ఎమ్బీయస్‍: బెంగాల్‌లో బిజెపి లాభనష్టాలు

ఈ నెలలో వెలువడిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం.. అనే క్రమం ఎంచుకుంటున్నాను. తూర్పు రాష్ట్రాలలో (బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఘండ్, అసాం, ఈశాన్య రాష్ట్రాలు)142 స్థానాలుంటే ఎన్డీఏకు 87…

ఈ నెలలో వెలువడిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం.. అనే క్రమం ఎంచుకుంటున్నాను. తూర్పు రాష్ట్రాలలో (బెంగాల్, బిహార్, ఒడిశా, ఝార్ఘండ్, అసాం, ఈశాన్య రాష్ట్రాలు)142 స్థానాలుంటే ఎన్డీఏకు 87 వచ్చాయి. ఇండియాకు 52, ఇతరులకు 3 వచ్చాయి. ఎన్డీఏ జాతీయ సగటు సీట్ల శాతం 61.3 కాగా, తూర్పున మాత్రం అది 54. ఇండియా జాతీయ సగటు సీట్ల శాతం 43.1 కాగా, తూర్పున మాత్రం 59.8! ఈ పెరుగుదలకు కారణం తృణమూల్! అది పేరుకి ఇండియా కూటమిలో ఉన్నా, బెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్‌లను దూరం పెట్టి 69% సీట్లు గెలిచింది. తక్కిన రాష్ట్రాలలో ఎన్డీఏదే హవా. అందువలన బిజెపి తూర్పున లాభపడిందని చెప్పాలి. ముఖ్యంగా ఒడిశా వచ్చి బిజెపి పాలిత రాష్ట్రాలలో చేరింది. అక్కడ అసెంబ్లీలో కూడా 147 సీట్లలో 78 (53.1%) గెలిచి, నవీన్ పట్నాయక్‌ను పదవీభ్రష్టుణ్ని చేసింది. బిహార్‌లో నీతీశ్‌తో కలిసి 40లో 30 పార్లమెంటు సీట్లు (75%) గెలిచింది.

ఒక్కొక్క రాష్ట్రంలో వచ్చిన ఫలితాలను ఆ యా రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు యిస్తాను. తూర్పున సీట్ల సంఖ్యాపరంగా పెద్దదైన బెంగాల్‌తో మొదలు పెడతాను. అక్కడి 42 సీట్లలో తృణమూల్‌కి 29 సీట్లు, 45.8% ఓట్లు, బిజెపికి 12 సీట్లు, 38.7% ఓట్లు వచ్చాయి 2019 పార్లమెంటు ఎన్నికలలో తమకు 18 సీట్లు (2014లో 2 సీట్లు, 18% ఓట్లు ఉండేవి) 40.7% ఓట్లు రావడంతో అప్పటిదాకా దుర్భేద్యంగా ఉన్న బెంగాల్‌ను జయించగలమనే ఆశ జనించింది బిజెపికి. 2021 అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ మాదే అనే సమరోత్సాహంతో పోరాడింది. కానీ మమత తన బలాన్ని చూపుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో 43.3% ఓట్లతో 22 సీట్లు మాత్రమే తెచ్చుకున్న తృణమూల్ 2021 నాటికి 48% ఓట్లతో 215 అసెంబ్లీ స్థానాలలో గెలిచి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. బిజెపికి 77 సీట్లు, 38.1% ఓట్లు మాత్రమే రావడంతో నిరాశ పడిన తృణమూల్ ఫిరాయింపుదారులు తిరిగి గృహోన్మఖులయ్యారు.

