Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: పారాహుషార్, బాబూ!

ఎమ్బీయస్: పారాహుషార్, బాబూ!

తెలుగు రాష్ట్రాలలో బిజెపి చేస్తున్న హడావుడి అధికార పార్టీలకు కలవరం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతీయ పార్టీలను మనజాలనీయం అని కంకణం కట్టుకుని బిజెపి పని చేస్తోదన్నది కంటికి కనబడుతున్న వాస్తవం. తెరాస, వైసిపి రెండూ ప్రాంతీయ పార్టీలే. ఇన్నాళ్లూ బిజెపి యిటువైపు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వలన వీళ్లు బతికిపోయారు. కానీ యిప్పుడు కెసియార్ డేంజరులో పడ్డారు. దక్షిణాదిన రెండో స్థావరంగా టార్గెట్ చేయదగ్గ రాష్ట్రంగా బిజెపికి తెలంగాణ కనబడుతోంది. దాని విజయావకాశాలపై ‘‘తెలంగాణ బిజెపి కైవసం అయ్యేనా?’’ అనే ఆర్టికల్‌లో రాశాను. 

తన పరిమితులను తెలుసుకున్న బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను, క్యాడర్‌ను తయారు చేసుకునే దీర్ఘప్రణాళిక జోలికి పోకుండా, క్యాడర్ ఉన్న నాయకులకు వలేసే అడ్డదారి ఎంచుకుంది. తాజాగా పడిన చేప రాజగోపాలరెడ్డి. మొన్న అమిత్ షా సభలో యింకా కొందరు నాయకులు బిజెపిలో చేరతారని ఊహాగానసభలు జరిగాయి. ఎందుకంటే తనను కాంగ్రెసులోనే ఉండిపొమ్మని నచ్చచెప్పడానికి వచ్చిన కాంగ్రెసు నాయకులకు రాజగోపాల రెడ్డి ‘మీరూ బిజెపిలోకి వచ్చేయండి’ అంటూ కౌంటర్ ఆఫర్ యిచ్చారని వార్తల్లో వచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి అది అంతగా జరిగినట్లు లేదు. దఫదఫాలుగా ఫిరాయింపులు ప్లాను చేస్తే అధికారపక్షం స్థయిర్యాన్ని దెబ్బ తీసినట్లుంటుందన్న వ్యూహం కాబోలు!

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే బిజెపి అధికారపక్షాన్ని టార్గెట్ చేయటం లేదు, ప్రధాన ప్రతిపక్షాన్ని చేస్తోంది. ఈటలను బిజెపి బయటకు లాక్కుని రాలేదు. కెసియార్‌కు అహం దెబ్బ తిని మూర్ఖంగా ఈటలతో పేచీ పెట్టుకున్నాడు. ఈటల బయటకు వచ్చేసి, ఏం చేయాలో తెలియక కొన్నాళ్లు తటపటాయించి, కెసియార్ కేసులు తట్టుకోవాలంటే బిజెపియే గతి అనుకుని దానిలో చేరాడు. అఫ్‌కోర్స్, బిజెపికి కూడా అతను చాలా ఉపయోగించాడు. దీని తర్వాత కెసియార్‌కు బుద్ధి వచ్చిందో ఏమో, సహచరులను బాగానే చూసుకుంటూన్నట్లుగా ఉంది. అందుకని బిజెపికి తెరాస నుంచి నాయకులను లాక్కోవడం అంత సులభంగా ఉన్నట్లు లేదు. అందువలన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు మీదే దృష్టి పెట్టింది. గతంలో కూడా కాంగ్రెసు నుంచి డికె అరుణ వంటి వాళ్లు బిజెపిలో చేరారు కానీ బిజెపి కుంటుకుంటూనే నడిచింది.

