Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఏసా, గణేశా – కేసులెవరి ఖాతాలో?

ఎమ్బీయస్‍: ఏసా, గణేశా – కేసులెవరి ఖాతాలో?

ఆంధ్రలో వినాయక చవితి పందిళ్లపై రగడ జరుగుతోంది. కరోనా కారణంగా పందిళ్లు, ఊరేగింపులు వద్దని ప్రభుత్వం అంటోంది. చర్చిల్లో ప్రార్థనలు జరగటం లేదా? ఏసుకి లేని నిషేధం గణేశుడికి ఎందుకు, మేం నిషేధాజ్ఞలు ధిక్కరించి తీరతాం అని బిజెపి, టిడిపి రంకెలు వేస్తున్నాయి. ఈ నిబంధన హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని వారి వాదన. కరోనా మహమ్మారి తొలగిపోలేదని అందరికీ తెలుసు. మూడో తరంగం పొంచి వుందని అంటున్నారు. కరోనా రూపు మార్చుకుంటూ పోతూనే వుంది. దేశంలో రోజుకి 35-40 వేల కేసులు వస్తూనే వున్నాయి. మరణాల శాతం తగ్గలేదు. రేపు వినాయక చవితి ఊరేగింపుల తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగితే దాన్ని ఏసు ఖాతాలో వేయాలా? గణేశుడి ఖాతాలో వేయాలా?

కరోనా వ్యాపిస్తూనే వున్నా, సాధారణ జనజీవితం సాగాలి కాబట్టి, లాక్‌డౌన్ ఎత్తివేసి, నిబంధనలు పెట్టారు. వాటినీ క్రమేపీ సడలించుకుంటూ వస్తున్నారు. ప్రమాదం వుంది, జాగ్రత్తలు పాటించండి అని పదేపదే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఉధృతంగా టీకాలు వేయిస్తున్నారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లకు, ఐసియు బెడ్ల ఏర్పాట్లకు ధనాన్ని వెచ్చిస్తున్నారు. కరోనా పిల్లలకు కూడా వ్యాపిస్తుందేమోనని భయపడే సమయంలో తక్కిన వైరస్‌లు మమ్మల్ని మర్చిపోతే ఎలా అంటూ పలకరిస్తున్నాయి. స్కూళ్లు తెరుస్తున్నారు, ఏవైనా కేసులు రాగానే మూసేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసుల్లో చదువులు వంటపట్టక, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవన్నీ గమనిస్తూనే ప్రభుత్వం కొన్నిటిని అనుమతిస్తోంది. శుభాశుభాలు ఆగవు కాబట్టి వివాహాలు జరుపుకోవచ్చు కానీ అతిథుల సంఖ్య పరిమితంగా వుండాలి అంది. మతపరమైన వేడుకలపై కూడా ఆంక్షలు పెట్టింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని కచ్చితంగా చెప్తోంది.

కానీ రాష్ట్రప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం వెసులుబాట్లు యిచ్చేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం బక్రీద్‌కు, ఓణంకు అలాగే యిచ్చి చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. అక్కడ యిప్పటికీ రోజువారీ కేసులు 25-30 వేలుంటున్నాయి. ఆ రాష్ట్రంలో వైద్యవసతులు ముందునుంచీ బాగుంటాయి కాబట్టి, మరణాల సంఖ్యను నియంత్రించ గలుగుతున్నారు కానీ చికిత్స కయ్యే ఖర్చు ప్రజలు భరించాల్సి వస్తోంది కదా. కుంభమేళా విషయంలో రాష్ట్రాలు జాగ్రత్తలు పాటిస్తామని చెప్పి, పాటించకపోవడంతో చివర్లో కేంద్రమే కలగజేసుకుని ఆపేసింది. తెలంగాణ ప్రభుత్వం బోనం పండుగలు జరిపించేసింది. ఏమైనా అంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... అనే ముక్క ముందు చేరుస్తున్నారు. ఏ ఒక్క ఫోటో చూసినా తెలుస్తుంది, ఏ మాత్రం పాటించలేదని.