అయినా 2024పై బిజెపికి ఆశ చావలేదు. పార్లమెంటు ఎన్నికలు కదా, మోదీని చూసి ఓటేస్తారు, మమత పార్టీకి ఓటేసినా వ్యర్థమని భావిస్తారు అనుకుంది. మోదీ మే 28 సభలో మాట్లాడుతూ ‘‘దేశం మొత్తంలో మా బెస్ట్ పెర్‌ఫామెన్స్ బెంగాల్‌లోనే ఉంటుంది.’’ అన్నారు. ఫలితాలు వచ్చాక చూస్తే వారి సీట్ల జాతీయ సగటు 44.2% కాగా, బెంగాల్‌లో 28.6% ఉంది. గతంలో కంటె 6 సీట్లు, 2% ఓట్లు పోగొట్టుకుంది. అవినీతి, హింసాత్మక పాలన ఆరోపణల్లో పీకలదాకా మునిగిన తృణమూల్ గతంలో కంటె 7 సీట్లు గెలిచింది. తృణమూల్‌తో పొత్తు కుదుర్చుకోవడంలో విఫలమైన కాంగ్రెసు 1 సీటు పోగొట్టుకుని 1 మిగుల్చుకుంది.

తృణమూల్ యిమేజి ఏ మాత్రం బాగా లేదు. స్కూల్ సర్వీస్ కమిషన్ స్కాము, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కామ్, సందేశ్ ఖాలీ హింస.. యిలా ఎన్నో ఉన్నాయి. ముఖ్యనాయకులు జైల్లో ఉన్నారు. తక్కినవారు సిబిఐ విచారణ ఎదుర్కుంటున్నారు. తపస్ రాయ్ వంటి ప్రముఖ తృణమూల్‌ నేత పార్టీ వదిలి బిజెపిలో చేరాడు. కలకత్తా హైకోర్టు ఎడాపెడా వాయించేస్తోంది. ఎన్నికలు జరుగుతూండగానే మే 22న ‘2020 నుంచి బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన ఒబిసి సర్టిఫికెట్లు చెల్లవని తీర్పు యిచ్చింది. 2012 చట్టం ద్వారా ప్రభుత్వం కొన్ని కులాలకు రిజర్వేవేషన్ యివ్వడం తప్పంది. రామకృష్ణ మిషన్‌, భారత సేవా సంఘ్, ఇస్కాన్ సంస్థలు బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మమత  చేసిన వ్యాఖ్యలతో హిందువులు ఆమెకు వ్యతిరేకంగా సంఘటిత మవుతారని అందరూ అనుకున్నారు. వివాదం చెలరేగడంతో మమత ఆ సంస్థల్లో కొందరు వ్యక్తులు.. అని సవరించుకుంది.

తృణమూల్‌ను మూలాల్లోంచి గడ్డిపరకల్లా పీకి పారేయడానికి యిదే తరుణం అనుకుంది బిజెపి. తన పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం కంటె తృణమూల్‌ను బలహీన పరచడం మీదనే దృష్టి పెట్టింది. మమతను ఢీకొనగల నాయకుణ్ని తయారు చేయడంలో విఫలమైంది. పార్లమెంటు ఎన్నికలు కదా మోదీ వెర్సస్ మమతా అంటే సరిపోతుందనుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో మోదీ మమతను ‘దీదీ, ఓ దీదీ…’ అంటూ వెక్కిరించడంతో రాజకీయంగా నష్టం జరిగిందని గ్రహించి, యీసారి అలా చేయలేదు. హైకోర్టు జజ్‌గా ఉంటూ తృణమూల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులిచ్చి, రిటైరైన 48 గంటల్లో తమ పార్టీలో చేరిన అభిజజిత్ గంగోపాధ్యాయ అనే జజ్ చేత మమతకు వ్యతిరేకంగా ప్రచారం చేయించింది. అతన్ని తామ్‌లుక్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది. అతను మమతపై చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఎన్నికల కమిషనర్‌ చేత శిక్షింపబడ్డాడు.