జాతీయ స్థాయిలో కాంగ్రెసు చచ్చుబడి ఉన్నా, తెలంగాణలో క్షేత్రస్థాయి నాయకుల కారణంగా కొన్ని చోట్ల యింకా బలంగానే ఉంది. చాలా ఏళ్లగా ప్రజల్లో పని చేస్తూండడం కారణంగా దానికి ఒక ఫిక్స్‌డ్ ఓటు బ్యాంకు కూడా ఉంది. అయితే ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనుకోవడం వలన పార్టీ ముందుకు సాగలేదు. పైగా డైనమిక్ లీడర్‌షిప్ లేదు. రేవంత్ వచ్చాక క్యాడర్‌లో హుషారు వచ్చినా, అతనికి చంద్రబాబు మనిషన్న ముద్ర, నోటు ఫర్ ఓట్ కేసులో వీడియోలో దొరికిపోవడం అనే మచ్చ ఉండిపోయాయి. పైగా తన గ్రూపును మాత్రమే ప్రొజెక్టు చేస్తూన్నాడన్న ఆరోపణను ఎదుర్కుంటున్నాడు. అంతఃకలహాల కారణంగా కాంగ్రెసు బలహీనంగా ఉంది. ప్రియాంక యికపై తనే తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తానని ప్రకటన యిచ్చింది. యుపి ఇన్‌చార్జిగా ఆవిడ నిర్వాకం చూశాం. ఇక యిప్పుడు యిక్కడ చూడాలి.

దిల్లీలోని కేంద్ర నాయకత్వమే అనాసక్తంగా ఉన్నపుడు కేంద్ర పరిశీలకుడు ఏమంత ఘనంగా ఉంటాడు? తన మీదే రేవంత్ ప్రత్యర్థులు యథేచ్ఛగా ఆరోపణలు చేస్తూంటే అతను ఏమీ చేయలేకున్నాడు. బిజెపి సొంతబలంతో మాత్రమే ఎదగాలంటే పదేళ్లు పడుతుంది. అంతకంటె టిడిపిని తెరాస తనలో కలిపేసుకున్నట్లు, కాంగ్రెసును తనలో కలిపేసుకుంటే తెరాసకు దీటుగా ఎదగడానికి ఐదేళ్లు చాలు. 2023 నాటికి తెరాస కంటె కొద్దిగా వెనకగా, ప్రధాన ప్రతిపక్షం కావచ్చు. 2028 నాటికి అధికారానికి పోటీ పడవచ్చు. కాంగ్రెసు నాయకులను లోబరచుకోవడానికి బిజెపి తక్కిన రాష్ట్రాలలో అవలంబిస్తున్న విధానాలనే యిక్కడా అమలు చేస్తుందని ఊహించవచ్చు.

ఇది గమనించి ఆంధ్రలో టిడిపి జాగ్రత్త పడాలని నా ఉద్దేశం. ప్రస్తుతానికి బిజెపికి ఆంధ్రలో బలం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్నుంచి తెలంగాణలో కొంత క్యాడర్ ఉంది కానీ ఆంధ్రలో అస్సలు లేదు. నాయకులు కూడా తెలంగాణ వారే. ఆంధ్ర నుంచి వెంకయ్య నాయుడు ఒక్కరే. ఆయన జాతీయ స్థాయిలో వెలిగే హడావుడిలో ఆంధ్రప్రాంతాన్ని పట్టించుకోలేదు. క్యాడర్‌ను నిర్మించలేదు. అందువలన టిడిపితో కలిసినప్పుడు మాత్రమే ఆంధ్ర ప్రాంతంలో బిజెపికి ఛాన్సు ఉంటూ వచ్చింది. ఇప్పుడా ఛాన్సు మరింత తగ్గింది. అడ్డగోలు విభజన పట్ల ఆంధ్రుల్లో కోపం యిప్పటికీ పోలేదు. ప్రధాన దోషి కాంగ్రెసు అయితే బిజెపిది ఎ2 స్థానం. పైగా బిజెపి అధికారంలో వచ్చాక విభజన హామీలు నెరవేర్చలేదని, ఇవ్వవలసినవి కూడా యివ్వలేదని ఆంధ్రులు రగులుతున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బిజెపి సంజాయిషీ చెప్పుకునే స్థితిలో ఉంది.