ఇప్పుడు వినాయక చవితి పందిళ్ల విషయంలో కూడా గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఏ మేరకు పాటిస్తారో వేచి చూడాలి. కరోనా విషయంలో కెసియార్ మొదటినుంచీ నిర్లక్ష్యంగానే వున్నారు. టెస్టులు చేయించకపోవడం దగ్గర్నుంచి, అన్నీ అవకతవకగానే చేశారు. ఇది రాసేనాటికి రాష్ట్రంలో వెయ్యిమంది ఆక్సిజన్ బెడ్ల మీద, మరో వెయ్యి మంది ఐసియులోనూ వున్నారట. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆక్సిజన్‌ సిలండర్లకు డిమాండు పెరుగుతోందిట. అయినా ఏ కారణం చేతనో, తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గానే వుంది. ఆంధ్రలో ప్రభుత్వం టెస్టులు చేయించినా, తక్కిన రాష్ట్రాల కంటె ఎక్కువగా నిషేధాలు పెట్టినా, తెలంగాణ కంటె కేసులు ఎక్కువగా వున్నాయి. హైదరాబాదులో ఉన్నన్ని వైద్యవసతులున్న నగరం ఆంధ్రలో ఏదీ లేదు. అందువలన కరోనా వస్తే ఆంధ్రప్రజలకు యిబ్బంది ఎక్కువ. ఇలాటి సమయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తలు పాటించమని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. బార్లు తెరవలేదా అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదే అక్కణ్నుంచి!

కరోనా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు పాడై పోకూడదని పరీక్షలు నిర్వహిస్తానని ఆంధ్ర ప్రభుత్వం అంటే కోర్టులు ఒప్పుకోలేదు, పిల్లల ప్రాణాలు పోతే మీరిస్తారా అంటూ. బడులు తెరుస్తానంటే సవాలక్ష ప్రశ్నలు. ఈ వినాయక చవితి పందిళ్ల విషయంలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు కోర్టుకి వెళితే చాలు, కోర్టులు పందిళ్లు పెట్టనివ్వాలి అని తీర్పు యిస్తాయని తోస్తోంది. జగన్ యతి అంటే ప్రతి అనడమే కోర్టులకు పని. మరి ప్రజారోగ్యం మాటేమిటి అని ప్రభుత్వ లాయరు అడిగితే ‘అందుకేగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరపమంటున్నాం’ అని అంటారు జడ్జిగారు. మరి యీ మాట పరీక్షల నిర్వహణకు వర్తించదా? ఏది ముఖ్యం? పరీక్షలా? పందిళ్లా?

వచ్చిన చిక్కేమిటంటే ప్రభుత్వాలు కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి వుండటం లేదు. రాజకీయ సమావేశాలకు, ఎన్నికల ప్రచారసభలకు అన్నీ మినహాయింపులే. మొన్న ఇడుపులపాయలో సంతాప సమావేశానికి అనుమతి ఎలా యిచ్చారు? ఇలా ప్రభుత్వాన్ని యిరుకున పెట్టే ప్రశ్నలు అడిగి వూరుకోవచ్చు. అయితే యిక్కడ జగన్ క్రైస్తవుడు కావడంతో దీనికి మతం రంగు పులుముతున్నారు. చర్చిల్లో ఏసు ప్రభువును కొలిస్తే తప్పు లేదు కానీ, జంక్షన్లలో మా గణేశుణ్ని కొలిస్తే తప్పా? అని అంటున్నారు. చర్చిలో ఎంతమంది పడతారు? అక్కడ కావాలనుకుంటే సామాజిక దూరం పాటించవచ్చు, మాస్కులు పెట్టుకోవచ్చు. స్వస్థత ప్రార్థన కూటములని పెట్టి వందలాదిని బహిరంగంగా పోగేస్తే పందిళ్లను దానితో పోల్చి విమర్శించవచ్చు. పందిళ్ల నిషేధం చూపించి, వినాయకుణ్ని యింట్లో పూజించినా జగన్ వచ్చి అడ్డుపడిపోతున్నట్లు కలరింగు యిస్తున్నారు.