తృణమూల్‌కు గ్రామగ్రామాన పటిష్టమైన నెట్‌వర్క్ ఉంది. ప్రశాంత కిశోర్ లేని ఐప్యాక్ టీమ్ కార్యకర్తలను పర్యవేక్షించింది. ఇటు చూస్తే, బిజెపికి పార్టీ నిర్మాణం గట్టిగా లేదు. పైగా అంతఃకలహాలు ఎక్కువ. అభ్యర్థుల ఎంపిక కూడా సరిగ్గా లేదనే వాదనలు వినవచ్చాయి. నిశిత్ ప్రమాణిక్ వంటి కేంద్ర మంత్రి, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వంటి వారు కూడా నియోజకవర్గాల ఎంపిక సరిగ్గా లేకపోవడం చేత ఓడిపోయారు. దిలీప్ ఘోష్‌ను క్రికెటర్ కీర్తి ఆజాద్ ఓడించాడు. శతృఘ్న సిన్హా వంటి బలమైన నాయకుడికి ప్రత్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలో తెలియక తడబడ్డారు. అభ్యర్థిని మార్చి, చివరి నిమిషంలో అహ్లూవాలియాను నిలబెట్టారు. ఆయన ఓడిపోయాడు. బెంగాల్‌లోనే కాదు, అనేక రాష్ట్రాలలో బిజెపి అభ్యర్థుల ఎంపికలో తప్పు చేసిందని, మోదీ యిమేజి అన్నీ కవర్ చేసేస్తుందనే ధీమాతో ఉందని బిజెపి అభిమానులే విశ్లేషించారు.

ఈ ఎన్నికలలో గమనించ వలసినదేమిటంటే మాయావతి మేనల్లుడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కుడిభుజం పాండ్యన్ సోదిలోకి లేకుండా పోతే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తగిన వారసుడిగా నిరూపించుకున్నాడు. డైమండ్ హార్బర్ పార్లమెంటు స్థానంలో మూడోసారి రికార్డు స్థాయిలో 7 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో నెగ్గాడు. నిజానికి అతనికి బయటి వాళ్లే కాదు, పార్టీలోనూ శత్రువులున్నారు. మమత వీధి పోరాటాల్లోంచి వచ్చిన వ్యక్తి. ఆమె మాటా, చేతా, వర్కింగ్ స్టయిల్ అలాటివి. కానీ అభిషేక్‌కి పోరాటం చేయవలసిన అవసరం ఎప్పుడూ పడలేదు. అతను పార్టీని కార్పోరేట్ స్టయిల్‌లో నడపాలని చూశాడు. 2021లో ప్రశాంత కిశోర్‌ను తెచ్చాడు. ఇప్పటికీ ఐప్యాక్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాడు.

ఇతని వ్యవహారశైలి యువతరం నేతలకు, బయటి తటస్థులకు నచ్చుతోంది కానీ పార్టీలోని పాతతరం వారు యితన్ని చూసి పెదవి విరుస్తున్నారు. లెఫ్ట్ నాయకులు అతన్ని బంధుత్వం వలన పైకి వచ్చిన కుర్రాడిగా కొట్టి పారేశారు కానీ యీసారి గెలుపుతో అతను వాళ్ల నోళ్లు మూయించాడు. లెఫ్ట్ ఫ్రంట్ తరఫున సిపిఎం 23, సిపిఐ 2, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఆర్‌ఎస్‌పి 2 పోటీ చేశాయి. వాటి భాగస్వామి కాంగ్రెసు 12టిలో పోటీ చేసింది. లెఫ్ట్‌కి 2019 కంటె 0.6% ఓట్లు తగ్గగా, కాంగ్రెసుకి 1% ఓట్లు తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దక్షిణ బెంగాల్, కలకత్తా పరిసర ప్రాంతాలు నిలుపుకోవడంతో పాటు తృణమూల్ పార్టీ బిజెపికి పట్టున్న ఉత్తర బెంగాల్, జంగల్‌మహల్ ప్రాంతాల్లో కూడా దానికి గట్టి పోటీ యిచ్చింది. ఉత్తర బెంగాల్‌లోని 8 సీట్లలో బిజెపి 6, తృణమూల్ 2 గెలిచాయి. 

