Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బిజెపి మైండ్‌గేమ్

ఎమ్బీయస్: బిజెపి మైండ్‌గేమ్

మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి, బిజెపి బలం గతంలో కంటె క్షీణించిందని అందరూ అనుకోసాగారు. కొందరు దాని పని అయిపోయిందని, 2024 నాటికి యింకా బలహీనపడుతుందని, యీలోపున రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతుందని అనసాగారు. ఇవన్నీ అర్థం లేని మాటలు. ఫుట్‌బాల్ ఆటలో అప్స్ అండ్ డౌన్స్ నిమిషనిమిషానికి మారినట్లే రాజకీయక్రీడలో కూడా ఉత్థానపతనాలు నెలనెలా మారతాయి. 

ఇవాళ వున్న పరిస్థితి వచ్చే నెల వుండాలని లేదు. మధ్యలో ఏదో సంఘటన జరుగుతుంది. ప్రజల మూడ్ మారుతుంది. పైగా మన సువిశాల దేశంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో నేపథ్యం. ఒక్కో కథ. పోటీలో వున్న జట్టు బట్టి ఫలితం మారుతుంది. కాంగ్రెసుతో పోటీ పడినప్పుడు బిజెపి విజయావకాశాలు వేరు, ప్రాంతీయ పార్టీతో పడినప్పుడు వేరు. బెంగాల్ ఫలితాలు చూసి మమత నేతృత్వాన ప్రతిపక్షాలన్నీ ఏకమైతే మోదీని ఓడించేస్తాయని వ్యాఖ్యానాలు చేస్తే పొరబాటవుతుందని ప్రశాంత కిశోరే అన్నాడు.

ఉన్న వాస్తవమేమిటంటే యీ క్షణాన బిజెపి పరిస్థితి బాగా లేదు. కారణాలేమిటనే చర్చలోకి వెళ్లనక్కరలేదు. దాని ప్రయత్నానికి తగిన ఫలితం రాలేదు. ఈ వాస్తవాన్ని బిజెపి నాయకులు గుర్తించి వుంటారు. కానీ ఆ మాట బయటకు చెప్తే కార్యకర్తల్లో నీరసం వస్తుందని, ప్రజల్లో చులకన ఏర్పడుతుందని, ప్రతిపక్షాలకు ఆత్మస్థయిర్యం పెరిగిపోతుందని భయపడి దబాయింపు మొదలుపెట్టారు. అసత్యాలు ప్రచారంలో పెట్టారు. 

సత్యాలను వేరే కోణంలో చూపడం ప్రారంభించారు. 060521 నాటి ‘‘సాక్షి’’ దినపత్రికలో తెలంగాణ బిజెపి రాష్ట్రప్రశిక్షణ కమిటీ కో-కన్వీనర్ శ్యామ్ సుందర్ పరయోగి అనే ఆయన ‘‘దేశంలో బిజెపి బలం పెరిగిందా? తగ్గిందా?’’ పేర వ్యాసం రాశారు. ఆయన చెప్పినది – ‘ఎక్కడా బిజెపి వ్యతిరేక పవనాలు రాలేదు.. నిజానికి యీ ఎన్నికలు బిజెపికి మరింత బలాన్నిచ్చాయి...’

ఈ వాదనను బలపరుచుకోవడానికి ఆయన చెప్పిన అంశాలు – అసాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని 7 పార్టీల కూటమిని చిత్తుగా ఓడించి బిజెపి కూటమి 75 స్థానాలతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 2) దక్షిణాదిలో కర్ణాటకతో పాటు పుదుచ్చేరి బోనస్‌గా వచ్చింది. కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితం కావడం ఎవరి గొప్పతనం? 3) ఒక్క సీటు కూడా లేని తమిళనాడులో 4 స్థానాలు సంపాదించడం బిజెపికి శుభపరిణామం కాదా? బిజెపితో జట్టుకట్టిన ఎడిఎంకె సుదీర్ఘపాలన తర్వాత కూడా 71 స్థానాలు సంపాదించింది కదా! 