కోర్టు ఆదేశాల మేరకో, వీళ్ల ఆందోళన సఫలమయ్యో పందిళ్లు, ఊరేగింపులు అనుమతించారని అనుకుందాం. వాటిలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే బాధ్యులెవరు? ఎక్కడైనా పోలీసులు వచ్చి మీరు మాస్కులు పెట్టుకోలేదు, సామాజిక దూరం పాటించలేదు అని అడ్డుపడితే వెంటనే ‘మా దేవుణ్ని పూజించుకోనీయరా?’ అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టవా? క్రైస్తవులు చర్చికే వెళ్లి ప్రార్థించాలా? ముస్లిములు మసీదుకే వెళ్లి ప్రార్థించాలా? అక్కరలేదు. ఇంట్లో కూడా ప్రార్థించుకోవచ్చు. కానీ వెళుతున్నారంటే రిస్కు తీసుకుంటున్నట్లే. మరి హిందువులు కూడా అలాటి రిస్కులు తీసుకోవాలని వీరి అభిమతమా? కనీసం వాళ్లయినా జాగ్రత్తగా వుండాలని, రోగాలపాలు కాకూడదని కోరుకోరా? ఈ రోజు ఊరేగింపులో పాల్గొనడానికి అందరూ వస్తారు. రేపు వారిలో ఒకడు కోవిడ్‌తో మరణిస్తే చూడడానికి కూడా ఎవరూ వెళ్లరు. వింతగా లేదూ!?

ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఎవరికీ ప్రజారోగ్యం గురించి చిత్తశుద్ధి లేదు. కనీసం ప్రజలకైనా ఎవరికి వారికి వుండాలి కదా! పట్టుబట్టి పందిళ్లకు అనుమతి సాధించినా ప్రజలు వెళ్లకుండా వుండాలని నాబోటి వాళ్ల పగటికల. కానీ అది జరగదు. ఇప్పటికే వీధుల్లో చూస్తే ఎవరూ ఏ జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. దుకాణాల్లో ప్రవేశించే ముందు టెంపరేచరు చూడడం కూడా మానేశారు. కిక్కిరిసిన వాహనాల్లో వెళుతున్నారు. ఇక పెళ్లిళ్లు, వేడుకల మాట చెప్పనే అక్కర్లేదు. ఒకాయన చెప్పాడు – ఈ మధ్య ఆయన ఓ పెళ్లికి వెళితే 1200 మంది వచ్చారట. ఎవరికీ మాస్కులు లేవుట. గతంలో లాగానే చిత్తం వచ్చినట్లు ఉన్నారు.

అంటే బాగుండదేమో కానీ - చాలామంది జనాలకు బుద్ధి వుండదు. హెల్మెట్టు పెట్టుకోవాలని ప్రభుత్వం వచ్చి చెప్పాలా? పెట్టుకోకపోతే దండిస్తామని బెదిరించాలా? కింద పడితే పగిలేది నీ తలకాయ కాదూ? రెడ్ సిగ్నల్ పడినపుడు వెళితే ఎదుటి నుండి వాహనం వచ్చి గుద్దేస్తుందని తెలియదూ? ప్రభుత్వం జరిమానా వేస్తానని హడలగొట్టాలా? ఇప్పుడు కరోనా బీభత్సరూపం రెండేళ్లగా చూస్తూ కూడా, చిత్తమొచ్చినట్లు తిరిగేసి, రోగాన్ని తగిలించుకుని యింటికి తీసుకువచ్చి యింట్లో వృద్ధులకు, పసిపిల్లలకు తగిలిస్తే పుణ్యం వస్తుందా? దేవుడు సంతసిస్తాడా? మామూలుగానే మన ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తక్కువ. శుభ్రత పాటించరు, ఎక్కడ పడితే అక్కడ తింటారు. వీళ్లకు శుభ్రత అక్కరలేదనే మన హోటళ్లు, లాడ్జిలు దాన్ని పట్టించుకోవు.