ఫలితాలు యిలా వస్తాయని ఎవరూ ఊహించ లేక పోయారు. దేశబంధు అనే హిందీ పత్రిక మాత్రమే తృణమూల్‌కు 26-28 (29 వచ్చాయి), బిజెపికి 11-12 (12 వచ్చాయి) వస్తాయని చెప్పింది. ఇప్పటిదాకా ఎంతో ఖ్యాతి గడించి, ఆర్నెల్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో, యీ పార్లమెంటు ఎన్నికలలో పరువు పోగొట్టుకున్న యాక్సిస్ మై ఇండియా తృణమూల్‌కు 11-14 వస్తాయని, బిజెపికి 26-31 వస్తాయని చెప్పింది. బిజెపి 30 సీట్ల లక్ష్యం పెట్టుకుంది కాబట్టి దాన్ని దాటించారనుకోవాలి. (ఎన్డీఏకు 401 అన్నట్లే!) అవేమీ జరగలేదు. తృణమూల్‌కే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం మమతకు మహిళా ఓటు బ్యాంకుని నమ్ముకోవడం. వారిలో 53% మంది తృణమూల్‌కు ఓటేశారని లోకనీతి సర్వే చెప్తోంది. 2019లో యిది 42%.  బిజెపికి 33% మంది మహిళలు ఓటేశారు. (2019 కంటె యిది 1% తక్కువ)

మమత అమలు చేసిన కన్యాశ్రీ, లక్ష్మీ భాండార్ వంటి సంక్షేమ పథకాలు మహిళలను మురిపించాయి. లక్ష్మీ భాండార్ పథకం ద్వారా 25-60 ఏళ్ల మధ్య వయసుండి, ప్రభుత్వోద్యోగం చేయని మహిళలకు నెలానెలా రూ.500, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 1000 యిచ్చేవారు. 2024లో వాటిని 1000, 1200 చేశారు. జర్నలిస్టులు అడిగినప్పుడు బెంగాల్ మహిళలు యిది సొంత ఆదాయమంటూ గర్వంగా చెప్పుకున్నారు. జనాభాలో 49% ఉండి, పురుషుల కంటె ఎక్కువగా ఓట్లేసే మహిళలను మమత యీ విధంగా ఆకట్టుకున్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల విషయంలో సందేశ్‌ఖాలీ ఎంత దుమారం లేపిందో అందరికీ తెలుసు. అక్కడి బసీర్‌హాట్ నియోజకవర్గంలో బాధిత మహిళ రేఖా పాత్రాకు బిజెపి టిక్కెట్టిచ్చి భలే ఎత్తుగడ వేశాననుకుంది. తీరా చూస్తే తృణమూల్ అభ్యర్థి హాజీ నూరుల్ ఇస్లామ్ చేతిలో ఆమె 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయింది.

దీన్ని బట్టి మహిళలకు మమత పట్ల మమకారం పోలేదని అర్థమౌతోంది. దానికి తగ్గట్టు మమత మహిళలకు రాజకీయాధికారం కట్టబెట్టడంలో ముందుంది. లోకసభలో నెగ్గిన మహిళా ఎంపీలు 74 మంది (13.6%) వీరిలో 30 మంది గతంలోనూ లోకసభలో ఉన్నారు, ఒకరు రాజ్యసభలో ఉన్నారు. 17 వ లోకసభలో 78 మంది ఉండేవారు. ఈసారి నలుగురు తగ్గారు. బిజెపి నుంచి 69 నిలబడితే 30 మంది నెగ్గారు. అంటే ఆ పార్టీ మొత్తం ఎంపీలలో 12.5% అన్నమాట. కాంగ్రెసు నుంచి 41 మంది నిలబడితే 14 గెలిచారు. (14%), ఎస్పీ 4 (10.8%), డిఎంకె 3, జెడియు 2, ఎల్జెపీ 2, వైసిపి 1, ఎన్సీపి ఎస్పీ 1, అకాలీ దళ్ 1, అప్నాదళ్ 1, ఆర్జేడీ 1, జెఎంఎం 1, టిడిపి 1, ఇతరులు 1. అయితే తృణమూల్ నుంచి 11 మంది నెగ్గారు, అంటే 38% అన్నమాట. 12 మందిని నిలబెడితే 11 మంది నెగ్గారు. ఓడిపోయిన సుజాతా మండల్ కూడా కేవలం 5600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నెగ్గినవారిలో మహువా మొయిత్రా వంటి వివాదాల్లో చిక్కుకున్న ఎంపీ కూడా ఉన్నారు.

