Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఊపు మీదున్న బిజెపి

ఎమ్బీయస్‌: ఊపు మీదున్న బిజెపి

మోదీ తాజాగా యిచ్చిన ఇంటర్వ్యూ చూస్తే 2019లో బిజెపి విజయం పట్ల ఆయనకున్న విశ్వాసం ప్రస్ఫుటంగా తెలిసింది. 2014 కంటె ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని చెప్పాడాయన. తెలంగాణాలో కాంగ్రెసువాలా దగ్గర్నుంచి ప్రతి నాయకుడూ అలాగే చెప్తాడు, దానిలో విశేషమేముంది అనుకోవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానంపై గెలుపు తర్వాత, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక తర్వాత పలికిన పలుకులవి. అందువలన వాటికి విలువ వచ్చి చేరింది.

ఇక్కడ ఒక చిన్న కరక్షన్‌! 'పలికిన' అనడం టెక్నికల్‌గా కరక్టుకాదు. ఎందుకంటే అది ముఖాముఖీ యింటర్వ్యూ కాదు, ఈమెయిల్‌ యింటర్వ్యూ. మోదీ యీ విషయంలో నూతన పంథాపట్టారు. అదేమిటో కానీ మోదీకి చర్చ అంటేకిట్టదు. నలుగురైదుగురు తనకు నమ్మకమైన నాయకులనో, అధికారులనో దగ్గర పెట్టుకుని విషయం సేకరిస్తారు. తను చెప్పదలచినది చెప్తారు. ఇంకో పక్క లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి జనరంజకంగా ప్రసంగిస్తారు. రెండింటికి మధ్యలో ఉండే గ్రూపు డిస్కషన్‌కి ఆయన విముఖం. గుజరాత్‌ ఎసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ ఆయన ఎవరితోనైనా వాగ్వివాదానికి దిగినట్లు తెలియదు. అసలు హాజరు కావడమే తక్కువ. హాజరైనపుడు ఏదైనా బిల్లు విషయంలో చర్చలో పాల్గొనడం చూడలేదు. కాబినెట్‌ సమావేశాల్లో కూడా చాలాభాగం మౌనంగా ఉంటారని యితర మంత్రులు చెప్తారు. చేయదలచుకున్నది చేయడమే తప్ప, దాని వెనకాల లాజిక్‌ గురించి వివరించే అలవాటులేదు.

పార్టీలతో ఎలా ఉన్నా నాయకులు మీడియాకు మాత్రం జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు మొహమాటాలుంటాయి. 'మీరూ గతంలో యిలా చేయలేదా?' అంటే వాళ్లు తడబడతారు. కానీ మీడియాకు పట్టింపులు ఉండవు. ఎడాపెడా ప్రశ్నలు సంధిస్తారు. మోదీ ప్రధాని కాకముందు మీడియాను - చాలా తక్కువగానే - ఎదుర్కున్నాడు కానీ ప్రధాని అయ్యాక ఒక్క ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదు. నాలుగేళ్ల పాలన పూర్తయి సార్వత్రిక ఎన్నికకు కొద్ది నెలల గడువు మాత్రమే ఉన్నపుడు ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'', ''హిందూస్తాన్‌ టైమ్స్‌'', ''ఎఎన్‌ఏ'' న్యూస్‌ ఏజన్సీకి ఈ మెయిల్‌ ఇంటర్వ్యూ యిస్తామన్నాడు. అంటే వాళ్లు ప్రశ్నలు ఈమెయిల్‌ ద్వారా పంపితే ప్రధాని కార్యాలయం జవాబుల ఈమెయిల్‌ పంపుతుందన్నమాట. సాధారణంగా ముఖాముఖీ యింటర్వ్యూ అయితే నాయకుడి సమాధానం నుంచే మీడియా తర్వాతి ప్రశ్నను తయారుచేసుకుని సంధిస్తుంది.