4) కేరళలో ఉన్న ఒక్క సీటు పోగొట్టుకున్నప్పటికీ ఓట్ల శాతం పెంచుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతానికి కూడా చేరుకోగలిగింది. 5) ఇక ఉపయెన్నికలకు వస్తే కర్ణాటకలో బెళగావి పార్లమెంటు ఎన్నికలో విజయబావుటా ఎగరేశారు 6) 10 రాష్ట్రాలలోని 12 అసెంబ్లీ స్థానాలలో 5 గెలిచి సత్తా చాటింది 7) శివసేన కూటమి అధికారంలో వున్న మహారాష్ట్రలో పండరిపూర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 7) బెంగాల్‌లో 3 నుంచి 77 స్థానాలకు చేరుకుంది. దాదాపు 80 స్థానాల దాకా కేవలం 4 ఓట్ల నుంచి 2500 లోపు ఓట్ల తేడాతో బిజెపి కోల్పోవడం నిజం కాదా? (నిజమో కాదో, చివరి పేరాల్లో చెప్తాను)

మొదట ఉపయెన్నికల గురించి చూదాం. ముందుగా లోకసభ. కర్ణాటకలో బెళగావి పార్లమెంటు ఎన్నికలో విజయబావుటా ఎగరేశారు అని చెప్పుకున్నారు. అది బిజెపి పాలిత రాష్ట్రం. బిజెపి అభ్యర్థి కరోనాతో మరణించిన దివంగత కేంద్ర మంత్రి సురేశ్ అంగడి భార్య. సింపతీ ఫ్యాక్టర్ పనిచేసినా, ఆవిడకు వచ్చిన మెజారిటీ 5300. దానితో పాటు జరిగిన మూడు పార్లమెంటు ఉపయెన్నికల గురించి వ్యాసకర్త చెప్పలేదు. 

తిరుపతిలో వైసిపి 2.72 లక్షల మెజారిటీతో స్థానాన్ని నిలుపుకుంది. కేరళలోని మళప్పురంలో ఐయుఎమ్‌ఎల్ 1.15 లక్షల మెజారిటీతో సీటు నిలుపుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో కాంగ్రెసు 1.37 లక్షల మెజారిటీతో స్థానాన్ని నిలుపుకుంది. ఇక్కడ ఓడినది 2014లో అక్కణ్నుంచి గెలిచిన ప్రముఖ బిజెపి నాయకుడు పొన్ రాధాకృష్ణన్. పైగా తమిళనాడును బిజెపి అర్ధపాలిత రాష్ట్రాలలో వేయవచ్చు. బెళగావిలో 10 లక్షల మంది ఓటేసినప్పుడు 5వేలతో నెగ్గితే దాన్ని మా వూళ్లో గట్టెక్కడం అంటారు. వ్యాసకర్త ఊళ్లో ‘విజయబావుటా ఎగరేశారు’ అని చెప్పుకుంటారు కాబోలు. 4 పార్లమెంటు స్థానాల ఉపయెన్నికలలో 1 మాత్రమే (25%) గెలిచారంటే బాగుండదని కాబోలు, గెలిచిన ఒక్కదాని గురించే చెప్పి తక్కినవి వదిలేశారు.

కానీ శాసనసభల స్థానాలకు వస్తే - 10 రాష్ట్రాలలో 12టిలో 5 గెలిచింది అన్నారాయన. 42% గెలిచింది సుమా అని ధ్వనించేట్లు.  కానీ https://en.wikipedia.org/wiki/2021_elections_in_India ప్రకారం 13టిలో జరిగాయి, బిజెపి గెలిచినది 5. అంటే 38 శాతమే! 4% తక్కువ. ఇక 10 రాష్ట్రాలలో 4 బిజెపి పాలిత రాష్ట్రాలు  (కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్). వాటిలో 5టికి ఎన్నికలు జరిగితే 3 బిజెపి గెలిచింది. 

