cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పౌరసత్వంపై జనాల్లో చైతన్యం తెచ్చిన మోదీ

ఎమ్బీయస్‌: పౌరసత్వంపై జనాల్లో చైతన్యం తెచ్చిన మోదీ

మోదీ వచ్చిన దగ్గర్నుంచి పాలనలో అనేక లోపాలు జరిగినా ప్రతిఘటించడానికి ఎవరూ లేకుండా పోయారు. తక్కిన సమయాల్లో మోదీపై అసంతృప్తి వెళ్లబుచ్చుతున్నా ఎన్నికలు వచ్చేసరికి మోదీ సృష్టించే భావావేశంలో పడి ప్రజలు బిజెపినే గెలిపిస్తున్నారు. 'మోదీ పాలన గొప్పగా ఏమీ లేదు, కానీ ప్రత్యామ్నాయం కానరావటం లేదు' అనే వాళ్ల లాజిక్‌. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పూర్తిగా అప్రతిష్ఠపాలయింది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న సోనియా జబ్బు పడింది. ఆసక్తి లేని రాహుల్‌ గబ్బు పట్టాడు. అయినా కాంగ్రెసును తన కబంధ హస్తాల నుంచి పోనీవడానికి సోనియా రెడీగా లేదు. 

ఇక తక్కిన ప్రతిపక్షాలన్నీ ప్రాంతీయ పార్టీలే. తమ క్షేత్రంలో ఎంతోకొంత బలం ఉన్నా, బిజెపిని ఎదిరించగల సత్తా లేకుండా కొట్టుమిట్టులాడుతున్నాయి. తమలో తాము కలహించుకుంటూ, సంఘటితం కాలేకుండా ఉన్నాయి. బిజెపి తమ పార్టీల్లోంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తమ బలాన్ని హరిస్తున్నా ఎదురు తిరిగి పోట్లాడే శక్తి లేదు వాటికి. ఏమైనా అంటే ఇడి, ఐటి దాడులు. కేసులు. బిజెపికి దాసోహం అనేదాకా సిబిఐ, యితర కేంద్రసంస్థలు వెంటాడుతున్నాయి. ఇన్నేళ్ల రాజకీయజీవితంలో ఏవో కొన్ని తప్పులు చేసే వుంటారు. కీలెరిగి అక్కడ వాత పెడతానంటూ బిజెపి బెదిరిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తోంది. 

కార్పోరేట్లు, బిజెపి ఒకరికొకరు సహకరించుకుంటూ దేశాన్ని తమ చిత్తం వచ్చినట్లు పాలిస్తున్నారు. గతకాలపు చక్రవర్తుల్లా 'ఒకే దేశం. ఒకే పాలకుడు, ఒకే భాష, ఒకేసారి ఎన్నికలు, ఒకే రేషన్‌ కార్డు, ఒకే పౌరస్మృతి..' యిలా ప్రతీదీ ఏకనామ స్మరణ చేస్తూ ఫాసిజం వైపు అడుగులేస్తున్నాడు మోదీ. దీని గురించి ప్రజలను ఎడ్యుకేట్‌ చేయడానికి కూడా ప్రతిపక్షాలకు బలం చాలకుండా ఉంది. ఎవరైనా నిజానిజాలు చర్చించబోతున్నా వినే మూడ్‌లో లేరు ప్రజలు. ఏదో ఒక అద్భుతం చేసి మోదీ దేశాన్ని గట్టెక్కిస్తాడు అనే ఊహల్లోనే బతుకుతున్నారు. 

ఇలాటి పరిస్థితుల్లో పౌరసత్వం అంశం తెచ్చి మోదీ ఒక్కసారిగా ప్రజల్లో, ప్రతిపక్షాల్లో కదలిక తెచ్చాడు. నోట్ల రద్దు సమయంలోనే యిలాటి ప్రతిఘటన రావాల్సింది. కానీ అప్పట్లో రద్దు తర్వాత అద్భుతాలు జరుగుతాయని జనం ఆశించి ఊరుకున్నారు. జిఎస్‌టి దెబ్బ కూడా రుచి చూశాక మోదీ విధానాలపై నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడీ పౌరసత్వం గురించి ఏం చెప్పినా నమ్మడానికి వీల్లేదంటూ, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. సిఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీ.. యివన్నీ వారిలో భయాందోళనలు కలిగించాయి. ప్రజల్లో, ప్రతిపక్షాలలో అంతకు ముందు కానరాని సంఘీభావం  చూసి కలవర పడిన మోదీ ఎన్నార్సీపై వెనకడుగు వేశాడు. హోం మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలను ఖండించాడు. అయితే ఎన్నార్పీ ద్వారా ఆ కార్యం నిర్వర్తిద్దామని చూస్తున్నాడనుకోండి. 