ఇక్కడ ఆ స్కోప్‌ లేదు. లేకుండా చేయడమే మోదీ ఉద్దేశం. ఉదాహరణకి ఉద్యోగకల్పనలో విఫలమైన విషయం గురించి వేసిన ప్రశ్నకు సమాధానంగా 'ఉద్యోగాల గురించిన డేటాబేస్‌ లేకపోవడం చేత ప్రభుత్వం యిలాటి విమర్శను ఎదుర్కోవలసి వస్తోంది' అన్నారు ప్రధాని. జర్నలిస్టు కనక ఎదురుగా కూర్చుని ఉంటే 'అయితే యీ నాలుగేళ్లలో ఆ డేటాబేస్‌ తయారు చేయలేక పోయారా?' అని అడిగి వుండేవాడు. 'పోనీ అందాజుగా చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఎన్ని కల్పించారు?' అని మరో ప్రశ్న సంధించేవాడు. ఈ ఈమెయిల్‌ వ్యవహారంలో దానికి తావే లేదు. అందుకే ఉద్ధవ్‌ ఠాక్రే యీ పద్ధతిని ఎద్దేవా చేశాడు. సరే యింటర్వ్యూ జరిగిన విధానం మాట పక్కన పెట్టి మోదీ ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుందాం. 'బిజెపికి వ్యతిరేకంగా కడుతున్న మహా కూటమి 2019 ఎన్నికలకు ముందు కుప్పుకూలుతుందా? తర్వాత కుప్పకూలుతుందా అన్నదొకటే కీలకమైన ప్రశ్న' అన్నాడు.

మహా కూటమి అనేది ఒట్టి తాటాకుల మంట అని తీసిపారేసే ధైర్యం వచ్చినది, అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాతనే. ఆ తర్వాతే అమిత్‌ షా టిడిపితో చేతులు కలిపేది లేదని ఘంటాపథంగా చెప్పాడు. తక్కిన సందర్భాల్లో కూడా బోర విరుచుకుని తిరగగలుగుతున్నాడు. ఇది మార్చికి, జులైకి మధ్య కానరాలేదు. మార్చిలో జరిగిన లోకసభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసినది. కానీ ఎడిఎంకె, తెరాస సభ్యులు చేస్తున్న ఆందోళన కారణంగా సభ సజావుగా లేదన్న కారణంతో ఆ తీర్మానాన్ని స్పీకరు చేపట్టలేదు. తనకు అనుకూలంగా ఉండే ఆ రెండుపక్షాల చేత బిజెపియే ఆందోళన చేయించిందని అందరూ అనుమానించారు. (జులైలో జరిగిన ఓటింగులో తెరాస గైరుహాజరు కాగా, ఎడిఎంకె ఎంపీల్లో 33 మంది బిజెపి పక్షాన నిలిచారు, 4గురు గైరుహాజరయ్యారు. అందువలన అప్పటి అనుమానాలు ధృవపడ్డాయి) తనకు అవసరమనుకున్నపుడు ఎలాగైనా సభలో ఎంత గందరగోళం ఉన్నా బిల్లులు పాస్‌ చేయించేసుకుంటున్న అధికారపక్షం అప్పుడు మాత్రం సభ ఆర్డరులో లేదనే కారణం చూపి మొత్తం సెషన్‌ను వృథా చేసింది. దాంతో అవిశ్వాసంపై జరిగే చర్చ అంటే ప్రభుత్వం భయపడుతోందన్న సంకేతం వెళ్లింది.

ఇక ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి. మోదీ ఎప్పుడూ మన్‌కీ బాత్‌ అంటూ ఏకపక్షంగా తన మన్‌ కీ బాత్‌ మాత్రమే చెప్తారు తప్ప అవతలివాళ్ల మన్‌ కీ బాత్‌ వినరని, పార్లమెంటులోనూ అదే పని చేస్తున్నారని అనసాగారు. ప్రజల సమస్యలు వినడానికి పార్లమెంటు చక్కని వేదిక అని, ప్రతిపక్షం వాళ్లు చెప్పే ఉపన్యాసాలు శ్రద్ధగా విని, తమ లోటుపాట్లు తెలుసుకునేందుకు ప్రభుత్వానికి మంచి అవకాశమని, కానీ మోదీ పార్లమెంటుపై గౌరవం లేక పోవడం చేత, ఎదుటివాళ్లు చెప్పేది వినదలచుకోక పోవడం చేతనే ఆ తీర్మానాన్ని చర్చకు రాకుండా చేశారని అన్నారు. ఇంకో వాదన కూడా వినవచ్చింది. 'బిజెపిలో అసంతృప్తులు మోదీకి బుద్ధి చెప్పదలిచారు. వారు అవిశ్వాసంపై ఓటింగు జరిగినపుడు తమ తడాఖా చూపుతారు' అని. ఈ వాదన ప్రకారం - 'పార్టీలో అధికారమంతా మోదీ తన చేతిలో కేంద్రీకరింప చేసుకున్నారు, కలక్టివ్‌ లీడర్‌షిప్‌తో యిన్నాళ్లూ నడుస్తూ వచ్చిన పార్టీ కల్చర్‌ మార్చిపారేశారు, ఎవరు చెప్పినా వినకుండా తనకు తోచిన ఆర్థిక విధానాలు చేపట్టి సామాన్యుడి నడ్డివిరిచారు.

