టిడిపి మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లు మాత్రమే తెచ్చుకున్నా సొంతంగా 39% ఓట్లు తమకున్నాయని చూపించుకుంది. ఐదేళ్ల బాబు పరిపాలనలో ఎన్నో లోపాలున్నా, అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉన్నా అంత బలమైన ఓటు బ్యాంకు టిడిపికి ఉంది. అలాటప్పుడు దానికి భవిష్యత్తు లేదని ఎలా అనుకుంటారు? కానీ బాబు చర్యల వలన, ప్రతిచర్యల వలన అలా అనిపిస్తోంది. చాలా ఏళ్లగా నాయకులుగా వున్న వారు సైతం టిడిపిని వీడి బిజెపి, వైసిపిలలో చేరుతున్నారు. బాబు వయసు రీత్యా 2024లో కూడా ఆయన నాయకత్వం కింద టిడిపి పోటీ చేయగలిగినా, దీర్ఘకాలంలో ఆయనకు సరైన రాజకీయ వారసుడు లేడని క్యాడర్‌ అభిప్రాయ పడుతోంది.

ఈ ఏడాది నిరుత్సాహ పరిచిన నాయకుల్లో లోకేశ్‌ ఒకడు. బాబు ఎంతసేపు చూసినా 'నా అనుభవం, నేను చేసిన అభివృద్ధి' అంటూ చాదస్తపు కబుర్లతో చంపుకుతింటున్నారు కాబట్టి యువతను టిడిపి వైపు ఆకర్షించాలంటే లోకేశ్‌ ఒక్కడే గతి. కానీ లోకేశ్‌ నాయకుడిగా ఎదగడం లేదు. ట్వీట్లతోనే ప్రజల దృష్టిని ఆకర్షిద్దామని చూస్తున్నాడు. వాటిల్లో కనబడే చమత్కారం, బయట అతని సంభాషణల్లో, ఉపన్యాసాల్లో కనబడకపోవడంతో ఎవరైనా ఘోస్ట్‌ రైటర్‌ ఉన్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. అది పెద్ద వింతేమీ కాదు కానీ, తనకు విషయపరిజ్ఞానం ఉందని చూపించుకోవాల్సిన అవసరం లోకేశ్‌కు ఉంది. లేకపోతే యువత దూరమవుతుంది. తెలిసీ తెలియక లోకేశ్‌ మాట్లాడాడన్నా సహించవచ్చు, కానీ అనుభవజ్ఞుడైన బాబు కూడా తన వ్యాఖ్యలతో నిరుత్సాహ పరుస్తున్నారు. ఓ ఏడాది ఆగితే జగన్‌ చేసే పొరపాట్లు ప్రజల్లోకి వెళ్లి బాబు మాటలకు విలువ వచ్చేది. కానీ ఆయన యిప్పుడు అడ్డంగా వాదిస్తూ, మధ్యతరగతి ప్రజల అభిమానాన్ని క్రమంగా పోగొట్టుకుంటున్నారు.

జగన్‌ యిప్పటిదాకా చేసిన పనుల్లో చాలా భాగం ప్రజలు హర్షించేవే! ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం పెట్టడం చేత ఆ స్కూళ్లకు వెళ్లే వర్గాలు హర్షించాయి తప్ప ఆందోళన పడలేదు, ఆందోళనలు చేపట్టలేదు.  మద్యప్రవాహాన్ని నియంత్రించడం వలన మహిళలు, సామాన్యులు సంతోషపడ్డారు తప్ప షాపులెందుకు మూసేస్తారని ధర్నాలు చేయలేదు. దిశ చట్టాన్ని తక్కిన రాష్ట్రాలు కూడా హర్షించాయి. మూడు రాజధానుల విషయంలో కూడా అమరావతిలో భూములు కొన్నవారు ఆందోళన చెందడం సహజం. తక్కిన ప్రాంతాల వారు ఆనందపడుతున్నారు. (రాజధానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు పరిహారం యిచ్చేవరకు రాజధాని సమస్య తీరినట్లు అనుకోవడానికి లేదు). ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ద్వారా ఆ కార్మికులు హేపీ. ఇక పథకాల మాటికి వస్తే జగన్‌ ఎడాపెడా కురిపిస్తున్న వరాలతో ఆ యా వర్గాలు సహజంగానే ఖుషీగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో బాబు చేస్తున్న విమర్శలకు ప్రజల్లో స్పందన రావటం లేదు.

జగన్‌ తప్పులు చేయటం లేదని చెప్పడానికి లేదు. ఇసుక పాలసీలో అవకతవకలు, స్థానిక ఉద్యోగాలలో రిజర్వేషన్‌, చీఫ్‌ సెక్రటరీ తొలగింపు - యివన్నీ పొరపాట్లే. అన్నిటికన్నా ఘోరం టీవీ ఛానెళ్ల ప్రసారాన్ని ఆపివేయడం. దీనిపై నిజంగా ప్రజాసంఘాలు తీవ్రంగా ఉద్యమించి ఉండాల్సింది. కానీ చైతన్యం కొరవడినందునో, ఇలాటివన్నీ సహజమే అనుకోవడం చేతనే పెద్దగా చర్చ జరగటం లేదు. ఈ పొరపాట్లన్నీ సామాన్యప్రజల్ని ప్రభావితం చేసేవి కాదు కాబట్టి వాళ్లు పెద్దగా స్పందించటం లేదు. అన్న క్యాంటీన్లు మూసివేతకైనా అభ్యంతర పెట్టాల్సింది. అదీ లేదు. జరుగుతున్నదేమిటంటే పాత పథకాలను ఎత్తివేసి, కొత్త పేర్లతో మళ్లీ పెడుతున్నారు. లోకేశ్‌ జిల్లాల వారీగా పాదయాత్ర చేపట్టి, జనాల్లో తిరుగుతూ వారిలో చైతన్యాన్ని రగిలిస్తే జనాలకు మంచిది, లోకేశ్‌కు మరీ మంచిది.