విదేశాల్లో చూడండి, విలాసాలు లేకపోయినా, పక్కలు, టాయిలెట్లు శుభ్రంగా వుంటాయి. తిండిపదార్థాలు శుచిగా వుంటాయి. రెండు, మూడు వారాలు వరసపెట్టి దేశాలు తిరిగినా జబ్బు పడం. అదే మన దేశంలో అయితే ఎంత ఖరీదైన హోటళ్లలో వున్నా, వారం రోజులలో అస్వస్థతకు గురవుతాం. మన హోటళ్లకు పైపైన డాబే తప్ప, కిచెన్‌లోకి వెళ్లి చూస్తే రోత పుడుతుంది. ఇలా యిష్టం వచ్చినట్లు బతికేస్తున్నాం కదా, రోగాలేమో వచ్చాయేమో ఏడాదికి ఓసారైనా పరీక్షలు చేయించుకుందాం అని అనుకోము. టెస్టులు చేయించుకుంటే ఏమేం బయటపడతాయో, అలవాట్లు మానుకోవాల్సి వస్తుందేమో, వాకింగ్ చేయాల్సి వస్తుందేమో, తిండి తగ్గించాల్సి వస్తుందేమోనని అటువైపు తొంగి చూడం. చేతిలో వున్న టూవీలర్‌కూ, ఫోర్ వీలర్‌కూ ఆర్నెల్ల కోసారైనా సర్వీసింగు చేయిస్తాం తప్ప శరీరానికి ఏడాదికి ఓ సారైనా సర్వీసింగు చేయించం.

మనదంతా రామ్‌భరోసే సిద్ధాంతం. మన ఆఫీసులో 40 ఏళ్ల లోపు కొలీగ్ మన కళ్లెదురుగానే కుప్పకూలిపోవడం చూసి కూడా ‘మనకేమీ కాదులే’ అనే ధైర్యంతో, లేదా యథార్థపరిస్థితి తెలుస్తుందనే పిరికితనంతో డాక్టరు వద్దకు వెళ్లం. రోగాన్ని ముదరపెట్టుకుంటాం. చివర్లో లబోదిబో మంటాం. ఇప్పుడు కరోనా వచ్చాక సంభవించిన మరణాలలో కోమార్బిడీతో పోయిన కేసులే ఎక్కువ అంటే అర్థమేమిటి? ఇతర రోగాలను యిప్పటిదాకా నిర్లక్ష్యం చేశావు, అవే ప్రాణం తీశాయి అని కదా. కరోనా వచ్చి దడిపించింది కాబట్టి, యికపై అంతా ఒళ్లు దగ్గరపెట్టుకుని బతుకుతారు అనుకుంటే అదీ జరగటం లేదు. టీకాలు వేయించు కోవడానికి కూడా ముందుకు రావటం లేదు.

నిజమే, యీ టీకాల సామర్థ్యం 60-70 శాతమే, కొత్త వేరియంట్ల మీద ఏ మేరకు పనిచేస్తుందో తెలియదు. లేనిబావ కంటె గూనిబావ మేలనే థియరీతో ప్రభుత్వం ఉచితంగా వేయిస్తోంది.  నీకు ఏ మేరకు పనిచేస్తుందో తెలియదు కానీ వేయించుకుంటే ప్రమాదమేమీ లేదు కదా! ప్రమాదం వుంటుందేమోనని మొదట్లో డాక్టర్ల దగ్గర్నుంచి సందేహించారు. కానీ ధాటీగా వేయడం మొదలుపెట్టి ఆర్నెల్లు దాటింది. ప్రమాదాలేమీ రికార్డు కాలేదు కదా! ‘వేయించుకున్నా మళ్లీ రావచ్చు, వేయించుకుని ప్రయోజనం ఏముంది?’ అనే వాదనతో చాలామంది వేయించుకోలేదు. మళ్లీ వచ్చినా ఆసుపత్రిపాలవడం తగ్గుతోంది అని గణాంకాలు చెపుతున్నాయి కదా.

