cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బొలీవియాలో ట్రంపు కీలుబొమ్మకు బైబై

ఎమ్బీయస్: బొలీవియాలో ట్రంపు కీలుబొమ్మకు బైబై

బొలీవియాలో అక్టోబరు మూడవ వారంలో జరిగిన ఎన్నికల ఫలితం అమెరికాకు పథకాలను నీరు కార్చింది. 2019 అక్టోబరు ఎన్నికల గురించి అది చేసిన దుష్ప్రచారం తప్పని ఆధారాలతో సహా తేలడంతో బాటు, బొలీవియా ప్రజలు కూడా దాన్ని నమ్మలేదని ఫలితాలు నిరూపించాయి. దాంతో 2019 నవంబరు నుంచి ట్రంప్ బొలీవియా మధ్యంతర అధ్యక్షురాలిగా అమెరికా కూర్చోబెట్టిన కీలుబొమ్మ జీనైన్‌ గద్దె దిగవలసి వచ్చింది. అధికారం మళ్లీ అమెరికా వ్యతిరేకులైన ఎంఎఎస్ (మూవ్‌మెంట్ టువర్డ్‌స్ సోషలిజం) పార్టీ చేతికే వచ్చింది. 

దక్షిణ అమెరికాలో పూర్తిగా తమ చెప్పుచేతల్లో వుండాలనే కాంక్షతో, అక్కడి ప్రభుత్వాలను అమెరికా యిష్టారాజ్యంగా నిలబెడుతూ, తమ వ్యతిరేకుల ప్రభుత్వాలను కూల్చివేస్తూ వుంటుంది. తమ పథకాలకు అనుగుణంగా నడుచుకోనివారిపై టెర్రరిస్టులని, మాదకద్రవ్యాల వ్యాపారులని ఏవేవో ముద్రలు కొడుతుంది. వాళ్లను ఎన్నుకోవాలో, మానాలో ఆ యా దేశప్రజల అభీష్టానికి వదిలేయకుండా తను మధ్యలో జోక్యం చేసుకుని, పెత్తనం చలాయిస్తూ వుంటుంది.

లాటిన్ అమెరికా దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అమెరికా చెప్పే సాకు ఏమిటంటే తమ దేశంలో వాడకంలో వున్న మాదకద్రవ్యాలు అక్కణ్నుంచి వస్తున్నాయని! ఇది చాలా ఫన్నీ ఆర్గ్యుమెంటు. 

అమెరికాలో డ్రగ్స్ వాడకం పెరుగుతోందంటే ఆ తప్పు ఎవరిది? వాడేవాళ్లది, సరఫరా చేసేవాళ్లది, ఆ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్న లంచగొండి ప్రభుత్వాధికారులది, వాళ్లను పట్టుకోకుండా, శిక్షించకుండా వదిలేస్తున్న పై అధికారులది. వాళ్లంతా దేశసరిహద్దుల్లోనే వున్నారుగా, వాళ్లని శిక్షించకుండా యితర దేశంపైకి దాడికి వెళ్లడమేమిటి? ఉదాహరణకి మెక్సికోలో ఒకడు తుపాకీతో పదిమందిని కాల్చేశాడు. ఆ తుపాకీ అమెరికాలో తయారైంది. ఆ కారణం చెప్పి మెక్సికో అమెరికాపైకి యుద్ధానికి దిగితే?

నెట్‌ఫ్లిక్స్‌లో ‘‘నార్కోస్’’ అని సీరీస్ లభిస్తుంది. పాబ్లో ఎస్కోబార్ (1949-93) అనే కొలంబియన్ డ్రగ్ డీలర్‌పై, అతని వారసులపై అమెరికన్ డిఇఏ (డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎడ్మినిస్ట్రేషన్) అధికారులు చేసిన పోరాటం గురించి అది విపులంగా చెపుతుంది. అది చూస్తే కొలంబియా రాజకీయ వ్యవహారాలలో అమెరికా ఎంత జోక్యం చేసుకుందో వివరంగా తెలుస్తుంది. 