అందువలన ఆంధ్ర రాజకీయాల్లో బిజెపి ఒక ఫ్యాక్టరే కాదని, దాని గురించి భయపడవలసిన అవసరం లేదని బాబు అనుకుంటే పొరపాటు చేస్తున్నట్లే. ప్రస్తుతానికి కేంద్ర బిజెపి నాయకత్వం ఆంధ్రపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లుగా కనబరచటం లేదు. రాష్ట్రంలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే చాలని భావిస్తున్నట్లు చూపిస్తోంది. 2018 వరకు టిడిపితో సఖ్యంగా ఉంది. 2019 నుంచి వైసిపితో సఖ్యంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఘర్షణ తెచ్చుకునే పరిస్థితి కనబడటం లేదు. ఇది పైకి కనబడే పరిస్థితి. కానీ మోదీ, అమిత్‌ల దీర్ఘకాలిక వ్యూహాలు గమనించేవారికి 25 ఎంపీ సీట్లున్న ఆంధ్రను అలా గాలికి వదిలేస్తారని అనుకోలేము. ఈ రోజు జగన్ రాజ్యసభలో బిజెపికి మద్దతు యిస్తూ ఉండవచ్చు. కానీ రేపు అతనిపై కేసులు తిరగతోడితే ఎదురు తిరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ ఉండరు, శత్రువులూ ఉండరు. తాజాగా నీతీశ్ ఏం చేశాడో చూశాం కదా!

ఆంధ్రలో 2029 నాటికి అధికారంలోకి రావాలి అని బిజెపి అనుకుంటోంది అనుకుని, దానికి అవకాశాలు ఎలా ఉన్నాయో చూదాం. ప్రస్తుత పరిస్థితే 2024 దాకా కొనసాగితే మహా అయితే బిజెపికి ఏ ఐదు సీట్లో వస్తాయనుకోవాలి. జనసేనతో దానికి పొత్తు పేరుకే తప్ప, అమలులో ఉన్నట్లు లేదు. పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించటం లేదు. పవన్ తన సభలకు బిజెపి క్యాడర్‌ను పిలవడం లేదు. కేంద్రం నుంచి వచ్చే బిజెపి నాయకులు పవన్‌ను కలవటం లేదు. కూటమిలోకి టిడిపిని తీసుకుని వస్తే తప్ప, తనూ కలిసేది లేదు అన్నట్లు పవన్ ప్రవర్తిస్తున్నారు. టిడిపితో పొత్తుకి బిజెపి సుముఖత కనబరచటం లేదు. అందువలన ఎవరి పాటికి వారు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కార్యక్రమాలు లేవు. టిడిపితో కానీ, జనసేనతో కానీ పొత్తు లేకపోతే బిజెపికి ఐదు కంటె ఎక్కువ వస్తాయనుకోలేము. అదే జరిగితే 2024లో 5 సీట్లున్న పార్టీ 2029 కల్లా 90 సీట్లకు (అధికారం దక్కాలంటే అన్ని రావాలి కదా) ఎదగగలదా? పోనీ అప్పుడు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది అనుకుంటే కనీసం 50 రావాలి కదా! పదిరెట్లు ఎదగడమంటే మాటలా?

అంతకంటె సులభమైన మార్గం ఏమిటి? ద్వితీయ స్థానంలో ఉన్న టిడిపిని కబళించి హరాయించు కోవడం! ఈశాన్య రాష్ట్రాలలో యిలాటి గమ్మత్తులు చాలా చేసింది బిజెపి. 2024లోపునే టిడిపిని జీర్ణం చేసేసుకుంటే, లేదా నామమాత్రంగా మిగిలిస్తే 2024 ఎన్నికలలో కనీసం 50 సీట్లు గెలుచుకోవచ్చు. అక్కణ్నుంచి 2029 నాటికి 90 తెచ్చుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు. 40 ఏళ్లగా పాతుకుపోయిన టిడిపిని పెకలించడం, చీల్చడం అంత సులభమా? కానే కాదు, బిజెపి అంత కష్టమైన పనిని తలకెత్తుకుంటుందా అంటే దాని అవసరం అలాటిది.

ప్రధానంగా ఉత్తరాదిన, పశ్చిమాన గుజరాత్‌లో బలంగా ఉంటూ వచ్చిన బిజెపి మోదీ-అమిత్ హయాంలో కొత్త ప్రాంతాలకు విస్తరించింది. యుపిలో పాగా వేసి పాతుకుపోయింది. దుర్గమంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెసును తరిమివేసి దాని స్థానంలోకి వచ్చేసింది. తూర్పు రాష్ట్రాలలోనే యింకా విజయం ప్రాప్తించలేదు. బెంగాల్, ఒడిశా ఒడిలో పడలేదు. బిహార్‌లో బాగానే పుంజుకుంది కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. పశ్చిమాన మహారాష్ట్రలో అధికారం వస్తూపోతూ ఉంది.

