cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఆనందయ్య మందు – చేప మందు

ఎమ్బీయస్: ఆనందయ్య మందు – చేప మందు

ఆనందయ్య మందు గురించి వార్తలు రాగానే నాకు కొందరు మెయిల్స్ రాశారు – అది మంచిదో, కాదో పరిశోధించి, వెంటనే వ్యాసం రాయవలసినది అని! నవ్వాలో ఏడవాలో తెలియలేదు. పరిశోధనలు చేయవలసినవారు చేస్తున్నారు కాబట్టి, పిక్చర్‌లో కాస్త క్లారిటీ వచ్చింది కాబట్టి మనం దాని గురించి కాస్త మాట్లాడుకోవచ్చు. దాని గురించి అంటే మందు గురించి కాదు, మందు చుట్టూ రేగిన వివాదం గురించి! ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం వేయబోతున్నారు కాబట్టి, క్లినికల్ ట్రయల్స్ వంటివి జరిగి మందు సామర్థ్యం గురించి మనకు అవగాహన వస్తుంది. ఇవాళ్టి పరిణామాలు నాకు తృప్తి నిచ్చాయి. ఐదు మందుల్లో మూడిటిని వాడడానికి అనుమతి నిచ్చారు. ఒక దాన్ని ఆయన చేసి చూపించలేదు కాబట్టి (ముడి సరుకు లేదట), దాని గురించి తెలియదు. కంట్లో వేసే మందు గురించి, పరిశోధనలు సాగుతున్నాయి కాబట్టి యిప్పుడే వద్దన్నారు.

ఇది జరగాల్సిన రీతిలో జరిగినందుకు సంతోషం. ఈ లోపున కొందరు చేసిన హడావుడి చింతాకరం. కొన్ని విషయాల గురించి చప్పున మాట్లాడేసుకుందాం. ఆనందయ్య మందును ఆయుర్వేదం కాదంటే చాలామందికి కోపం వచ్చేసింది. వేళ్లతో, ఆకులతో చేసిన ప్రతీదీ ఆయుర్వేదం కాదని మొదటగా తెలుసుకోవాలి. అది సిద్ధ కావచ్చు, సాంప్రదాయకమైన మందు కావచ్చు. మనం సింపుల్‌గా నాటు మందు అంటాం, తెలుగు మందు అని కూడా అనేస్తాం, మా చిన్నపుడు ఆయుర్వేదం మందుల దుకాణాలను తెలుగు మందుల షాపు అనీ, అలోపతీ మందుల షాపును ఇంగ్లీషు మందుల షాపు అనీ అనేవారు. మొక్కలతో చేసిన మందులు హోమియోపతీలో కూడా వున్నాయి. అలోపతీలో వాడే మార్ఫిన్ వంటి మొక్కల్లోంచి వచ్చినదే కదా. ఒకే మెటీరియల్‌ను ఆయుర్వేదం అంటే ఒకలా ప్రాసెస్ చేస్తారు, హోమియో అంటే మరోలా ప్రాసెస్ చేస్తారు.

‘ఆయుర్వేద పద్ధతిలో ప్రాసెస్ చేయలేదు కాబట్టి, ఆయుర్వేదం అనలేం, సాంప్రదాయకమైన మందు అంటాం’ అని ఆయుష్ కమిషనర్ డా. రాములు చెప్పగానే చాలామందికి కోపాలు వచ్చేశాయి, నాటు మందు అంటారా అంటూ! నాటు కానీ, సిద్ధ కానీ అంత తీసిపారేయదగినవి ఏవీ కాదని గుర్తుంచుకోవాలి. ఆయుర్వేదం అనగానే, ధన్వంతరి, హిందూమతం గట్రా, గట్రా దాని వెనకే వచ్చేశాయి. ఇక అక్కణ్నుంచి దాన్ని ఆ కోణంలో చూసి మెచ్చుకునేవారు, నిరసించేవారు తయారయ్యారు. వైద్యాన్ని వైద్యంలా చూడకుండా మతంతో కలిపి చూడడం ప్రమాదకరం. యునానీ అంటే ముస్లిములు వాడేది అని కొందరి అభిప్రాయం. అది గ్రీసు నుంచి వచ్చినదని ఎంతమందికో తెలుసో నాకు తెలుసు. మనమందరం సర్వరోగనివారిణిగా వాడే జిందా తిలిస్మాత్ యునానీ మందే! మందును మందుగానే చూడాలి.

