cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ప్రేమ వివాహాల్లో జాగ్రత్తలు

ఎమ్బీయస్‌: ప్రేమ వివాహాల్లో జాగ్రత్తలు

‘‘ఎలక్ట్రా కాంప్లెక్సున్న భార్యలు’’ వ్యాసం చాలామందికి నచ్చింది. ఇంకా రాసి వుండాల్సింది అన్నారు. అర్థం కావాల్సినవారికి అర్థమవుతే చాలనుకున్నాను. వైవాహిక జీవితాల్లో కలతలు వచ్చినవారు ఈ రోజుల్లో చాలామంది కనబడుతున్నారు. వారు ఆత్మపరిశీలన చేసుకోవడానికి యిది ఉపకరిస్తుంది. పెళ్లి చేసుకుందా మనుకునే ప్రేమికుల కోసం యీ వ్యాసం రాస్తున్నాను.

పెద్దలు కుదిర్చిన వివాహంలో సాధారణంగా ఒకే స్థాయి వున్నవారిని పరిగణిస్తారు. కానీ ప్రేమ వివాహాల్లో యువతీయువకులు స్థాయిని గణించరు. ‘మా మనసులు కలిశాయి, డబ్బు దేముంది, స్టేటస్‌ది ఏముంది?’ అనుకుంటారు. డబ్బు లేదా పలుకుబడి, అధికారం ఉన్న కుటుంబంలోని అమ్మాయి అవి లేని అబ్బాయిని చేసుకునేముందు తనకు ఎలక్ట్రా కాంప్లెక్సు వుందేమో పరీక్షించుకుని చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లికి ముందు ప్రేమే ముఖ్యమనిపిస్తుంది కానీ తర్వాత భర్తను తండ్రితో పోల్చి చూస్తే ప్రమాదం.

‘నీకు డబ్బు లేదన్న చింత నాకు లేదు. కానీ పైకి ఎదగాలన్న ఆలోచన లేదు చూడు, అది నాకు అర్థం కావటం లేదు. మా నాన్నకూ మొదట్లో ఏమీ వుండేది కాదు, కానీ కష్టపడి పైకి వచ్చాడు. పరీక్షలు రాసి ప్రమోషన్‌ తెచ్చుకున్నాడు/ అప్పు తెచ్చి వ్యాపారం పెట్టి పెద్దది చేశాడు/ చొరవతో ప్రజాసేవ చేసి పెద్ద పదవి సంపాదించాడు. ఎవర్నైనా యింప్రెస్‌ చేయగలడు. నీకలాటి ఏంబిషన్‌ ఎందుకుండకూడదు?’ అని అడగడం మొదలుపెడితే గొడవలు రావడం తథ్యం. భర్తను తండ్రిలా మార్చాలని చూడడం వ్యర్థం.

వీళ్లు గుర్తు పెట్టుకోవసినది - ప్రేమించినపుడు ఆ గుణాలను చూసి ప్రేమించలేదు. అతనికి తనంటే యిష్టం, తన కోసం ఏ కష్టమైనా పడతాడు, ఎంతకైనా తెగిస్తాడు, లేదా తనలాటి అభిరుచులే ఉన్నాయి, మనిషి మంచివాడు.. యిలాటివి చూసి నచ్చి తలిదండ్రులు వద్దన్నా పెళ్లాడింది. ఇప్పుడు వాటికి తక్కువ మార్కులు వేసి, మా నాన్నలాగ చేయి, పైకి రా అంటే ఎలా? అతను వాళ్ల తండ్రిలాగే వుండకపోవచ్చు, యిక మీ తండ్రి లాగ ఎందుకుంటాడు?

మీ నాన్న, ప్రేమంటూ ఒకమ్మాయి చుట్టూ ఏళ్ల తరబడి తిరగలేదు. ఆ సమయాన్ని వేరేదానికి వెచ్చించి జీవితంలో పైకి వచ్చాడు. ఇతను ప్రేమంటూ నీ కోసం ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెట్టినప్పుడే అర్థమై వుండాలి - ఇతను మా నాన్న తరహా కాదని! మరి పెళ్లయ్యాక యింకోలా మారమంటే ఎందుకు మారతాడు? మీ నాన్నకు జీవితాన్ని ఎంజాయ్‌ చేయడం రాదని, తనకు వచ్చని అతని అభిప్రాయం కావచ్చు.

కొందరు తలిదండ్రులు కూతురు ప్రేమవివాహం చేసుకుంటానన్నపుడు వద్దని ఏడాది, రెండేళ్ల పాటు అడ్డుపడతారు. తర్వాత కొంతమంది సరేనంటారు. మరికొంతమంది సరేననరు. మూడు నాలుగేళ్లు పోయాక మధ్యలో కొందరు కలగజేసుకుని నచ్చచెపితే ఒప్పుకుంటారు. రాకపోకలు మొదలవుతాయి. (కులాంతర వివాహం విషయంలో ఐతే) కులం ఎలాగూ మార్చలేం కానీ స్థాయి మార్చవచ్చు కదా అనుకుని ఇక అప్పణ్నుంచి అమ్మాయిపై సన్నగా ఒత్తిడి మొదలవుతుంది.