స్థానిక బిజెపి నాయకులు బెంగాలీలే అయినా, బిజెపి కేంద్ర నాయకత్వం వైఖరి కారణంగా తృణమూల్ బిజెపిపై ‘బహిరాగత’ (ఔట్‌సైడర్) అని చిత్రీకరించ గలిగింది. దేశమంతా బిజెపి ముస్లిములపై చొరబాటుదారుల ముద్ర కొడితే, బెంగాల్‌లో బిజెపిపై ఆ ముద్ర కొట్టగలిగింది. పక్కనున్న ఒడిశాలో పాండియన్‌ను బూచిగా చూపించి మోదీ ఒడిశా ‘ఆత్మగౌరవా’న్ని రెచ్చగొడితే, తృణమూల్ బెంగాల్‌లో అదే పని మోదీ-అమిత్‌లను చూపించి చేయగలిగింది. ‘బిజెపి అంటే ‘బంగ్లా విరోధి’, మనకు నిధులు యివ్వదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగాల్‌కు నిధులు ప్రవహింప చేస్తామని వాగ్దానాలు చేశారు కానీ ఒక్క పైసా కూడా యివ్వలేదు. పైగా అవినీతి ఆరోపణలు వచ్చాయనే సాకు చెప్పి నరేగా, పిఎం ఆవాస్ యోజనా వంటి అనేక కేంద్ర పథకాల నిధులను విడుదల చేయకుండా ఆపేశారు. బెంగాల్ బిజెపి నాయకులు యిదేమిటని తమ కేంద్ర నాయకత్వాన్ని అడగలేని అసమర్థులు.’ అని ప్రజల్ని నమ్మించగలిగారు.

కేంద్రంలో బలమైన బెంగాలీ బిజెపి నాయకుడూ ఒక్కరూ లేకపోవడం, కేంద్రం నుంచి వచ్చిన నాయకులందరూ హిందీలోనే మాట్లాడడం, బెంగాల్‌లో ఉన్న ఉత్తరాది వారిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేయడం, స్థానికంగా ఉన్న దుర్గ, కాళీ వంటి దేవతలను కాకుండా పెద్దగా ప్రాచుర్యంలో లేని రాముడు, ఆంజనేయుడు వంటి దేవుళ్ల ఉత్సవాలు భారీ ఎత్తున జరపడం – వీటి వలన బిజెపి అంటే నాన్-బెంగాలీ అనే భావం బలపడింది. శ్రీరామనవమి ఉత్సవాలంటూ ప్రతీసారీ అల్లర్లు జరగడం బెంగాలీలను విసిగించింది. జై శ్రీరామ్ నినాదంతో బెంగాలీయేతర ఓట్లు పట్టుకుపోతోందని కాబోలు, తృణమూల్ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు జరిపింది యిటీవల. అక్కడ జై శ్రీరామ్ నినాదాలు కూడా చేశారు. ఎంతైనా రామమందిరం కట్టేసిన తర్వాత బెంగాల్‌లో రాముడిపై ఉత్సాహం తగ్గిందని, యీసారి శ్రీరామనవమి పెద్దంత ఘనంగా జరగలేదని ఆ సామగ్రి అమ్మే దుకాణదారులు వాపోయారు.  