ఆనందయ్య మందు పని చేస్తోందిట అనే టాక్ రాగానే, ఎంతమందిపై, ఎలా పనిచేసిందో తెలుసుకోకుండానే యిక కొందరు అలోపతి వైద్యంపై దాడి చేసేశారు. కార్పోరేట్ల దోపిడీకి అడ్డుకట్ట వేద్దామని ఆనందయ్య ప్రయత్నిస్తూ వుంటే, ఆంధ్ర ప్రభుత్వం ఆయన్ని కిడ్నాప్ చేసేసింది అంటూ. మొదటగా తెలుసుకోవలసినది – దోపిడీ చేస్తున్నది అలోపతి వైద్యం కాదు, వైద్యులు కాదు. వైద్యుల్ని నియమించుకున్న ఆసుపత్రి వ్యాపారస్తులు. దోపిడీ చేయడం వాళ్ల కొక్కరికే వచ్చని అనుకోకూడదు. డిమాండు బట్టి వసూలు వుంటుంది. కేరళ ఆయుర్వేదశాలలు విదేశీయుల నుంచి ఎంతెంత వసూలు చేస్తాయో తెలుసా? కార్పోరేట్ హోమియోపతి పేర ఏడాదికి 50 వేలంటూ ఒకేసారి తీసేసుకుంటారు తెలుసా? అంటే ఏడాది దాకా మీ రోగం తగ్గదని మా హామీ అని ముందే చెప్పినట్లు కదా!

అంతెందుకు అంగవృద్ధి, వక్షోజవృద్ధి, సంసారంలో సుఖం లేదా, పిల్లలు పుట్టటం లేదా, మా వద్దకు రండి నాటు మందులతో నయం చేస్తాం అని గోడల మీద తమ పేర్లకు ముందు ప్రొఫెసర్ అనో, డాక్టరు అనో వేసుకుని రాయించే ప్రకటనలు ఎన్ని వుండవు? రోడ్డు పక్కన వేర్లు, దుంపలు పెట్టుకుని కూర్చున్న కోయవాడి దగ్గర్నుంచి నీ నమ్మకాన్ని ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాడు. ఏ అలోపతీ డాక్టరూ నిన్ను యింటి వద్దకు వచ్చి లాక్కెళ్లటం లేదు. నువ్వే వెళుతున్నావు. ఆనందయ్య మందు ప్రచారంలోకి వచ్చాక, మొన్న ఒక టీవీ ఛానెల్‌లో అందర్నీ పిలిచి, అలోపతి గురించి తిట్టించారు. ప్యానెల్‌లో వున్న ఒక్క అలోపతీ డాక్టరు అంతా విని, ‘ఇప్పణ్నుంచి కరోనా బాధ్యతను మా దగ్గర్నుండి తీసేయండి. మేం మిగతా సర్జరీలు చేసుకుంటూ వుంటాం. కరోనా రోగులను ఆల్టర్నేట్ మెడిసిన్ వాళ్లకే అప్పగించండి. ఏడాదిగా పిపిఇ కిట్స్ వేసుకుని, ప్రాణాలు ఒడ్డి రోగులను కాపాడడానికి చూస్తుంటే మాకిస్తున్న ఖితాబు యిదా?’’ అని వాపోయారు. దెబ్బకి అందరూ ‘‘బాబోయ్ అలా అనకండి’’ అన్నారు.

ఎందుకంటే మనందరికీ అలోపతీ అనే కొమ్మ లేకుండా బతకలేమని తెలుసు. ఏదైనా వస్తే మొదట అలోపతీయే ట్రై చేస్తాం. దానికి లొంగకపోతేనే ఆయుర్వేదం, హోమియోపతీ, యునానీ, సిద్ధ, నాటు వైద్యం.. యిలా వుంటుంది మన వ్యవహారం. మిగతావాటితో వైద్యం చేయించుకుంటున్నా, ఏదైనా ఎమర్జన్సీ వస్తే మాత్రం మళ్లీ అలోపతీయే. ఎందుకంటే ఏ మెడికల్ షాపు వాడైనా ఏదో మందు యిచ్చి ఆ రాత్రి గట్టెక్కించగలడు. తక్కిన వైద్యవిధానాలైతే డాక్టరూ, పేషంటూ యిద్దరూ తెలివిగా వుండాలి. తమ లక్షణాలను పేషంటు కరక్టుగా చెప్పగలగాలి. డాక్టరు ఓపిగ్గా వినాలి. అందువలన దీర్ఘవ్యాధులు, మొండి వ్యాధులు లాటి వాటికి ఆయుర్వేదం, హోమియో వంటివి వాడుతూ, జ్వరం, జలుబు లాటి వాటికి అలోపతీమీదే ఆధారపడతాం. సర్జరీ అంటే ఖచ్చితంగా అలోపతీయే.

