cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బైడెన్ ఆఫ్గన్ వైఖరి సబబే!

ఎమ్బీయస్: బైడెన్ ఆఫ్గన్ వైఖరి సబబే!

అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా వైదొలగడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. తన బాధ్యత వదిలిపెట్టి వెళ్లిపోయిందని, దేశాన్ని తాలిబాన్ల పాలు చేసి పారిపోయిందని, 20 ఏళ్లు వుండి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేక పోయిందని, యీ నిర్ణయం ద్వారా బైడెన్ అమెరికా పరువు తీశాడనీ.. యిలా చాలా మంది అంటున్నారు కానీ నాకు మాత్రం బైడెన్ చేసినది సమంజసమే అనే నమ్మకం కుదిరింది. ఇతర దేశాల వ్యవహారాల్లో కలగజేసుకోవడం పులి స్వారీ లాటిది. పులి వీపు ఎక్కడానికి ఎలాగోలా గెంతి కూర్చోవచ్చు కానీ దిగడమే కష్టం. దిగితే పులి చంపేస్తుందేమోనని భయం. కానీ ఎన్నాళ్లు పులి వీపు మీద కూర్చోవడం? తెగించి కిందకు దూకడానికి చాలా ధైర్యం కావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుడికి! పరిస్థితి క్లిష్టంగా వుందని, బాగుపడే ఆశ యీషణ్మాత్రం లేదని తెలిసిన పార్టీ లోపలా, వెలుపలా ప్రత్యర్థులు దేశద్రోహివి అంటూ దుమ్మెత్తిపోస్తారు. రాజకీయంగా నష్టం కలిగినా ఫర్వాలేదు, దేశక్షేమం కోసం యిది చేస్తున్నాను అనే ప్రగాఢవిశ్వాసం వుంటే తప్ప యిలాటి స్టెప్ ఎవరూ తీసుకోలేరు.

పరిస్థితులు చక్కదిద్ది వెళ్లవచ్చు కదా అని అంటే బైడెన్ చెప్పాడు – అఫ్గన్ సైన్యం సంగతి చూశారు కదా, తాలిబాన్లు వారంలోపులే అధికారం చేజిక్కించుకున్నారు కదా! మేం యింకో 20 ఏళ్లు వున్నా యిదే జరిగేది.’ అని. అఫ్గనిస్తాన్‌లో బ్రహ్మాండమైన పాలన జరుగుతోంది. ఇప్పుడు తాలిబాన్లు వచ్చి అంతా సర్వనాశనం చేస్తారు అని మన మీడియాలో హోరెత్తిపోతోంది. ఎంత గొప్ప పాలన జరిగిందో వివరాలు బయటకు రావడం మొదలెట్టాయి కదా! కొన్నాళ్ల తర్వాత మనకు బోధపడుతుంది – తాలిబాన్లు గ్రామాలకు గ్రామాలు స్వాధీనం చేసుకుంటూ వస్తే ప్రజలెందుకు తిరగబడలేదో! సైన్యం విషయంలో జరిగిన మోసాలు ముందుగా బయటకు వచ్చాయి. తాలిబాన్లు 60 వేల మంది, సైన్యం 3 లక్షల మంది ఉన్నా లొంగిపోతున్నారు అని రాశాను. 3 కాదు 3.60 లక్షల మంది అని కొందరన్నారు. ఏ అంకె చెప్పినా అదంతా కాగితాల మీదే కానీ, నిజంగా వున్నది రెండు లక్షల లోపే అని యిప్పుడు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు క్లయింట్లకి బిల్లు వేయడానికి ఉన్న స్టాఫ్‌ను ఉబ్బేసి చెప్తారు చూడండి, అలాగే అమెరికా నుంచి నిధులు లాగడానికి దొంగ పేర్లు చూపించి పాలకులు మింగేశారన్నమాట!