అనేక రాష్ట్రాల్లో చెలరేగిన యీ ఆందోళనల్లో కొందరు చనిపోయారు. వాటి వెనుక ముస్లిం సంస్థలున్నాయని ప్రభుత్వం అంటోంది. ముస్లింలు అతి తక్కువ శాతంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమం మాటేమిటి అంటే యీ ముస్లిం సంస్థలే అక్కడకు వెళ్లి అల్లరి చేశాయంటోంది ప్రభుత్వం. ఏది ఏమైనా మోదీకి తగిలిన మొదటి ఎదురుదెబ్బ యిది. కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఆదేశాలు అమలు చేయమని మొండికేస్తున్నాయి. అందుకే దీనిపై పాఠకులలో కూడా ఆసక్తి పెరిగింది. ఈ అంశంపై విశదంగా రాయమని చాలామంది అడుగుతున్నారు. 

సాంకేతిక విషయాల జోలికి వెళ్లే ముందు, ఈ అంశంపై నా భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తాను. ప్రభుత్వ చర్యలపై నా స్పందన ఆ ఆలోచనాధోరణికి అనుగుణంగానే ఉంటుంది. నాతో మీరు ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. కానీ దేశానికి ఏది హితమో శాంతంగా, ఆవేశాలకు లోను కాకుండా ఆలోచించండి. ప్రజలలో ఎందుకింత వ్యతిరేకత వస్తోందో అర్థం కావచ్చు. మొదటి రెండు వ్యాసాలలో నా భావాలు చెప్పాక తర్వాతి వాటిల్లో చట్టం ఏం చెబుతోంది, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌ గందరగోళమేమిటి అనేవి చర్చిస్తాను.

మాది విశాలమైన యిల్లు. ఇంటికి ముందు అరుగులు, వెనకాల పెరడూ ఉన్నాయి. మాకు కాస్త దగ్గరలోనే పల్లపు ప్రాంతాలున్నాయి. వరదలు వచ్చినపుడు అక్కడ నివాసముండే జనాల యిళ్లు మునిగాయి. మా యింటికి వచ్చి తలదాచుకుంటామన్నారు. సరేనన్నాను. అరుగుల మీదే పడుక్కున్నారు. పెరట్లో వంటలు వండుకున్నారు, తిన్నారు. ఆ నాలుగు రోజులూ యిల్లు నానా కంగాళీగా ఉంది. అయినా మానవత్వంతో భరించాను. ఏ మాట కా మాట చెప్పాలంటే వాళ్లను నాతో సమానంగా చూడలేదు, వాళ్లెవరినీ మా యింట్లో హాల్లోకి రానివ్వలేదు, నా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి పడుక్కోబెట్టుకోలేదు. మా ఆవిడ కిచెన్‌లోకి రానివ్వలేదు. కానీ ఏ సరుకు కావాలన్నా ఉదారంగా యిచ్చేది, వాళ్లు పట్టుకెళ్లి పెరట్లో పొయ్యి పెట్టుకుని వండుకునేవారు. స్నానాలూ అవీ నూతి దగ్గరే చేసేవారు. మా బాత్‌రూమ్‌ వాడేవారు కాదు. 

నాలుగు రోజుల్లో పరిస్థితి చక్కబడింది. ఎవళ్ల యిళ్లకు వాళ్లు వెళ్లారు. వాళ్లు వెళ్లాక మా యిల్లు శుభ్రం చేసుకోవడానికి రెండు రోజులు పట్టింది. వచ్చినవాళ్లలో మా కులం వాళ్లు కొంతమంది ఉన్నారు. అయినా వాళ్లను మా దగ్గరే ఉండిపొమ్మని అనలేదు. వాళ్ల పిల్లలు 'మనిల్లు కన్న యీ యిల్లే బాగుందమ్మా, యిక్కడే వుండిపోదామా?' అన్నా, వాళ్ల తలిదండ్రులు తిట్టి, ఎప్పుడూ వాళ్లు వుండే పల్లపు ప్రాంతాల యిళ్లకే తీసుకెళ్లిపోయారు. తమ కష్టకాలంలో ఆదుకున్నందుకు మాకు కృతజ్ఞతలు చెప్పారు. మనకున్నంత దానిలోనే సాటి మనిషిని ఆదుకున్నందుకు మేమూ సంతోషించాం. మూడు, నాలుగేళ్ల క్రితం యిలాగే జరిగింది. వచ్చినవాళ్లు మళ్లీ వెళ్లం అని భీష్మించి ఉంటే యీసారి వాకిట్లో అడుగు పెట్టనిచ్చేవాళ్లం కాము. పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్లు నడుచుకున్నారు కాబట్టే వాళ్లకూ, మాకూ మాట దక్కింది. 