నాకు అన్ని వైద్యవిధానాలపై నమ్మకం వుంది. ప్రతీదానికీ పరిమితులున్నాయనీ తెలుసుకున్నాను. ఒక్క రోగానికి ఒక్కో విధానం తగినదని అనుభవం మీద తెలుసుకున్నాను. అలోపతీ విధానాన్ని కాదని జీవించడం కష్టం. బిపి, సుగర్ వంటి వాటికి అలోపతి మందులు వాడుతూనే వాటి డోసు పెరగకుండా యితర విధానాల మందులు వాడవచ్చు. అవి మానేసి నా దగ్గరకు వస్తే పూర్తిగా తగ్గిస్తాను అనే ప్రత్యామ్నాయ వైద్యులంటే నాకు భయం. ‘డయాగ్నస్టిక్స్ అనేవి అలోపతికి మాత్రమే పరిమితం, మేం రిపోర్టులు చూడం’  అనే ఆయుర్వేద, హోమియో డాక్టర్ల జోలికి నేను వెళ్లను. అన్ని వైద్యవిధానాలను సమన్వయం చేసే డాక్టర్లనే నేను అభిమానిస్తాను. ఏదైనా రోగిని బట్టి, రోగం బట్టి, విధానం ఎంచుకోవాలి. ఒకళ్లకు పని చేసింది కదాని మనకు పని చేయాలని లేదు. విఫలమైంది కాబట్టి మనకు విఫలమవాలని లేదు. ఎందుకంటే ఆహారం, వ్యాయామం, మందు, జీవనశైలి – వీటి మీదనే ఫలితాలు ఆధారపడతాయి.

హెర్బల్ అనగానే మనం ఎగిరి గంతేసి ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్‌స్ కొనేస్తున్నాం. ఎన్ని పని చేస్తున్నాయి? అందువలన ఆనందయ్య హెర్బల్ మెడిసన్ అనగానే పని చేస్తుందని ఢంకా బజాయించి చెప్పడానికి లేదు. ఏదైనా పరీక్ష చేసి తేల్చాల్సిందే. ఆయన మందు తీసుకున్నవాళ్ల రికార్డు దగ్గర పెట్టుకుని, వారిలో ఏ మేరకు ప్రభావం చూపింది అనేది అధ్యయనం చేయాల్సిందే. దీనితో బాటు వేరే మందు కూడా వాడారా? ఈ మందు ఫలితం తాత్కాలికమా? శాశ్వతమా? ఇలాటివన్నీ తెలుసుకుని కనీసం నెల తర్వాతనే ఏదో ఒకటి నిర్ధారించుకోవాలి. వాక్సిన్ గురించి రాసినపుడు రాశాను. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రాకుండా అనుమతి యివ్వడం రిస్కుతో కూడుకున్నదే అని. అదే మాట దీని గురించీ చెప్పాలి. ఆయుర్వేదం, హెర్బల్ అని ఏ మినహాయింపూ యివ్వనక్కరలేదు. అలోపతి అయితే సైడ్ ఎఫెక్ట్ వుంటుంది, దీనికి వుండదు అనుకోవడానికి లేదు. హెర్బల్‌కి కూడా వుంటుంది. ఓ సారి సుగర్‌కి అంటూ మా తమ్ముడు శ్రీలంక నుంచి హెర్బల్ మెడిసిన్ తెచ్చి యిచ్చాడు. నాకు పడలేదు. అవస్థ పడ్డాను.