పోనీ మూడున్నర లక్షల మంది పేరు చెప్పి డబ్బు పుచ్చుకున్నారు కదా, యీ లక్షన్నర, రెండు లక్షల మందికైనా జీతాలివ్వాలిగా, యివ్వలేదట. కొందరికి సగం జీతం యిచ్చారట, మరి కొందరికి నెలలుగా జీతాలే లేవట! ఇక దుస్తులు, ఆహారం విషయంలో ఎంత కొట్టేశారో తెలియదు. ఇలా ఉన్న సైన్యం ప్రాణాలకు తెగించి ఎవరితో మాత్రం ఎందుకు పోరాడుతుంది? తినేయడం మరిగినవాళ్లు సైన్యం విషయంలో మాత్రం తిని అంతటితో ఆగుతారా? తక్కిన ప్రాజెక్టుల విషయంలో ఎంత తినేశారో ఏమో! సగం పని చేయించి, పూర్తి బిల్లులు చెల్లించి, వాటిలో కమిషన్లు తీసుకున్నారేమో! వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన అష్రఫ్ ఘని దేశం వదిలి పారిపోయాడు, పోతూపోతూ డబ్బు మూటలు పట్టుకుపోయాడట. ఈ పాటికే స్విస్ బ్యాంకుల్లో ఎంత దాచాడో ఏమో!

మొన్నటిదాకా అతనికి చేదోడువాదోడుగా వున్న సాలే ‘నేను యికపై తాలిబాన్లను ఎదిరించి, దేశాన్ని కాపాడుతాను’ అని ప్రకటన యిచ్చాడు. టీవీ చర్చలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళా హక్కుల కార్యకర్త యీ న్యూస్‌పై మండిపడింది – మొన్నటిదాకా ఘని పక్కనే వున్న నీకు అతని సంగతి తెలియదా? ఈ రోజు అంతర్యుద్ధం తెచ్చి దేశాన్ని రక్తపాతంతో ముంచెత్తుతావా? అని. ఆమె తాలిబాన్లకు వ్యతిరేకి. అదే సమయంలో మొన్నటివరకూ ఉన్న ప్రభుత్వ వర్గాలనూ అసహ్యించుకుంటోంది. ఇలాటి ప్రభుత్వాన్నా అమెరికా నిన్నటివరకు బోటు పెట్టి నిలబెడుతూ వచ్చింది! తాడిచెట్టు ఎక్కేవాణ్ని ఎంతవరకూ తోస్తాం అంటూ బైడెన్ యిప్పుడు చేతులెత్తేశాడు. ఇంకో ఐదేళ్లపాటు ఘనీని పోషించినా, అమెరికాకు వచ్చే లాభం యిసుమంతైనా వుండకపోగా, ఘనీకి, అతని గ్యాంగ్‌కు ఆస్తులు పెరిగేవి. ప్రజలకు వాళ్ల మీద అసహ్యం పెరిగేది. ఘని మీద అసహ్యం, అతన్ని నిలబెట్టిన అమెరికా మీద కూడా ప్రసరిస్తోంది. తన సైనికులను బలిపెట్టి, టాక్స్‌పేయర్ డబ్బు వెచ్చింది, ఆఫ్గన్ ప్రజల ఆగ్రహాన్ని కొనుక్కోవడం అమెరికాకు తెలివైన పనా?

ఈ ఆలోచన అమెరికా ప్రజల్లో కూడా వున్నా, తిరోగమన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏ అధ్యక్షుడూ ధైర్యంగా ముందడుగు వేయలేదు. ఒబామా హయాంలో 2012లో మొదలైన ఆలోచన అమలులోకి వచ్చేందుకు యిన్నాళ్లు పట్టింది. వియత్నాం యుద్ధ సమయంలోనూ అంతే, అమెరికన్ ప్రజల్లో చాలా మంది, ముఖ్యంగా యువత, దాన్ని వ్యతిరేకించారు. నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా ఏ అధ్యక్షుడూ యుద్ధం ముగించలేక పోయాడు. తోక ముడుచుకుని వచ్చేశారని అంటారని భయపడి, ఏదో సాధించి వెనక్కి వచ్చామని చెప్పుకోవడానికి ఏళ్లపాటు చర్చలు జరిపారు. చివరకు ఆ ఊబిలోంచి బయటపడేటప్పటికి చచ్చే చావైంది. తాము వియత్నాంలో చేసిన అకృత్యాలకు అమెరికా భారీ మూల్యమే చెల్లించింది.  ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ విషయంలో కోట్లాది డాలర్లు వెచ్చించడమే కాక, ఆఫ్గన్ల అభిమానాన్ని పొందలేక పోయింది. ఎంత డబ్బు కుమ్మరించినా, ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా తమను ఆక్రమణదారులుగానే చూస్తున్నారని అమెరికాకు ఎప్పుడో అర్థమైంది. కానీ విత్‌డ్రా కావడానికి సాహసించలేదు.

