cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జాప్యానికి ప్రాయశ్చిత్తం లాక్‌డౌనా?

ఎమ్బీయస్‌: జాప్యానికి ప్రాయశ్చిత్తం లాక్‌డౌనా?

ముఖ్యమంత్రులకు ఏమీ తెలియదు కనుక అడగడం అనవసరం అనవచ్చు. కానీ ప్రధాని, ఆయన సలహాదార్లు మాత్రం తెలిసున్నట్లు ప్రవర్తించారా? సావధానంగా వినండి, నిష్పక్షపాతంగా ఆలోచించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా కోవిడ్‌ గురించి ఎప్పుడు చెప్పింది? 2019 డిసెంబరు 31న. వెంటనే ఆ సంస్థ ఐఎమ్‌ఎస్‌టి (ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సపోర్ట్‌ టీమ్‌) అని పెట్టి దాని గురించి శోధించడం మొదలుపెట్టింది. జనవరి 30 నాటికల్లా మన దేశంలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. ఫిబ్రవరి 12 కల్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫోరమ్‌ అని పెట్టి, ప్రపంచం నాలుగు మూలల నుంచి 400 మంది నిపుణులను పిలిచి చర్చించింది. కోవిడ్‌ అనే ఊపిరితిత్తుల రోగం ఉందని ప్రకటించింది. ఫిబ్రవరి 16 కల్లా అనేక దేశాల ఎక్స్‌పర్ట్స్‌తో సహా ఓ టీము చైనా వెళ్లి సంగతేమిటో చూస్తోంది.

ఇవన్నీ నాబోటి, మీబోటి సామాన్యుల దృష్టిని పెద్దగా ఆకర్షించక పోవచ్చు. కానీ కేంద్ర ఆరోగ్యశాఖలో ఉన్నవారికి యిదే పని కదా. అందువలన వారు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. జనవరి 21 నుంచే చైనా నుండి వచ్చేవారిని థర్మల్‌ చెక్‌ చేసే పని 7 ఎయిర్‌పోర్టుల్లో మొదలుపెట్టారు. జనవరి నెలాఖరుకి దాన్ని 20 ఎయిర్‌పోర్టులకు విస్తరించారు. ఫిబ్రవరి వచ్చేసరికి చైనా నుంచే కాకుండా థాయ్‌లాండ్‌, సింగపూర్‌, హాంగ్‌ కాంగ్‌, జపాన్‌, సౌత్‌ కొరియాల నుంచి వచ్చినవారినీ చెక్‌ చేయసాగారు. ఫిబ్రవరి ఆఖరి వారం వచ్చేసరికి నేపాల్‌, వియత్నాం, ఇండోనేసియా, మలేసియాలను కూడా లిస్టులో చేర్చారు. ఇక్కడ నాకు తెలిసున్నది చెప్తాను.

మా కజిన్‌, తన భర్త దక్షిణ కొరియా రాజధాని సోల్‌ (మన మీడియా సీయోల్‌ అంటుంది)లో వాళ్లబ్బాయి యింటికి జనవరిలో వెళ్లారు. ఆ దేశంలో మొదటి కేసు జనవరి 20న బయటపడింది. 20 ఫిబ్రవరికి 58కి చేరింది. మన తబ్లిగీలాగ (వాళ్ల ఆగడాల గురించి వేరే వ్యాసంలో) ఒక మహాతల్లి (పేరు చెప్పకుండా ‘‘పేషంట్‌ 31’’ అంటున్నారు) వారానికో చర్చికి వెళ్లి సాధ్యమైనంత మందికి అంటించిందట. 21 కల్లా 346కి చేరడంతో మా  మేనల్లుడు  తలిదండ్రులను వెంటనే ఇండియాకు వెళ్లిపోమని పట్టుబట్టాడు.

వీళ్లు వెంటనే బయలుదేరి 23 కల్లా దిల్లీ మీదుగా హైదరాబాదు చేరుకున్నారు. దిల్లీ ఎయిర్‌పోర్టులో వాళ్లకు క్షుణ్ణంగా పరీక్షలు చేశారు, గత ఏడాదిలోపున చైనా వెళ్లారా అని అడిగారు. సంతృప్తి పడ్డాకనే హైదరాబాదు రానిచ్చారు. వచ్చాక వీళ్లు రెండు వారాల పాటు యిల్లు కదలలేదు, ఎవర్నీ రానివ్వలేదు. ఆన్‌లైన్‌లోనే కూరగాయలు తెప్పించుకుని యింట్లోనే వండుకున్నారు. మనలాటి సామాన్యులు యిలాటి జాగ్రత్తలు తీసుకుంటూంటే అదే సమయానికి, ఫిబ్రవరి 24న మోదీగారు ఏం చేస్తున్నారు?