చాలాకాలం అధికారంలో ఉండడం ఒకరకంగా యిబ్బంది కూడా. టర్మ్ టర్మ్‌కీ ప్రభుత్వ వ్యతిరేకత పెరగక తప్పదు. పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీ పలుకుబడితో ఎలాగో నెగ్గేయవచ్చు కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి, స్థానిక నాయకుల బలాబలాలపై ఫలితాలు ఆధారపడతాయి. గతంలో కంటె సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. దాన్ని కాంపెన్సేట్ చేసుకోవాలంటే కొత్త ప్రాంతాలకు విస్తరించక తప్పదు. కొత్త ప్రాంతాలలో అతి ఆకర్షణీయంగా కనబడుతున్నది దక్షిణం. దక్షిణాదిన కర్ణాటక ఒక్కటే బిజెపికి ఆశ్రయం యిచ్చింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో బలం లేదనే చెప్పాలి. అధికారం అంచుల్లోకి వచ్చి ఆగిపోయి, ఆ పై ఫిరాయింపులకు పాల్పడ వలసి వస్తోంది. ఇన్నాళ్లూ ముక్కోణపు పోటీ ఉండడం బిజెపికి లాభిస్తూ వస్తోంది. ఇప్పుడు జెడిఎస్ బలహీనపడింది. అంతఃకలహాల్లో మునిగి తేలుతున్నా కాంగ్రెసుకు బలం పెరుగుతోందనే వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

అన్నిటికీ మించి యెడియూరప్ప వ్యవహారం బిజెపికి శిరోభారంగా ఉంది. ఆయన్ను తలకెత్తుకోనూ లేరు, తోసి పారేయనూ లేరు. అందుకే 75 ఏళ్లు దాటినా సెంట్రల్ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్నారు. అతని సహచరి శోభను ముఖ్యమంత్రి చేస్తారనే పుకార్లు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే ప్రమాదం అనే భావన ఉన్నట్లుంది. ఇక కేరళలో ఎంత హడావుడి చేసినా లాభం లేకుండా ఉంది. తమిళనాడులో ఎడిఎంకె ద్వారానే రాజకీయాల్లో నిలదొక్కుకోవాలి తప్ప సొంతంగా ఎదిగేందుకు అవరోధాలు చాలా ఉన్నాయి. ఎడిఎంకె పరిస్థితి చూస్తే దాని రెండాకులు కకావికలై ఉన్నాయి. వాళ్లలో వాళ్లే తన్నుకుంటున్నారు. ఇక ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బిజెపితో కలిస్తే ఉన్న అవకాశం కూడా అడుగంటుతుందనే భయాలు వాళ్లకుండవచ్చు.

అందుకే తెలంగాణపై విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి పక్కనే ఉన్న ఆంధ్రపై అస్సలు చేయకుండా ఉంటుందా? అధికారంలో ఉన్న వైసిపిపై నేరుగా తలపడడం కంటె ద్వితీయస్థానంలో ఉన్న టిడిపిపై అస్త్రాలు ఎక్కుపెట్టడం సులభం. కానీ టిడిపి తక్కువ పార్టీ కాదు. 2019లో 39% ఓట్లు తెచ్చుకున్న పార్టీ అది. తర్వాతి ఎన్నికలలో కూడా 36%కు తగ్గని ఓటు బ్యాంకు ఉందని దాని శత్రువులు కూడా ఒప్పుకోవాల్సిందే. దాన్ని హరించడం మాటలా? ఇక్కడ మనం గమనించవలసినది, ప్రజాస్వామ్యంలో ఒకడు 51% ఓట్లు తెచ్చుకుంటే అవతలివాడు 49% ఓట్లు తెచ్చుకున్నా వ్యర్థుడే. అతన్ని నమ్ముకుని వెంట నడిచినవాళ్లందరూ నిరాశలో మునుగుతారు. తాము పెట్టిన పెట్టుబడి, పడిన శ్రమ వృథా అయ్యాయని బాధపడతారు. అటూయిటూ దిక్కులు చూస్తారు. 2019లో ఘోరపరాజయం తర్వాత యీ మూడేళ్లలో టిడిపి ఉపయెన్నికలలో, స్థానిక ఎన్నికలలో గణనీయంగా సీట్లు గెలిచి ఉంటే దానికి అండగా నిలిచిన ధనిక, రాజకీయ వర్గాలు 2024 పట్ల ఆశాభావంతో ఉండేవి.