వీటిలో ఉత్తరాఖండ్‌లో నిలుపుకున్న సాల్ట్, కాంగ్రెసు నుంచి గెలిచిన బసవకళ్యాణ (కర్ణాటక), ఇండిపెండెంట్ నుంచి గెలిచిన మోర్వా హడాఫ్ (గుజరాత్) ఉన్నాయి. తక్కిన 2 కాంగ్రెసు నిలుపుకున్న కర్ణాటకలోని మస్కి, మధ్యప్రదేశ్‌లో దామో. 6 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో (తెలంగాణ, రాజస్థాన్, ఝార్‌ఖండ్, మహారాష్ట్ర, నాగాలాండ్, మిజోరం) 8టికి ఎన్నికలు జరిగాయి. వీటిలో పాలకపక్షాలు 6 గెలుచుకుంటే బిజెపి 1 నిలుపుకుని, మరో దాన్ని (పండరిపూర్) కాంగ్రెసు నుంచి గుంజుకుంది.

స్థూలంగా చెప్పాలంటే ఝార్‌ఖండ్‌లో జెఎంఎం, మిజోరంలో జోరామ్, నాగాలాండ్‌లో ఎన్‌డిపిపి, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు, తెలంగాణలో తెరాస. ఉత్తరాఖండ్‌లో బిజెపి తమ రాష్ట్రాలలో ఒక్కో స్థానానికి ఎన్నిక కాగా అవన్నీ నిలుపుకున్నాయి. బిజెపి పాలిత కర్ణాటకలో కాంగ్రెసు ఒక స్థానాన్ని నిలుపుకుంది, మరో దాన్ని బిజెపికి పోగొట్టుకుంది. బిజెపి పాలిత గుజరాత్‌లో బిజెపి ఒక స్వతంత్ర స్థానాన్ని గెలిచింది. 

కాంగ్రెసు పాలిత రాజస్థాన్‌లో కాంగ్రెసు 2 నిలుపుకుంది, బిజెపి 1 నిలుపుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెసు 1 స్థానాన్ని బిజెపికి పోగొట్టుకుంది. దీని అర్థం మొత్తం 13టిలో బిజెపి 2 కాంగ్రెసు స్థానాలను గెలిచింది తప్ప యితర పార్టీలను కాదు. వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి కూతుర్ని ఓడించే దమ్మూ ధైర్యమూ తమ పార్టీకే వుందని చెప్పుకున్నారు కానీ యిటీవల సిటింగ్ ఎమ్మెల్సీ స్థానం పోయిందనీ, యిప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపయెన్నికలోనూ, ఆంధ్రలోని తిరుపతి పార్లమెంటు ఉపయెన్నికలోనూ 5% ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగామని చెప్పలేదు.

ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వద్దాం. మేజర్ భాగస్వామిగా గెలిచిన అసాంలోను, మైనర్ భాగస్వామిగా గెలిచిన పుదుచ్చేరిలోను దానికి ప్రత్యర్థి కాంగ్రెస్సే. దక్షిణాది ప్రజలు కర్ణాటకకు బోనస్‌గా పుదుచ్చేరి యిచ్చారట. 9 లక్షల జనాభా వున్న పుదుచ్చేరిలో ఉన్న స్థానాలు 30. ఐదేళ్ల క్రితం గెలిచినది బిజెపి గెలిచినది 0 కాబట్టి ఇప్పుడు 6, అనగా 20% సీట్లు గెలవడం కూడా గొప్పే. ఫిరాయింపులతో కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టి, గత ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలో ముందుకు వెళ్లారు. రంగస్వామి పార్టీకి 10 వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రికి టిక్కెట్టు కూడా యివ్వని కాంగ్రెసుకి 2, దానితో కలిసి పోటీ చేసిన డిఎంకెకు 6, వాళ్లు మద్దతిచ్చిన స్వతంత్రుడికి 1 వచ్చాయి. ఇతర స్వతంత్రులకు 5 వచ్చాయి. కాంగ్రెసును ఓడించిన ఘనత మేజర్ భాగస్వామి ఐన రంగస్వామికే పోతుందనాలి.