ఒక దశలో అమెరికన్ గూఢచారి సంస్థ సిఐఏ, సాటి అమెరికన్ సంస్థ ఐన డిఇఏకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్లకు డ్రగ్ సరఫరా కంటె కమ్యూనిస్టులను వేటాడడం ముఖ్యం. కమ్యూనిస్టుల వేటలో డ్రగ్ కార్టెల్ తమకు సహకరిస్తోంది కాబట్టి సిఐఏ, డిఇఏకు అడ్డు తగులుతుంది. దాన్ని బట్టి డ్రగ్స్ నిరోధం విషయంలో అమెరికా చిత్తశుద్ధి ఎంతో తెలుస్తుంది. బొలివీయా ఒకటే కాదు, లాటిన్ అమెరికాలో ప్రతీ దేశంలోనూ అమెరికా ఏదో ఒక కారణం చెప్పి తలదూరుస్తుంది.

బొలీవియాలో అమెరికాకు, బహుళజాతి సంస్థలకు చాలాకాలంగా కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తి జువాన్ మొరేల్స్. 1959లో పుట్టాడు. బొలీవియా స్వదేశీ తెగలకు చెందినవాడు. కోకో పండించే రైతు కుటుంబంలో పుట్టి, కార్మిక నాయకుడిగా ఎదిగి, రాజకీయాల్లోకి వచ్చాడు. మాదకద్రవ్యాలపై యుద్ధమంటూ అమెరికా కోకో వ్యవసాయాన్ని నిషేధించమని కొలంబియా ప్రభుత్వంపై ఒత్తడి తెస్తూ వుంటే దానిని ఎదిరించి, రైతుల మద్దతు సంపాదించాడు. 

1997లో కాంగ్రెసుకు ఎన్నికయ్యాడు. స్వదేశీ తెగల గురించి, బీదవారి గురించి, సోషలిజం గురించి ఉపన్యాసాలిచ్చి పాప్యులర్ లీడరయ్యాడు. 2005లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, హైడ్రోకార్బన్ పరిశ్రమపై పన్నులు పెంచి, అలా వచ్చిన ఆదాయాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి, ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న ఋణాలను తీర్చివేస్తూ, అక్షరాస్యతపై, దారిద్ర్యనిర్మూలనపై ఖర్చు పెట్టి ప్రజాదరణ సంపాదించుకున్నాడు.

రోడ్లు వేశాడు, స్కూళ్లు పెట్టాడు. స్వదేశీ జాతుల వారికి అవకాశాలు కల్పించాడు. గ్యాస్, ఖనిజ రంగాలను జాతీయం చేశాడు. అతని హయాంలో దేశ జిడిపి 50 శాతం పెరిగింది. బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యానికి గండి కొట్టి మిక్సెడ్ ఎకానమీని (పబ్లిక్, ప్రయివేటు రంగాలు రెండూ సమానంగా మనుగడ సాగించే వ్యవస్థ) ప్రోత్సహించాడు.

 ఆ విధంగా దేశంపై అమెరికా ప్రభావాన్ని తగ్గిస్తూ వచ్చాడు. దానితో బాటు లాటిన్ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలున్న క్యూబా, వెనిజువెలా వంటి దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకున్నాడు. అతని పాలనలో దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడడంతో 2009లో మళ్లీ అధ్యక్షుడిగా నెగ్గాడు.

ఇదంతా అమెరికాకు కంటగింపుగా మారింది. అతన్ని ఎలా పదవీభ్రష్టుణ్ని చేయాలా, ఏ కారణం చెప్పి ప్రతిపక్షాలను రెచ్చగొట్టాలా అని చూడసాగింది. 2014 వచ్చేసరికి దానికి ఓ అవకాశం వచ్చింది. సాధారణంగా ప్రజాదరణ కొనసాగుతూన్న లీడర్లకు పదవి వదిలిపెట్ట బుద్ధి కాదు. తమకు అనుకూలంగా చట్టాలు మార్చేస్తూ శాశ్వతంగా ఆ పదవిలో వుందామని చూస్తారు. మొరేల్స్ కూడా అదే పని చేశాడు. 