అది జరగకుండా బాబు ఎంతసేపూ ప్రెస్‌మీట్లకు, అసెంబ్లీకి పరిమితమవుతున్నారు. వాన పడినా, పడకపోయినా జగన్‌ను తిడుతూ విలువ పోగొట్టుకుంటున్నారు. తన హయాంలో ఏం జరిగిందో ఆయన మర్చిపోయినా, జనం మర్చిపోలేదు. జగన్‌ గద్దె కెక్కకుండానే టిడిపివారు పెట్టుబడులు రావడం మానేశాయి, వెనక్కి వెళ్లిపోయాయి అంటూ పాట మొదలుపెట్టారు. తుమ్మినా, దగ్గినా కూడా పెట్టుబడుల గురించే మాట్లాడుతూన్నారు. అసలు యిప్పటిదాకా వస్తాయన్న ప్రకటనలే తప్ప ఆంధ్రకు పెట్టుబడులు రాలేదన్న సంగతి అందరికీ తెలుసు. వెళ్లిపోయాయి, వెళ్లిపోయాయి అంటున్నారు తప్ప వెళ్లిపోయిన కంపెనీలేవో టిడిపి చెప్పదు. వద్దామనుకుని మానేసిన కంపెనీల జాబితానూ ప్రకటించదు. పెట్టుబడులతో పాటు మరో గోల ఏమిటంటే జగన్‌ రాష్ట్రాన్ని క్రైస్తవం చేసేస్తున్నాడని! జగన్‌ వచ్చేముందు ఎన్ని మతమార్పిళ్లు జరిగాయి, తర్వాత ఎంత పెరిగాయి, చర్చిలకు ఎన్ని ఎకరాలు కట్టబెట్టాడు, గుళ్లకు ఎన్ని యిచ్చాడు లాటి గణాంకాలు యివ్వరు. ఏతావతా టిడిపి ప్రతిపక్షంగా కూడా విఫలమవుతోందని నాయకులకు తోస్తోంది.

దీన్ని బిజెపి అవకాశంగా మలచుకుంటోంది. టిడిపికి అండగా నిలిచిన వ్యాపారస్తులను, కమ్మకులస్తులను తనవైపు తిప్పుకుంటోంది. మరో వైపు కాపులను కూడా ఆకర్షిద్దామని చూస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో బలపడుతున్నామని చెప్పుకుంటూ వచ్చిన బిజెపి ఆ పని చేయలేకపోయింది. ఈ ఐదేళ్లలో ఎంతో కొంత చేయాలని చూస్తోంది. డబ్బున్న కమ్మలు బిజెపి వైపు వెళ్లినా మధ్యతరగతి కమ్మలు మాత్రం టిడిపికి అంటిపెట్టుకునే ఉన్నారు. వారిని కదల్చడం కష్టం. జగన్‌ వాళ్లను వదిలిపెట్టి బిసిలను, కాపులను ఖుషామత్‌ చేయడానికి తెగ చూస్తున్నాడు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు ఎలాగూ తనతో ఉన్నారు. రాయలసీమ ప్రాంతం జేబులో ఉన్నట్లే వుంది. జగన్‌  అత్యంత ప్రధానమైన వీక్‌ పాయింటు - నిధుల నిర్వహణ. ఇన్నేసి పథకాలకు డబ్బు ఎక్కణ్నుంచి తెస్తాడనే అందరూ అడుగుతున్నా సమాధానం రావటం లేదు. ఎప్పటికో అప్పటికి చేతులెత్తేస్తాడని, అప్పుడు విరుచుకుపడి నమిలి తినేద్దామని విమర్శకులు కాచుకుని ఉన్నారు.

అప్పటివరకు వేచి ఉండడానికి ఓపిక లేక తొందపడుతున్న కోయిల - పవన్‌ కళ్యాణ్‌. ఈ ఏడాది మేటి పరాజితుల్లో ఆయన్నే ప్రథమంగా చెప్పుకోవాలి. టిడిపికి సీట్లు లేక పోయినా ఓట్లు ఉన్నాయి. జనసేనకు అదీ, యిదీ ఏదీ లేదు. ముఖ్యమంత్రి అయిపోతాడని అభిమానులను ఊరించిన వ్యక్తి రెండు చోట్లా ఓడిపోయాడు. పార్టీ మొత్తానికి నెగ్గిన ఒక్క వ్యక్తీ జగన్‌ గుణగానం చేస్తున్నాడు. నాయకులందరూ పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. పరాజయానికి కారణమేమిటో సమీక్ష చేసుకోవలసిన జనసేనాని కార్యకర్తలను దోషులుగా నిలబెట్టాడు. ఇక అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక గందరగోళాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. ఎన్నికల సమయానికి వామపక్షాలతో ఊరేగిన మనిషి, యిప్పుడు బిజెపిని కీర్తిస్తుంటే ఎలా సమర్థించాలో తెలియక ఆయన ప్రతినిథులు తికమక పడుతున్నారు.

జగన్‌ యీ ఏటి మేటిగా నిలిచాడన్నది వాస్తవం. వచ్చే ఏడు కూడా నిలుస్తాడా అనేది పెట్టుబడులు తెచ్చి, ఆదాయం పెంచే సామర్థ్యంపై ఆధారపడి ఉంది. ఖర్చు ఎవరైనా పెట్టగలరు, సంపాదించడమే కష్టం. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2019)