‘మీ ఆయనకు చెప్పు, వేరే ఊళ్లో ఉద్యోగం ఎందుకు? మాకు దగ్గర్లోనే వుండవచ్చు కదా, నాన్నగారి కంపెనీలో డైరక్టరుగా/ వ్యాపారంలో భాగస్వామిగా చేరమను.  పెట్టుబడి అక్కరలేదు, కట్నం యిచ్చామనుకుంటాం లేదా పెళ్లికి ఖర్చు పెట్టామనుకుంటాం.’ అని తల్లి హితవు చెప్పనారంభిస్తుంది. అమ్మాయికి యిది రీజనబుల్‌గానే అనిపిస్తుంది. నాలుగేళ్లు పోయాక చేరువైన అమ్మానాన్నలను నొప్పించ కూడదనుకుంటుంది. భర్తకు నచ్చచెప్పడానికి చూస్తుంది. ‘అంతగా నచ్చకపోతే అప్పుడే బయటకు వచ్చేసి మళ్లీ ఉద్యోగం చూసుకోవచ్చు’ అని వాదిస్తుంది. 

ఈ ప్రతిపాదనకు  అల్లుళ్లందరూ ఎగిరి గంతేస్తారని అనుకోనక్కరలేదు. డబ్బు వస్తే మంచిదే కానీ, వ్యాపారం, వ్యవహారం అంటే రిస్కుతో, శ్రమతో, టెన్షన్లతో కూడుకున్న వ్యవహారం, ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకునేవాళ్లుంటారు. లేదు, ఛాన్సు తీసుకుందాం అనుకుని వచ్చినవాళ్ల కేసులో భార్యకు ఎలక్ట్రా కాంప్లెక్సు వుంటే యిబ్బందులు వచ్చేస్తాయి. ‘మా నాన్న చూడు, యీ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారో, నీకు బద్ధకం ఎక్కువ. బొంబాయికి స్వయంగా వెళ్లకుండా మార్కెటింగ్‌ మేనేజర్‌ను పంపావట, అందుకే కాంట్రాక్టు రాలేదట..’ వంటి పోలికలు, ఫిర్యాదులు వచ్చే ప్రమాదం వుంది.

తండ్రీకొడుకులు ఒకే వృత్తిలో ఉన్నా, ఒకే వ్యాపారంలో ఉన్నా గొడవలు వస్తూంటాయి. తరాల మధ్య అంతరం అలాటిది. ఆయన చుట్టూ చేరే గ్రూపుకి, యీ యువకుడి చుట్టూ చేరే గ్రూపుకీ మెంటాలిటీలో చాలా తేడా వుంటుంది. డబ్బు వేస్టవుతోందని పెద్దాయన గోల, పెద్దాయన చాదస్తం వలననే బిజినెస్‌ పెరగటం లేదని చిన్నాయన ఫిర్యాదు. నమ్మిన విలువల వద్దే భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. సొంత రక్తమైన తండ్రీ కొడుకులే అడ్జస్టు కాలేనప్పుడు మామా- అల్లుళ్లు ఒకేలా ఎందుకుంటారు? ఇది ఆ అమ్మాయికి బోధపడకపోతే, నిరంతరం పోలుస్తూ వుంటే సంసారం సజావుగా సాగదు. డబ్బు సమకూరితే మనుషులు తృప్తి పడతారని అనుకోవడం అవివేకం. ప్రతి మనిషికి తనదైన వ్యక్తిత్వం, అహంకారం వుంటాయి. వాటికి దెబ్బ తగిలినపుడు డబ్బు మలాము పూయలేదు.

ఇక అబ్బాయి స్థాయి పెద్దగా వుండి, అమ్మాయి స్థాయి తక్కువున్న కేసుల్లో- అబ్బాయికి ఏక్సెప్టన్స్‌ లెవెల్స్‌ హెచ్చుగా వుండాలి. అమ్మాయి తన స్థాయికి అలవడడం సులభంగానే జరుగుతుంది. ఎందుకంటే చీకట్లోంచి వెలుగులోకి రావడం, ఆసరాతో నిచ్చెన మెట్లెక్కడం కష్టమేమీ కాదు. కానీ ఆమె తలిదండ్రులు, బంధువులు మాత్రం తమ గూటిలోంచి బయటకు రారు, తమ స్థాయి బట్టి అబ్బిన అలవాట్లు మార్చుకోరు.  అల్లుడు యింటికి వచ్చాడు కదాని వాళ్లకు హఠాత్తుగా సిరి అబ్బదు, పద్ధతులు మారవు. ఆ యింటినుంచి వచ్చిందే కాబట్టి భార్యకు అవేమీ ఎబ్బెట్టుగా అనిపించవు. భర్త వాటిని తప్పుపడితే నొచ్చుకుంటుంది, ఎదురు తిరుగుతుంది. భార్యతో బాటు ఆమె కుటుంబాన్నీ సొంతం చేసుకోగలిగితేనే, వాళ్ల స్థితిగతులను ఆమోదించ గలుగుతేనే పెళ్లిపీట లెక్కాలి.

నేను గమనించినదేమిటంటే - కులాంతర ప్రేమ వివాహాలలో కంటె స్థాయి వేరేగా వున్న ప్రేమ వివాహాల్లో అవగాహన ఎక్కువ అవసరం. పెళ్లి చేసుకున్నాక అవతల వాళ్ల స్థాయిని మార్చేద్దామని చూడడంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తన తండ్రిని ఆదర్శంగా తీసుకోమని భర్తను పోరే అమ్మాయిలకు మరిన్ని సమస్యలు కలుగుతాయి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2020) 
mbsprasad@gmail.com