ఇల్లయినా, దేశమైనా యీ విషయంలో ఒకటే. పొరుగుదేశంలో ఏదో ఆపద వచ్చింది, జనాలు తరలి వస్తారు. వాళ్లకు మనం ఆశ్రయం కల్పిస్తాం. ఏ గుడారాల్లోనో ఉండమంటాం. మన నుంచి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బును ప్రభుత్వం వాళ్లపై వెచ్చిస్తుంది. లేదా వారి కోసం అదనంగా పన్ను వసూలు చేస్తుంది. మానవత్వ దృష్టితో మనం భరిస్తాం. ఎందుకివ్వాలి అని అడగం. ఇలా నెలో, రెండు నెలలో, మహా అయితే ఆర్నెల్లో భరించి, వెనక్కి పంపించి వేస్తాం. ఈ లోగా అక్కడ పరిస్థితులు చక్కబడ్డాయని తోచి వాళ్లు సొంత యిళ్లకు వెళ్లిపోతారు. మన దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా తమ దేశంలో సొంత వ్యవసాయం, వ్యాపారాల ద్వారా పొట్ట పోసుకుందామని చూస్తారు. ఆ కష్టమేదో యిక్కడే పడితే, అక్కడి కంటె యిక్కడే నాలుగు రాళ్లు ఎక్కువ వస్తాయి కదా అనుకున్నవాళ్లు యిక్కడ ఉండిపోదామని చూసినా మనం 'వెళ్లిరా నాయనా' అంటాం కానీ 'నువ్వు మా మతం వాడివి, మా కులం వాడివి, ఉండిపో ఫర్వాలేదు' అనం. 

ఇది సహజన్యాయం. ప్రకృతి వైపరీత్యాల వలన కాని, రాజకీయ కారణాల వలన కాని, యుద్ధవాతావరణం వలన కాని, దుర్భర జీవన పరిస్థితుల వలన కాని, శరణార్థులుగా, కాందిశీకులుగా జనాలు పొరుగు దేశాలకు వెళుతూనే ఉంటారు. పొరుగు దేశాలు కొంతకాలం ఆశ్రయం యిచ్చి వెనక్కి పంపేస్తూనే ఉంటాయి. ఇది యిటీవలి కాలంలో శ్రుతి మించి యూరోప్‌లో పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. 'కాందిశీకులను మేమెందుకు  ఆదరించాలి? ఎంతకాలం ఆదరించాలి? దానివలన మా దేశపౌరుల అవసరాలను తీర్చలేక పోతున్నాం. ఇది మాకు తట్టుకోలేని, తలకు మించిన భారమౌతోంది' అని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు అడుగుతున్నాయి. 'మానవత్వం కోసం భరించాల్సిందే, అది మన యూనియన్‌ పాలసీ' అని యూనియన్‌ నాయకత్వం అంటే 'అయితే మేం సభ్యత్వం వదులుకుంటాం, యీ బాధ్యత నుంచి తప్పించుకుంటాం' అంటున్నాయి ఆ దేశాలు. బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ ఎంచుకోవడానికి ప్రధాన కారణాల్లో యిదొకటి. ఈ దేశాలేవీ కాందిశీకులు మన మతస్తులా, కాదా అని చూడటం లేదు. మన దేశపౌరులా కాదా అనే చూస్తున్నాయి. 

ఆ దేశాల్లో ఎవరు పౌరుడో, కాదో గుర్తించేందుకు పకడ్బందీ వ్యవస్థ ఉంది. గుర్తింపు కార్డులుంటాయి. అది పోయిందంటే, వెరిఫై చేయడానికి పాత రికార్డులు పక్కాగా ఉంటాయి. ఇతర దేశస్తులను పంపేయాలి అని గట్టిగా అనుకుంటే పంపించి వేయగల సాధనసంపత్తి పుష్కలంగా ఉంది. ఇక్కడ అమెరికా నుంచి మెక్సికన్‌ అక్రమ వలసదారులను పంపలేక పోతున్నారేం? అనే ప్రశ్న వస్తుంది. పైకి ఏం చెప్పినా వాళ్లు కావాలనే మెక్సికన్లను భరిస్తున్నారని నా అనుమానం. ఎందుకంటే వాళ్లకు కావలసిన చీప్‌ లేబర్‌ ఫోర్సంతా మెక్సికో నుంచే వస్తోంది. ఆ కూలీకి స్థానికులు ఎవరూ పని చేయరు. ఐటీ రంగంలో చీప్‌ లేబర్‌ ఫోర్సు మన ఇండియన్లు. అందుకే వీసా పరిమితి ముగిసిపోయినా మనవాళ్లు కొందరు అక్కడ ఉండిపోగలుగుతున్నారు. 