నిజానికి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ‘సంబంధం లేని యితర ప్రాంతాల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి తెచ్చేసి, ఆ విధంగా వ్యయం తగ్గిస్తానని, ఆ నిధులను అమెరికన్ యువత సంక్షేమానికి ఖర్చు పెడతానని’  వాగ్దానాలు చేశాడు. కానీ ఎప్పణ్నుంచో పాతుకుపోయిన వ్యవస్థ ఆ పని చేయనీయలేదు. ట్విన్ టవర్స్ దాడి తర్వాత అఫ్గనిస్తాన్‌పై అమెరికా దండెత్తడం ఆవేశంలో, అహంకారంతో చేసిన పని. అంతకు ముందే రష్యా దండెత్తి చేతులు కాల్చుకుని తోక ముడిచిన చరిత్ర దాని కళ్లముందు వుంది. అయినా తమపై దాడి చేసినవారికి బుద్ధి చెప్పాలన్న తొందరపాటు వారిని తప్పుడు నిర్ణయం తీసుకునేట్లా చేసింది. అఫ్గనిస్తాన్ చరిత్ర గురించి 2019 నాటి బిబిసి వాళ్ల రెండు భాగాల డాక్యుమెంటరీ – అఫ్గనిస్తాన్, ద గ్రేట్ గేమ్ అనే చూశాను. చాలా బాగుంది. వీలుంటే చూడండి. 

చూడలేకపోతే నేను ఆ దేశపు చరిత్ర గురించి రాయబోయే వ్యాసాలు చదవండి. మీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. అఫ్గనిస్తాన్ క్లిష్టమైన పర్వతప్రాంతం. చిన్నచిన్న గ్రామాలుగా, వాటిని పాలించే వందలాది తెగలుగా విడిపోయిన ప్రాంతం. వాళ్ల బతుకేదో వాళ్లు బతకడమే వాళ్లకు తెలుసు. ఎప్పుడో మధ్యయుగాల్లో గజనీ మొహమ్మద్ దండయాత్రలు వదిలేయండి. తర్వాత వాళ్లు ఎవరి జోలికీ రాలేదు. అయితే రష్యా, ఇండియాను పాలించే బ్రిటన్ అనే రెండు మహా సామ్రాజ్యాల మధ్య శాండ్‌విచ్ కావడమే దాని కర్మం. దీని ద్వారా అవతలివాళ్లు తమ పైకి దండెత్తి వస్తారేమోనన్న భయం బ్రిటన్, రష్యాలకు వుండి, దీని వ్యవహారాల్లో కలగజేసుకోవడానికి చూశాయి. ప్రపంచాన్నంతా కబళించాలని చూసే బ్రిటన్ 19వ శతాబ్దంలో మొదటిసారిగా అఫ్గనిస్తాన్‌పై దాడి చేసి చావుదెబ్బ తింది. అఫ్గనిస్తాన్‌లో ప్రవేశించడం సులభం కానీ మర్యాదగా బయటపడడం కష్టం. ఎందుకంటే వాళ్లకు పరాయిపాలన కింద వుండడం అస్సలు రుచించదు. బ్రిటన్ అనుభవం అయిన తర్వాత కూడా రష్యా బుద్ధి తెచ్చుకోకుండా 20వ శతాబ్దంలో దాడి చేసి, అదీ చావుదెబ్బ తిని, గిలగిలలాడి, పదేళ్ల తర్వాత బయటపడింది. 21వ శతాబ్దంలో అమెరికా అదే పని చేసి, 20 ఏళ్ల తర్వాత బయటపడింది.