అహ్మదాబాద్‌లో ‘‘నమస్తే ట్రంప్‌’’ కార్యక్రమానికి లక్షాపాతిక వేలమందితో హంగామా నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్‌, దిల్లీ, ఆగ్రా అంతా సందడే సందడి. ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినవారిని మాత్రమే తనిఖీ చేయాలి, యితర దేశాల నుంచి వచ్చినవారిని చేయనక్కరలేదని కేంద్రం ఎలా అనుకుంది? గ్లోబల్‌ విలేజి, ప్రపంచం ఒక కుగ్రామం వంటి సూక్తులు వినలేదా? చైనా నుంచి భూగోళంలోని సమస్తదేశాలకు యాత్రికులు వెళతారని తెలియదా? ముఖ్యంగా అమెరికాతో మనకున్న వ్యాపారబంధం సామాన్యమైనదా? చైనాతో మన వ్యాపారం 84 బిలియన్‌ డాలర్లయితే, అమెరికాతో 74! అమెరికా నుంచి ట్రంప్‌తో బాటు, ముందూ వెనుకా ఎంతమంది అమెరికన్లు, ఎంతమంది ఎన్నారైలు వచ్చి వుంటారు? వాళ్ల నెందుకు కట్టడి చేయలేదు?

ఎందుకంటే మోదీగారు తలపెట్టిన నమస్తే ట్రంప్‌ ఆగడానికి వీల్లేదు. దక్షిణ కొరియా అప్పటికే ఫంక్షన్లన్నీ రద్దు చేసేసింది. మనం మాత్రం చేయలేదు. ఎందుకంటే ‘హౌడీ మోడీ’ ఋణభారం వుండిపోయింది. అది తీర్చుకోవాలి. అందువలన రిస్కు తీసుకున్నారు. ఈ రోజు భారత్‌లో ప్రస్తుతానికి 250 మంది మరణించారని చెప్తున్నారు. ఒక మరణం సంభవించిందంటే దాని వెనక రోగం సోకి, వివిధ దశల్లో ఉన్నవారు 800 మంది ఉంటారని లెక్క వేసి చెప్పారు. ఆ లెక్క ప్రకారం యిప్పటికి 2 లక్షల మంది భారతీయులకు సోకి వుండాలి. కానీ యిప్పటిదాకా కన్‌ఫమ్‌ అయినది 8 వేల లోపునే. అంటే యింకా ఎంతోమంది బయటపడాల్సి వుంది. అవన్నీ బయటకు వచ్చాక ఎప్పుడు, ఎక్కడ, ఎలా సోకిందో తెలియాలి.

మార్చి 13 న కూడా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిథి కరోనా వైరస్‌ హెల్త్‌ ఎమర్జన్సీ కాదని చెపుతున్నారు. వారం తిరక్కుండానే మోదీ ‘జనతా కర్ఫ్యూ’ ఆవశ్యకత గురించి ప్రసంగించారు. కర్ఫ్యూ అయిన రెండు రోజుల తర్వాతి నుంచి లాక్‌డౌన్‌ పెట్టేశారు. ఇప్పుడు దాన్ని పొడిగిస్తారేమోనని ఫీలర్లు వదులుతున్నారు. మన దేశంలో తొలి కరోనా కేసు నమోదైన జనవరి 30కి తొమ్మిది రోజుల ముందే అంటే జనవరి 21 నుంచే విదేశీ ప్రయాణీకులను తనిఖీ చేయడం మొదలుపెట్టిన కేంద్రం, మార్చి 13న అలా చెప్పడమేమిటి? కరోనా పెద్ద యిదేమీ కాదు, అందుకే ట్రంప్‌ ఫంక్షన్‌ చేశాం అని చెప్పుకోవడానికి కాదా?

అందుచేతనే కాబోలు కేంద్రం కరోనాకు సంబంధించిన సమాచారం రాష్ట్రాలతో పంచుకోలేదు. దాంతో ముఖ్యమంత్రులు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కెసియార్‌, జగన్‌ గురించి చెప్పుకున్నాం. మార్చి 13 నుంచి 15 వరకు తబ్లీగీ సమావేశం జరుపుకుంటామంటే దాన్ని దిల్లీ ముఖ్యమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి అనుమతించారు. పెద్ద ఫంక్షన్లకు వెళ్లకండి, నిర్వహించకండి అని ఆదేశాలిచ్చిన తర్వాత తనే దాన్ని  ఉల్లంఘించారు యెడియూరప్ప. మార్చి 16న 2 వేల మంది హాజరైన ఎమ్మెల్సీ కూతురి పెళ్లికి వెళ్లారు.