వేడుకలపై వేలు ఖర్చుపెట్టే జనాలు టీకాలపై ఖర్చు పెట్టడానికి ముందుకు రాకపోవడం చేతనే ప్రయివేటు సెక్టార్‌లో 7శాతానికి మించి టీకాలు ఖర్చు కావటం లేదు. పోనీ ప్రభుత్వం ఉచితంగా యిచ్చే టీకాలు వేయించుకోవచ్చు కదా! సెకండ్ వేవ్ ఉధృతంగా వున్నపుడు క్యూలు కట్టారు. అది చల్లబడగానే వీళ్లూ చల్లబడ్డారు. గత రెండు నెలలుగా కొన్ని ప్రాంతాల్లో టీకాకరణ అనుకున్నంత జోరుగా జరగటం లేదని జూన్ మధ్య నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ తీసేశారు. ఆధార్ కార్డు తీసుకుని వెళితే చాలు, అప్పటికప్పుడు వేసేస్తాం అంటున్నారు. అయినా చాలా గ్రామాల్లో జనం కదలటం లేదుట. మనదేశంలో టీకాలంటే చిన్నపిల్లలకే తప్ప పెద్దవాళ్లకు కాదు అనే భావం బలంగా నాటుకుపోయింది. దానికి తోడు ప్రభుత్వం టీకాల సామర్థ్యం విషయంలో చాలా గందరగోళపు ప్రకటనలు చేసి వాక్సిన్ హెజిటన్సీని పెంచింది. ఆర్నెల్లు దాటింది కాబట్టి, పరిస్థితిలో ఒక స్థిరీకరణ వచ్చింది. ఉచితంగా వేస్తామన్నా ప్రజలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా లేదా?

మేం టీకాలు వేయించుకోం. ఎందుకంటే మేం ఇంట్లోనే వుంటాం, ఎవర్నీ రానివ్వం, బయటకు ఏదైనా అత్యవసరమైన పని మీద వెళ్లినా జాగ్రత్తలు పాటిస్తాం అని నిశ్చయించు కుంటున్నారా? అదీ లేదు. ఆ జాగ్రత్తలూ గాలికి వదిలేస్తున్నారు. ఇలాటి పరిస్థితిలో ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతుంది? ఎలాగైనా రోజుకి కోటి వాక్సిన్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్రం పట్టుదలగా వుంది. ఆగస్టులో 18 లక్షల అంకెకు చేరారు. కోటి వాక్సిన్ల లక్ష్యాన్ని రెండు రోజులు చేరగలిగారు. వాక్సిన్లనే కాదు, ఇలాటి లక్ష్యాలు చేరుకోవాలని ప్రయత్నించే పరిస్థితుల్లో ప్రభుత్వయంత్రాంగంలో సాధారణంగా ఏమవుతుందో చెప్తాను. ఎమర్జన్సీ టైములో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో యిలాటి టార్గెట్లనే విధించారు. కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది, మీ కోటా యింత అని. రాష్ట్రాధినేతలు జిల్లా కలక్టర్లను ఆదేశించారు. వాళ్లు ప్రభుత్వోద్యోగులందరికీ ఆర్డర్లు పాస్ చేశారు.