ఇప్పుడా పరిస్థితి లేదు. బయట నుంచి మద్దతిచ్చేవారే కాదు, పార్టీ వర్గాల్లోనే నిరాశా నిస్పృహలున్నాయి. ఏ నాయకుడూ అరుగు దిగటం లేదు, జేబులో చెయ్యి పెట్టడం లేదు. అచ్చెన్నాయుడి ఫీలింగే అందరిలోనూ ఉందనుకోవాలి. టిడిపిని వదలలేక, వైసిపి వైపు వెళ్లలేక అల్లాడుతున్న కార్యకర్తలకు ఏం చేయాలో తోచటం లేదు. నానాటికీ పెరుగుతున్న వైసిపి దాష్టీకాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కొన్ని చోట్ల జూనియర్‌ను పార్టీలోకి తీసుకురావాలి అని నినాదాలు చేస్తున్నారు. పవన్‌తో పొత్తు పెట్టేసుకోవాలని నాయకుడికే బహిరంగంగా సలహా యిస్తున్నారు. మద్దతిచ్చే ధనిక వర్గాలు బిజెపిని బతిమాలైనా దానితో పొత్తు కుదుర్చుకోవాలి అని హితవు చెప్తున్నారు.

కానీ బాబు ఏమీ చేయటం లేదు. తన పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. ద్వితీయ స్థానంలోకి ఎవర్ని తెచ్చినా లోకేశ్‌కు పోటీ వస్తారని ఎవర్నీ రానివ్వటం లేదు. యువతకు ప్రాధాన్యత యివ్వటం లేదు. మేధోమథనాలు లేవు, స్ట్రాటజీపై సమావేశాలు లేవు. మేధావులతో సెమినార్లు లేవు. దశాబ్దాలుగా వినిపిస్తూ వచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాన్నే నేటికీ గంటల తరబడి వల్లిస్తారు. జగన్‌ను తను తిట్టడం, తన మీడియా చేత తిట్టించడం జరిపించి రోజు గడిచింది చాలనుకుంటారు. మోదీ ఉన్నంతకాలం తనను దగ్గరకు రానివ్వరని లోకమంతటికీ అర్థమైనా ఆయన కెందుకు అర్థం కాదో తెలియదు. ఆంధ్ర ప్రజలకు బిజెపిపై కోపం ఉందని తెలిసినా, బిజెపిని పన్నెత్తి మాట అనకుండా కేంద్ర పన్నులకు కూడా రాష్ట్రాన్నే నిందిస్తూ పోతే ప్రజలు పట్టించుకోరని ఆయనకు తెలియదా? నేను మారాను, మారాను అనడమే తప్ప ఆయన మారరు, ఆయన ఆ స్లోగనూ మారదు. ‘సిగరెట్లు మానేయడం చాలా యీజీ, నేను చాలా సార్లు మానేశాను’ అనే జోక్‌లా నేను మారాను అని ఆయన అన్నప్పుడల్లా ‘అంటే నిన్నటిదాకా మారలేదన్నమాట, మారానని చెప్పి ఏడాది దాటి పోయిందే’ అని గుర్తుకు వస్తుంది.

ఇలా స్తబ్దంగా ఉన్న పార్టీపై బిజెపి చూపు పడకుండా ఉంటుందా? తెలంగాణలో టిడిపి స్తబ్దం కాగానే తెరాస దాన్ని స్వాహా చేసేసింది. పార్టీ ఎంత పాతది అనేది ప్రశ్న కాదు, ప్రస్తుతం ఎంత చురుగ్గా ఉన్నది అనేదే పాయింటు. శివసేన టిడిపి కంటె పాతది. బిజెపి ఏం చేసింది? సాంతం మింగేయకపోవచ్చు. శిందే శివసేన అంటూ పోటీ శివసేనను తయారుచేసి తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. ఏది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమో, కోర్టో తేల్చవచ్చు. కానీ దేనికి ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తాయో దానిలోకే శివసైనికులు దూకేస్తారు. గతంలో ఇందిరా గాంధీ కాంగ్రెసు పార్టీని రెండు సార్లు చీల్చినపుడు అదే జరిగింది. రెండు సార్లూ ఆమెకు కొత్త ఎన్నికల గుర్తు యిచ్చినా, ప్రజలు దానికే ఓట్లేశారు. వారి వరస చూసి నాయకులు కూడా ఆమె పంచనే చేరి, దాన్నే అసలైన కాంగ్రెసు చేసేశారు.