అందువలన 2019 ఎన్నికలలో బిజెపికి యిప్పటి కంటె కనీసం 50 కంటె తక్కువ స్థానాలు వస్తాయి. ఇతర పార్టీల సహాయంతో మాత్రమే ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఆ పార్టీలు నియంతృత్వ పోకడలు ఉన్న మోదీని ప్రధానిగా ఆమోదించవు. పదిమందిని తనతో కలుపుకుని పోగలిగిన మరో లీడరుని బిజెపి చూపించవలసి వస్తుంది. అది కూడా కష్టమే. అందుచేత మోదీయే తన తరహా మార్చుకుంటే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలలో వరుస జయాలతో మోదీకి, అమిత్‌ షాకు గర్వం తలకెక్కుతోంది. వారిని నేలకు దింపాలంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని బిజెపి అసంతృప్తులు అనుకున్నారు.' ఎవరో కొందరు అసంతృప్తులు యిలా అనుకున్నంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఉండదు అని కొట్టి పారేయడానికి లేదు. గతంలో జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ ఉత్తుత్తినే పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతున్న కొద్దీ బలం పుంజుకోసాగింది.

నాలుగు పార్టీల కూటమైన జనతా పార్టీ అంత:కలహాలలో మునిగి నాయకులు ఒక్కొక్కరు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి మారిపోసాగారు. జార్జి ఫెర్నాండెజ్‌ ఒక రోజు పార్లమెంటులో ప్రభుత్వాన్ని అద్భుతంగా సమర్థిస్తూ ఉపన్యాసం యిచ్చి, మర్నాడే బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించాడు. అంతిమంగా ఎన్నో ఆశలతో రూపు దిద్దుకున్న జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెసు పార్టీ చరణ్‌ సింగ్‌కు మద్దతిచ్చినట్లే యిచ్చి, వెంటనే కాళ్ల కింద తివాచీని లాగేసింది. చరణ్‌ సింగ్‌ ప్రధాని పదవి కొన్ని రోజులకే పరిమితమై ఆపద్ధర్మ ప్రధానిగా కొన్నినెలల పాటు ఉండవలసి వచ్చింది. పరిపాలన అస్తవ్యస్తమై, ప్రజలకు కాంగ్రెసేతర పక్షాలపై విశ్వాసం నశించి, 1980లో వచ్చిన ఎన్నికలలో కాంగ్రెసును మంచి మెజారిటీతో గెలిపించారు. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తే ఇలాటి స్నోబాలింగ్‌ ఎఫెక్ట్‌తో ప్రమాదాలు జరగవచ్చనే భయంతో దాన్ని మొగ్గలోనే తుంపి వేయడానికి మోదీ మార్చిలో తీర్మానాన్ని చర్చకే రాకుండా చేశారు. ఇదీ ఆ వాదన సారాంశం.

ఇలాటి వాదనల్లో వాస్తవమెంత ఉందో సామాన్యుడికి తెలిసే అవకాశం లేదు. కానీ అవిశ్వాసానికి ప్రభుత్వం జంకుతోంది అని అతడికి తోస్తే దానిపై గౌరవం పోతుంది. బిజెపి పార్టీ అనేక చోట్ల ఉపయెన్నికలలో ఓడిపోతోంది. మోదీ, అమిత్‌ల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కష్టంతో విజయం సాధించింది. ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రతిపాదన కూడా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతోనే చేస్తోంది అని అనేకమంది కాలమిస్టులు రాశారు, రాస్తున్నారు. మోదీకి యింకా మిగిలి వున్న యిమేజిని పెట్టుబడిగా పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళితే మంచిదని, లేకపోతే ఆ యా రాష్ట్రాల ముఖ్యమంత్రి పెర్‌ఫార్మెన్స్‌ కారణంగా అధికారం చేజారే ప్రమాదం ఉందని బిజెపి అనుకుంటోందని అందుకే వెలుతురుండగానే యిల్లు చక్కబెడుతోందని వస్తున్న వ్యాఖ్యలను జనం నమ్మసాగారు. ఇక మన తెలుగు మీడియా అయితే మరీ రెచ్చిపోయింది.