ఇక తమిళనాడు విషయానికి వస్తే, 2019 ఫలితాలు చూసి డిఎంకె దున్నేస్తుందనుకున్నారు. కానీ పళనిస్వామి పాలనాప్రతిభ, కరోనాను హేండిల్ విధానం వలన ఎడిఎంకె కూటమి 75 స్థానాలు గెలిచింది. బిజెపి చెప్పినట్లు ఆడుతోంది అనే ముద్ర లేకపోయి వుంటే యింకా కొన్ని సీట్లు గెలిచేది అని పరిశీలకులు అనడమే కాదు, ఎడిఎంకె వాళ్లు కూడా అనుకున్నారు. అందుకే కొన్ని రోజుల ప్రచారం తర్వాత ఎడిఎంకె అభ్యర్థులు మోదీ, షాల బొమ్మలు లేకుండా చూశారు. బిజెపికి గతంలో ఏ సీట్లూ లేవు కానీ యీసారి 4 తెచ్చుకున్నారు. కేరళలో బిజెపికి ఉన్న ఒక్క సీటూ పోయింది. ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామన్నంత హడావుడి చేసి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్‌ను ప్రకటిస్తే ఆయన కూడా ఓడిపోయాడు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రెండు చోట్ల ఓడిపోయాడు. కేరళలో ఎన్‌డిఏకు వచ్చిన ఓట్లు 12.4%. 2016లో 15%, 2019లో 13% వచ్చి యిప్పుడు తగ్గాయి. మరి యీ వ్యాసకర్త ..ఓట్ల శాతం పెంచుకోవడమే కాక.. అని రాస్తారేమిటి?

అసాంలో ఎన్‌డిఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్, కేరళలలో కూడా అదే జరిగింది. అసాంలోని ఎన్‌డిఏలో బిజెపికి గతంలో 60 వుంటే యిప్పుడూ అన్నే వచ్చాయి. అసాం గణపరిషద్‌కు గతంలో 14 వుంటే యిప్పుడు 5 తగ్గి, 9 వచ్చాయి. కొత్తగా చేరిన యుపిపిఎల్ 6 సీట్లు తెచ్చుకుని మొత్తం మీద 75 వచ్చాయి. మహాజోత్‌లోని కాంగ్రెసుకు గతంలో 26 వుంటే యిప్పుడు 3 పెరిగి, 29 వచ్చాయి. ఏఐయుడిఎఫ్‌కు 13 వుంటే యీసారి 3 పెరిగి, 16 వచ్చాయి. బోడో ఫ్రంట్‌కి గతంలో 12 వుంటే యిప్పుడు 8 తగ్గి 4 వచ్చాయి. సిపిఎంకు 1 వచ్చింది. మొత్తం 50. దీన్ని వ్యాసకర్త కాంగ్రెస్ నేతృత్వంలోని 7 పార్టీల కూటమిని చిత్తుగా ఓడించించి.. అని చెప్పుకున్నారు. బిజెపికి సీట్లు పెరగకపోగా, కాంగ్రెసుకి పెరిగాయి.

ఏది ఏమైనా కాంగ్రెసు పార్టీ చల్లగా వుండాలని, రాహుల్ గాంధీయే దాని ప్రధాని అభ్యర్థిగా వుండాలని, అతను రంగం విడిచి పారిపోకుండా చూడడానికి సోనియా చిరాయువుగా వుండాలని దేవుడికి దణ్ణం పెట్టుకునేది ఎవరంటే బిజెపి పార్టీయే. ఎందుకంటే కాంగ్రెసు ప్రత్యర్థిగా వున్న చోటే బిజెపి తన తడాఖా చూపుతోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట గట్టి పోటీని ఎదుర్కుంటోంది. ఆ వ్యాసం రాసేటప్పటికి బహుశా యుపి పంచాయితీ ఫలితాలు వచ్చి వుండవు. పంచాయితీ ఎన్నికలు పార్టీపరంగా జరగకపోయినా, అభ్యర్థులు ఎవరే పార్టీ వాళ్లో అందరికీ తెలుసు. ఆ ప్రకారం మొత్తం 3050 జిల్లా పంచాయితీ వార్డుల్లో బిజెపికి 579 వస్తే ఎస్పీకి 779, బియస్పీకి 361, కాంగ్రెసుకు 59, యితరులకు 1272 వచ్చాయని టీవీ ఛానెళ్లు చెపుతున్నాయి.