మన దేశంలో పౌరులను గుర్తించే వ్యవస్థ సరిగ్గా లేదు. ప్రభుత్వ యంత్రాంగం లోపభూయిష్టంగా ఉంది. అందువలన అనేకమంది అక్రమంగా చొరబడుతున్నారు. ఇన్నాళ్లూ మనకు ఉన్న గుర్తింపు కార్డు రేషన్‌ కార్డు మాత్రమే. ఆ తర్వాత ఓటరు ఐడెంటిటీ కార్డు. దొంగ రేషన్‌ కార్డులు, దొంగ ఐడెంటిటీ కార్డులు సృష్టించడం మహా సులువుగా ఉండేది. పాన్‌ కార్డులు, పాస్‌పోర్టు జారీ చేసే ప్రక్రియ మాత్రం క్లిష్టంగా ఉండేది. కానీ వాటి కోసం అడిగేవాళ్లు చాలాచాలా తక్కువ. 

పౌరసత్వం నిర్ణయించడానికి పటిష్టమైన విధానం ఉండాలని ఆధార్‌ కార్డును ప్రవేశపెట్టారు. ఇది పాత వాటి కంటె చాలా మెరుగు కానీ దీనిలోనూ తమాషాలు చేసిన ఉదంతాలు పేపర్లలో వచ్చాయి. చచ్చిపోయిన వాళ్ల పేర, అమితాబ్‌, కలాం వంటి ప్రముఖుల పేర్ల ఆకతాయిలు ఆధార్‌లు సంపాదించారని తేలింది. ఎంతైనా ఆధార్‌ను యిప్పుడందరూ విశ్వసిస్తున్నారు. ప్రతీదాన్నీ ఆధార్‌కు లింక్‌ చేయమంటున్నారు. ఎక్కడో అక్కడ క్రాస్‌ చెక్‌ చేస్తూ ఉంటే లోపాలు వెలికి వస్తాయి. 

ఆధార్‌ వ్యవస్థను ఎంత పటిష్టం చేస్తే అంత మంచిది అనేది నిర్వివాదాంశం. దాన్ని రేషన్‌ లబ్ధిదారులకు లింక్‌ చేసినప్పుడు బోగస్‌ రేషన్‌లు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏ పథకమైనా ప్లాన్‌ చేసినప్పుడు ఎంతమందికి యిది ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చవుతుంది అనేది అంచనా వేయడానికి పనికి వస్తుంది. ఆధార్‌ను ఓటరు ఐడి కార్డుక్కూడా అనుసంధానం చేసినప్పుడు బోగస్‌ ఓట్లు పడడం ఆగిపోతుంది. లోకంలో అన్నిటిని ఆధార్‌కు లింకు చేస్తున్న పాలకులు, ఆ పని మాత్రం చేయకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఆధార్‌ను పటిష్టం చేస్తూ, లోపాలు సరిదిద్దుతూ, అనుమానం ఉన్నచోట ఆధారాలు చూపమని అడుగుతూ ఉంటే అసలైన పౌరులెవరో తేలిపోతుంది. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు, ఎవరూ అభ్యంతర పెట్టే పని కాదు. 

అయితే బిజెపి ప్రభుత్వం మాత్రం పౌరసత్వం పేరుతో చాలా ఖర్చుతో పెద్ద కసరత్తు చేపట్టింది. ఆర్థిక పరిస్థితి బాగా లేదు, అనేక పథకాలకు నిధులు చాలటం లేదు, ఆంధ్ర వంటి రాష్ట్రాలకు వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు విడుదల చేయటం లేదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆదుకోవడం లేదు, జిఎస్‌టిలో రాష్ట్రాలకు రావలసిన వాటాలు యివ్వటం లేదు. ఇస్తాం కానీ ఎప్పుడిస్తామో చెప్పలేం, ఎప్పటికో అప్పటికి యిస్తాం అంటున్నారు. అలా ఎందుకంటే డబ్బు లేదంటున్నారు. మరి దీనికి మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. దీనికింత ప్రాధాన్యత ఎందుకు? అంటే బిజెపికి ఓ ఎజెండా ఉంది. దాని ద్వారా రాజకీయాలు నడిపి ఓటు బ్యాంకును తయారు చేసుకుందామని చూస్తోంది. ఇదీ అసలు సమస్య. (సశేషం) -

(ఫోటో - పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో ఆందోళనలు)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020) 
mbsprasad@gmail.com