అప్పటిదాకా కు.ని. ఆపరేషన్ చేయించుకుంటే ట్రాన్సిస్టర్ ఉచితంగా యిచ్చేవారు. అయినా జనాలు ముందుకు వచ్చేవారు కారు. ఎమర్జన్సీ టైములో సంజయ్ గాంధీ దేశం ముందుకు వెళ్లాలంటే జనాభాను నియంత్రించాలి, బలవంతంగానైనా కుని ఆపరేషన్లు చేయించాలని ప్రతిపాదించాడు. అతని పంచసూత్రం పథకం, ఇందిర 20 సూత్రాల పథకం, మొత్తం 25 సూత్రాలలో తక్కినవాటి మాట ఎలా వున్నా యీ సూత్రాన్ని మాత్రం గట్టిగా అమలు చేశారు. రోజుకి యిన్ని ఆపరేషన్లు తీసుకురాకపోతే, లేదా చేయకపోతే నీ జీతం కట్ అన్నారు. దాంతో ప్రభుత్వోద్యోగులు గ్రామాల మీద పడి మొగవాళ్లను లాక్కుని వచ్చి ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. యువకులందరూ భయపడి పొలాల్లోకి పారిపోయి, చెట్లమీద కాపురం వుండేవారు. భార్యలు అక్కడకు వెళ్లి అన్నం పెట్టేవారు. యువకులు దొరక్కపోవడంతో ముసలివాళ్లను, పిల్లలను లాక్కుని వచ్చి ఆపరేషన్లు చేయించేశారు.

కొంతకాలానికి వాళ్లూ దొరక్కపోతే ఆపరేషన్లు చేసినట్లు దొంగ లెక్కలు చూపడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల ఒక్కో డాక్టరు వందేసి ఆపరేషన్లు ఒక్క రోజులో చేసినట్లుగా కూడా రికార్డులు సృష్టించారు. ఇదేమిటి, యిదెలా సాధ్యం అని అడిగినవాడు లేడు. ఎందుకంటే వ్యవస్థకు గణాంకాలు కావాలి. ఊరి జనాభా కంటె ఆపరేషన్ల సంఖ్య ఎక్కువ చూపించినా పై అధికారి నిలదీయడు. ఆ అంకె చూపించి, పై అధికారి దగ్గర శభాషనిపించుకుంటాడు. ఆ అధికారి, అతని పైఅధికారి దగ్గర, ఆతను మంత్రి దగ్గర.. యిలా వుంటుంది. అందరూ జబ్బలు చరుచుకున్నారు. ఎమర్జన్సీ ఎత్తివేసి షా కమిషన్ వేసినప్పుడు యీ అతిశయోక్తులూ, అక్రమాలూ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడనిపిస్తుంది, ఉత్తర భారతంలో నిజంగా ఆ స్థాయిలో కుని ఆపరేషన్లు జరిగి వుంటే అక్కడ యీ స్థాయిలో జనాభా పెరుగుదల వుండేది కాదని!

ఎమర్జన్సీ టైము అనే కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి తెలుస్తుంది, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే హడావుడి. ఒక డిపార్టుమెంటుకి యింత అని బజెట్‌లో కేటాయిస్తారు. కానీ ఏడాదంతా మొత్తుకుంటున్నా నిధులు విడుదల కావు. జనవరి వచ్చాక అప్పుడు హంగామా ప్రారంభమవుతుంది. మార్చిలోగా నిధులు ఖర్చు పెట్టకపోతే ఆడిట్ నుంచి చివాట్లు పడతాయి. వచ్చే ఏడాదికి బజెట్ కేటాయింపులు తగ్గిపోతాయి. అందువలన ప్రతిపాదనలు పంపండి, ఏ క్వెరీలు లేకుండా శాంక్షన్ చేసేస్తాం అంటారు. ఇక ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి శాఖలోనూ విచ్చలవిడిగా ఖర్చుపెడతారు. ఉపయోగం వున్నా లేకపోయినా, అంత క్వాంటిటీ అవసరం వున్నా లేకపోయినా కొనేయడమే. ధర గురించి అడగరు. సరుకు డెలివరీ అయిందా లేదా అని అడగరు. తర్వాత ఆ సరుకు వాడావా లేదా అని కూడా అడగరు. మార్చి లోగా ఖర్చు పెట్టావా లేదా అన్నదే లెక్క.