బొలీవియాలో 2009లో ఓ చట్టం వచ్చింది, రెండు టర్మ్‌లకు మించి ఎవరూ పదవిలో కొనసాగకూడదని. అయితే మొరేల్స్ మళ్లీ నిలబడదామనుకున్నాడు. అతని పార్టీ వాళ్లు ‘చట్టం వచ్చినప్పటి నుంచి లెక్క వేయాలి, అలా అయితే నీకు ఒక టర్మ్ మాత్రమే అయినట్లే లెక్క’ అన్నారు. ఔను ఆ వాదన కరక్టే అంది మొరేల్స్ విధేయులతో నిండిన కోర్టు.

ఆ విధంగా మొరేల్స్ 2014లోనూ అధ్యక్షుడై పోయాడు. అతని ఆర్థికవిధానాల వలన దారిద్ర్యం 25 శాతం, అతిదారిద్ర్యం 43 శాతం తగ్గింది కాబట్టి మళ్లీ ఎన్నికయ్యాడని ‘‘గార్డియన్’’లో ఓ వ్యాసకర్త విశ్లేషించాడు. మళ్లీ అధ్యక్షుడయ్యాక మొరేల్స్ 2017లో అధ్యక్షపదవికి ఉన్న రెండు టెర్మ్‌ల పరిమితిని ఎత్తివేశాడు. కోర్టు దాన్ని సమర్థించింది. 2019 అక్టోబరులో మళ్లీ పోటీ చేశాడు. 

అతనికి 47 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష అభ్యర్థికి 36.5 శాతం ఓట్లు వచ్చాయి. 10 శాతం కంటె తక్కువ తేడా వుంటే మళ్లీ ఎన్నికలు జరపాలని చట్టం చెప్తోంది. తేడా 10 శాతం కంటె తక్కువ వుందని, మొరేల్స్‌ ఎన్నికలో అక్రమాలు చేశాడని ఓఎఎస్ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్) అనే ఆరోపించింది. 

కెనడా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలలోని 34 దేశాలకు చెందిన యీ సంస్థ అమెరికా చెప్పినట్లు ఆడుతుంది. దానికి సెక్రటరీ జనరల్‌గా వున్న లూయీస్ అల్మాగ్రో ఉరుగ్వేకు చెందినవాడు. రైటిస్టు రాజకీయాల నుంచి బయలుదేరి, లెఫ్టిస్టు అయి, యీ పోస్టుకి వచ్చాక అమెరికాకు సన్నిహితుడై, దక్షిణ అమెరికాలో వున్న అమెరికా వ్యతిరేక పాలకులపై కయ్యానికి కాలుదువ్వుతూ వచ్చాడు. తద్వారా ట్రంప్‌కు ఆత్మీయుడయ్యాడు.

బొలీవియా ఎన్నికలలో ఓడిపోయిన ప్రతిపక్షాలు ఏ ఆధారాలూ చూపకుండానే ఎన్నికలలో అక్రమాలు జరిగాయని అనగానే అల్మాగ్రో ఔనౌనంటూ రిపోర్టు సమర్పించాడు. వెంటనే అమెరికా, కెనడా ప్రభుత్వాలు - యితర దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి వాళ్లకెవరు హక్కు యిచ్చారో తెలియదు- ఆ ఎన్నికలను రద్దు చేయాలని, మొరేల్స్ వెంటనే రాజీనామా చేయాలని, పిలుపు నిచ్చాయి. ఇలాటి చేష్టలకు అలవాటు పడి, ట్రంప్ యిప్పుడు అమెరికాలో ఎన్నికల ఫలితాన్ని కూడా ధిక్కరించాడు. ఆ పిలుపును బొలీవియా ప్రజలు వింటారో లేదోనని ప్రతిపక్షాల చేత మిలటరీ రెండు వారాల పాటు బొలీవియా వీధుల్లో అల్లర్లు జరిపించింది.