ఈ అంకెలు సదరు పార్టీలు ఒప్పుకోవటం లేదు. ఎన్నడూ లేనివిధంగా బిజెపి తన అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించింది. ఇప్పుడు 900 సీట్లకు పైగా నెగ్గానంటోంది. అంటే 2 వేలకు పైగా స్థానాల్లో ఓడిపోయినట్లే కదా! ఎస్పీ 1000 గెలిచానంటోంది. బియస్పీ 300కి పైగా గెలిచానంటోంది. ఎస్పీకి 2016 పంచాయితీ ఎన్నికలలో వచ్చినదాని కంటె తక్కువ వచ్చాయని బిజెపి ప్రతినిథులు సంతోషిస్తున్నారు. అప్పుడు వాళ్లు అధికారంలో వున్నారు. ఆంధ్రలో అధికారంలో వున్న వైసిపికి తాజాగా పంచాయితీ ఎన్నికలలో 80% సీట్లు వచ్చాయి. మరి యుపిలో బిజెపికి 579 మాత్రమే (19%)వచ్చాయి. నెగ్గిన స్వతంత్రులలో చాలామంది బిజెపి రెబెల్సే అని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. పార్టీ ఎంపిక చేసినవారిని కాకుండా, వేరేవారిని నెగ్గించారంటేనే పార్టీకి బలం లేదని తెలుస్తోంది. జాతీయ పత్రికలలో, టీవీల్లో యోగి ఆదిత్యనాథ్ గుప్పించే యాడ్స్ చూస్తే తల తిరుగుతుంది. ఈ కసరత్తంతా కరోనా కట్టడికై చేసి వుంటే యీ స్థితి వచ్చేది కాదు కదా అనిపిస్తుంది.

ఇక బెంగాల్ వద్దకు వస్తే – 2016 లోని 3 స్థానాల నుంచి 77 స్థానాలకు చేరామని చెప్పుకుంటున్నారు. అది నిజంగా ఘనతే. అయితే 2019 లెక్క ప్రకారమైతే 120 రావాలి. అఫ్‌కోర్స్, అది మోదీ ప్రధాన అభ్యర్థి ఐన పార్లమెంటుకి, యిది ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని అసెంబ్లీకి. అందుకని ఓటర్లు 26% సీట్లు యిచ్చి యివి చాల్లే అన్నారు. ‘200కి పైగా వస్తాయని చెప్పుకున్నారు కదా, 77తో ఆగిపోయారేం’ అని అడిగితే బిజెపి వాళ్లు 1984లో మాకు రెండు సీట్లే వుండేవి. అక్కణ్నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం అంటారు. ఆ 2కి ముందు వాళ్లు జనతా పార్టీలో భాగస్వాములుగా వుండి అనేకమంది ఎంపీలతో రాజ్యం చేసిన విషయం చెప్పుకోరు. పార్టీలకు ఎగుడుదిగుళ్లు తప్పవు. ఒకే మార్గంలో పైపైకి వెళ్లిపోరు. అంతెందుకు 2019 పార్లమెంటు ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత మూడు రాష్ట్రాలు చేజారాయి కదా!