గ్రామీణుల్లో వాక్సిన్ హెజిటన్సీ వుంది, ప్రభుత్వం వాక్సినేషన్‌లో రికార్డులు నెలకొల్పాలని లక్ష్యాలు పెట్టుకుంది అని వినగానే నాకు యివన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఈ రోజు మన రాష్ట్రంలో 5 లక్షల డోసులు వేయించాలి అని అనుకున్నారనుకోండి. కొన్ని సందర్భాల్లో ఆ సమాచారం కింది దాకా చేరేసరికి ఏ మధ్యాహ్నమో అవుతుంది. అంచెలంచెలుగా గ్రామాలకు చేరేసరికి సాయంత్రమవుతుంది. మీ వూరికి వెయ్యి టీకాలు కోటా ఎలాట్ చేశాం, రాత్రికల్లా పూర్తి చేయి అంటాడు పై అధికారి. ‘జనాలు పెద్దగా లేరండీ, టార్గెట్ రీచ్ కాలేం’ అని అక్కడి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగి అన్నాడనుకోండి. ‘వాళ్లు రాకపోతే మీరే సంచి భుజాన వేసుకుని వెళ్లండి, ఇంటికి వెళ్లి పొడిచి రండి’ అంటారు పైవారు. ‘కావాలంటే రేపు వేయండి, కానీ యివాళే టీకా వేసినట్లు రికార్డులో రాయండి. అర్ధరాత్రయినా, బెదిరించైనా, సాధ్యమైనంతవరకు యివాళే వేసేయండి. పని కాలేదని మాత్రం నాకు చెప్పకండి’ అని గద్దిస్తారు.

ఇక ఆ క్రింది స్థాయి ఉద్యోగి యింటింటికి వెళ్లి టీకాలు వేస్తాడా లేదా అన్నది అతని నిజాయితీపై ఆధారపడి వుంటుంది. కొందరు అలాగే చేయవచ్చు. మరి కొందరు యింట్లోనే కూర్చుని, ఆశా వాళ్ల దగ్గరో, ఏ సంక్షేమ పథకంలోని లిస్టులోంచో, ఆధార్ కార్డుల నెంబర్లు సంపాదించి వాళ్లకు టీకాలు యిచ్చినట్లు సిస్టమ్‌లో ఎంట్రీ చేసేయవచ్చు. హరిప్రసాద్ అని ఉమ్మడి రాష్ట్రంలో లాటరీ విభాగానికి అధిపతిగా వుండేవాడు. ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వందలాది పెట్టీ కాష్ ఓచర్లపై వేలిముద్రలు చూపించారు. విచారణలో బయటపడినదేమిటంటే అవి యిద్దరు వ్యక్తుల లెఫ్ట్, రైట్ థంబ్ యింప్రెషన్లు! అంటే యిద్దరికి ఓ స్టాంప్ పాడ్ యిచ్చి ఓ గదిలో కూర్చోబెట్టి మొత్తం ఓచర్ల పని కానిచ్చేశారన్నమాట. ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చాక యిలాటి ఫ్రాడ్స్‌కు అవకాశం లేదనుకోనక్కరలేదు. టీచర్ల హాజరీని చెక్ చేయడానికి బయోమెట్రిక్ విధానం పెడితే దాన్నీ మానిప్యులేట్ చేస్తున్నారని వింటున్నాను. మన ఫోన్ నెంబర్లు ఎక్కడెక్కడో తేలుతున్నాయి. అలాగ ఏవేవో ఆధార్ కార్డులు నెంబర్లు ఎడాపెడా కొట్టేసి, లక్ష్యాన్ని చేరామని చెప్పవచ్చు.