అదే ట్రిక్కు టిడిపిపై ప్లే చేయవచ్చు. చంద్రబాబు గుప్పిట్లో ఉన్న టిడిపి పార్టీ అధిష్టానాన్ని ఏమీ చేయకుండా వదిలేసి, క్యాడర్‌ను ఆకర్షించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపిని ఢీకొనే సత్తా మాకు లేదు అని డీలా పడి ఉన్న టిడిపి క్యాడర్ యీ ప్రత్యామ్నాయంపై ఆకర్షితులు కావచ్చు. బాబు, తనయుడు, చుట్టూ పరివేష్టించి ఉన్న పది పదిహేను మంది నాయకబృందం తప్ప వేరెవరూ ఒరిజినల్ పార్టీలో మిగలక పోవచ్చు. 1969లో ఇందిర కాంగ్రెసును చీల్చినపుడు పాత కాంగ్రెసులో కొందరు అలాగే ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. 1977 జనతా పార్టీ ఏర్పడినపుడు అప్పటికి మిగిలున్నవారు దానిలో చేరి, ప్రముఖులయ్యారు. 1980లో జనతా చీలినపుడు సోషలిస్టులు జనతాదళ్‌గా, చరణ్ సింగ్ అనుచరులు లోకదళ్‌గా, జనసంఘీయులు బిజెపిగా తమ ప్రయాణం కొనసాగించారు కానీ యీ పాత కాంగ్రెసు వాళ్లు అజాపజా లేకుండా పోయారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకి అటువంటి గతి పడుతుందని కలలో కూడా అనుకోలేము. కానీ బిజెపి ప్రయత్నాలు చూస్తూంటే అలాటి ప్రమాదం లేదని మాత్రం వాదించనూలేము. రాష్ట్రంలో కమ్మలు టిడిపికి, రెడ్లు వైసిపికి అంకితమై పోయారు కాబట్టి జనసేన, బిజెపిలకు కాపులు మాత్రమే మిగిలారని, అందుకే రెండూ చేతులు కలిపి కాపు ఓటుకి గేలం వేశాయని చెపుతూ వచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా కాపులకే ఛాన్సివ్వడం యీ వాదనకు ఊతమిచ్చింది. దానివలన ఏ ప్రయోజనమూ కలగలేదని గ్రహించినా బిజెపి అదే పంథాను కొనసాగిస్తుందని ఎందుకనుకోవాలి? సామాజికంగా, ధనపరంగా, రాజకీయంగా ఎంతో ముందంజలో ఉన్న కమ్మలను టిడిపికి ధారపోసి ఎందుకు కూర్చుంటుంది? వైసిపి వచ్చాక తమకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నా, టిడిపి చేతకానితనం వలన తమకు నష్టం కలుగుతోందని రగులుతున్న కమ్మలను ఆకర్షించే స్ట్రాటజీ బిజెపి వర్కవుట్ చేయకుండా ఉంటుందా?

కమ్మలే కాదు, పైకి ఎదగాలనుకునే ఏ కులం వారైనా సరే, తమ కులస్తుడే అధికారంలో ఉండాలని తపించిపోడు. తమ ప్రయోజనాలను కాపాడగలిగితే చాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెడ్ల ఆధిక్యం ఉన్న కాంగ్రెసు దశాబ్దాల పాటు ఏలింది. ఆ టైములో కమ్మలు వృద్ధిలోకి రాలేదా? కాంట్రాక్టులు పొందలేదా? ఎన్టీయార్‌ను బాబు కూలదోసినప్పుడు యిద్దరూ తమ కులస్తులే అయినా వీరు బాబు వెంట ఎందుకు నిలబడ్డారు? తమ ప్రయోజనాలను బాగా కాపాడగలడనే కదా! అందువలన బిజెపి రాజకీయకారణాల రీత్యా, రేపు ఒక బిసిని తమ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపినా వారి పక్షాన నిలవడానికి కమ్మ పెట్టుబడిదారులు సంకోచించరు. గతంలో వెలమ కులస్తుడైన వెంగళరావు కాంగ్రెసు ముఖ్యమంత్రి కావడానికి, కమ్మలు యిచ్చిన సపోర్టే కారణమని అనుకున్నారు.