తిరుపతి గుడిని మార్చి 19 వరకు తెరిచే వుంచారు. రోజుకి కనీసం 50-60 వేల మంది భక్తులు వస్తారు. వారికి సేవలందించేవారు వేలమంది వుంటారు. తిరుపతికి వచ్చినవారిలో అనేక దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు ఎందరో వుంటారు. ఎంతో ఆర్గనైజ్‌డ్‌గా, ఓ మోస్తరు శుభ్రంగా ఉండే తిరుపతిలోనే కరోనా పాకే అవకాశం ఉందనుకుంటే ఉత్తరభారతంలో అస్తవ్యస్తంగా నిర్వహించే పెద్ద గుళ్ల గురించి ఏం చెప్పాలి?

ఏదైనా సోకి వుంటే యీ పాటికే వాళ్లు చనిపోయి వుండాలి కదా అనకండి. చనిపోయి వుండవచ్చు, కానీ మృత్యుకారణం కరోనా అని అనుకోకుండా ఊపిరాడలేదనో, ఫ్లూ అనో అనుకుని వుండవచ్చు. ఇప్పుడు మనకు కరోనా మరణాల సంఖ్యే బులెటిన్‌లా యిస్తున్నారు తప్ప తక్కిన చావుల గురించి చెప్పటం లేదు కదా. ఒక వ్యక్తిగత విషయం రాస్తాను, గమనించండి. మా నాన్న కాలేయసంబంధిత వ్యాధితో 1969లో చనిపోయారు. ఉబ్బు కామెర్లు అని దేశీయవైద్యులు అన్నారు కానీ అలోపతీవాళ్లు ఏమీ అనలేదు.

నా స్నేహితుడు వరప్రసాద్‌ హెపటైటిస్‌-బికి వ్యాక్సిన్‌ డెవలప్‌ చేసినపుడు దాని గురించి చదివాక మా నాన్న పోయినది ఆ వ్యాధితోనే అని నాకు అర్థమైంది. 1967లోనే అమెరికాలో హెపటైటిస్‌-బి వైరస్‌ను కనుగొన్నారు, 1969లో వైరస్‌ తయారుచేశారు. అది చేసిన బ్లూమ్‌బెర్గ్‌గారికి 1976లో నోబెల్‌ బహుమతి వచ్చి దాని ప్రాముఖ్యత జగానికి తెలిసింది. 1997లో మా వరప్రసాద్‌ ఆ వ్యాక్సిన్‌ను సామాన్యుడికి అందుబాటులో తేవడంతో  యిక్కడ దాని గురించి అందరికీ అవగాహన పెరిగింది. కానీ 1969లో మా నాన్నకు చికిత్స జరిగేనాటికి యిక్కడి వైద్యులకే దీని గురించి తెలియదు. కాలేయం పాడయ్యాక మిగతా అవయవాలు కూడా పనిచేయడం మానేస్తాయి కాబట్టి అంతిమంగా గుండెపోటుతో పోయినట్లు డెత్‌ సర్టిఫికెట్టులో రాశారు.

ఈ కోణంలో ఆలోచిస్తే యీనాడు మనం అనుకుంటున్న కోవిద్‌ మరణాల సంఖ్య కరక్టో కాదో నిర్ధారణగా చెప్పలేమని అర్థమవుతుంది. ప్రజలు కంగారుపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం దాస్తూండవచ్చు. కాదు, వాస్తవసంఖ్య యిది అని చెప్పడానికి మీడియా చురుగ్గా లేదు. చాలామంది జర్నలిస్టుల ఉద్యోగాలు పోతున్నాయి. ఉన్నవాళ్లు కూడా బయట తిరిగే పరిస్థితులు పెద్దగా లేవు. ఉన్నదున్నట్లు రాస్తే ప్రజల స్థయిర్యం దెబ్బ తింటుందన్న సంకోచమూ ఉంటుంది. అందువలన ప్రభుత్వం  వెల్ల డిస్తున్న అంకెల మీదే మనం చర్చించగలుగుతున్నాం.

మన ప్రభుత్వం చేపట్టిన చర్యలు అంతర్జాతీయంగా ఫలానావారు మెచ్చుకున్నారు, మీరేమిటి యిలా అంటారు అనవచ్చు, మోదీపై యీగ వాలడానికి ఒప్పుకోనివారు.  కేంద్రం ప్రకటిస్తున్న అంకెల ఆధారంగానే విదేశీయులూ వ్యాఖ్యానిస్తారు. ఎస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో యాజమాన్యం చూపించిన అంకెలు చూస్తూ యిన్నాళ్లూ భేష్‌భేష్‌ అన్నాం. మూత తెరిచి, గోకి చూస్తే అసలు రంగు బయటపడింది. మన దేశం కూడా విండో డ్రెసింగ్‌ చేస్తోందేమో తెలియదు కదా!