ఇప్పుడు బెంగాల్ గురించి – మమత విజయాన్ని తక్కువగా చూడకూడదు. మూడోసారి ముఖ్యమంత్రి అయిందామె. గుజరాత్‌లో మోదీ మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు గతంలో కంటె 2 తగ్గాయి. 63% సీట్లు వచ్చాయి. మరి మమతకు గతంలో కంటె 2 పెరిగాయి. 73% సీట్లు వచ్చాయి. ఆ విజయం ఎలా దక్కింది అనేది యిక్కడ చర్చించటం లేదు. దక్కిందా లేదా అనేదే ప్రశ్న. అయితే దీన్ని తక్కువచేసి చూపడానికి బిజెపి మైండ్‌గేమ్ ఆడుతోంది. ఫలితాలు వచ్చిన మర్నాడే వాట్సాప్‌లు వచ్చేశాయి – 92 స్థానాల్లో బిజెపి వెయ్యికి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది, లేకపోతేనా? అంటూ. ఆ సాయంత్రానికి మా కజిన్ ఒకతను వాట్సాప్ పంపించాడు. హిందీ న్యూస్‌పేపర్లో ఓ పట్టిక అది. అతి తక్కువ మార్జిన్లతో ఓడిన లేదా గెలిచిన అభ్యర్థుల జాబితా అనే హెడింగ్‌తో ఓ 70 సీట్ల అంకెల వివరాలు. దానిలో తములుక్‌లో తేడా 4 అని వుంది.

పట్టిక చూడగానే నాకు అనుమానం వచ్చింది. సాధారణంగా బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గం అనగానే కనీసం 2 లక్షల ఓట్లుంటాయి. దీనిలో విజేత, పరాజితుడు ఓట్లు కూడితే 80 వేలున్నాయి. అంటే యిది మూడో రౌండో, నాలుగో రౌండోనా? అని. జాబితాలో కొన్ని చోట్ల మొత్తం 10 వేల ఓట్లు కూడా లేవు. ఇది బోగస్ అనుకున్నాను. కానీ వ్యాసకర్త శ్యామ్ సుందర్ ఆ మెసేజి చూసి కాబోలు ‘.. దాదాపు 80 స్థానాల దాకా కేవలం 4 ఓట్ల నుంచి 2500 ఓట్ల లోపు తేడాతో బిజెపి కోల్పోవడం నిజం కాదా?’ అని రాసేశారు. 

నిజం అవునో, కాదో తేల్చుకుందామని వికీపీడియాలో చూశాను. మీరూ చెక్ చేసుకునేందుకు వీలుగా ఆ పట్టికలో యిచ్చిన అసెంబ్లీ స్థానాల నెంబర్లు యిస్తున్నాను. వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాలు 6. వాటిలో బిజెపి గెలిచినది మూడు (7, 231, 282) తృణమూల్ గెలిచినది మూడు (17, 219, 203). అందువలన వెయ్యి మార్జిన్‌తో బిజెపి 92 స్థానాలు పోగొట్టుకుంది అనేది శుద్ధబద్ధం. https://en.wikipedia.org/wiki/2021_West_Bengal_Legislative_Assembly_election

ఇక యీ వ్యాసకర్త చెప్పిన 2500 లోపు ఓట్ల తేడాతో బిజెపి 80 సీట్లు కోల్పోవడం గురించి. ఆ తేడాతో వున్నవి మొత్తం 18. వీటిలో బిజెపి గెలిచినవి 12. (7, 40, 44, 64, 92, 96, 206, 210, 231, 239, 252, 282). తృణమూల్ గెలిచింది 6 (17, 54, 208, 219, 203, 225). నేను ఏదైనా మిస్ చేసి వుంటే ఆ పట్టీ చూసి చెప్పవచ్చు. ఏది ఏమైనా తక్కువ మార్జిన్ల వలన తృణమూల్ కంటె రెట్టింపు లాభం పొందినది బిజెపి. మరి యీయన 80 స్థానాల్లో పోయిందంటాడేమిటి? పోనీ లౌక్యంగా తక్కువ మార్జిన్లతో ఫలితాలు తారుమారయ్యాయి అని కూడా కాదు, ఏకంగా బిజెపి కోల్పోయింది అని క్లెయిమ్ చేసేశాడు. నాలాగ పనిలేనివాడు తప్ప వేరెవ్వడూ చెక్ చేయడులే అనే ధైర్యం.