బెంగాల్ జనాభాలో 27% మంది ముస్లిములు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో 130 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2011 తర్వాత ముస్లిం ఓట్లు కాంగ్రెసు, లెఫ్ట్‌ల నుంచి తృణమూల్‌కు బదిలీ అయ్యాయి. కానీ ముస్లింలపై మమత పట్టు యిటీవల సడలింది. పైగా కాంగ్రెసు, లెఫ్ట్ కూడా చురుగ్గా ఉన్నాయి కాబట్టి ముక్కోణపు పోటీలో ముస్లిం ఓట్లు చీలిపోయి, బిజెపి లాభపడుతుందని అనుకున్నారు. మమత ముస్లిము పక్షపాతాన్ని ఎత్తి చూపి హిందువులను మూకుమ్మడిగా తమ వైపు తెచ్చుకోవడానికి బిజెపి సిఏఏ చట్టాన్ని వాడదలిచింది. అది పార్లమెంటులో నాలుగేళ్ల క్రితమే పాస్ అయింది. అయినా ఈ ఏడాది మార్చి 11న మాత్రమే కేంద్రం దాన్ని నోటిఫై చేసింది. ఇక ముస్లిములందరికీ బెంగ పట్టుకుంది.

దానికి తోడు మోదీ ముస్లిములను చొరబాటు దారులని, మరోటని చాలా అనడంతో వాళ్లకు భయం వేసింది. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాననడం, కాంగ్రెసు వారు హిందూ స్త్రీల మంగళసూత్రాలను సైతం ముస్లిములకు యిస్తారని మోదీ అనడం యివన్నీ వారిని బిజెపి పట్ల విముఖులను చేశాయి. సిఏఏను, ఎన్‌ఆర్‌సి (పౌరుల జాబితా)ను బెంగాల్‌లో అమలు చేయనని మమత హామీ యివ్వడంతో, బిజెపి రథాన్ని అడ్డుకునే శక్తి మమతకే ఉందనుకుని కాంగ్రెసు, లెఫ్ట్‌లను పక్కన పెట్టి తృణమూల్‌కే ఓటేశారు. సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే ప్రకారం ముస్లిములు 2019లో 60% మంది తృణమూల్‌కు ఓటేస్తే, యీసారి 73% మంది ఓటేశారు. ముస్లిములలో 7% మంది (2019లో 4%) బిజెపికి ఓటేశారు.

గమనించాల్సింది ఏమిటంటే హిందువులు కూడా ముస్లిముల పట్ల వివక్షతను హర్షించలేదు. ఇక్కడే కాదు, యుపిలో కూడా సాధారణ పౌరులు ‘ఈ హిందూ-ముస్లిమ్‌ ఝగ్‌డేకీ బాత్ బహుత్ హోగయా’ అని చాలా మంది జర్నలిస్టుల దగ్గర వ్యాఖ్యానించారు. తమ విద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టే నాయకులు సెక్యూరిటీ పోలీసుల మధ్య భద్రంగా ఉంటారు. వ్యాఖ్యల కారణంగా మతఘర్షణలు చెలరేగితే నష్టపోయేది సామాన్యులే. ఆస్తులు, ప్రాణాలు పోయినా, పోకపోయినా ఉపాధి, రోజు కూలీ మాత్రం పోతాయి కదా. శాంతియుతంగా బతికేస్తున్నపుడు ఎందుకొచ్చిన గొడవలివి అని హిందువులైనా, ముస్లిములైనా భావించారు. డీకోడర్ డాట్‌కామ్ వీడియోలలో కూడా చూశాను. ‘ఇక్కడేమీ గొడవలు లేవు, రావు’ అంటూ బెంగాల్‌లో ముస్లిము జనాభా నొక్కి వక్కాణించారు.