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే నిజాలు బయటపడే పరిస్థితి రావచ్చు. అందువలన మొత్తమంతా అదుపులోకి వచ్చి, విమర్శలు తట్టుకోవచ్చని అనుకునేవరకు పాలకులు యీ లాక్‌డౌన్‌ కొనసాగేట్లా చూస్తున్నారు.  కెసియార్‌ ఏప్రిల్‌ 7 కల్లా అదుపులోకి వచ్చేస్తుందనుకున్నారు. తబ్లిగీ సంగతి బయటకు రాగానే ఏకంగా జూన్‌ 3 వరకు అంటున్నారు. ఒక్క తబ్లిగీ వలన అంత తేడా వచ్చేస్తుందా? అసలేమైనా తర్కం వుందా? శాస్త్రీయంగా ఆలోచిస్తున్నట్లు కనబడుతోందా?

ఆయనకేముంది? ఇంట్లోనే కూర్చున్నాడు. ఆదాయానికి లోటు లేదు. వాళ్ల  పిల్లల ఉద్యోగాలు పోతాయన్న భయం లేదు. వాళ్లమ్మాయికి కొత్త ఉద్యోగం కూడా రాబోతోంది. ప్రగతి భవన్‌ అని మన డబ్బుతో ఊరంత యిల్లు కట్టుకున్నాడు. మన పరిస్థితి అది కాదు కదా! (వలస కార్మికుల గురించి వేరే వ్యాసం రాస్తా, సొంత యింట్లో వున్న వారి గురించే యిక్కడ రాస్తున్నా) ఇరుకిరుకు యిళ్లు, ఉన్న ఉద్యోగం వుంటుందో వూడుతుందో,  పిల్లలకు చదువు, వచ్చిన ఉద్యోగావకాశాలు పోతాయన్న భయంతో వుండగా కుదురుగా, స్థిమితంగా ఎలా వుండగలం?

అసలు నాకనిపిస్తుంది - ఈ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తమ యింట్లో కాకుండా వేరే చోట ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి వుంటే ఏమయ్యేదా అని. తాము రాష్ట్రం బయట వున్నపుడు ముఖ్య అనుచరుడు వెన్నుపోటుకై కుట్ర పన్నుతున్నాడో, లేక భారతీయ విలువలకై అహరహం శ్రమించే పార్టీ తన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు వల విసిరిందేమో అన్న భయంతో నిద్ర పోయేవారా?

బాబు యిప్పటికీ ఆంధ్ర ముఖ్యమంత్రి అయి వుంటే పెట్టుబడుల (?) కోసం ఏ దావోసో వెళ్లి వున్నపుడు అక్కడ యిరుక్కుపోయి వుంటే ఎంత విలవిల్లాడిపోయేవారు! తను లేకపోయినా ప్రభుత్వాధికారులు తమ పని తాము చేసుకుని పోతూ వుంటే మనసెంత వికలమై పోయి వుండేది! తన దగ్గరుండి, పక్కనే బిస్తరు పరుచుకుని అదిలిస్తూ చెప్తేనే కదా వాళ్లు పనిచేయాలి! వాళ్లంతట వాళ్లే పని చేసేస్తే కార్యదక్షుడిగా తనకు పేరు వచ్చేదెలా? మోదీగారు ఏ విదేశీ పర్యటనలో వుండగానే ఏ హెల్త్‌ మినిస్టరో ధైర్యం చేసి లాక్‌డౌన్‌ పెట్టేసి, తన బదులు టీవీల్లో మిత్రోం.. అంటూ మాట్లాడేసి, చప్పట్ల ఐడియా, దీపాల ఐడియా హైజాక్‌ చేసేసి వుంటే ఆయనెంత కొట్టుకునిపోయేవాడు.    

వీళ్లంతా యిళ్లల్లో హాయిగా వున్నారు. మనం యిళ్లల్లో హాయిగా వున్నామనుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో సామాన్యుల సమస్యల గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహం తప్పక కలుగుతుంది. లాక్‌డౌన్‌ ప్రకటించిన విధానం, నడిచిన తీరు గురించి వాళ్లు సమీక్షించుకోకపోయినా వచ్చేవ్యాసంలో మనం మాట్లాడుకుందాం. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2020)