కావాలంటే ఓఎఎస్ వచ్చి ఓట్ల కౌంటింగ్‌ను ఆడిట్ చేసుకోవచ్చని మొరేల్స్ ఆఫర్ యిచ్చాడు. కానీ అమెరికా వినదలచుకోలేదు. మిలటరీ సహాయంతో యిబ్బందులు సృష్టించసాగింది. అమెరికా వలన తనకు ప్రాణహాని కలుగుతుందని మొరేల్స్‌కు తోచింది. రక్తపాతం ఆగిపోవాలనే ఉద్దేశంతో తను తన పదవికి రాజీనామా చేస్తున్నానని 2019 నవంబరు 10న ప్రకటించాడు. వెంటనే కొందరు ఆయుధాలు ధరించి అతని యింట్లో చొరబడ్డారు. 

కొందరు అనుయాయులు అతన్ని కాపాడారు. వెంటనే మెక్సికో ఒక విమానం పంపి, అతన్ని రక్షించింది. డిసెంబరులో అతను అర్జెంటినాకు వెళ్లిపోయి, అక్కడ తలదాచుకున్నాడు.ఇది జరుగుతూండగానే అమెరికా సెనేట్ ఎమర్జన్సీ సమావేశం ఏర్పరచి, తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో జీనైన్‌ను గద్దెపై కూర్చోబెట్టింది. 

జీనైన్ పార్టీ ఐన డెమోక్రాట్ సోషల్ మూవ్‌మెంట్‌కు 2019 ఎన్నికలలో 4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె లాయరు, రైటిస్టు. ఎవాంజలిస్టు. మెజారిటీ సీట్లున్న ఎంఎఎస్ సెనేట్‌లో ఓటింగు బహిష్కరించింది. తక్కిన చిన్న చిన్న పార్టీలు ఆమెను సమర్థించాయి. కోరమ్ లేకపోయినా ఆ సమావేశం చెల్లుతుందంటూ ఆమె పార్టీ మద్దతుదారులు వాదించారు.

అర్జంటుగా ఆమె అధ్యక్షురాలి హోదాను అమెరికా, కెనడా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, రష్యా ఆమోదించేశాయి. పదవిలోకి వస్తూనే ఆమె ఏర్పరచిన కాబినెట్‌లో బొలీవియా స్వదేశీ తెగల వారెవరూ లేకుండా చూసింది. వ్యాపారస్తులకు చోటిచ్చింది.

ఇక తాత్కాలిక అధ్యక్ష హోదాలోనే మొరేల్స్ విధానాలన్నిటినీ తిరగతోడసాగింది. దేశంలోని సహజవనరులను ప్రయివేటు కంపెనీలకు ధారాదత్తం చేయసాగింది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ప్రయివేటు సెక్టార్‌కు అమ్మివేయసాగింది. 15 సంవత్సరాలుగా బొలీవియాతో సన్నిహిత సంబంధాలు నెరపిన క్యూబా, నికారాగువా, వెనిజులాలతో దౌత్యసంబంధాలు తెంపేసింది. 

ఓ పక్క దేశంలో కోవిడ్ వ్యాపిస్తూ, అనేక మరణాలు సంభవిస్తూండగానే వందలాది క్యూబన్ డాక్టర్లను వెళ్లగొట్టింది. మొరేల్స్ హయాంలో ఇజ్రాయేలును ‘టెర్రరిస్టు దేశం’గా ప్రకటిస్తే తను అధికారంలోకి వస్తూనే ఇజ్రాయేలుతో దౌత్యసంబంధాలు పెట్టుకుని, వామపక్షవాదులను ఎలా అణచివేయాలో తమ సైన్యానికి తర్ఫీదు యివ్వమని అడిగింది.

క్యూబాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు చె గుయివేరా బొలీవియాలో విప్లవం తేవాలని అక్కడకు వచ్చినపుడు సిఐఏ సహాయంతో బొలీవియా సైన్యం అతన్ని 1967 అక్టోబరు 9న చంపివేసింది. ఇప్పుడు జీనైన్ అక్టోబరు 9న పెద్ద ఉత్సవంలా జరిపి ‘‘బొలీవియాలో కమ్యూనిస్టుల నియంతలకు స్థానం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు యిది’’ అని గర్వంగా ప్రకటించింది. 