ఆంధ్రుడి దెబ్బకి మోదీ వణుకుతున్నాడని, బిజెపి పని అయిపోయినట్లేనని కూడా అనసాగారు. అసలు 2019లో దానికి 150 కూడా వస్తాయో రాదో అని కథనాలు వండివార్చారు. అలాటి నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో తొలిసారిగా జులైలో బిజెపి ధైర్యంగా అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ప్రతిపక్ష నాయకుల ఉపన్యాసాలకు అడ్డు తగలకుండా వారిని చెప్పాలనుకున్నది చెప్పనిచ్చింది. తర్వాత మంత్రులు, చివరగా ప్రధాని సమాధానాలిచ్చారు. 12 గంటల చర్చ తర్వాత ఓటింగు పెట్టారు. బిజెపిలో అసమ్మతి ఉందని, మోదీపై సణుగుడు ఉందని వచ్చిన వార్తలన్నీ అబద్ధమని తేలాయి. తన పార్టీ ఎంపీలను సమీకరించడంలో అమిత్‌ షా తన ఆర్గనైజింగ్‌ కెపాసిటీని, మైక్రో మానిటారింగ్‌ స్కిల్స్‌ను మరోసారి నిరూపించుకున్నారు. బుధవారం నాటికి 32 మంది బిజెపి ఎంపీలు దిల్లీలో లేరు. శనివారం నాటికి ఇద్దరు తప్ప తక్కిన బిజెపి ఎంపీలందరినీ రప్పించగలిగారు. వారిలో యిద్దరిని స్ట్రెచర్‌పై తీసుకుని వచ్చారు. రప్పించలేక పోయిన ఆ యిద్దరిలో ఒకరైన కీర్తి ఆజాద్‌ విదేశాల్లో ఉన్నాడు, మరో ఎంపీ తీవ్ర అస్వస్థతతో ఉన్నాడు.

ఎన్‌డిఏలో భాగస్వామి ఐన 8 మంది ఎంపీల శివసేన ప్రభుత్వానికి మద్దతిస్తానని మొదట్లో చెప్పి, తర్వాత మనసు మార్చుకుని గైరు హాజరైంది. దాంతో 310 రావలసినది 292 వచ్చాయి. అయితే ఎడిఎంకెలోని 37 మంది ఎంపీల్లో 33 మంది అనుకూలంగా వేయడంతో మొత్తం 325 వచ్చాయి. మామూలుగా అయితే ఎన్‌డిఏకు స్పీకరుతో సహా 315 ఎంపీలే ఉన్నారు. కానీ దాని కంటె 10 ఎక్కువ వచ్చింది. సభలో 451 మంది ఉన్నారు కాబట్టి యిది 70% స్ట్రెంగ్త్‌ అయింది. సభలో హాజరీ తక్కువ వుండడానికి కారణం 11 మంది సభ్యులున్న తెరాస, 19 మంది సభ్యులున్న బిజెడి, 4గురు ఎడిఎంకె సభ్యులు గైరుహాజరు కావడం. వీరితో పాటు కాంగ్రెసుకు చెందిన యిద్దరు ఎంపీలు కూడా రాలేదు. దానాదీనా అవిశ్వాసం ప్రవేశపెట్టిన ప్రతిపక్షానికి 126 ఓట్లు మాత్రం వచ్చాయి. లెక్కలేసి చూస్తే యుపిఏకు 63 (కాంగ్రెసు 48, ఎన్‌సిపి 7, ఆర్‌జెడి 4, ఐయుఎమ్‌ఎల్‌ 2, జెఎంఎం2), ఇతర పార్టీలకు 156 ఎంపీలు ఉన్నారు. మొత్తం 219, అయితే అవిశ్వాసానికి అనుకూలంగా పడిన ఓట్లు 126 మాత్రమే!