ముఖ్యంగా చూడవలసినది చేస్తున్న ప్రాసెస్ ఎలా వుంది అనేది. శుభ్రమైన వాతావరణంలో చేస్తున్నారా? ప్యాకేజింగ్ ఎలా వుంది? వయసు బట్టి, రోగతీవ్రత బట్టి డోసేజి కరక్టుగా ఫిక్స్ చేస్తున్నారా? ఇలాటివి. తయారీలో, ప్యాకేజీలో స్టాండర్డ్ మేన్‌టేన్ చేయాలంటే ఖర్చవుతుంది. అది పెద్ద కంపెనీలకే సాధ్యమౌతుంది. అందుకే నేను ఆయుర్వేద మందులన్నీ హిమాలయా, ఝండూ డాబర్, బైద్యనాధ్, కొట్టక్కల్ యిటువంటివే కొంటాను. ఉచితంగా మందు పంపిణీ అనగానే కుటుంబ సభ్యులు, యిరుగుపొరుగు చేతులేసి చేయాల్సి వస్తుంది. వాళ్లలో శుభ్రత గురించి అవగాహన ఎంత వుందో తెలియదు. తక్కువ మందికి సప్లయి చేయడమంటే మేనేజ్ చేయవచ్చు. హెచ్చు మోతాదులో కావాలంటే జరిగే పని కాదు. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా అలోపతీ ఫార్మా జయింట్స్ ఆనందయ్యను తొక్కేస్తున్నారు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ టీవీల్లో హోరెత్తించడం అన్యాయం.

అదే విధంగా దాన్ని తీసిపారేయడమూ తప్పే. కళ్లలో మందు వేస్తే ఆక్సిజన్ లెవెల్ పెరగడమేమిటని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. కడుపులో నొప్పి అంటే జబ్బ మీద సూదిమందు ఎందుకిస్తున్నారు? ఎంత భారీ శరీరమైనా అది బాలన్స్ తప్పకుండా నిలబడాలంటే చెవిలో వుండే అతి చిన్న ఎముకకు యిన్ఫెక్షన్ రాకుండా వుండాలి. శరీరమంతా ఒక అవయవంతో మరొకటి అనుసంధానమై వుంటుంది. అది గ్రహించకుండా వెక్కిరించడం పొరపాటు. మీ మందు ఎలా పనిచేస్తుందో నాకు తెలిసిన భాషలో వివరించండి అని అడగడం కూడా పొరపాటే. దూరాన్ని లీటర్లలో కొలుస్తానని పాత్ర పట్టుకుని తయారైనట్లు వుంటుంది. హోమియో వైద్యంలో పొటెన్సీ పెరిగిన కొద్దీ మందు వాటా తగ్గిపోతుంది. దాన్ని మనం విశదీకరించగలమా?

సిసిఎంబి వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ గ్రహీత పిఎం భార్గవగారంటే నాకు అమిత గౌరవం. కానీ ఆయన హోమియోపతిపై చేసిన యుద్ధం నాకు నచ్చలేదు. నాకు తెలిసిన రీతిలో దాని పనితీరును విశ్లేషించి చెప్పండి అనేవాడు. గొథే ఎంత గొప్ప రచయితో తెలియాలంటే జర్మన్ భాష తెలుసుకుని అప్పుడు ఎసెస్ చేయాలి. నాకు జర్మన్ రాదు, నేర్చుకోను కానీ ఆయన కవి కాదు అంటే ఎలా? దేనికైనా గీటురాయి ఏమిటి? అనుభవపూర్వకంగా, ఎంపిరికల్‌గా దాని పనితీరును చూడడం. అది చూడకుండా తీర్మానించడం తప్పు. ఏదైనా యిలాటిది రాగానే జనవిజ్ఞాన వేదిక వాళ్లు దిగిపోతారు. వాళ్లు ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొడతాం అంటూ గ్రామాలు వెళ్లి చేతబడులు లేవని చూపిస్తారు, సంతోషం. తిరిగి వచ్చే దారిలో స్వస్థత ప్రార్థన సమావేశాలకు కూడా వెళ్లి, ‘దీనివలన మీకు మనశ్శాంతి కలగవచ్చు తప్ప పోయిన దృష్టి రాదు, విరిగిన కాళ్లు అతుక్కోవు’ అని చెప్పరు. చేప మందు కానీ ఆనందయ్య మందు కానీ పబ్లిసిటీ రాగానే దీన్ని ఆపేయాలి అని రగడ మొదలెడతారు.