తమ సిఏఏ ద్వారా బెంగాల్లో 11 లోకసభ నియోజకవర్గాల్లో లాభం కలుగుతుందని బిజెపి లెక్క వేసింది. వాటిల్లో బంగ్లాదేశ్ నుంచి తరలి వచ్చిన మతువా, నామశూద్ర హిందువులు బహుళంగా ఉన్నారు. వీరి గురించి, మోదీ వీరిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల గురించి గతంలో ఒక వ్యాసం రాశాను. తమకు పౌరసత్వం వస్తుంది కదాన్న అంచనాతో వీరు వీరు తమకు ఓటేస్తారని బిజెపి అనుకుంది. అయితే అది పాక్షికంగానే పని చేసింది. ఈ 11లో 5టిలో మాత్రమే బిజెపి గెలిచింది. ఆరిటిలో తృణమూల్ గెలిచింది. దీనికి కారణం సిఏఏ చట్టంలోని సాంకేతిక అంశాలు మతువాలను, నామశూద్రులను కంగారు పెట్టడమే అంటున్నారు అక్కడి బిజెపి కార్యకర్తలు.

కేరళలో పరస్పరం పోరాడిన లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ బెంగాల్‌లో జత కట్టి రెండూ నష్టపోయాయి. లెఫ్ట్ ఫ్రంట్ 33 సీట్లలో పోటీ చేసి ఒక్కటీ గెలవలేదు. గతంలో కంటె 0.6% ఓట్లు తక్కువ తెచ్చుకుంది. గతంలో 2 సీట్లు, 5.7% ఓట్లు ఉన్న కాంగ్రెసు యీసారి 9టిలో నిలబడి, 1 సీటు, 4.7% ఓట్లు తెచ్చుకుంది. దాని పార్లమెంటరీ పార్టీ నేత, ఐదు సార్లుగా గెలుస్తూ వచ్చిన అధీర్ రంజన్ చౌధురి 85 వేల ఓట్ల తేడాతో క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (తృణమూల్) చేతిలో ఓడిపోయాడు. లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగస్వామి అయి, 2 స్థానాల్లో పోటీ చేసి, 0.2% ఓట్లు తెచ్చుకున్న ఫార్వర్డ్ బ్లాక్‌ ఫలితాల తర్వాత ‘‘సిపిఎం మమ్మల్ని సంప్రదించకుండానే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంది. గతంలో కాంగ్రెసు చేసిన పాపాలకు మేం సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చింది. అందుకని యికపై కాంగ్రెసు-లెఫ్ట్ కూటమిలో చేరం.’’ అంది ఆ పార్టీ. మరో లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామి ఆర్ఎస్పీ (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) కూడా యీ కలయికకు యికపై విముఖమే అంది.

పార్లమెంటు ఫలితాలను బట్టి చూస్తే మొత్తం 294 సెగ్మెంట్లలో తృణమూల్ 193 (2021లో 215 గెలిచింది) బిజెపి 90 (77), కాంగ్రెసు 10 (0) అసెంబ్లీ సెగ్మెంట్‌లలో గెలిచాయి.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తృణమూల్ 65.6% సీట్లు గెలుస్తుందన్నమాట! అంటే మమత బలం తగ్గలేదు. కానీ బిజెపికి పెరిగే అవకాశాలున్నాయి. 39% ఓట్లు వచ్చాయి, 31% అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉంది. మోదీ కరిజ్మా తెచ్చిన ఓట్లను తగ్గించి లెక్క వేసినా అసెంబ్లీ ఎన్నికల పాటికి 30% ఓట్లు, 25% సీట్లు కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. మమత వ్యతిరేకులను లెఫ్ట్, కాంగ్రెసు ఆకర్షించలేక పోతోంది కాబట్టి వాళ్లందరూ బిజెపికి ఓటేయక తప్పని పరిస్థితి. వచ్చే వ్యాసంలో ఒడిశా గురించి రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2024)

[email protected]