టిడిపి, కాంగ్రెసు, సిపిఐ, సిపిఎం, తృణమూల్‌, ఆప్‌ అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లేశాయి. పిఎంకె, జెడియు, శివసేన గైరు హాజరయ్యాయి. బిజెడి వాకౌట్‌ చేసింది. తెరాస ఓటింగులో పాల్గొనలేదు. దీని అర్థం బిజెపి తన పార్టీ ఓట్లన్నీ వేయించుకోవడమే కాదు, ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా లేకపోయినా, వ్యతిరేకంగా కూడా లేవని నిరూపించింది. ఇది బిజెపికి మొరేల్‌ బూస్టర్‌గా పని చేసింది. బిజెపి పార్టీపై తనకు తిరుగులేని పట్టుందని నిరూపించుకున్న మోదీ ఈ తీర్మానం ఓటమి ప్రతిపక్షాల అహంకారానికి గుణపాఠం అని ప్రకటించాడు. అంతేకాదు, 2024లో కూడా రాహుల్‌ గాంధీ యిలాటి అవిశ్వాస తీర్మానం పెట్టాలని శివుణ్ని కోరుకుంటున్నానని చమత్కరించాడు. అంటే 2019లో కూడా తాము అధికారంలోకి వచ్చి, 2024 వరకు పాలిస్తూనే ఉంటామని, రాహుల్‌ అప్పటికీ ప్రతిపక్ష నాయకుడి స్థానంలోనే పాతుకుపోయి ఉంటారని వెక్కిరింత.

దీని తర్వాత ఆగస్టు 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఉపయెన్నిక జరిగింది. దీనిద్వారా బిజెపి మరింత బలపడిందని, ప్రతిపక్షాలు మరింత బలహీనమయ్యాయని మరో మాటు రుజువైంది. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పిడిపి, ఆప్‌లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెసు విఫలమైంది. బిజెపి చూస్తే తెరాస, బిజెడిల మద్దతు సంపాదించింది. శివసేన, అకాలీ దళ్‌ బిజెపితో అలిగినట్లు కనిపిస్తూనే యిప్పుడు వాళ్ల అభ్యర్థికే ఓట్లేశాయి. జెడియు ఎంపి ఐన హరివంశ్‌ నారాయణ సింగ్‌ను ఎన్‌డిఏ అభ్యర్థిగా బిజెపి నిలబెట్టింది. అతనికి ప్రతిగా నిలబెట్టడానికి మీరామీరా అని అందర్నీ అడిగి ఎవరూ ముందుకు రాకపోతే యిక తప్పక కాంగ్రెసు బికె హరిప్రసాద్‌ను నిలబెట్టింది. విజేతకు 125 ఓట్లు రాగా పరాజితుడికి 105 మాత్రమే వచ్చాయి. కాంగ్రెసుతో బాటు తృణమూల్‌, డిఎంకె, వామపక్షాలు, ఎస్పీ, బియస్పీ, ఎన్‌సిపి, కొత్తగా వీళ్ల వైపు ఫిరాయించిన టిడిపి కలిపి వేయగా అన్ని ఓట్లు వచ్చాయి. పిడిపి, ఆప్‌లతో బాటు వైసిపి కూడా తటస్థంగా ఉంది.

తనపై కేసులు పెట్టించి జైలుకి పంపిన కాంగ్రెసుతో జగన్‌ పొత్తు కలపకపోవడం సహజమే కానీ బిజెపి పై నిప్పులు కక్కుతున్న పిడిపి, ఆప్‌లను మచ్చిక చేసుకోలేకపోవడం రాహుల్‌ వైఫల్యం. 'మోదీని కౌగలించుకుంటాడు కానీ మా అరవింద్‌కు ఫోన్‌ చేయలేడా?' అని ఆప్‌ ఎంపీ రాహుల్‌ను తిట్టిపోశాడు. జగన్‌లాటి కోపమే రాహుల్‌దీనూ. కాంగ్రెసు స్కాములను బాగా హైలైట్‌ చేసి ప్రజల్లో అదంటే ఏహ్యత కలిగించిన ఘనత అరవింద్‌దే. అప్పట్లో అతనికి గ్లామర్‌ ఉండేది, తటస్థుడనే యిమేజి ఉండేది. తమ ఘోరాతిఘోరమైన ఓటమికి కారకుడనే కారణంగా రాహుల్‌ అరవింద్‌కు ఫోన్‌ చేసి ఉండకపోవచ్చు. పిడిపికి చేస్తే ఒమర్‌ అబ్దుల్లాకు కోపం వస్తుందని దడిసి ఉండవచ్చు. ఇటు పక్క చూస్తే అమిత్‌ షా తమ బద్ధశత్రువులతో సహా అందరికీ ఫోన్లు చేసి, మంచి చేసుకుని విజయం సాధించాడు. మోదీకి రాహుల్‌ చాలడని మరోసారి నిరూపితమైంది.