ఇలాటిది నేను కళ్లతో చూశానని చెప్పటం లేదు. ఇలా జరగడానికి ఆస్కారం వుందని మాత్రం చెపుతున్నాను. అన్నీ పకడ్బందీగా వుండే మా బ్యాంకింగు సిస్టమ్‌లోనే యిలాటి గమ్మత్తులు జరుగుతాయి. ఏన్యువల్ క్లోజింగ్ రోజున బాలన్స్ షీటు దివ్యంగా కనబడడానికి ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్‌ఫర్లు చేసేసి, ఆఖరి రోజున డిపాజిట్లను ఘనంగా చూపించేవాళ్లం. మర్నాడు చూస్తే అవి ఘోరంగా తగ్గిపోయేవి. ప్రతీ బ్రాంచ్ యిలాగే విండో డ్రెసింగ్ చేస్తూ పోయి, ఫైనల్‌గా బాంకు బాలన్స్‌ షీటును ఆకర్షణీయంగా తయారు చేసేవారు. 1990లలో నరసింహం కమిటీ రిపోర్టు వచ్చి నాన్ పెర్‌ఫామింగ్ ఎసెట్స్‌ను క్లాసిఫై చేసి చూపించాలనేటప్పటికి బాంకుల బండారం బయటపడింది. అప్పటిదాకా రాని బాకీలమీద, చావుబాకీల మీద కూడా వడ్డీలు వచ్చేస్తాయని చూపించి లాభాలు చూపించేవారు. ఇంత కంప్యూటరైజేషన్ తర్వాత కూడా యింకా బాంకు మోసాలు జరుగుతున్నాయంటే వీటంతటి ఆర్గనైజ్‌డ్‌గా లేని యితర వ్యవస్థలలో అంకెలెలా వుంటాయో ఊహించుకోవచ్చు.

ఇంతకీ టీకాల విషయంలో వేయకుండానే వేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నారనుకోండి, అప్పుడు టీకాలేం చేస్తారు? ఉండవలసినదాని కంటె ఎక్కువ స్టాకు కనబడితే అదో తంటా. వాటిని మాయం చేయాల్సి వస్తుంది. ప్రయివేటు సెక్టార్‌కి అమ్ముకుంటే అదో ఫ్రాడ్. అమ్ముకోకుండా టీకాలు పగలగొట్టేస్తే మహాపాపం. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో టీకాలు లేక జనం అల్లాడుతూంటే యిక్కడ వృథా చేస్తే అంతకంటె అమానుషం వేరేదైనా వుంటుందా? దీనిలో యింకో యిబ్బంది కూడా వుంది. ఈ రోజు టీకాలు వేయించుకోనన్నాడని వదిలేసి, అతని ఆధార్ కార్డు మీద టీకా యిచ్చేసినట్లు రాసేసు కున్నారనుకోండి, రేపుమర్నాడు థర్డ్ వేవ్ వచ్చి అతనికి బుద్ధి మారి, టీకా కోసం వస్తే ‘నీకు యిదివరకే యిచ్చేశాం, మళ్లీ ఎలా యిస్తాం?’ అంటే? ఆలోచించిన కొద్దీ బుర్ర వేడెక్కుతుంది.

మళ్లీ చెపుతున్నాను. ఇలాటివి జరిగాయని నేను అనటం లేదు. లక్ష్యాలను చేరడానికి పరుగులు పెట్టినపుడు యిలాటి అనర్థాలు జరిగే ఆస్కారం వుంది సుమా అనే చెపుతున్నాను. ఇలాటివి జరగకుండా ఎక్కడికెక్కడ పర్యవేక్షణ వుండాలి. రేండమ్ చెకింగులు వుండాలి. అసలు అంతకంటె ముందు ప్రభుత్వం టీకాకరణకు, సంక్షేమ పథకాలకు లింకు పెడితే మంచిది. టీకా వేయించుకోకపోతే నీ పేరు తీసేస్తాం అంటే ఎలా వుంటుంది? ఎమర్జన్సీ నాటి బలవంతపు కుని ఆపరేషన్లలా వుంటుందా? వాహకుడు హెల్మెట్ వేసుకోకపోతే వాహనాన్ని రోడ్డు మీదకు రానివ్వం, మాస్కు వేసుకోకపోతే జరిమానా వేస్తాం అని అన్నట్లుగా మాత్రమే వుంటుందా? నయాన చెప్తే వినని ప్రజలకు భయాన చెపితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందా? సమాజహితాన్ని కోరి, వ్యక్తి స్వేచ్ఛను కొంతమేరకు హరించవచ్చా? ఆలోచించదగిన అంశమే.

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?