జన విజ్ఞాన వేదిక అంటే ఏమిటి? దేని గురించైనా విజ్ఞానాన్ని తాము సంపాదించి, జనంలో వ్యాప్తి చేయాలి. కొందరు వాలంటీర్లను ఏర్పరచి, ఆ మందో మరొకటో ఎలా పని చేస్తుంది అనేది సర్వేలు చేసి, అధ్యయనం నిర్వహించి, ఆ పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందించాలి. ప్రస్తుతం కరోనా వాక్సిన్ పనితీరు, అవాంఛిత పరిణామాలపై ప్రజల్లో సందేహాలున్నాయి. టీకాలు వేయించుకున్నవారి స్టాటిస్టిక్స్ సేకరించి, దానిపై ఒక క్లారిటీ యివ్వవచ్చు కదా! ప్రభుత్వం చెప్తే మరణాలు దాచేస్తోంది, దుష్ఫలితాలు తగ్గించి చెపుతోంది అంటాం, యిలాటి స్వచ్ఛంద సంస్థ చెపితే నమ్మబుద్ధవుతుంది. వాళ్లు అలాటి పని చేసినట్లు నాకు తెలియదు. ఏదైనా సాంప్రదాయకపు మందు అనగానే దాన్ని తిరస్కరించాలని ప్రకటనలు చేయడం ద్వారానే పబ్లిసిటీ తెచ్చుకుంటారు.

దీనికి ప్రతిగా కొంతమంది తయారవుతారు. వాళ్లూ మందు పనితీరుపై అధ్యయనాలు చేయరు. అలోపతి కానిది అనగానే ఆకాశానికి ఎత్తడం ఆరంభిస్తారు. కరోనా రాగానే హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బమ్ వేసుకుంటే చాలు, కరోనా పటాపంచలు అని హడావుడి చేశారు. ఏ ప్రయోగాలూ జరపకుండా అలా ఎలా ప్రకటిస్తారు అని నేను అడిగితే కొందరు పాఠకులు తిట్టారు. ఇప్పుడేమైంది ఆర్సెనిక్ ఆల్బమ్? ఇప్పుడు బ్లాక్ ఫంగస్‌ను పారద్రోలడానికీ అదే మందు అంటున్నారు. అది పని చేస్తే యిన్ని కరోనా మరణాలు ఎలా సంభవించాయి? అలాగే కరోనా రాగానే దీనికి వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో మందు వుంది అనేశారు. దాన్నీ ప్రశ్నించాను, తిట్లు తిన్నాను. ఆయుర్వేదంలో మందే వుంటే దానికి పట్టుకొమ్మగా వున్న కేరళలో అంతమంది ఎలా చచ్చిపోయారు? క్లినికల్ ట్రయల్స్ లేకుండా ప్రకటనలు యిచ్చేస్తే యిలాగే వుంటుంది.

పని చేయకపోయినా, మానసికంగా ఊరట కలిగిస్తుంది కాబట్టి ఆనందయ్య మందును అనుమతించాలి అని కొందరు వాదించారు. ప్లాసెబో ఎఫెక్ట్ అనేది వుంది. నిజమే, ఎంతవరకు? అదే రోగాన్ని నయం చేయగలిగితే మందులు, వాక్సిన్‌లు తయారు చేయడమెందుకు? కష్టపడి కొత్తవి కనిపెట్టడమెందుకు? వైద్యుని హస్తవాసిపై, ఔషధంపై నమ్మకం పెట్టుకోవడం మందు పనితీరు మెరుగు పడడానికి పనికి వస్తుంది. పాలు తాగినా దానిలో విషం కలిపారన్న సంశయం కలిగితే జబ్బు కలుగుతుంది. ఇప్పుడీ మందుపై నమ్మకం పెట్టుకుని కరోనా మందులు వేసుకోకుండా కూర్చుంటే ఎంత నష్టం! ఆనందయ్య డబ్బు కోరుకోవటం లేదు, పేరు కోరుకోవడం లేదు. మంచి మనిషి. కానీ తన మందు ఏ మేరకు పనిచేస్తోందో తెలుసుకుని చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉందా?