అంతేకాదు, ఎంఏఎస్ పార్టీ సభ్యులపై దమనకాండ జరిపిస్తూ, అలా చేసిన సైనికులందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తూ పోయింది. వీటితో బాటు మొరేల్స్ మళ్లీ తిరిగి రాకుండా అతనిపై దేశద్రోహం, టెర్రరిజం కేసులు మోపింది. దేశంలో అతనికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు అతనే బాధ్యుడని ఆరోపించింది. అంతేకాదు, అతను ఎన్నికలలో నిలబడడానికి అనర్హుడని ప్రకటించింది.

అర్జెంటీనాలో తలదాచుకున్న మొరేల్స్ తను మళ్లీ ఎన్నికలలో నిలబడనని ప్రకటించాడు. ఈ లోగానే ఓఎఎస్ యిచ్చిన నివేదికపై 2020 జూన్‌లో వివాదం చెలరేగింది. ‘‘న్యూయార్క్ టైమ్స్’’ పత్రిక కొన్ని ప్రముఖ అమెరికన్ యూనివర్శిటీలలోని ప్రొఫెసర్లతో కమిటీ వేసి ఆ నివేదికంతా తప్పులతడక అని నిరూపించింది. 

అమెరికా మీడియా అంతా గతంలో బొలీవియాలో జరిగిన కుట్రను సమర్థించినవాళ్లే. కానీ యిప్పుడు వాస్తవాలు బయటపడడంతో అంతా ఓఎఎస్‌ను తప్పుపట్టడం మొదలెట్టారు. 2020 మేలో జరగవలసిన బొలీవియా ఎన్నికలు కరోనా కారణంగా ఆలస్యమై అక్టోబరు 18న జరిగాయి.

కరోనా భయం వున్నా 88 శాతం పోలింగు జరిగింది. ఎంఎఎస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నిలబడిన లూయీస్ ఆర్సే, మొరేల్స్ ప్రభుత్వంలో ఫైనాన్స్ మంత్రిగా వుండి దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడినవాడు. అతనికి 55 శాతం ఓట్లు వచ్చాయి. రైటిస్టు పార్టీ నాయకుడు కార్లోస్‌కు 28 శాతం, 2019లో అల్లర్లను ప్రేరేపించిన మరో రైటిస్టు నాయకుడు కామాచోకు 14 శాతం ఓట్లు వచ్చాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు సభల్లోనూ ఎంఎఎస్‌కు మెజారిటీ వచ్చింది. ట్రంప్ కీలుబొమ్మ జీనైన్ రాజీనామా చేసి దిగిపోయింది.  

ఈ ఫలితాలతో తనకు 2019లో అన్యాయం జరిగిందని రుజువైందని మొరేల్స్ వాదిస్తున్నాడు. అల్మోగ్రా తప్పుడు నివేదిక కారణంగా జరిగిన అల్లర్లలో వేలాది మంది బొలీవియా ప్రజలు హతులయ్యారని, దానికి బాధ్యుడైన అతనిపై ఇంటర్నేషన్ క్రిమినల్ కోర్టులో కేసు పెడతానన్నాడు. ప్రాణభయం తొలగిపోయింది కాబట్టి నవంబరు 9న బొలీవియాకు తిరిగి వచ్చాడు. 

బొలీవియాలో ఎంఎఎస్ విజయం అల్మోగ్రా నెత్తి మీదకు వచ్చింది. 2015లో జనరల్ సెక్రటరీగా ఎంపిక అయిన అతను 2019లో చేసిన నిర్వాకానికి మెచ్చి అమెరికా 2020 మార్చిలో అతనికి రెండో టెర్మ్ కూడా వచ్చేట్లు చేసింది. తీరా తప్పుడుతడకల నివేదిక బయటపడడంతో యిప్పుడు అందరూ అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (ఫోటో – మొరేల్స్, జీనైన్, ఓఎఎస్ అల్మోగ్రా, తాజా విజేత ఆర్సే)

ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
mbsprasad@gmail.com

 


×