కమ్మల ఆధిపత్యానికి పగ్గాలు వేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న జగన్‌ను ఎదిరించే పార్టీ కోసం వెతకడం కమ్మ పెట్టుబడిదారుల తక్షణ కర్తవ్యం. బాబు ఒకప్పుడు ఎంతటి ఘనుడైనా కావచ్చు కానీ ప్రస్తుతం మాత్రం అప్రయోజకుడిగా ఉన్నారు. లోకేశ్ ఎక్కి రాలేదు. చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నాయకత్వమూ లేదు. బిజెపితో అవసరంగా బంధాన్ని తెంపుకుని, మోదీతో వ్యక్తిగత వైరం తెచ్చుకుని తను దెబ్బ తినడమే కాక తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించారని వారికి బాబుపై గుర్రుగా ఉంది. పెట్టుబడి దారులకు కులాభిమానం కంటె విన్నింగ్ సైడ్ ఉండాలనే తాపత్రయం ఎక్కువ. ఇప్పుడు దేశమంతా బిజెపిదే హవా. ఇంకో పదేళ్లదాకా దానికి ఎదురు లేదన్నంత ఊపులో ఉంది. దానికి ఏ విధంగా దగ్గరవుదామా అనేదే ఏ పెట్టుబడిదారుడైనా ఆలోచిస్తాడు. టిడిపికి అండగా నిలిచిన యీ వర్గాల మీద బిజెపి దృష్టి సారించి, ఆకర్షించ చూస్తోందని అనుకోవాలి.

ఈ ఆలోచనను పసిగట్టే, అమిత్ జూనియర్‌ను పిలిపించారని అనుకోవాలి. సినిమాలో నటనను మెచ్చుకోవడానికి పిలిచారని ఎవరైనా చెపితే ఎలా నవ్వాలో తెలియదు. మునుగోడు గురించి మాత్రమే అన్నా నమ్మలేం. కమ్మ ఓట్లు అక్కడ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు కానీ జూనియర్‌కు కమ్మ యిమేజి లేదు. అతను వాళ్లతో ఐడెంటిఫై కాలేదు, వాళ్లూ ఓన్ చేసుకోలేదు. ఆ మాటకొస్తే తొలిరోజుల్లో నందమూరి కుటుంబం అతన్ని గుర్తించలేదు. ఇప్పటికీ కళ్యాణ్‌రామ్‌తోనే సాన్నిహిత్యం. బాబు కొద్దికాలం చేరదీసి, ‘యూజ్ అండ్ త్రో’ పాలసీలో పక్కన పెట్టేశారు. కులరీత్యా హీరోల్లో ఎంతమంది కమ్మలున్నా, కమ్మ సినీ అభిమానుల ఐకాన్ బాలకృష్ణే. రాజకీయాలకు వచ్చేసరికి బాలకృష్ణ బాబుకి ఎదురు నిలవలేరు, బంధుత్వం దృష్ట్యా, రాజకీయచాతుర్యం దృష్ట్యా! పైగా వయసు ఆయన పక్షాన లేదు. జూనియర్‌ను కమ్మ ప్రతినిథిగా కంటె, ఒక పాప్యులర్ యూత్ ఐకాన్‌గా చూడడం భావ్యం.