ఆనందయ్య మందు వలన 40 వేల మంది బాగు పడ్డారు అని ఒక న్యూస్, నలుగురు చచ్చిపోయారు అని మరో న్యూస్,  ఆక్సిజన్ లెవెల్స్ 4-5శాతం  పెరిగి, 3-4 గంటల్లో తగ్గిపోతోంది అని యింకో న్యూస్. ఏది నిజం? అనేది యీ టీవీ ఛానెళ్లు తమ రిపోర్టర్లను పంపి కనుక్కోవు. ఎంతసేపూ కార్పోరేట్ల నుంచి లంచాలు తిని ప్రభుత్వం ఆనందయ్యను ప్రోత్సహించటం లేదు, అణగదొక్కేస్తోంది అనే హోరు తప్ప! అసలు ప్రభుత్వానికి యీ వ్యవహారంలో ప్రమేయం వుందా? ఈ విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. సాంప్రదాయకపు మందుల విషయంలో ఎవరి నమ్మకాలు వాళ్లవి. ప్రభుత్వం జోక్యం చేసుకోనక్కరలేదు. పుత్తూరులో ఎముకల వైద్యం చేస్తారు. మరో చోట కామెర్లకు పసరు మందు యిస్తారు, ఇంకో చోట అనాసకు మందిస్తారు. నమ్మకం వున్నవాళ్లు వెళతారు, లేనివాళ్లు లేదు. ప్రభుత్వం వెళ్లమనీ చెప్పదు, వద్దనీ చెప్పదు.

కానీ వెళ్లేవాళ్లకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇదే కాదు, మతపరమైన విషయాలూ అంతే. తిరుపతికి వెళ్లి మొక్కులు మొక్కుకోండి అని ప్రభుత్వం చెప్పదు. కానీ అక్కడకి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు, వెళ్లాక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. పుట్టపర్తి వెళ్లమని చెప్పదు, కానీ రోడ్డు వేస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకోమని చెప్పదు, కానీ కేరళకు ప్రత్యేక రైళ్లు వేస్తుంది. షిర్దీ వెళ్లమని చెప్పదు, కానీ బస్సులు వేస్తుంది. తిరణాళ్లు, జాతరలు జరుపుకోండని చెప్పదు. కానీ జరిగినప్పుడు తొక్కిసలాట జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం అలాగే వుండాలి. ఇప్పుడు హైదరాబాదు చేప మందు దగ్గరకు వస్తాను. నా చిన్నప్పణ్నుంచి దాన్ని పాత బస్తీలో వేస్తూనే వుండేవారు. అది పనిచేస్తుందో నాకు తెలియదు కానీ, ఒకసారి వచ్చినవాళ్లు ఏళ్ల తరబడి వస్తూనే వుండేవారు. అదేమిటి, తగ్గలేదా? అంటే ‘అబ్బో దానికి పత్యం చాలా చెప్పారు. అది పాటించడం కష్టం.’ అనేవారు. ‘పత్యం పాటించకపోతే మందు వేయించుకోవడం దేనికి, చేప మింగడానికి యింత దూరం రావాలా?’ అనేవాణ్ని.

అది ప్రయివేటు కార్యక్రమంగా వుంటే అలాగే నడిచేది. కానీ దేన్నయినా మార్కెట్ చేయడానికి ఉబలాటపడే చంద్రబాబు దృష్టికి అది వెళ్లింది. దానికి పబ్లిసిటీ యివ్వడానికి ప్రభుత్వ వనరులను ఉపయోగించారు. స్వయంగా తాను వేసుకున్నారు. పెద్ద పెద్ద షామియానాలు వేయించారు. దేశమంతా డప్పు కొట్టారు. దిల్లీ నుంచి, గుజరాత్ నుంచి మా కొలీగ్స్ వాళ్లు వచ్చి వేయించుకున్నారు. దీని గురించి మీకెలా తెలుసు? అని ఆశ్చర్యపోయి, చంద్రబాబా, మజాకాయా అనుకున్నాను. ఆయన పుష్కరాలను కూడా మార్కెటింగ్ యీవెంటుగా మార్చేశాడు. గత ప్రభుత్వాలు వచ్చినవారికి ఏర్పాట్లు చేసి వూరుకునేవి. ఈయన జనాల్ని వెళ్లమని ఊదరగొట్టాడు.