వరుస యుద్ధాలలో ఓటమి ఎదురవుతున్నా యీ అగ్రరాజ్యాలు వెంటనే ఎందుకు బయటకు రావు? అనే ప్రశ్నకు ఆ డాక్యుమెంటరీలోనే సమాధానం చెప్పారు. ఓడిపోతున్న కొద్దీ, తమ సైనికుల శవాల గుట్టలు పెరుగుతున్న కొద్దీ, సైన్యాధికారులు తమ పాలకులకు ‘అబ్బే లాభం లేదండి, వెనక్కి వెళ్లిపోతే మంచిది’ అని సలహా చెప్పరు. ‘మనకు సైనికులు తక్కువగా వున్నారు, ఆయుధాలు తక్కువగా వున్నారు, నిధులు సరిపోవడం లేదు. ఇంకా పంపండి, యింకా పంపండి.’ అంటూ పిండుకుంటూ వుంటారు. ప్రపంచంలో ఏ సైన్యంలోనైనా అవినీతి తప్పదు. ఓటమి ఒప్పుకోవడానికి సైనికాధికారులకు అహంభావం అడ్డు వస్తుంది. ‘నా హయాంలో ఫలానా రాజ్యం చేతిలోంచి జారిపోయింది’ అనే మాట రాజకీయంగా తనకు హాని చేస్తుందనే పాలకుడి భయం. అందువలన యిద్దరూ కలిసి, సైనికుల శవాల గుట్టలు పెంచుకుంటూ పోతారు. ఆ ఓటముల గురించి సొంత దేశపు మీడియాలో రాకుండా జాగ్రత్త పడతారు.

రష్యా సైన్యం ఆఫ్గన్‌లో ఓడిపోతున్నపుడు శవాలను చాటుగా తరలించి వారి కుటుంబాలకు రాత్రివేళ అప్పచెప్పేవారట. అంత్యక్రియల న్యూస్ బయటకు రాకుండా చూసేవారట. అంతెందుకు గోర్బచేవ్ 1985లో పార్టీ జనరల్ సెక్రటరీ కాగానే సైన్యాన్ని వెనక్కి వచ్చేయమంటే వాళ్లు మూడేళ్ల గడువు అడిగారట! మూడేళ్ల తర్వాత అతను యింకా పెద్ద పదవిలోకి వెళ్లి సైన్యవిరమణపై పట్టుబట్టడంతో గతిలేక 1988 మేలో మొదలుపెట్టి 1989 ఫిబ్రవరి నాటికి వెనక్కి వెళ్లిపోయారు. అతను కాక వేరే ఎవరైనా అధికారంలోకి వచ్చి వుంటే జనరల్స్ ‘గోర్బచేవ్‌కు ఏమీ తెలియదండీ, ఇంకో మూడేళ్లు ఆగితే గెలుపు తథ్యం’ అంటూ చాచివేసేవారు. ఇప్పుడు బైడెన్‌కు కూడా అమెరికన్ వ్యవస్థలో యిలాటి వ్యతిరేకత, ప్రతిఘటన వచ్చి వుంటుంది. విపరీత జాతీయభావాలతో ‘ఇలా చేస్తే అమెరికా పరువేం కాను, రేప్పొద్దున్న మరో చిన్న దేశం కూడా తోక ఝాడిస్తుంది’ అని వాళ్లు వాదించి వుండవచ్చు. అయినా బైడెన్ గట్టిగా నిలబడినందుకు అతన్ని మెచ్చుకోవాలి.