దీన్నే బిజెపి వాడుకుందామని చూడవచ్చు. అతను రాజకీయాల్లో చేరనంటున్నాడు కాబట్టి, పార్టీ పెట్టే ఓపికా, తీరికా లేదు కాబట్టి, తమ పార్టీకి ప్రచారసారథిగా ఉండమని కోరవచ్చు. 2014లో పవన్ తమ కోసం ప్రచారం చేసిన తీరులో చేయమని అడగవచ్చు. కర్ణాటకలో వాడుకోవచ్చు, తెలుగువాళ్లున్న పొరుగు రాష్ట్రాలలో వాడుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఇంతలా వాడుకున్నవాళ్లు 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రలో వాడుకోరా? జూనియర్ వచ్చి బాబుకు వ్యతిరేకంగా గళం విప్పితే ప్రజల్లో స్పందన రాకుండా ఉంటుందా? తన తాత పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడా అనే సందేహం వస్తోందా? శిందే ఏమంటున్నాడు? బాల ఠాక్రే నా దేవుడు, కానీ ఉద్ధవ్ ఆ వారసత్వానికి అర్హుడు కాడు అంటున్నాడు. జూనియర్ కూడా అదే అనవచ్చు. నా తాత పెట్టిన పార్టీని హైజాక్ చేసి, పేద ప్రజలకు దూరంగా తీసుకుని పోయాడు. ఎన్టీయార్ కలలను నిజం చేసే శక్తికి బిజెపికే ఉంది, అందుకే నిస్వార్థంగా దానికి ప్రచారం చేస్తున్నాను అనవచ్చు.

2014లో పవన్ నిస్వార్థంగా ప్రచారం చేసినప్పుడు ఓటర్లపై పడిన ప్రభావం వేరు, 2019లో తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చినపుడు ఓటర్ల రియాక్షన్ వేరు. జూనియర్‌కు కులముద్ర లేదు, స్వశక్తితో పైకి వచ్చాడన్న మర్యాద ఉంది, జగన్, బాబుతో సహా ఆంధ్రలో ఏ నాయకుడికీ లేనంత వాగ్ధాటి ఉంది. అతని ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగిస్తే టిడిపికి మద్దతుగా నిలుస్తూ వచ్చిన వర్గాలు బిజెపివైపు తిరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఎవరు చూడవచ్చారు, బిజెపి మద్దతుతో టిడిపి చీలినా చీలవచ్చు. ఇదే బాబు గుర్తించాలి. బిజెపిని ఏమీ అనకుండా, ఎంతసేపూ వైసిపినే అంటూ వస్తే వైసిపి వ్యతిరేక ఓటు బిజెపికి వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించాలి. బిజెపిని కూడా రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించి, దానితో కూడా పోరాటం చేయాలి. ముఖ్యంగా పార్టీ చైతన్యంతో తొణికిస లాడుతోందని, తనే వైసిపికి అసలైన ప్రత్యామ్నాయమని, ఎన్నికలు బహిష్కరించింది ఓటమి భయంతో కాదనీ, బిజెపి తనకు ఎంత అడ్డు తగిలినా 2024లో గణనీయంగా సీట్లు గెలుస్తామనీ తన మద్దతుదారులను నమ్మించాలి.

బిజెపి జూనియర్‌కు ఫలానా ప్రతిపాదన చేసి ఉండవచ్చని ఊహించినప్పుడు, దానికి జూనియర్ సమ్మతిస్తారా అనే ఊహ కూడా చేయడం అవసరం. సినిమాలు ఉధృతంగా ఉండగా రాజకీయాల్లోకి ప్రచారసారథిగా నైనా దిగడానికి జూనియర్‌కి యిష్టం లేకపోవచ్చు. కానీ సినిమావాళ్లు మోస్ట్ వల్నరబుల్. ఎన్టీయార్ ప్రభంజనం ఎదుర్కోవడానికి రాజీవ్ గాంధీ కృష్ణను పాలిటిక్స్‌లోకి రమ్మన్నాడు. విధిలేక కృష్ణ అతనున్నంతకాలం రాజకీయాల్లో ఉన్నాడు. రాజీవ్ ఆదేశం మేరకు ఎన్టీయార్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీశాడు. అతని తర్వాత హమ్మయ్య అని తప్పుకున్నాడు. అది కేంద్రంలో కాంగ్రెసు హయాం. ఇప్పుడు బిజెపి తలచుకోవాలే కానీ ఈడీ వచ్చి తలుపు తట్టగలదు. పైగా యిక్కడ తమాషా చూడండి. అమిత్ జూనియర్‌ను రహస్యంగా కలవలేదు. బాహాటంగానే కలిసి, తన యింటెన్షన్ ఏమిటో అందరికీ తెలియపరిచాడు. ఇక జూనియర్ హితైషులందరూ అతనికి సలహాలిస్తూంటారు. వాళ్ల ప్రెషర్ తట్టుకోలేకనైనా జూనియర్ బిజెపి ఒత్తిడికి లొంగవచ్చు.

- ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?