బిజెపి నిక్షేపంలా వుంది, దూసుకుపోతోంది. బెంగాల్‌లో కాస్తలో తప్పిపోయింది కానీ విజయం వాళ్లదే అని మనను ప్రభావితం చేయడానికి వాళ్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌లలో అజ్ఞాత వ్యక్తుల ద్వారా అబద్ధాల ప్రచారమే కాదు, ప్రింటు మీడియాలో కూడా ట్రైనింగ్ కమిటీ కో కన్వీనర్ యింత పచ్చిగా అసత్యాలు చెపుతున్నారు. ఇదేనేమో వాళ్లకు యిచ్చిన, వీళ్లు యితరులకు యిస్తున్న ట్రెయినింగ్! ఈయనొక్కరే యీ తరహా వ్యక్తి అనుకోవడానికి వీలులేదు. అదే రోజు (060521) ‘‘ఆంధ్రజ్యోతి’’లో బిజెపి నాయకుడు, విద్యాధికుడు, లాయరు, మొన్నటిదాకా ఎమ్మెల్సీ అయిన ఎన్. రామచందర్ రావు గారు ‘‘మోదీపై ప్రజల విశ్వాసంలో మార్పేమీ లేదు!’’ అని వ్యాసం రాస్తూ ‘బెంగాల్‌లో ..రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఓడించడమే గాక, 72 స్థానాల్లో 1000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది...’ అని రాశారు.

రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఓడించడమే గాక.. అని ఎలా రాశారో నాకు అర్థం కాలేదు. దాదాపు ఓడించడమే గాక అని రాద్దామనుకున్నారేమో! ఫలితాలు అందరికీ తెలుసు కాబట్టి దీన్ని పొరబాటుగా సర్దుకోవచ్చు. కానీ వాక్యంలో రెండో భాగం వుంది చూశారా, 72 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడా.. అది కావాలని ఆడిన అబద్ధం. దానికి పైన ఉదాహరణలు యిచ్చాను కదా, గణాంకాలు యిచ్చాను కదా. వాట్సాప్‌లలో 92 స్థానాలు పోయాయంటే, ఈయన 72 అని ప్రింటులో రాసేశారు. 

వెబ్‌సైట్‌లో అయితే ఎవరైనా తప్పు ఎత్తి చూపితే వెంటనే సవరించుకునే సావకాశం వుంది. ప్రింటులో మర్నాటిదాకా ఆగాలి. కానీ మర్నాడు సవరణ ఏదీ రాలేదు. పైగా ఈ 72 స్థానాల విషయాన్ని పేపర్లో బ్లూ స్క్రీన్‌తో హైలైట్ చేశారు. పేపరు వాళ్లని ఏమీ అనలేం. రామచందర్ రావు వంటి పెద్ద లీడరు అబద్ధాలు చెప్తారని ఎవరూ ఊహించరు కదా! నేను చూసిన పేపర్లు యీ రెండే. తక్కిన వాటిల్లో ఇంకెన్ని రాశారో! వాళ్ల పార్టీ పత్రికల్లో క్యాడర్‌ను ఉత్సాహపరచాలని, యింకా కొన్ని జోడించారేమో! పరిశోధించే కుతూహలం వున్నవాళ్లు ఆ పని చేయవచ్చు.

ఎక్కడో దూరంగా వున్న తెలుగు బిజెపి నాయకులే యిలా రాస్తూండగా లేనిది, బెంగాల్ బిజెపి వాళ్లు ఊరుకుంటారా? తృణమూల్ దాడుల్లో చనిపోయిన బిజెపి కార్యకర్త అంటూ బెంగాల్ బిజెపి ఓ వీడియో ప్రచారంలో పెట్టింది. ఆ ఫోటోలో వున్నది ఇండియా టుడే జర్నలిస్టు అభ్ర బెనర్జీ. ఘటన జరిగిన స్థలానికి 1300 కి.మీ.ల దూరంలో వున్నాడు. ఇప్పుడు వీళ్ల మీద కేసు పెడతానంటున్నాడు. ప్రచారంతోనే బిజెపి అధికారంలోకి వచ్చింది. ప్రచారంతోనే నెట్టుకుని వస్తున్నారు. ప్రచారంతోనే తాము ఓడిపోలేదని బుకాయిస్తున్నారు. దీన్ని చూసి ప్రతిపక్షాలు నిరాశపడకూడదు, ప్రజలు భ్రమపడకూడదు.

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?