ఉమ్మడి రాష్ట్రంలో వుండగా పుణ్యం గురించి పోస్టర్లు వేశారో లేదో గుర్తు లేదు కానీ మొన్న గోదావరి పుష్కరాలకు మాత్రం ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ పుష్కరస్నానం చేయండి, పాపాలు పోగొట్టుకోండి అంటూ కాన్వాస్ చేశాయి. ఇవేమన్నా పాపవిమోచన పత్రాలు అమ్మే చర్చిలా? ఇలా అలవికానంత మందిని పిలిపించి, అక్కడి దుర్ఘటనకు కారకుడయ్యారు బాబు. చేప మందు మార్కెటింగ్ భారం ప్రభుత్వం తన నెత్తిన వేసుకోవడంతో జనవిజ్ఞాన వేదిక వాళ్లు దిగడ్డారు. ‘ఇది మందా? అయితే దానిలో ఏముందో మాకు చెప్పు.’ అని నిలదీశారు. బత్తిన సోదరులు ఆ పరీక్షకు నిలబడదలచుకోలేదు. అందువలన ‘ఇది మందు కాదు, ప్రసాదం’ అనే పల్లవి అందుకున్నారు. ప్రసాదమంటే విశ్వాసానికి సంబంధించినది, సైన్సుకి, వైద్యానికి సంబంధించినది కాదు. పరీక్ష పెడితే కళ్లు పోతాయి.

ఆ విధంగా వాళ్లు స్క్రూటినీ తప్పించుకున్నారు కానీ ప్రజల నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు. దానికి తోడు బాబు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, పబ్లిసిటీ పని పెట్టుకోలేదు. క్రమేపీ మందిచ్చే మండపం సైజు చిక్కిపోసాగింది. జనాభా పెరుగుతున్న కొద్దీ, వాతావరణ కాలుష్యం వలన శ్వాసకోశసమస్యలు పెరుగుతున్న కొద్దీ, ఆ మందుకు డిమాండు పెరగాల్సింది, కానీ తగ్గింది. ఈ ఏడాది కరోనా కారణంగా చేపమందు వితరణ జరపటం లేదని వార్త వచ్చింది. ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం వెళ్లేవారు వెళతారులే, మాకేం పని అని ఊరుకుని వుండవచ్చు. లో స్కేల్‌లో వుంటే అది నడిచిపోతుంది కానీ కానీ కరోనా విజృంభణ కారణంగా హై స్కేల్‌కు వెళ్లిపోయింది. జనం విరగబడ్డారు. ఆ వూరికి, పరిసర ప్రాంతాలకు కరోనా వ్యాపించి, ఆ వూరే సూపర్ స్ప్రెడర్‌గా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. జగన్ స్థానంలో బాబు వుంటే మరో చేపమందు ప్రహసనం అయి వుండేదేమో! కానీ జగన్ మీ మందును పరీక్షకు గురి చేస్తామని అడగడం, బత్తిన సోదరుల్లా కాకుండా ఆనందయ్య సరేననడం జరిగాయి. అదీ శాస్త్రీయ విధానమంటే!

కానీ జనాలకు శాస్త్రీయత అక్కరలేదు, వేలంవెర్రిగా ఆయన మీద పడసాగారు. రక్షించడానికి ఆయన్ని అక్కణ్నుంచి తరలించి నెల్లూరులో దాచారు. ఇక ఎబిఎన్ అందుకుంది. ప్రభుత్వం కిడ్నాప్ చేసేసింది. ఆయన చేత బకెట్ల కొద్దీ మందులు తయారు చేయించి వైసిపి నేతలు దిల్లీ దాకా పట్టుకుపోతున్నారు అంటూ. వీళ్లకు కావలసినది సెన్సేషన్ తప్ప సైంటిఫిక్ ఎప్రోచ్ కాదు. ఆయుర్వేదం కాదంటారా, ఆయన, ఎంత అహంకారం? అని హుంకరింపు. కార్పోరేట్ల కుట్ర, ఆనందయ్య ప్రాణాలకు ప్రమాదం పొంచి వుందా!? వంటి స్క్రోలింగ్స్. శాంపుల్ పట్టుకెళ్లగానే వెంటనే చెప్పేయగలరా, కనీసం పది పదిహేను మంది పైన వారం, పది రోజులు పరిశోధించి ఆయుర్వేద రిసెర్చి వాళ్లు ఏం చెపుతారో చెప్పేదాకా ఆగుదామనే యింగితం లేకుండా పోయింది. జగన్ కావాలనే యిదంతా చేస్తున్నాడు, ప్రజల ప్రాణం పట్ల లక్ష్యం లేదని వక్తల ఆరోపణలు వేరే.