ఇప్పుడు అమెరికా వెళ్లిపోవడం వలన అఫ్గనిస్తాన్ కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది, నరహంతకులైన తాలిబాన్లు ప్రజల హక్కులు హరించేస్తారు, కాల్చుకు తినేస్తారు, అనే వాదన చూపించి, అమెరికా యింకా వుండిపోవాలని అనడం అర్థరహితం. ప్రపంచంలో అనేక చోట్ల అనేక అఘాయిత్యాలు జరుగుతూ వుంటాయి. దుర్మార్గులైన పాలకులు రాజ్యం చేస్తూంటారు. అందర్నీ చక్కదిద్దడం అమెరికా పనా? ఉత్తర కొరియాలో రాక్షస పాలన జరుగుతోంది, మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కూలదోసి సైనిక పాలన వచ్చింది, సౌదీ అరేబియాలో మతఛాందసం రాజ్యం చేస్తోంది. ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో అనేక రాజ్యాల్లో నియంతలున్నారు. అవన్నీ ఎలాగో అఫ్గనిస్తాన్ కూడా అంతే. తాలిబాన్ల పాలన నచ్చకపోతే దాన్ని కూలదోయవలసిన పని ఆఫ్గన్లదే!

వాళ్లు శరణార్థుల్లా యితర దేశాలకు వస్తే మూణ్నెళ్లు, మహా అయితే ఆర్నెల్లు ఆశ్రయం యిచ్చి ఆ తర్వాత ‘నీ దేశం వెళ్లి పోరాడుకో’ అని పంపించివేయాలి తప్ప, వాళ్లకు శాశ్వతంగా నివాసం కల్పించకూడదు. వాళ్ల తరఫున మనం వెళ్లి యుద్ధాలు చేయకూడదు. అబ్బే సాధారణ పౌరులు సాయుధులైన తాలిబాన్లను ఎలా ఎదుర్కోగలరు? అంటే 4 కోట్ల జనాభాలో తాలిబాన్లు 60 వేల మందే కదా! ఆఫ్గన్ల రక్తంలోనే వీరత్వం వుంది, తిరుగుబాటు లక్షణం వుంది, ప్రాణాలకు తెగించే తెగువ వుంది అన్నపుడు వాళ్లు అదేదో తాలిబాన్ల మీదనే చూపించాలి. ఇప్పటిదాకా అనుభవించిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు పోగొట్టుకోకూడదంటే వాటికోసం పోరాడాలి. ఇంగ్లీషువాళ్ల నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటే, యితరులు వచ్చి సాయం చేశారా? మనమే తిరగబడ్డాం కదా, కష్టనష్టాలు అనుభవించాం కదా ప్రాణాలు అర్పించాం కదా! మేం అదేమీ చేయం, మా తరఫున మీరు వచ్చి తాలిబాన్లను తరిమివేయండి అని ఆఫ్గన్లు అంటే ఎలా?

తాలిబాన్లు అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాల వ్యాపారం పెరిగిపోతుంది, దానివలన ప్రపంచానికే ముప్పు అనే వాదనలో కూడా నాకు పస కనబడదు. దక్షిణ అమెరికాలో, ఆఫ్రికాలో అనేక దేశాల్లో కూడా యిదే పరిస్థితి. వాటినేం చేద్దాం? దేశంలో వాటిపై సరైన నిఘా పెట్టి నిరోధించడమే అసలైన మార్గం. ఆ నిఘా లేకపోతే మాదక ద్రవ్యాలే కాదు, ఆడపిల్లల స్మగ్లింగ్, మారణాయుధాల రవాణా దగ్గర్నుంచి అన్నీ జరుగుతాయి. అయినా తాలిబాన్లు 20 ఏళ్ల క్రితం ఎలా వున్నారో యిప్పుడూ అలాగే వుంటారని ఎవరైనా చెప్పగలరా? అప్పటి పరిస్థితులు వేరు, యిప్పటివి వేరు. సరిగ్గా వుండకపోతే మళ్లీ 20 ఏళ్లు అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వస్తుందనే స్పృహ వారికి వుండవచ్చు. పైగా యీసారి ఎక్కడో దూరంగా వున్న అమెరికా కాదు, పొరుగున వున్న చైనాను ఎదుర్కోవాలి. తాలిబాన్లు టాక్టిక్స్ మార్చవచ్చు. అఫ్గన్ పరిస్థితిలో క్లారిటీ రాకుండానే వాళ్లను ఏ విధంగానూ బ్రాండ్ చేయడం సరి కాదు. ఈలోగా విదేశీ శక్తులు దూరంగా వుండడమే మేలు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)

mbsprasad@gmail.com

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×