తెరాసను చూడండి, మొదటి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసింది. రెండోది చర్చకు వస్తే తటస్థంగా ఉంది. ఈ ఎన్నిక వచ్చేసరికి ముసుగు తీసేసి బిజెపికి జై అంది. రాష్ట్రంలో బిజెపి కెసియార్‌పై కత్తులు నూరుతోంది. అయినా అమిత్‌ కెసియార్‌ను ఒప్పించగలిగాడు కదా. అలాగే ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌కు పోటీగా ఎదుగుతూనే మరో పక్క మద్దతు కోరి, సంపాదించుకోగలగడం - అదో అద్భుతం. ఈ విజయాల తర్వాత బిజెపి మంచి దూకుడు మీద ఉండడం సహజం. అందుకే మోదీ తన యింటర్వ్యూలో అంత ధాటీగా మాట్లాడినా చెల్లింది. కానీ వెనువెంటనే అమిత్‌ షా జమిలి ఎన్నికలంటూ మాట్లాడడం దానిలో అపశ్రుతి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి ఓటమి తథ్యం అంటూ ఎబిపి సర్వే కూడా యిప్పుడే వచ్చింది. అమిత్‌ కూడా అన్నీ కలిపేస్తాం అంటూంటే వాళ్లు పైకి బింకంగా మాట్లాడుతున్నా, లోలోపల బెంగ పడుతున్నారేమోనన్న సందేహం కలుగుతుంది. పార్టీపరంగా బిజెపికి కలిగే లాభనష్టాల మాట ఎలా ఉన్నా అధికార పార్టీ బలంగా ఉండడమనేది దేశానికి మంచిది. తమను పాలిస్తున్న ప్రభుత్వం స్థిరంగా ఉందనే భావన సామాన్యుడి నుంచి వాణిజ్యవర్గాల వరకూ అందరికి ఉండడం ఎప్పుడూ మంచిది.

విదేశాలు కూడా బలహీన ప్రభుత్వంతో లాంగ్‌ టెర్మ్‌ ఒప్పందాలు చేసుకోవడానికి జంకుతాయి. ఇది ఎన్నాళ్లు ఉంటుందో, తర్వాత వచ్చే ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందేమోనని భయపడతాయి. బలహీన ప్రభుత్వం అనగానే అందరికీ లోకువే. పరిపాలన కుంటుపడుతుంది. తుమ్మితే ఊడే ముక్కులాటి ప్రభుత్వంలోని మంత్రుల మాటలకు, హామీలకు, వాగ్దానాలకు విలువ వుండదు. రాజకీయాల్లో బలం ఉన్నవాడే ఏమైనా చేయగలడు. ప్రజల మర్యాద మన్ననలు అందగలడు. ఏ పార్టీ లేదా ఏ కూటమి అధికారంలో ఉన్నా యీ సూత్రం ఎప్పుడూ వర్తిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని అయిన సందర్భంగా మరింత వర్తిస్తుంది. అతను పాక్‌ సైన్యం సాయంతోనే పదవిని అందుకున్నాడనీ, తన సత్తాను తన ప్రజలకు చూపడానికి భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతాడనీ అంటున్నారు. ఇలాటి తరుణంలో మనకు బలమైన ప్రభుత్వం, బలమైన నాయకుడు అవసరం. తాను బలంగా ఉన్నానని నిరూపించుకోవడం ద్వారా మోదీ దేశప్రజల్లో విశ్వాసాన్ని, ఆశాభావాన్ని నింపాడు. అది శుభసూచకం. తన పిల్లచేష్టలతో రాహుల్‌ సమీపభవిష్యత్తులో తనకు ఆ కుర్చీ ఎక్కే అర్హత లేదని చూపుకున్నాడు. కాంగ్రెసు లో మరొకరు ప్రధాని అభ్యర్థి అవుతారంటేనో, బిజెపియేతర కూటమి బలం పుంజుకుని ఏ మమతా బెనర్జీయో ప్రధాని అవుతుందేమో అనుకుంటేనో అప్పుడు వారి బలాబలాలు మోదీతో పోల్చి చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?