ఏ పరిశోధనలూ లేకుండా ప్రభుత్వం మందు వేయడానికి అనుమతించిం దనుకోండి, కొందరు చనిపోయారనుకోండి, అప్పుడేమంటారు? ప్రజల ప్రాణాలతో ఆడుకుంది ప్రభుత్వం. నాటు మందుతో ఉసురు తీస్తూంటే, ఉలక్కుండా, పలక్కుండా కూర్చుంది సర్కారు అనే ఆరోపణలు రావా? చేపమందు విషయంలో ప్రాణాలు పోలేదు. కానీ దీనిలో ప్రాణాంతకమైన కరోనా భయం వుంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? ఆ జాగ్రత్త తీసుకోవడం వీరి దృష్టిలో అపరాధమై పోయింది. వీళ్ల మాటలు ఎలా వున్నా జగన్ ప్రభుత్వం మందు పంపిణీని ఆపించి, దానిలోని శాస్త్రీయతను తెలుసుకునేందుకు సిసిఆర్ఏఎస్ సహా అనేక సంస్థలకు పంపించి నివేదికలు తెప్పించి, ఒక నిర్ణయం తీసుకోమని ఆయుష్ కమిషనర్ వి. రాములుకు అప్పగించింది. అందువలన దానిపై అలోపతి వారో, జనవిజ్ఞాన వేదిక వారో కాకుండా దానిలో నిష్ణాతులైన వ్యక్తులే సూచనలు చేశారు.

ఇప్పుడు కథలో స్పష్టత వచ్చింది. 1) ఇది ఆయుర్వేదం మందు కాదు. సాంప్రదాయకపు మందు. దీనిలో వాడే పదార్థాలు హానికారకాలు కావు. లాభం వుందో లేదో తెలియదు. నష్టం లేదు కదానే అనుమతించారు. 2) ఇది కరోనాపై పని చేస్తుందన్న దాఖలాలు లేవు. ఆ విషయం స్పష్టంగా తెలుసుకుని, యిష్టమైతేనే తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత కూడా కరోనా మందులు వాడాలి. 3) నోట్లో వేసుకునే పి, ఎల్, ఎఫ్ మందులు తీసుకోవచ్చు. ముడి పదార్థాలు అందుబాటులో లేనందున ‘కే’ మందుని తయారు చేసి ఆనందయ్య చూపించలేక పోయారు కాబట్టి, దాని వాడకానికి అనుమతి లేదు. 4) కంట్లో వేసే ఐ మందుకు సంబంధించి కొన్ని నివేదికలు రావాలి కాబట్టి దానికీ అనుమతి లేదు. ఇక తక్కినవన్నీ ఎడ్మినిస్ట్రేటివ్ విషయాలు. పంపిణీ విషయం ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతోంది కాబట్టి, పెద్ద స్థాయిలో ఉత్పాదన జరిగినా ప్రోడక్టు క్వాలిటీ కూడాలో ప్రమాణాలు పాటిస్తారని ఆశించవచ్చు. స్కేల్ అప్ చేసినప్పుడు కొందరు అనుభవజ్ఞులు పూనుకుని డోసేజి, ప్యాకింగ్ వంటి వాటిపై సలహాలు యివ్వవచ్చు.

ఇది కరోనాను టాకిల్ చేయకపోయినా, ఇమ్యూనిటీ పెంచినా మంచిదే. అలోపతి మందు వ్యాధితో పోరాడుతుంది. ఆయుర్వేదం, హోమియో మందులు శరీరాన్ని దృఢపరిచి వ్యాధితో పోరాడే శక్తినిస్తాయి. ఈ మందును ఊరికే పంచవలసిన అవసరం లేదు. చెట్లను, పుట్లను నరికి వేస్తూ, ఇలా అవసరం పడినప్పుడు వాటి కోసం పరిగెట్టే ప్రజలకు జరిమానాగానైనా అరణ్యాలు పెంచే ఖర్చు వాళ్ల దగ్గర వసూలు చేయాలి. నిస్వార్థంగా తనకు తెలిసున్న వైద్యాన్ని, వైద్యఫలాల్ని ప్రజలకు అందించిన ఆనందయ్య గారికి అవార్డు యివ్వడంతో సరిపెట్టకుండా ప్రభుత్వం ఓ యిల్లూ, యిలాటి ఔషధవృక్షాలను పెంచడానికి కాస్త భూమీ యివ్వాలి.

ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2021)

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×